కృష్ణపక్షం (కథ)
విద్యాధర్ మునిపల్లె
ఆమె లేదని.. తిరిగి రాదని తెలిసినప్పటి నుండి విశ్వనాధశాస్త్రి మనసు మనసులో లేదు. ఆమె లేని తన జీవితానికి అర్ధమే లేదని అతనికి అనిపించింది. ఆమె పరిచయం కాకముందు తన జీవిత భాగస్వామి రాజ్యలక్ష్మి వుండేది. రాజ్యలక్ష్మి మరణం తర్వాత అనుకోని రీతిలో తన జీవితంలోకి ప్రవేశించింది తులసి. ఇప్పుడు ఆమె కూడా తన జీవితంలోంచి వెళ్ళిపోయింది. కాలం తన నుంచి ఎందుకు తనకి దగ్గరైన వారినిలా దూరం చేస్తుందో విశ్వనాధశాస్త్రికి అర్ధంకావటంలేదు. తన మనసుకి దగ్గరైన ఇద్దరు స్త్రీలను కాలం దూరం చేసింది. రాజ్యలక్ష్మితోపాటు పుట్టింటి అరణమనుకోవాలో మరేమనుకోవాలో తెలీని ఆమె తమ్ముడు పదమూడేళ్ళ ముకుందుడు తనింటికి వచ్చాడు. బావా బావా అని పిలుస్తూనే పిల్లలులేని మాకు ఆ లోటు తీర్చాడు. వరసకి తనకి తమ్ముడైనా కొడుకుకన్నా గారంగా చూసేది.
ముకుందుడు కూడా పిలుపుకి బావ అని పిలిచినా విశ్వనాధుడ్ని తండ్రిగా చూసేవాడు. విశ్వనాధుడ్ని ఎవరైనా ఏమైనా అనాలన్నా.. ఎవరైనా కలవాలన్నా ముందు ముకుందుడి దర్శనం అయ్యాకే.. అతని సమ్మతి అయ్యాకే కలిసేవారు. ఏ నిర్ణయమైనా విశ్వనాధుడు తీసుకున్నాడంటే అటు ముకుందుడు కానీ, ఇటు రాజ్యలక్ష్మికానీ మారాడేవారు కాదు. అలాంటి ముకుందుడ్ని కూడా విశ్వనాధుడు దూరం చేసుకున్నాడు.
వృద్ధాప్యం మీద పడింది. డెబ్బై సంవత్సరాల ఈ వయసులో అందరూ దూరమై బ్రతుకు భారమై పోయిందతనికి. బ్రతకాలన్న ఆసక్తిలేదు. తులసి తనవద్దకు తిరిగి వచ్చే ప్రసక్తేలేదు. ఇది తెలిసిన విశ్వనాధుడు తులసిమీదున్న ప్రేమని మరచిపోలేక, తనవద్దకి రాలేని ఆమె నిస్సహాయతని భరించలేక తన జీవితాన్ని చాలించేద్దామనకున్నాడు. చంద్రగిరి రాజావారు తనకు బహుమానంగా ఇచ్చిన వజ్రపుటుంగరాన్ని చేతిలోకి తీసుకొని..
‘‘ఇన్నాళ్ళూ నా చేతివేలికి అలంకరణగా వున్నావు.. ఇప్పుడు నువ్వు నాకు మోక్షాన్ని అనుగ్రహించబోతున్నావు.. ఓ కఠినకర్కశ వజ్రసదృశ కాలమా.. కలంతో కవనాలను కథం తొక్కించిన ఈ కవిరాజుని నీలో కలుపుకునే సమయం ఆసన్నమైంది. ఈ కవిభానుని అస్థమయం ఈ కృష్ణపక్ష అమావాస్య నాడు ఈ గ్రహణ సమయంలో సంభవించనున్నది. ఈ కాయం మాయం చేసేందుకు కేవలం తులసి ఎడబాటుతో ఈ గుండెకి అయిన గాయం చాలదు.. ఈ వజ్రం నా ప్రేగ్రులను కోస్తూ.. రక్తంతో అభిషేకించబడుతూ ఇచ్చే మోక్షంతోనే సాధ్యం. తులసి లేని నా జీవితం ఇక వృధా..’’
అనుకుంటూ వజ్రాన్ని పగలగొట్టి గ్లాసులో వేశాడు.. మధ్యం సీసాలోంచి మధ్యాన్ని వంచు కున్నాడు.. గ్లాసుని కలిపాడు.. నోట్లోకి వంపుకున్నాడు... అంతే ఆ వజ్రం అతని గొంతునాళాల్ని కోస్తూ పేగుల్లోకి చేరుతూ వాటిని కర్కశంగా కోస్తూ లోనికి జారుతోంది. అతని నోటి వెంట రక్తం వరదలా పారుతోంది. వజ్రం చేసే గాయాలకు అతను నరక యాతన పడుతున్నాడు.. తులసి లేదన్న బాధ ముందు అతని శరీరం అనుభవించే ఈ బాధ ఏపాటి?
దీర్ఘంగా ఊపిరి పీల్చాడు.. తులసీ.. తులసీ.. అని కలవరిస్తూ అలాగే నేలపై పడిపోయాడు.
************
విశ్వనాధశాస్త్రి 18-19 శతాబ్దాల మధ్యకాలంలో గొప్ప కవిపండితునిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. యావత్ ద్రవిడదేశంలో ఆయనపేరు మారుమ్రోగేది. ఎంతోమంది ఈయన రచనలకు అభిమానులుగా వుండేవారు. విజయనగరంలోని విశ్వేశ్వరాగ్రహారంలో వుండేఈయన ఎన్నో సంస్థానాల ఆహ్వానాలను అందుకొని అక్కడి కవిపండితులను తన పాండిత్యంతో ఓడించి ఆయా సంస్థానాలనుండి జయపత్రికలు అందుకున్నారు. బ్రిటీషువారు కూడా విశ్వనాధుని పాండిత్యానికి మెచ్చి అతనికి సర్ అనే బిరుదుని ప్రదానం చేయాలని భావించారు. అయితే విశ్వనాధుడు దానిని సున్నితంగా తిరస్కరించాడు.
విశ్వనాధునికి మొదట రాజ్యలక్ష్మితో వివాహం జరిగింది. రాజ్యలక్ష్మి ఒక్కగానొక్క తమ్ముడు ముకుందుడు. అతను రాజ్యలక్ష్మికంటే వయసులో పదేళ్ళు చిన్నవాడు. వివాహమైనప్పటి నుండీ విశ్వనాధుని ఇంటే పెరిగాడు. బావగారి కవనాలను ఉల్లేఖించే లేఖకునిగా వ్యవహరించేవాడు. బావగారి వాగ్ధాటికి అనుగుణంగా అతని కలం కదిలేది.
అలా విశ్వనాధుడి సంస్కృతాంధ్ర రచనలు దేశంలో అప్పుడప్పుడే ప్రారంభమైన అచ్చు పత్రికల్లో ముద్రితమై పాఠకుల ప్రశంసలు అందుకునేవి. విశ్వనాధుడు కవి పండితుడే అయినా విశ్వేశ్వరస్వామి దేవాలయంలో అర్చకత్వం అతని ప్రధాన వృత్తి. స్వామి సేవను ఏనాడూ విడవలేదు. కొంతకాలానికి రాజ్యలక్ష్మి అకాలమరణం పాలైంది. దీంతో అప్పటి వరకూ సరసశృంగార కవనాలు అల్లిన విశ్వనాధుడు నాటి నుండి వైరాగ్య కవితలు, రచనలు చేయటం మొదలు పెట్టాడు. అయినా సరే వాటిని కూడా పాఠకులు విశేషంగా ఆదరించటం మొదలు పెట్టారు.
కాలగమనంలో విశ్వనాధునికి అరవై ఐదు సంవత్సరాలవయసు వచ్చింది. అలాంటి సమయంలోనే విరూపాక్షుడనే కవీంద్రుడు జవ్వంగి సంస్థానంలో కవిగా వుండేవాడు. జవ్వంగి రాజావారి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కవితా సంగ్రామానికి కవిశార్ధూలాలకు ఆహ్వానం పంపించారు. ఆ ఆహ్వాన బాధ్యతలను విరూపాక్షునికి అప్పజెప్పారు. ఆ ఆహ్వానాన్ని తీసుకొని విశ్వనాధుని ఇంటికి వచ్చాడు విరూపాక్షుడు. అప్పటికే విరూపాక్షునికి విశ్వనాధుని సాహితీ పాటవం మిడిమిడిగా తెలిసి వుంది. కానీ విరూపాక్షునికి తనంతటి కవీశ్వరుడు లేడని నమ్మకం. తన తోటి కవులైన కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు వంటి వారి రచనల్లో కూడా పసలేదని తరచూ మాట్లాడుతుండేవాడు.
విరూపాక్షుడు విశ్వనాధుని ఇంటికి రావటం అక్కడ ఎవ్వరూ కనిపించకపోవటంతో వసారాలో వేసిన వాలుకుర్చీలో కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఇంతలో పిడుగులు కురిపించే గొంతుతో ముకుందుడు అక్కడికి చేరుకొని విరూపాక్షుని కుర్చీలోంచి లేవమని, అది తన బావగారు కూర్చునే కుర్చీ అని వాదనకు దిగాడు. అంతటితో ఊరుకోకుండా విరూపాక్షుని కుర్చీలోంచి బలవంతంగా పైకి లేపాడు. దీంతో విరూపాక్షుని మనసు తీవ్రంగా గాయపడింది. తనంతటి కవిపండితుని ఇంతలా అవమానిస్తాడా అంటూ విరుచుకుపడ్డాడు. అప్పుడే అక్కడికి వచ్చిన విశ్వనాధుడు విరూపాక్షుని చూసి వచ్చిన కారణం అడిగి ఉగాది పర్వదినానికి జవ్వంగి చేరుకుంటానని చెప్పి పంపించాడు. అయితే విరూపాక్షునికి జరిగిన అవమానం అతన్ని దహించేస్తోంది.
విరూపాక్షుడు నేరుగా రాజమహేంద్రవరంలోని తన వుంపుడుగత్తె అయిన తులసి వద్దకు చేరి ఆమెని విశ్వనాధునిపై ప్రయోగించాలని నిర్ణయించుకున్నాడు. విశ్వనాధుని ఆమెకి దాసునిగా చేసుకుంటే సింహాచలంలోని తన మూడంతస్తుల మేడని ఆమె పరంచేస్తానని వాగ్దానం చేశాడు విరూపాక్షుడు. సహజంగానే సానులకుండే సంపద వ్యామోహంతో తులసి సమ్మతించింది. అంతే విశ్వనాధుని ఇంటికి చేరింది తులసి.
విశ్వనాధుని ఇంటికైతే చేరింది కానీ ముకుందుడిని మాత్రం అంత తేలిగ్గా దాటలేకపోయింది. భార్యని కోల్పోయిన విశ్వనాధుడు తులసి అందచందాలపట్ల ఆకర్షితుడయ్యాడని గ్రహించింది.
‘‘ ఇనుపకచ్చడాల్ కట్టిన మునులు సైతం పైట చెంగు రెపరెపలకి దాసులేకదా’’ అని తను చదివిన సాని సాహిత్యాన్ని విశ్వనాధునిపై ప్రయోగించింది. అంతే విశ్వనాధుని ఇంట తులసి తిష్టవేసింది.
నానాటికీ విశ్వనాధునికి తులసి దగ్గరవుతూ.. ముకుందుడిని దూరం చేయటం మొదలు పెట్టింది. విశ్వనాధుడు తన మడీ ఆచారాలను వదిలేశాడు. మద్యపానం మొదలు పెట్టాడు. బూతుకవనాలు రాయటం మొదలు పెట్టాడు. తులసితోనే లోకమైపోయాడు. ముకుందుడు చాలా సార్లు విశ్వనాధుని హెచ్చరించాడు కూడా.. అయినా సరే విశ్వనాధుడు పట్టించుకోకపోగా ముకుందుడిని తన్ని ఇంటి నుంచి తరిమేశాడు.
కాలం గడిచిపోతోంది. విశ్వనాధుడు పూర్తిగా తులసీదాసుడైపోయాడు. విశ్వనాధుని పాండిత్యం అతని సంస్కారం తులసి మనసుని పూర్తిగా మార్చేశాయి. నాటి నుండి విశ్వనాధుని భక్తితో సేవించటం మొదలు పెట్టింది తులసి. విశ్వనాధునికీ తులసి వయసులో నలభై సంవత్సరాల వ్యత్యాసమున్నప్పటికీ ఆమె అతనితో వివాహం కాకుండానే సంసారం చేయసాగింది. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. ఆవిషయం విశ్వనాధునికి చెబుదామని అనుకొని సుముహూర్తం కోసం ఎదురు చూస్తున్న సమయంలో విరూపాక్షుడు ఆమెని తనతో బలవంతంగా అతి రహస్యంగా తీసుకొని వెళ్ళిపోయాడు.
తులసి జాడతెలీని విశ్వనాధుడు పిచ్చి పట్టినవాడై రాజమహేంద్రవరం వీధుల్లో తిరగటం మొదలు పెట్టాడు. తులసి జాడ తెలియలేదు. విరూపాక్షుడు ఆమెని క్షీరపురికి తీసుకుపోయాడు. అక్కడే ఆమెతో వుంటున్నాడు. విశ్వనాధుని వంశాంకురం ఆమె గర్భంలో పెరుగుతుందని తెలిసినా విరూపాక్షుడు ఆమెను ఏమీ అనలేదు. కానీ తులసి మాత్రం విశ్వనాధుని నామమే లోకంగా జీవిస్తోంది.
రాజమహేంద్రవర వీధుల్లో మద్యపానం చేసిన విశ్వనాధుడు దారిన పోయే ప్రతివారినీ తులసీ.. తులసీ అని సంబోధిస్తూ వారి వెంట వెళ్ళటం.. దేహశుద్ధి చేయించుకోవటం పరిపాటి అయిపోయింది. తన అక్కకి శ్రాధ్ధకర్మలు నిర్వహించేందుకు గోదావరీ పుష్కరాల సందర్భంగా కోటి లింగాలకు వెళ్ళాడు ముకుందుడు. అక్కడ తన బావ విశ్వనాధుని పరిస్థితి చూసి పట్టరాని ఆవేదనతో విశ్వనాధుని సముదాయించాడు.. తన బావ దుస్థితికి కారణం ఆ వగలాడి తులసేననీ ఆమె పట్టరాని ఆగ్రహంతో వూగిపోయాడు ముకుందుడు. తులసిని తీసుకొస్తే తన బావ సాధారణ స్థితికి వస్తాడని గ్రహించి తన మనసుని చంపుకొని తులసి జాడకనుక్కొని ఆమెని తీసుకొస్తానని అక్కడి అగ్రహారంలో తనకు తెలిసిన వారింట విశ్వనాధుని వుంచి తులసి జాడ కునక్కోటానికి పయనమయ్యాడు ముకుందుడు.
ముకుందుడు వారినీ వీరిని అడిగి మొత్తానికి తులసి క్షీరపురిలో వుంటోందని తెలుసుకొన్నాడు. అక్కడ విరూపాక్షని చూసిన ముకుందునికి విషయం పూర్తిగా అర్థమైంది. వెంటనే పట్టరాని ఆవేశంతో విరూపాక్షపై దాడిచేశాడు. చేతికి అందిన కత్తితో విరూపాక్ష గొంతుని తెగనరికాడు. బంగారంలా వున్న తన బావ జీవితాన్ని సర్వనాశనం చేసిన తులసిని కత్తితో పొడిచాడు. అతని ఆవేశం చల్లారలేదు.. ఆమె చెప్పేది కూడా వినదలచుకోలేదు.. ముకుందుడు వేగంగా కత్తిని అక్కడ పడేసి రాజమహేంద్రవరం చేరుకున్నాడు.
‘‘బావా తులసి ఇక రాదు.. రాలేదు.. వచ్చే పరిస్థితిలో లేదు.. ఇక నువ్వు ఆమెని మర్చిపోవటం మంచిది. ’’ అని చెబుతుండగా విశ్వనాధుడు చిరునవ్వు నవ్వి... కోటిలింగాల వద్ద రుద్రహోమం చేయించి, రాధామాధవాలయం నుంచి తులసి తీర్థం తీసుకురమ్మని చెప్పి గ్రహణకాలం లోగా రెండూ తీసుకురావాలన్నాడు. కృష్ణపక్ష అమావాస్య రోజు ఏర్పడిన గ్రహణం.. చాలా అరుదు.. వెళ్ళమని బలవంతం చేశాడు.
ముకుందుడికి విషయం అర్థంకాకపోయినా తన బావ మాటని ఏనాడూ దాటలేదు కనుక బావ చెప్పిన పనిచేయటానికి కదిలాడు. అలా ముకుందుడు వెళ్ళిపోగానే విశ్వనాధుడు తులసి రాదనీ రాలేదని అర్థంచేసుకున్నాడు.. ఆత్మహత్యకు పూనుకున్నాడు.
***************
ముకుందుడు గాయం చేసినా ప్రాణాలను అరచేతపట్టుకొని టాంగాలో రాజమహేంద్రవరానికి చేరుకుంది తులసి. టాంగా వాని సహాయంతో విశ్వనాధుని ఆచూకీ తెలుసుకొని విశ్వనాధుని చెంతకు చేరింది.
తులసి వచ్చేసరికి విశ్వనాధుడు కొనప్రాణాలతో వున్నాడు. తులసి పరిస్థితీ అలాగే వుంది. ఆమె చేతిలో మగపసికందుని చూపిస్తూ... ‘‘ స్వామీ... ’’ ‘‘స్వామీ..’’ అని పిలిచింది.
విశ్వనాధుడు తులసి పిలుపువిని నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. అతని నోటి వెంట రక్తం.. తులసి కంగారుగా ‘‘ఏమైంది స్వామీ...!’’ అన్నది.
‘‘ ఆలస్యమైపోయింది. నువ్వు రావని.. ముకుందుడు చెప్పాడు. నీ వియోగంతో వుండలేక ఈలోకాన్నే వదిలేద్దామని నిర్ణయించుకున్నాను. మృత్యుదేవత కౌగిట్లోకి చేరిపోవాలని.. నీకేమైంది?’’
‘‘ చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం... స్వామీ ఇదిగో మన ప్రేమకి ప్రతిరూపం... ’’ అంటూ విశ్వనాధునికి అందించింది..
విశ్వనాధుడు ఆ బిడ్డని, ఆమెని ముద్దాడాడు.. అలాగే ఒరిగిపోయాడు.. తులసి కూడా ఊపిరి వదిలి విశ్వనాధునిపై వాలిపోయింది...
అప్పుడే బావగారి ఆజ్ఞమేరకు ముకుందుడు తీసుకొచ్చిన అగ్ని, తులసి తీర్థం వారిని చూస్తూనే జారవిడిచాడు. బిడ్డ ఏడుపువిని పరుగు పరుగున వచ్చి విశ్వనాధునిపై వున్న తులసిని పక్కకి తప్పించాడు. విశ్వనాధుడు, తులసి మృతిచెందారనీ, వారి ప్రేమకి ప్రతిరూపమే ఆ బిడ్డ అని గ్రహించాడు ముకుందుడు. తనెంత పెద్ద తప్పుచేశాడో తెలుసుకొని రోధించాడు. పసిబిడ్డని తన అక్కున చేర్చుకొని కన్నీటి పర్యంతమయ్యాడు ముకుందుడు.
ఇన్నాళ్ళూ వారిది వ్యామోహమని భ్రమపడ్డ ముకుందుడికి అర్థమైంది వారిద్దరి మధ్యా వున్నది ప్రేమ అని. ఆ బిడ్డ ఆలనా పాలనా తను స్వీకరించాడు ముకుందుడు.
ప్రేమికులకు మరణం వుండచ్చు.. కానీ ప్రేమకి మరణం లేదు..
శుభం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి