శివలీలలు 1

శివలీలలు

- విద్యాధర్ మునిపల్లె 

ఈ శివలీలలు అనే సీరియల్ శివపురాణము, విష్ణుపురాణము మరికొన్ని జనబాహుళ్యంలోని కధలను, కధనాలను ఆధారంగా చేసుకొని రాస్తున్న సీరియల్. ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.

పూర్వకాలంలో నారదుడు ఒకసారి హిమాలయ పర్వతాలలోని మానససరోవరం దగ్గర పర్ణశాల నిర్మించుకొని భీకరమైన తపస్సు చేస్తున్నాడు.

నారదుని తపస్సు భంగము చేయ్యమని దేవేంద్రుడు తన అప్సరసలను పంపించాడు.

అప్సరసలు నారదుని సమీపించి వీనులవిందుగా గానం చేశారు. కనుల పండువుగా నాట్యం చేశారు.

మహర్షి చలించలేదు. చివరి అస్త్రంగా అప్సరసలు అంగాంగ ప్రదర్శనం చేశారు.

నారదుడు ‘‘శివ.. శివా..’’ అంటూ కళ్ళు మూసుకొని తపస్సు ప్రారంభించాడు.

అప్సరాంగనలు దేవేంద్రుని వద్దకు పోయి నారదుని తపస్సు భంగము చేయలేకపోయామని విన్నవించి సిగ్గుతో తలలు వంచుకున్నారు. నారదుడు ఆ తపస్సు తన ఇంద్రపదవి కోసం చేయటంలేదు.. కేవలం పరమేశ్వరుని అనుగ్రహం కోసమే చేస్తున్నాడని తెలుసుకున్న దేేవేంద్రుడు కూడా శాంతించాడు.

అప్సరసల వయ్యారములకు లొంగక ఇంద్రియ నిగ్రహము పాటించినందుకు నారదుడు తనను తానే అభినందించు కున్నాడు, లోలోన సంతసించాడు. క్రమంగా ఆ సంతోషము గర్వముగా మారింది. 'అవ్సరాంగనలకు లొంగలేదు కాబట్టి మాయను జయించినల్లే' అని తీర్మానించుకున్నాడు.

ఇలా ఉండగా ఒక రోజున నారదుడు సత్యలోకానికి వెళ్ళి, బ్రహ్మదేవుడితో తను తపస్సు చేసిన విధానము, అప్పరాంగ నలను జయించిన విధానము వివరించి “తండ్రీ! ఇదేకదా మాయ. ఆ మాయను నేను జయించగలిగాను'' అన్నాడు. అ మాటలు విన్న పరమేపష్టి నవ్వి ఊరుకున్నాడు.

తరువాత నారదుఠు కైలాసానికి వెళ్ళి, శివుడికి నమస్కరించి “దేవదేవా! శివ మాయను జయించటం వల్ల నేను ధన్యుడనైనాను" అన్నాడు. ఆ మాటలు విన్న ఈశ్వరుడు ‘‘ నారదా! శివ మాయ అంటే ఏమిటో పూర్తిగా నాకే తెలియదు. దాన్ని జయించానం టున్నావు. ఎందుకయినా మంచిది, జాగ్రత్తగా ఉండు” అన్నాడు.

తరువాత నారదుడు వైకుంఠం చేరి, విష్ణువుకు నమస్కరించి, తాను చేసిన తపస్సు గురించి తెలిపి, “తాను శివమాయను జయించాను, విష్ణు మాయ కూడా నన్నేమీ చెయ్యలేదు" అన్నాడు. ఆ మాటలు విన్న విష్ణుమూర్తి “నారదా! త్రిమూర్తులకు మించిన శక్తి ఇంకొకటి ఉన్నది, అదే పరమ శక్తి. మహామాయ. దానిని గురించి తెలియనివారు విష్ణుమాయ, శివమాయ అనుకుంటారు. కాని మహామాయ త్రిమూర్తులను కూడా బద్దులను చేస్తుంది. మాయకు అతీతుడైన వారెవరూ లేరు. కాబట్టి నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండవలసినది” అన్నాడు.

ఆ మాటలు విన్న నారదుడు సరే అని తల ఊపి భూలోకానికి బయలుదేరాడు. భూలోకంలో కళ్యాణపురము పట్టణమున్నది. అది సస్యశ్యామలమై ఉన్నది. ఆ రాజ్యాన్ని పాలించే మహారాజుకు యుక్తవయస్కురాలైన కుమార్తె ఉన్నది. కుమార్తెకు వివాహం చేద్దామని నిశ్చయించి, దేశం నలుమూలలా చాటింపు వేయించాడు మహారాజు.

రాజభవనముతో పాటు కళ్యాణపుర మంతా అందంగా అలంకరించారు. అంత కోలాహలంగా. ఉన్నది. ఆ రాజ్యానికి బయలుదేరాడు నారదుడు.

రాజభవనానికి వచ్చాడు.

మహర్షిని చూడగానే రాజు అర్హ్యపాద్యాదులు ఇచ్చి స్వాగతం పలికాడు.

సుఖాసీనుడైనాడు నారదుడు. మహర్షిని ఘనంగా సత్కరించాడు మహారాజు, చెలికత్తెలు రాకుమారిని తోడ్కొని వచ్చారు.

రాజహంసలా వచ్చిన రాకుమారి అతి వయ్యారంగా నమస్కరించింది.

నిండు యవ్వనంలో ఉన్న రాకుమారి అవురూస సౌందర్యరాశి.

ఆమెను చూడగానే నారదుని మనసు పరిపరివిధాల పోయింది, అమె పేరు రమాదేవి. 

(సశేషం)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి