వసంతం

                                         వసంతం

- గంగారపు రాణి

‘‘ మనిషి పాతరాతియుగం నుంచి పరమాణు యుగం వరకూ ఎదిగి ఎన్నో అద్భుతాలు సృష్టించినా ఇంతవరకూ మనిషి పూర్తిగా చిక్కువిప్పలేనిది మనసు. అది సృష్టించే స్థితి మనిషి మానసిక స్థితి నీటిలో తేలే మంచుముక్కతో పోలిస్తే నీటిలో తేలే మంచుముక్క అందరికీ కనిపించే వ్యక్తిత్వమైతే... నీటి అడుగున ఎవ్వరికీ కనిపించనిది మనిషి అసలు రూపం. ’’ అని చెప్పటంతో హాల్లో వున్న అందరూ చప్పట్లు కొట్టారు. 


ఉపన్యాసం ఆపి కర్చీఫ్ తో ముఖం తుడుచుకున్నాడు డాక్టర్ చంద్రశేఖర్. 
ఆ ఎయిర్ కండిషనర్ సెమినార్ హాల్లో నాలుగు వందలకు పైగా వున్న డెలిగేట్స్ మధ్య అలవోకగా ఉపన్యాసం ఇస్తున్నాడు. 
అయితే ఒక్క క్షణం చెమటలు పట్టటానికి కారణం ఆ ఆవరణ లోకి హటాత్తుగా ప్రవేశించిన ఓ అరవై ఏళ్ళ వృద్ధురాలు. ఆవిడ బాగా అలసిపోయినట్లు కనిపిస్తోంది. మాసిపోయిన చీరె.. బాగా రేగిన జుట్టు.. చంద్రశేఖర్ వంక తదేకంగా చూస్తోంది. ఆ చూపుల్లో ఏ భావమూ లేదు. 
చంద్రశేఖర్ గొంతు తడి ఆరిపోయింది. 
అతడి పక్కనే వున్న పాలరాతి శిల్పం లాంటి అతని భార్య అనూషవైపు చూశాడు. 
ఆమె తన తండ్రి భూపతిరావు వైపు చూసింది. 
భూపతిరావు నిర్వాహకులను గట్టిగా పిలిచి ఈ పిచ్చిదాన్ని బయటికి గెంటేయమని చెప్పాడు. 
ఆ ముసలావిడని నిర్వాహకులు లాక్కుంటూ వెళ్ళి బయట విసరివేశారు. 
మళ్ళీ చంద్రశేఖర్ తన ఉపన్యాసాన్ని కొనసాగిస్తున్నాడు.  ‘‘ మతి భ్రమించటం అంటాం. అంటే మనసు దారి తప్పటం అది మరీ తీవ్రతరంగా పరిణామం చెందితే వచ్చే జబ్బు అల్జీమర్స్. ఇది వృద్ధాప్యంలో ఎదురయ్యే సమస్య. రక్త సంబంధీకులను మర్చిపోయే స్థితి. ఈ వ్యాధి నివారణకు మందుల కన్నా.. వ్యాధి గ్రస్తులని వారి పూర్వస్థితిలోని విషయాలు జ్ఞాపకాల్లోకి తీసుకెళ్ళటం ద్వారా వారిని మామూలు స్థితిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాం..’’ అంటూ గంటసేపు ఏకధాటిగా ప్రసంగించిన తర్వాత సభంతా చప్పట్లతో మారుమ్రోగింది.
అయితే చంద్రశేఖర్ కి ఆ చప్పట్లు వినిపించటం లేదు. అతని మనసు మాత్రం సెమినార్ లోకి వచ్చిన ఆ ముసలావిడ చుట్టూ తిరుగుతోంది. ఉపన్యాసం పూర్తయిన వెంటనే వేగంగా డయాస్ దిగి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి కారెక్కాడు. అతన్ని భార్య, మామ అనుసరించారు. 

*********

ఆ కారు ఒక ఇంటి ముందు ఆగింది. చుట్టూ ఖాళీస్థలం. పూలమొక్కలు. మధ్యలో ఇల్లు. తలుపు తీసుకొని లోపలికి వెళ్ళాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. కర్చీఫుతో మొహం తుడుచుకున్నాడు. అతని భార్య మామ ఇద్దరూ ఆ ఇంటిని పరికించి చూసి ఇక్కడికెందుకు తీసుకొచ్చావ్ అని అడిగారు. 
‘‘ ఇదే నేను పుట్టిన ఊరు. ఇది నా ఇల్లు. ఇందాక సెమినార్ లోకి వచ్చిన ముసలావిడ మా అమ్మగారు ’’అని సమాధానమిచ్చాడు. 
దానికి అతని మామగారు ‘‘ కోపంగా నాకు ఎనకాముందూ ఎవ్వరూ లేరు. నేను ఒక్కడినే. పెద్ద ఆస్థిమంతుడను, ఒక బిల్డింగ్ వుందని అబద్ధం చెప్పి మా అమ్మాయిని పెళ్ళి చేసుకున్నావ్..’’ అంటూ నిలదీశాడు. 
‘‘ మా పెళ్ళికి మీరు ఎన్నో ఆంక్షలు పెట్టారు. ప్రేమించిన మీ అమ్మాయి నాకు మిస్ అవుతుందన్న కారణంతో అలా అబద్ధం చెప్పాల్సి వచ్చిందని’’ చెప్పాడు చంద్రశేఖర్.
అంతలో ఒక వ్యక్తి వచ్చి నమస్తే డాక్టర్ గారూ బాగున్నారా.? పదిరోజుల క్రితం మీరు విజయవాడ సెమినార్లో పాల్గొంటున్నారని చెప్పాను. అయోమయంగా చూసింది. మళ్ళీ నిన్న చెప్పాను. మీ అబ్బాయి వస్తున్నాడని. అలాగేలే అన్నది. మళ్ళీ ఉదయం అడిగితే మర్చిపోయింది. సరే కన్న కొడుకుని చూసుకుంటుందిలే అని ఆటో ఎక్కించుకొచ్చాను. అక్కడ మీరు లోపలికి రానీయకుండా బయటికి గెంటి తలుపులేసేశారు. ఏడ్చుకుంటూ ఆటో ఎక్కి ఇంట్లో గదిలోకెళ్ళి తలుపేసుకొని ఏడుస్తోందని చెప్పాడు. పిలుస్తాను వుండండి అని భాగ్యమ్మని పిలిచాడు. 
లోపలగదిలో నుంచి భాగ్యమ్మ బయటికొచ్చింది. 
చంద్రశేఖర్ అమ్మా అని పిలిచాడు. 
ఆవిడలో ఏమార్పూలేదు. అలాగే చూస్తూ వుంది. 
నేనేనమ్మా .. నీ చంద్రశేఖర్ అని అమ్మా.. 
ఆమెలో చలనం లేదు. ఎవరూ అన్నట్లుగా చూసింది.  ఆ చూపుకి కుప్పకూలిపోయాడు చంద్రశేఖర్. 
పదిహేను సంవత్సరాలు నీ గురించి పట్టించుకోకుండా రాలేకపోయాను.. నన్ను క్షమించు. అన్నాడు. అతను ఏమి మాట్లాడినా ఆమెలో ఏవిధమైన చలనమూలేదు.. అతన్ని గుర్తుపట్టనూ లేదు. భార్య, మామ హోటల్ కి వెల్దాం పదండి అన్నారు. మీరు వెళ్ళండి నేను రాను అన్నాడు చంద్రశేఖర్. దానికి భార్య ఇక్కడెలా వుంటారు అని అడిగింది. నేను మా అమ్మ దగ్గరే వుంటాను మీరు వెళ్ళండి అన్నాడు. రమ్మని బలవంతం చేశారు. ఈ పరిస్థితుల్లో అమ్మని వదిలి ఎలా వుంటానని కోపంగా అరిచాడు. అందుకు భార్య అనూషకూడా భర్తతో వుంటానని చెప్పింది. చంద్రశేఖర్ నీ ఇష్టం అని చెప్పాడు. మామ భూపతిరావు అసహనంగా వెళుతూ మనకి బిజీ షెడ్యూల్ వుంది. ఇక్కడ కార్యక్రమాలు త్వరగా పూర్తిచేసుకొని హోటల్ కి రమ్మని వెళ్ళిపోయాడు. చంద్రశేఖర్ వాళ్ళ అమ్మ కాళ్ళదగ్గర కూర్చున్నాడు. అతడిలో పాత జ్ఞాపకాలు.. 

పదేళ్ళ పిల్లవాడైపోయాడు. 
తల్లి కూరగాయలు అమ్ముతోంది. 
చంద్రశేఖర్ బండి నెడుతున్నాడు. 
తర్వాత దృశ్యం  మారిపోయింది... 
చంద్రశేఖర్ పద్యం, పాటలతో సినిమా డైలాగులతో అదరగొడుతున్నాడు. భాగ్యమ్మ సంబరపడి పోతుంటుంది. 
ఇంటర్ లో ఫస్ట్ ర్యాంకు రావటంతో తల్లి పాయసం పెట్టి దీవించటం,
ఎంబిబిఎస్ మంచి మార్కులతో పాసై పరిగెత్తుకుంటూ తల్లిదగ్గరకు రావటం.. 
భాగ్యమ్మ దిష్టితీసి ఆనందంగా పదిమందికీ చెప్పుకోవటం... 
చంద్రశేఖర్ ను అమెరికా పంపించటం. 
ఒక్కసారి తుళ్ళిపడి లేచాడు చంద్రశేఖర్.. 
భాగ్యమ్మ ఎక్కడికో వెళ్ళటానికి లేచింది. 
చంద్రశేఖర్ అమ్మా అని పిలిచాడు. 
ఒక్కసారిగా అతన్ని పరిశీలనగా చూసి ఎవరు బాబూ నువ్వు అని అంది. 
చంద్రశేఖర్ మనసులో బాధ సుడులు తిరిగింది. 
ఆమె అన్నమాటలకు అయోమయంగా చూసి నేనమ్మా చంద్రశేఖర్ ని అన్నాడు. 
నాకు నువ్వు తెలీదు అన్నది. 
ఇంతలో సెల్ ఫోన్ మోగింది. 
ఇంకో గంటలో మనం ఫ్లైట్ క్యాచ్ చెయ్యాలి. మీ ఇంటికి కారు పంపిస్తున్నాను.. డైరెక్టుగా ఎయిర్ పోర్టుకి వచ్చెయ్యమని భూపతి చెప్పాడు. 
సరేనన్నాడు చంద్రశేఖర్. 
మళ్ళీ తల్లి దగ్గరకు వచ్చి అమ్మా నా చిన్నప్పుడు కూరగాయలు అమ్మేదానివి గుర్తొచ్చిందా అన్నాడు. 
ఆమె ముఖంలో ఏ మార్పూలేదు. 
నేను పెద్ద డాక్టర్ ని అమ్మా.. పెద్ద ఉద్యోగం.. డాక్టర్ చంద్రశేఖర్ ఎం.డి. కన్సల్టెంట్ సైక్రియాట్రిస్ట్, క్యాలిఫోర్నియా హెల్త్. అన్నాడు. 
ఆ మాటలకు ఆమె అదోలా చూసి నాకు ఒక్క ముక్క అర్ధం కావట్లేదు నువ్వు అనేది అన్నది. ఏంటమ్మా అలా అంటున్నావ్ అన్నాడు. 
చంద్రశేఖర్ ఏడుస్తూ క్షణం సేపు ఆలోచనలో పడ్డాడు. అటూ ఇటూ పచార్లు చేశాడు. ఏదో గుర్తొచ్చిన వాడిలా ఆమె ఎదురుగా నిలబడి చిన్నప్పుడు నేర్చుకున్న పద్యం పాడాడు. అమ్మా ఈ పద్య నాన్న, నువ్వు నాకు చిన్నప్పుడు నేర్పారు. గుర్తొచ్చిందా అన్నాడు. 
దానికి తల్లి భాగ్యమ్మ ఏంటో నీ పిచ్చి వాగుడు అని నవ్వింది. 
ఇంతలో ఫోను మోగింది. 
నేను ఎయిర్ పోర్టులో వున్నాను. మీకు కారు పంపించాను. వెంటనే వచ్చేయండని భూపతి రావు ఫోన్లో చెప్పాడు. 
‘‘ అమెరికాలో పెద్ద ఉద్యోగం .. ఏం చెయ్యాలి.. డబ్బున్న అమ్మాయితో పెళ్ళి జరిగింది. లక్షల డాలర్ల జీతం. ఇవన్నీ వదులుకొని ఇక్కడే వుంటే.. నాపై ఆశలు పెంచుకున్న అమ్మ మనసులో ఆలోచనల సుడి ఒక సందిగ్ధం. ఒక సంకోచం.. ఆ గదిలో పచార్లు చేస్తున్నాడు.  అమెరికా వెళ్ళి అక్కడ పొందే సుఖాలకంటే,తన తల్లిని మామూలు మనిషిని చేసుకోవటంలో ఎంతో ఆనందముందని గ్రహించి తన చదువుని, విజ్ఞానాన్ని తల్లిని బాగు చేసుకోవటం కోసమే ఉపయోగించి చిన్నప్పడు తన తల్లితో వున్న జ్ఞాపకాలను గుర్తు చేస్తూ.. ఆమెకి సపర్యలు చేసుకుంటూ తమ జీవితాల్లో వసంతం చిగురించటంకోసం ఇక్కడే వుండాలని నిర్ణయించు కున్నాడు చంద్రశేఖర్....

*******

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి