శిలాక్షరాల చరిత్ర

 శిలాక్షరాల చరిత్ర

- నల్లబాటి రాఘవేంద్రరావు
సెల్ : 9966212386

సుబ్బారాయుడు ఆ తరంలోనే  కాదు ఈ తరంలో కూడా  పెళ్లిళ్లు  కుదర్చే పెద్ద. అయితే ఇప్పుడు.. పెద్ద.. అన్న మాట వాడడం కుదరదు. ఎందుకంటే ఇప్పుడు బ్రోకర్ అనాలి. అలా అంటేనే కానీ ఇప్పటి తరానికి అర్థం కావడం లేదు. తప్పదు.. ఏం కర్మ వచ్చింది రా దేవుడా..అని మనసులో  అనుకుంటూ సెల్  ఆన్ చేశాడు సుబ్బారాయుడు.

''  షణ్ముఖంగారూ.. నమస్కారమండి.  నేను  పెళ్లిళ్ల బ్రోకరు సుబ్బారాయుడు మాట్లాడుతున్నాను. బస్సు ఎక్కాను వచ్చేస్తున్నాను'' అంటూ వణుకుతున్న   కంఠంతో అన్నాడు.

అతని కంఠం  వణుకుతుంది తప్పదు మరి . కంఠం వణకకపోయినా శరీరం వణకుతుంది ఎందుకంటే 90 ఏళ్ల దగ్గర పడ్డ వ్యక్తి.

ఆరు పుష్కరాల క్రితమే అతను ఈ వృత్తి చేపట్టాడు.  అయితే అప్పటి రోజులు వేరే. పెళ్లిళ్లు  కుదర్చే  వ్యక్తిని అమితంగా గౌరవించేవారు, గారం చేసేవారు, సన్మానం కూడా చేసేవారు.

సిగ్నల్స్  అందుకోక ఏమో అవతల వైపు మాట్లాడే షణ్ముఖం మాట కట్ అయిపోయింది.   గత జ్ఞాప కాలు మళ్లీ మళ్లీ ఆలోచిస్తూ సెల్  లో అవతల  వ్యక్తితో మాట్లాడడం గురించి ప్రయత్నం చేస్తున్నాడు సుబ్బా రాయుడు.

  అప్పట్లో....

''సుబ్బారాయుడుగారు అయ్యా నమస్కారం  సార్, మీరు వచ్చి ఈ సంబంధం   కుదర్చకపోతే మా అమ్మాయికి పెళ్లి కాదండి. మీ కాళ్లకు పాలాభిషేకం చేస్తాను మీరు త్వరగా రండి సార్ ..,''
అంటూ గౌరవంగా మాట్లాడే వారు .. ల్యాండ్ లైన్ లేని వాళ్ళు ఒక మనిషిని పంపించేవారు తన గురించి. అతను తనను బస్సు మీద గౌరవంగా తీసుకెళ్లేవాడు దారి ఖర్చులు పెట్టుకొని.. దారిలో టీ కానీ కాఫీ కానీ ఇప్పించే వాడు కూడా.

అబ్బాయి తరుపు వాళ్ళకి  అమ్మాయి తరఫు వాళ్ళకి పూర్తి వివరాలు విపులంగా చెప్పి ముందుకు వెళ్ళండి నేను ప్రయత్నం చేస్తాను అన్ని విషయాలు నేను చూస్తాను అంటూ  భరోసా ఇచ్చి ఆ పెళ్లి విహారం పూర్తయ్యే వరకు దగ్గరే ఉండేవాడు సుబ్బారాయుడు. అబ్బాయి తరుపు వాళ్లకి అమ్మాయి తరఫు  వాళ్లకి సమస్యలు వస్తే సర్దుబాటు చేసి  పెళ్లి పూర్తి చేయిం చేవాడు.

పెళ్లి అయ్యాక కూడా రెండు వైపుల వాళ్లకు ధైర్యం '' మీకేం భయం లేదు ఏ సమస్య వచ్చినా  కాకి చేత కబురు పెట్టండి .'' అంటూ   అండగా నిలబడినట్టు మాట్లాడేవాడు.

సాధారణంగా సమస్యలు  వచ్చేవి కాదు ఒకవేళ వచ్చిన సుబ్బారాయుడు దగ్గరుండి వాళ్ళను వీళ్ళను ఒప్పించి ఏ సమస్య లేకుండా సర్దుబాటు చేసేవాడు.  కాపురాలు సజావుగా  జరిగేవి . నూటికి ఒకటో రెండో తప్పించి మిగిలిన 98 కూడా సక్సెస్  బాటలోనే ప్రయాణించి పిల్ల పాపలతో సంతోషంగా కాపు రాలు చేస్తూ సకల ఆనందాలతో కుటుంబాలు  కళకళలాడుతుండేవి.. అవి.. ఆ రోజులు.. గత కాలం   నాలుగైదు పుష్కరాలు క్రితం మాట.

సాధారణంగా  ఆరోజుల్లో ఎక్కువగా దగ్గర సంబంధాలే చేసుకునేవారు. దానికి సుబ్బరాయుడు అవసరం అంతగా ఉండేది కాదు అలా సగం వరకు సంబంధాలు జరిగిపోవడంతో మిగతా సగం సంబంధాల విషయంలో సుబ్బారాయుడు  పెద్దగా బాధపడకుండానే పెళ్లిళ్లు    కుదిరిచ్చేవాడు ఆ చుట్టుపక్కల గ్రామాలలో.

వాళ్ళు ఇచ్చిన  100  లేక 200 డబ్బులు తీసుకొని సరిపెట్టుకునే వాడు. ఇవ్వకపోయినా అడిగేవాడు కాదు. ఆ డబ్బులతోనే సంసారం,పిల్లలు తన  భవిష్యత్ కార్యక్రమాలు హాయిగా  జరిగిపోతుండేవి. 

ఈలోగా సెల్  ఆన్ అయి అవతల వ్యక్తి హలో..  అన డంతో  హుష్ కాకి లెక్కన గతం ఎగిరిపోయి ప్రస్తుతం లోకి వచ్చాడు సుబ్బారాయుడు.

'' ఏం చేస్తున్నావ్ నువ్వు బయలుదేరి రావాలి. డబ్బులు తీసుకుంటారు కానీ  పనిచేయరు.''
అన్నాడు చిరాకుగా అవతలి  వ్యక్తి షణ్ముఖం.

''బస్సులోనే ఉన్నాను సార్ బస్సు లేటు.'' అన్నాడు సుబ్బారాయుడు.  షణ్ముఖానికి,తనకు   రెండు పుష్కరాల  వయస్సు తేడా . కానీ  షణ్ముఖం కనీస గౌరవం కూడా  ఇవ్వకుండా మాట్లాడడం సుబ్బా రాయుడు గుండెల్లో  కసుక్కుమంది.  అలవాటై పోయింది ఏం చేస్తాడు. ప్రస్తుతం అవతల వ్యక్తి ఇచ్చే 100.. 200 చాలా అవసరం మరి.

భుజాన ఆల్బమ్స్ ఉన్న బ్యాగు తగిలించుకొని వాటర్ బాటిల్లో ఉన్న నీళ్లు కొద్దిగా  తాగి తను దిగవలసిన గమ్యం చేరిన   ప్యాసింజర్ బస్సు దిగాడు సుబ్బా రాయుడు.

నేరుగా షణ్ముఖం గారి ఇంటికి వెళ్లి తన ఆల్బమ్స్లో పాతవి కొత్తవి చాలా ఫోటోలు చూపించేశాడు ఆ కుటుంబ సభ్యులకు. ఒక్క అమ్మాయి ఫోటో కూడా నచ్చలేదు. షణ్ముఖం గారి కోడలు ఎక్కడ ఉందో పాపం.   మళ్లీ వస్తాను సార్ మరికొన్ని బయోడేటా లతో.. అని చెప్తూ వాళ్ళు కొన్ని అయినా డబ్బులు ఇస్తా రేమో అని ఎదురు చూసి ఇవ్వకపోయేసరికి నీరసపడి పోయాడు సుబ్బారాయుడు.

ఎందుకన్నా మంచిది అని చివరి అస్త్రం ఉపయోగిస్తూ ఇలా అన్నాడు.. ''ఇదిగో  షణ్ముఖం గారు మీ అబ్బాయి కి మీ ఎదురింటి సంబంధం గురించి అదే సత్యేంద్ర ప్రసాద్ గారి అమ్మాయి గురించి ఏమైనా ఆలోచించా రా.. మీ అబ్బాయికి వాళ్ళ అమ్మాయి బాగానే ఉంటుంది కదా..అంటూ గుర్తు చేశాడు.''

'' చాలు చాలు ఊరుకో.. చెప్పినదే ఎన్ని సార్లు  చెబు తావు. అది అష్ట వంకర్ల సంబంధం దాని గురించి ఎప్పుడూ నా దగ్గర ఎత్తకు .'' అంటూ షణ్ముఖం కసురుకోవడంతో నాలుగు చీబాట్ల పెట్టడంతో మారు మాట్లాడకుండా బయటపడ్డాడు సుబ్బారాయుడు.

అలాగే ఎదురింటి  సత్యేంద్ర ప్రసాద్ గారి ఇంటికి కూడా వెళ్లి వాళ్లకు కూడా తన  దగ్గర ఉన్న  అబ్బా యిల బయోడేటాలు ఫొటోస్  చూపించి వాళ్ళు అవేవి సరిపడలేదు అని చిరాకుగా మాట్లాడిన మీదట వెళ్ళిపోతూ మళ్లీ  వెనక్కి తిరిగి వచ్చాడు సుబ్బా రాయుడు.

'' ఇదిగో సత్యేంద్ర ప్రసాద్ గారు.. మీ అమ్మాయికి  ఎదురింటి షణ్ముఖం గారి అబ్బాయి 100% సరి పోతాడు కదా  ఆ సంబంధం గురించి ఏమైనా ఆలోచించారా?'' అంటూ  చెప్పాడు.

సత్యేంద్రప్రసాదు కూడా  చివాట్లు  కడుపునిండా పెట్టాక అవి పూర్తిగా తిని అక్కడ ఉన్న గ్లాసులు మంచినీళ్లు తాగి బయటపడ్డాడు సుబ్బారాయుడు ఇప్పటి పరిస్థితి విధానానికి  లోబడిన వ్యక్తి.

గతం గతః 

ఇప్పుడు పెళ్లిళ్లు విధానానికి వస్తే... మనుషులు సంబం ధాలు కుదుర్చుకోవడం అనేది చాలా  గగనతలమై పోతుంది.   ఆశలు అత్యాశలు. తమకు లేకపోయినా ఎదుటివాళ్ళకు  అవి ఉండి తీరాలి అన్న అదోరకమైన వెధవగొట్టు ఏడుపు  ఆలోచనలు. సంబంధాలు కుదుర్చు కోలేకపోతున్నారు. కుదిరి నా మూడున్నర రోజుల ముచ్చట అయిపోయి  విడాకులతో అశుభం కార్డు  పలుకుతున్నాయి కాపురాలు. 

******


ఈరోజు సుబ్బారాయుడు చెప్పిన మరో కొత్త సంబంధం గురించి అమ్మాయిని చూడడానికి  బయలు దేరారు.. షణ్ముఖం కుటుంబం.

షణ్ముఖం తన కొడుకు అమర్నాథ్ పెళ్లి సంబంధానికి విజయవాడ వెళ్లడం విషయంలో హడావిడిగా ఉన్నాడు.

సికాకుళం సైకిల్ మీద స్పీడ్ గా వచ్చి కొంచెం దూరం గా స్టాండ్ వేసి తన బుట్టలోంచి నాలుగు మూరలు మల్లెపూల దండ తీసి బయట నిలబడి ఉన్న  షణ్ముఖం భార్య సావిత్రికి అందించి షణ్ముఖం  వైపు తిరిగి...
'' బాబాయ్ గారు ఈ సంబంధం ఖచ్చితంగా ఖాయం చేసుకుని వచ్చేయాలండీ. పెళ్లి బేరం  మాత్రం నాదే ఎవరికి ఇవ్వకూడదు.'' అంటూ.. షణ్ముఖం ఇచ్చిన డబ్బులు తీసుకుని  రోడ్డు దాటి  అవతలకి వెళ్లి కొంచెం దూరంలో ఉన్న ఎలక్ట్రికల్ స్తంభం దగ్గర  సైకిల్ స్టాండ్ వేశాడు అక్కడ ఉన్న ఇంట్లో వాళ్లకి పువ్వులదండ ఇవ్వాలని.

షణ్ముఖం తన కొడుకు, భార్య ఇతర బంధువులతో టాక్సీ ఎక్కి స్పీడుగా విజయవాడ వైపు  వెళుతు న్నాడు. రమారమీ 20 సంవత్సరాల నుండి తన కొడుకుకు సంబంధం గురించి తిరుగుతూనే ఉన్నాడు షణ్ముఖం.. పెళ్లిళ్ల  బ్రోకర్ సుబ్బారాయుడు చాలా సంబంధాలు చెప్తూనే ఉన్నాడు.  కొడుకు జాతకంలో దోషాలు లేకపోయినా తృప్తి కోసం పూజలు చేయిం చాడు లక్షలు ఖర్చుపెట్టి. అయినా ఏ సంబంధానికి వెళ్లిన  ఏదో   మైనస్.. అసంతృప్తి. భర్తకు నచ్చితే   భార్యకు నచ్చటం లేదు భార్యకు నచ్చితే భర్తకు నచ్చటం లేదు. పిల్లపొట్టి అని, రంగుతక్కువ అని, కులం, గోత్రం  తేడాగా ఉన్నాయని, బాగా లేనివాళ్లు అని, చాలా దూర ప్రాంతంఅని,చదువుతక్కువ అని, పిల్ల తల్లి తండ్రి అందంగా లేరని, అన్నీ కుదిరితే జాతకం బాగోలే దని, కట్నకానుకల విషయం సరిగా లేదని, పెళ్లికి బలమైన ముహూర్త బలం లేదని ఇలా రకరకాలు ఆలోచనతో ఆ భార్యభర్తలు సంబంధం  కుదర్చలేక పోతున్నారు. రెండు మూడు సంబంధాలు అయితే ముహూర్తాల వరకు వచ్చి ఆగిపోవడం మళ్లీ  సంబం ధాల కోసం దండయాత్ర. ఇది ఎప్పటికీ తరగని సీరి యల్లా కొనసాగుతూనే ఉంది. 


*****


20 ఏళ్ల క్రితం మొట్టమొదటి సంబంధానికి వెళ్లేటప్పుడు ఇంటింటికి చనువుగా తిరుగుతూ పువ్వులు అమ్ము కునే సికాకుళం అన్నమాట గుర్తొచ్చింది ప్రస్తుతం  కారు లో జారబడి  సంబంధం కోసం విజయ వాడ వెళుతున్న షణ్ముఖానికి.

''బాబాయ్ గారు..  ఈ వీధిలో రోడ్డుకి అవతల ఎలక్ట్రిక్ స్తంభం దగ్గర ఇల్లు ఉంది  చూడండి అదే.. మీ  దోస్త్ సత్యేంద్ర ప్రసాద్ గారి అమ్మాయి  బుజ్జమ్మ ఉంది కదా. బోల్డంత చదువుకుంది.. బాగుంటుంది  మీలాగే  బాగా ఉన్నవాళ్లే. మీ కులమే కదా.. ఆ అమ్మాయిని మన అబ్బాయి గారికి చేసుకుంటే బాగుంటుందేమో''
అన్నాడు.

ఆ మాటలు విన్నాక షణ్ముఖం..ఎదురింటి సంబంధమా వద్దులే అంటూ తన కనురెప్పలు రెండు బాగా పైకి సాగదీసి పెదాలు కూడా పక్కలకు బాగా  విడదీసి ఒక సారి కళ్ళు మూసుకొని వదిలాడు. అతని భార్యసావిత్రి కూడా  అది మనకు కుదరదు..అంది. సికాకుళం వాళ్ళిద్దరూ ఎందుకు అలా అంటున్నారో తన బుర్రకు ఏ మాత్రం అర్థంకాక మిన్నకుండి  పోయాడు.  పువ్వులు ఇస్తున్నప్పుడు అలా చాలా సార్లు చెప్పాడు కానీ ఆ భార్యాభర్తలు వినబడనట్లుగానే మసులుకొనేవారు.

ఇప్పుడు కారులో ఉన్న షణ్ముఖం ఆ విషయం గుర్తుకు వచ్చి డోరు సైడ్ ఉన్న మిర్రర్ లో తన ముఖం చూసుకున్నాడు..తన కనురెప్పలు రెండు బాగా పైకి సాగదీసి పెదాలు కూడా పక్కలకు బాగా  విడదీసి ఒకసారి కళ్ళు మూసుకొని వదిలాడు.
టాక్సీ విజయవాడ వైపు స్పీడుగా దూసుకు పోతోంది.


****


ఎలక్ట్రిక్ స్తంభం దగ్గర స్టాండ్ వేసిన సికాకుళం సత్యేంద్ర ప్రసాద్ గారి గేటు దాటి లోపలకు వెళ్లి కింద మెట్టు మీద కూర్చుని  బుట్టలో  నుండి నాలుగు మూరల పూల దండ తీసి ఆ ఇంటి ఓనర్ సరస్వతమ్మ అందించాడు.

'' అమ్మగారు ఈ సాయంత్రం మన  చిట్టితల్లి బుజ్జమ్మ కు  సంబంధం వస్తుందన్నారు కదా.  పాప వయసు మించి పోయింది . ఈసారి  ఎలాగైనా అబ్బాయిని ఖాయం చేసేయండమ్మ'' అన్నాడు. నెమ్మదిగా కొంచెం భయపడుతున్నట్టు.

షణ్ముఖం లాగే సత్యేంద్రప్రసాద్ కూడా బిజినెస్ మ్యాగ్నెట్. ఎడతెరిపి లేని వర్షం పడుతున్నట్టు 20 సంవత్సరాలు నుండి అతను కూడా తన కూతురికి సంబంధాలు చూస్తూనే ఉన్నాడు.. పెళ్లిళ్ల బ్రోకర్ సుబ్బారాయుడు సహాయంతో.  తన కూతురు తోటి అమ్మాయిలకు పెళ్లిళ్లు అయిపోయి పిల్లలు పుట్టి ఆ పిల్లలకు రజస్వల కార్యక్రమాలు కూడా అయిపోవడం.. ఆ కార్యక్రమాలకు తమ కుటుంబ సైతం గా వెళ్లిరావడం సత్యేంద్ర ప్రసాద్ కు కొంచెం బాధగానే ఉంది కానీ ఏమీ చేయలేకపోతున్నాడు. సత్యేంద్ర ప్రసాద్ తో పాటు అతని భార్య సరస్వతమ్మ కూడా రాబోయే అల్లుడు విషయంలో రకరకాల గేటులు పెట్టేసుకున్నారు. వందరకాలుగా రాబోయే అల్లుడు , వారి కుటుంబం..
తమకు సరిపోవాలి అనే గాడిలో ఉన్న వాళ్ళిద్దరూ ఏ సంబంధాన్ని కుదుర్చు కోలేకపోతున్నారు.

20 ఏళ్ల క్రితం సత్యాంద్రప్రసాద్, అతని భార్య సరస్వతమ్మ ఒకనాడు  పార్కులో కూర్చున్నప్పుడు ఆ లోపలే పూలు అమ్ముతున్న సికాకుళం తనకు  బాగా పరిచయం ఉన్న వాళ్లు ఇద్దరినీ  సమీపించి  కొంచెం దూరంగా నిలబడి నెమ్మదిగా.. వాళ్ల ఎదురింటి షణ్ముఖం గారి అబ్బాయి గురించి ఇలా అన్నాడు

'' అన్ని విధాలా మీకు అనుకూలంగా ఉన్న మీ ఎదు రింటి షణ్ముఖంగారి అబ్బాయిని కుదుర్చుకుంటే ఒక పని అయిపోతుందికదా '' అంటూ అన్నాడు.

సత్యేంద్రప్రసాద్ కాసేపు నుదురు చిట్లించి తల గోక్కుని ముక్కు సరి చేసుకుంటూ పైకి లేచి నిలబడి సికాకుళం వైపు పిచ్చివాడిని చూస్తున్నట్టు చూసి వికటంగా నవ్వి ...
'' ఎదురింటి సంబంధమా ఎందుకులే..''  అంటూ వెళ్లి పోయాడు. అతని భార్య కూడా అలాగే అంది.

అయినా అప్పుడప్పుడు సికాకుళం ఆ విషయం గురించి సత్యేంద్ర ప్రసాద్ సరస్వతములకు చెబు తూనే ఉన్నాడు.. 20 ఏళ్ల నుండి.

అలా  వాళ్ల అమ్మాయికి సంబంధం చూడడం మొదలు పెట్టి 20 ఏళ్లు గడిచిపోయాయి సత్యేంద్ర ప్రసాద్ దంపతులకు.


*****


ఆదివారం రోజున..
షణ్ముఖం పార్కులో తూర్పు మూల బల్ల మీద నీర సంగా కూర్చుని  పల్లీలు తింటున్నాడు. పార్కులో పడమర మూల కూర్చుని పల్లీలు తింటున్న సత్యేంద్ర ప్రసాద్ మరింత నీరసంగా నడుచుకుంటూ నెమ్మదిగా ఈ పక్కకు వచ్చాడు.

" ఏమయ్యా షణ్ముఖం ఆ పల్లీలు అతను ఇలా వచ్చాడా?" అంటూ అడిగాడు.

" అదేంటి నీ దగ్గర నుంచే  వచ్చేడట  కదా నీకు కూడాా పల్లీలు ఇచ్చాడట కదా.ఇలా కూర్చో" చోటు చూపిస్తూ అన్నాడు షణ్ముఖం.

" ఇచ్చాడు. మళ్లీ తీసుకుందామని వచ్చాను. 20 ఏళ్ల నుండి నాకు ఆ పక్కనే కూర్చోవడం అలవాటై పోయింది. ఇక్కడ కూడా చల్లగానే ఉంది"

" నేను కూడా చాలా సార్లు ప్రయత్నించాను నువ్వు కూర్చుండే ఆ పడమర బల్ల వైపు వద్దామని కానీ ఏదో ఇలా అలవాటైపోయి నువ్వు అన్నట్టు  20 సంవత్స రాల నుండి ఇక్కడే గడిచిపోతుంది."

" సరే ఇలా కూర్చుంటానే నీ పక్కగా." కూర్చుంటూ అన్నాడు సత్యేంద్ర ప్రసాద్.

"ఈ బల్ల నాది కాదు కదా కూర్చో." నవ్వుతూ అన్నాడు షణ్ముఖం.

" జోకులు వేయడం ఇంకా మానలేదు నువ్వు. అవును మీ అబ్బాయి సంబంధాలు ఎంత వరకు వచ్చాయి?"

" నీకు తెలియందిముంది. ఒకటి కుదిరితే ఒకటి కుదరడం లేదు.   ఎందుకూ పనికిరాని సంబంధాలు. ఖర్చు లెక్క పెట్టుకుంటే 20 ఏళ్లలో పెళ్లి సంబంధా లుగా తిరగడానికి 10లక్షల అయింది. నాకు వయసు అయి పోతుందేమో ఆరోగ్యం కూడా తగ్గిపోతుంది.  ఓ పక్క సంబంధం కుదరటం లేదన్న మానసిక వేదన.
చచ్చిపోవాలని ఉంది. మొన్న అమ్మాయి బాగుంది  సంబంధం  కుదిరిపోతుంది అనుకున్నాను. తీరా  చూస్తే ఆ అమ్మాయికి పన్ను మీద పన్ను. మీ చెల్లాయి   మన వాళ్ళల్లో ఎవరు అలాలేరు వద్దు అంది''. అన్నాడు షణ్ముఖం తిరిగి తిరిగి కాళ్ళు లాగినవాడిలా .

" అలాగే నాకు కూడా జరిగింది మేము సంబంధాలకు వెళ్లిన చోట ఆ అబ్బాయికి 75 వేలు జీతమట. వాళ్లు గొప్పగా ఉంటుందని లక్ష అని చెప్పుకుంటు న్నారు. ఇదేమిటని అడిగితే మార్చి నుండి పెరుగు తుంది అన్నారు.  మీ చెల్లెమ్మ  వాళ్ళు అబద్ధం చెప్పారని ఆ సంబంధం వద్దు అంది. మా అమ్మా యికి  సంబంధం కుదిరే లోపల ప్రాణం పోయే లాగుంది. నాకు కూడా నీలాగే 10 లక్షలు ఖర్చు అయింది.  ఇలాంటివి చెప్పాలంటే లక్ష ఉన్నాయి.  వెయ్యి అబద్దాలు  ఆడి పెళ్లి చేయమన్నారు కరెక్టుగా అలాగే ఉంది ఇప్పుడు పరిస్థితిి. అబద్ధాలు ఆడితేనే కానీ  పెళ్లిళ్లు చేయ లేమేమో"

"  అలాగే ఉంది వాతావరణం . ఇక మనము కూడా అలా నడుచుకుంటేనే కానీ మన పిల్లలకు పెళ్లిళ్లు అయ్యేలా లేవు."

"నీకు చెప్పకపోవడమే. ఇంటికి ఎదురుగుండా ఉన్నావు ఇందులో తప్పేముంది.. మొన్న ఏమైంది అంటే మా  అమ్మాయికి ఒక మంచి సంబంధం వచ్చింది. ఇద్దరు వయసు సమానంగా ఉంది. వాళ్లు ఒప్పుకోరు కదా. దాంతో రెండు సంవత్సరాలు వయసు తక్కువ ఉన్నట్టు ఇంకొక బయోడేటా తయారు చేయించి పంపించాను. అన్ని మాట్లాడే సుకున్నాం. ముహూర్తాలు పెట్టుకునే టైంలో వాళ్లకు నిజం తెలిసిపోయి క్యాన్సిల్ చేసేసారు." తప్పు నాదే కదా నోరు మూసుకొని వచ్చేసాను'' నిట్టూరుస్తూ అన్నాడు సత్యేంద్ర ప్రసాద్.

"ఇలాంటివి  నాకు కూడా చాలా జరిగాయి. నేను కూడా మా అబ్బాయికి మొన్న ఒక సంబంధం  ఫిక్స్ చేసుకునే లెవెల్ కి వెళ్ళిపోయాను. కానీ పెళ్లి జరగడం  కోసం నీలా  నేను  ఆడిన చిన్న అబద్ధం ఆ సంబంధాన్ని చెడ గొట్టింది.  

'' సరే మనవి మంచి కుటుంబాలు కనక మన పిల్లలు ఇప్పటి  వరకు లేచిపోలేదు అందుకు సంతోషిద్దాం.''

'' సంతోషించడం కాదు. అనవసరపు భేషజాలకు, అహంభావాలకు, అతిచాదస్తాలకు పోయి మనిద్దరం  మన పిల్లల పట్ల  పెద్ద తప్పు చేశాం. ఎదురెదురుగా  ఉన్నప్పటికీ ఈ 20 సంవత్సరాల లో మనం మాట్లాడు కున్నదే చాలా తక్కువ'

'' నిజమే...వాళ్ళ యవ్వన జీవితాలను గుర్తించలేక పోయాం.''

''ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మనిద్దరం  ఒక అడుగు ముందుకు వేద్దాం.''

'''అవును.. నీకు చెప్పాలని చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను. ఐదు సంవత్సరాల క్రితం మా సిద్ధాంతి గారికి మీ అబ్బాయి జాతకం చూపించాను.  మీ అబ్బాయికి  మాఅమ్మాయికి కరెక్ట్ గా సరిపో తుందట."  తెగ ఆనంద పడిపోతూ చెప్పాడు సత్యేంద్ర ప్రసాద్.

" నేను పది సంవత్సరాల క్రితమే చూపించాను బాగా కుదిరిందట ఇద్దరికీ. నీతో అందామంటే ఏమిటో అలా గడిచిపోతుంది. ఏ నీకు ఏమైనా ఉద్దేశం ఉందా ?"
మరింత ఆనందంగా అన్నాడు షణ్ముఖం.

" అలా అంటున్నావ్ గాని నీకు మాత్రం లేదా సరే ఒకసారి పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తే సరి "

"పెళ్లి చూపుల..ఇంకా నయం రోజుకు 90 సార్లు ఒకరి నొకరు చూసుకుంటున్నారు. మాట్లాడు కుంటున్నారు. మా అబ్బాయిని ఇదివరకు ఎప్పుడో  మీ అమ్మాయి గురించి అడిగితే నాకు  ఇష్టమే అన్నాడు ఏంటో మరి."

" ఐదేళ్ల క్రితం మా ఇంట్లో మాట్లాడుకుంటునప్పుడు మీ అబ్బాయిని చేసుకోవడానికి మా అమ్మాయి కూడా బాగా ఇష్ట పడింది."

"శుభం.. ఈ సంవత్సరంలో ఇంకా ఒకే ఒక  మంచి ముహూర్తం ఉందట రేపు 20వ తారీకున. అది తప్పితే మళ్లీ సంవత్సరం వరకు ముహూర్తాలే లేవట. అంటే ఇప్పటికి పది రోజులు టైం ఉంది . సరిపోతుంది. డబ్బులు ఉంటే ఎంతసేపు ఈరోజుల్లో.. నడు ఆ పని మీద  ఉందాం'''

" మరి ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు..?"

"ఇప్పటికే వెధవ ఈగోలకు పోయి  పిల్లల ఇద్దరి యవ్వన   జీవితాలు నాశనం చేశాము. ఇంకా ఈ వెధవ గోల ఎందుకు. నువ్వు ఇచ్చినంత.. ఇవ్వక పోయినా పర్వాలేదులే."

" చూసుకో నువ్వు అనుకున్న దానికి రెండు రెట్లు చేస్తాను నేను."


*****


10 రోజుల తర్వాత


దగ్గరలోని సిటీలో ఫైవ్ స్టార్ హోటల్లో అమర్నాథ్, బుజ్జమ్మల పెళ్లి ఘనంగా జరుగుతుంది. గేటు బయట  వందలాది కార్లు మోటార్ సైకిళ్ళు. 

అదిగో అప్పుడే స్పీడుగా సైకిల్ మీద వచ్చి తన బుట్టలో 20 మూరల మల్లెపూల దండలతో లోపలికి   వెళ్లాలని ప్రయత్నించాడు  సికాకుళం.  వెళ్ళనివ్వకుండా అడ్డు కున్నారు కాపలావాళ్ళు. 

కాసేపటికిి పెళ్లిళ్ల బ్రోకర్ సుబ్బారాయుడు కూడా అప్పుడే ఆటో మీద వచ్చి  లోపలకు వెళ్ళనివ్వక పోవడంతో గేటు బయట నిలబడి పోయాడు . పెళ్లి పూర్తి అయిపోయి జనం అందరూ వెళ్ళిపోయి ఆ ప్రాంతం నిర్మానుష్యం అయిపోయింది.  అయినా ఇంకా అక్కడే రోడ్డు అవతల తన బుట్టలో వాడి పోయిన మల్లెపూదండలను చూసుకుంటూ అలగా మనిషిగా నిలబడ్డాడు తన సైకిల్ పట్టుకొని  సికాకుళం.

''  ఒరేయ్ సికాకుళం 20  ఏళ్ల నుండి నీలాగే నేను కూడా చెప్పేవాడిని . ఇప్పటికి దారికొచ్చి పాపం వీళ్లిద్దరికీ పెళ్లి చేశారు... ఇదీ ఈనాటి చాలామంది  పెద్దల నిర్వాకం. జీవితం  మూడొంతులు అను కుంటే రెండు వంతులు  ఇప్పటికే గడిచిపోయిన వీళ్ళకి ఇప్పుడు పెళ్లి! ఇక ఈ భార్యాభర్తల మధ్య ప్రేమలు, బంధాలు, అనుబంధాలు ఎప్పటికీ అనుకూలిస్తాయో... ఈ మధ్యలో వచ్చే అహంభావ ద్వేషపూరిత సమస్యలు.

సికాకుళం.. ఈ లెక్కన రాబోయే  తరంలో పెళ్లిళ్లు కుదుర్చుకోవడం, కాపురాలు చేయడం విషయం ఆలోచిస్తుంటే...  అసలు  భవిష్యత్తులో  ఇలాంటి సాంప్రదాయం అంటూ ఒకటి ఉండి ఏడుస్తుంది అన్న నమ్మకం నాకు లేదురా.. పెద్దలు, సాంప్రదాయపు విధానాలు, పెళ్లిళ్లు,వేదమంత్రాలు, సీమంతం,బార సాల ఇంకా రకరకాల ముచ్చట్లు  మొత్తం విధానం అంతా కనుమరుగైపోతోందని భయమేస్తుందిరా నాకు. 

ఇప్పటి పద్ధతులను బట్టి చూస్తుంటే..  భవిష్యత్తులో ఇక  ప్రేమగా సంసారం చేయడం, బంధాలు,అను బంధాలు పెంచుకోవడం ఇవన్నీ మృగ్యం అయిపో తాయేమో అన్నంత భయంగా ఉంది నాకు... ఆలోచి స్తేనే దడ పుడుతుంది.  ఆవిధానాలు అన్ని రాతి గోడల పై   ఉలితో  చెక్కుకొని అప్పుడప్పుడు అద్భుత విష యాలుగా చదువుకునేలా  పరిస్థితులు మారిపోతా యేమో అన్నట్టు అనిపిస్తుందిరా. 

ముందు ముందు భరతమాత బిడ్డలు అని చెప్పు కోవడానికి సిగ్గు పడవలసి  వస్తుందేమో! భగవంతుడు నన్ను ఈ అధోగతి చరిత్ర అంతా చూడడానికి  ఇన్నాళ్లు బ్రతికించాడేమో.''....కళ్ళ నీళ్లు తుడుచుకున్నాడు సుబ్బారాయుడు.

వాళ్లకు పుట్టిన పిల్లలకు పెళ్లి సంబంధాలు చూడ వలసిన వయసులో...పెళ్లి అయిన ఆ  కొత్త జంటను తలచుకుని అక్కడ తెగబాధపడేది...సుబ్బారా యుడు..సికాకుళం మాత్రమే !



**************

1 కామెంట్‌:

  1. సుబ్బారాయుడు, సీకాకుళం పాత్రలతో పాత పద్ధతులను శిలాక్షరాలలో చూసుకోవాల్సి వస్తుందని రచయిత గారు చెప్పింది అక్షర సత్యం. ఎదురింట్లో మంచి సంబంధం పెట్టుకుని 20 ఏళ్లు వెయిట్ చేశారనే కన్నా వేస్ట్ చేశారంటే ఎంత దారుణమో అనిపిస్తుంది. పిల్లలకు పెళ్లి చేయాల్సిన వయసు లో పెళ్లి చేసుకుంటున్న జంటను చూస్తే జాలి వేస్తుంది. కథ సుఖాంతం ఐ బాగుంది.

    రిప్లయితొలగించండి