యద్భావం తద్భవతి
రియల్ ఎస్టేట్
వ్యాపారి జగదీష్ ఇల్లది.సమయం రాత్రి
రొండు గంటలు. నేరేడు పండు
రంగు చీకటి అలుముకొంది అక్కడ. ఆ ఇంటి
ముందు ఎత్తుగా పెరిగిన కొబ్బరి చెట్లు, సైనికుల్లా కాపలాకాస్తున్నట్లున్నాయి.
వాటి పక్కగా ఓ పెద్ద నల్లని
త్రాచుపాము స్...స్...స్.. మని శబ్దం
చేస్తూ పాకుతోంది. ఇంటి వెనగ్గా
వచ్చిన ఓ నల్లని ముసుగు
మనిషి, సి.సి కెమెరా వైర్లు కత్తిరించి, ఆ ఇంట్లోకి, తర్వాత
పడక గదిలోకి ప్రవేశించాడు. స్మశాన నిశబ్దం నెలకొంది ఆ ఇంట్లో. జగదీశ్
అతని భార్య ఒకే బెడ్ ఫై పడుకున్నారు. టాయిలెట్ కి వెళ్ళడానికి మెలకువ
రావడంతో గాఢనిద్రలో నుండి మత్తుగా లేచాడు జగదీశ్. కళ్ళు నులుము
కుంటూ ఎటాచ్డ్ టాయిలెట్ వైపు నడుస్తున్న అతనికి ఎదో ఆకారం షెల్ఫ్ దగ్గరికి వెళ్ళుతున్నట్టుగా లీలగా
కనిపించింది బెడ్ లైట్ వెలుతురులో. కళ్ళు పెద్దవి చేసి పరీక్షగా చూసాడు. ఎవరో ముసుగు
మనిషి కనిపించాడు. ఎవరూ? అన్నాడు మెల్లగా.
తచ్చాడుతున్న ఆ ముసుగు మనిషి
అతని పిలుపికి
ఉలిక్కిపడి, వెంటనే తేరుకుని జగదీష్ ని చూసి ఒక్క ఉదుటున వచ్చి అరవకుండా నోరు నొక్కిపట్టి గట్టిగా పట్టుకున్నాడు. ఆ హఠాత్ పరిణామానికి
బెదిరిపోయిన జగదీష్, ఆ ఆకారo నుండి పట్టు విడిపించుకోడానికి, పక్కకి తోసే ప్రయత్నo చేశాడు. అతని
ప్రయత్నాన్ని గమనించిన ముసుగుమనిషి, మరింత గట్టిగా పట్టుకున్నాడు. ఇద్దరూ
ఒకరినొకరు తోసుకుంటూ ఆ గదిలోనుండి పక్కనే
ఉన్న వంటగది లోకి వెళ్లారు. ఆ తోపులాటలో
జగదీష్ ముసుగు తీసేశాడు, నువ్వా? అన్నాడు
ఆశ్చర్యంగా ఆ వ్యక్తిని చూసి.
ఎప్పట్నుంచో పరిచయం ఉన్న ఆ ముఖాన్ని ఆ
చిరు చీకట్లో కూడా చాలా సులువుగా గుర్తుపట్టేసాడు జగదీష్. తత్తర పడిన
ఆ ముసుగు వ్యక్తి
వెంటనే పక్కన ఉన్న కుక్కర్ గిన్నెని తీసుకుని తలపై బలంగా కొట్టి, ఆరవకుండా నోరు
గట్టిగా నొక్కేసాడు. మ్.. మ్ అని
మూలుగుతూ కుప్పకూలిపోయాయడు జగదీష్, తలపగిలి రక్తం
కారుతోoది.
ఎటువంటి శబ్దం రాకుండా మెల్లగా పడుకోబెట్టి వెంటనే
బెడ్ రూమ్ లోకి వెళ్లాడు ముసుగు మనిషి. జగదీష్ భార్య
నిద్రపోతూనే ఉంది. షెల్ఫ్ తెరిచి
లోపల ఉన్నసెల్ ఫోన్, ఆ పక్కనే
ఉన్న పదివేలు డబ్బులు కూడా తీసుకుని, కుక్కర్ గిన్నెతో
సహా మెల్లగా ఇంటి బయటికి వచ్చి, చుట్టూ చూసి
ఎవరూ గమనించట్లేదని నిర్ధారించుకున్నాక కుక్కర్ గిన్నెని డ్రైనేజీ కాలువలో పడేసి, వేలిముద్రలు పడకుండా
వేసుకున్న ప్రత్యేకమైన గ్లోవ్స్ ని తీసేసి వాటిని తగలబెట్టి, ఆ బూడిదని
కూడా డ్రైనేజీలో కలిపేసి, తాను వ చ్చిన
దారిలోనే తిరిగి వెళ్లి చీకట్లో
కలిసిపోయాడు.
* * *
ఉయ్....ఉయ్...
మంటూ వచ్చి ఆగింది పోలీస్ కారు ఇంటి ముందు. కారు
దిగి వచ్చిన ఎస్సై రమేష్ కి సెల్యూట్ కొట్టాడు కానిస్టేబుల్
.
గుమ్మం ముందు చాలామంది జనం గుమికూడి ఉన్నారు. క్లూస్ టీం
ఆధారాల్ని సేకరిస్తోంది. డాగ్ స్క్వాడ్ వాసన ద్వారా హంతకుడు తిరిగిన ప్రదేశాలని వెతికే ప్రయత్నం చేస్తుంది. లోపలికి వెళ్లి
చూసాడు ఎస్సై రమేష్. చేతులు అర్ధచంద్రాకారంలోకి తిరిగి, కాళ్ళు ఎడంగా
జరిగి, బోర్లగా పడివుంది
జగదీష్ శవం. తల
ఎడమ పక్కకి తిరిగి, పాపిట మధ్యలో
ఏర్పడిన గాయం నుండి రక్తం ముక్కుమీదుగా కారి కొద్దిదూరంలో మడుగు కట్టింది. శవాన్ని పరిశీలనగా
చూశాడు రమేష్. తలపై తగిలిన
ఆ ఒక్క దెబ్బ
తప్ప మిగతా ఎటువంటి ఆనవాళ్లు లేవు. బట్టలుకూడా నలిగిపోలేదు
ఇస్త్రీ మడతలు అలాగే ఉన్నాయి. ఇల్లు మొత్తం
పరిశీలించాడు ఎటువంటి క్లూ దొరకలేదు. కుటుంబసభ్యుల్ని పిలవమని చెప్పాడు. జగదీష్ భార్య సరిత, కొడుకు యతిష్
వచ్చారు. నోటికి చీర
కొంగుని అడ్డు పెట్టుకుని ఏడుస్తోంది సరిత. యతిష్ ముఖంలో
బాధ, విచారం, కళ్లు నీటి చెమ్మతో నిండాయి. ఎలా జరిగింది? అడిగాడు రమేష్ వారి మొహాల వైపు చూస్తూ. ఉదయం నిద్రలేచి
చూసే సరికి అయన చనిపోయి పడివున్నాడు సార్ అంది దుఃఖం ఆపుకొంటూ. డాడీ చనిపోయారని
ఫోన్ చేస్తే గంట క్రితమే వచ్చాను సార్, జరిగిన దాన్ని
బట్టి చూస్తే ఇది ఎవరో దొంగలు చేసిన పనిలా అనిపిస్తొoది అన్నాడు
యతిష్ కన్నీళ్లు తుడుచు కుంటూ. యతిష్ ఇంటికి
నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ఇంజనీరింగ్ కాలేజీలో
మూడో సంవత్సరం హాస్టల్లో ఉండి చదువుతున్నాడు. శవాన్ని పోస్టుమార్టమ్ కి పంపించండి అని కానిస్టేబుల్ కి చెప్పి స్టేషన్ కి బయలుదేరాడు.
రొండు రోజుల
తర్వాత పోస్టుమార్టమ్ రిపోర్ట్ వచ్చింది. ఎదో బలమైన
వస్తువుతో కొట్టడంతో తలపగిలి చనిపోయాడని ఉంది రిపోర్టులో. డాగ్ స్క్వాడ్ ఇంటి పక్కనే ఉన్న మురికి కాలువ దగ్గరికి వెళ్లి అగిపోయాయని చెప్పాడు కానిస్టేబుల్. కేసు విచారణ మొదలు పెట్టిన రమేష్ ముందుగా చుట్టుపక్కల దొంగతనాలేమైన జరిగాయా అని, జగదీష్
ఇంటి చుట్టు పక్కల వాళ్ళని విచారించాడు. అలాoటివి
ఏo జరగలేదని
తెలుసుకున్నాడు. తర్వాత వ్యాపార పరమైన
శత్రువులెవరైనా చేసి ఉంటారా అని ఎంక్వయిరీ చేసాడు ఎస్సై రమేష్.వ్యాపారంలో కొంతమందితో
గొడవలు ఉన్నాయని తెలుసుకున్న ఎస్సై రమేష్ వాళ్లలో రవీంద్రని కలిశాడు. రవీంద్రకి, జగదీష్
కి వ్యాపార పరమైన గొడవలున్నా చంపుకునేంత శత్రుత్వం లేదని, జగదీష్ హత్య
జరిగినప్పుడు అతను చెన్నై లో కొడుకు వివాహ నిశ్చితార్థం నిమిత్తం కుటుంబంతో పాటు ఉన్నాడని తేలింది. ఇంకా మరికొందరిని
విచారించినా, జగదీష్ హత్యతో ఎవరికీ సంభంధం లేదని తేలింది. జగదీష్ మంచి
వ్యక్తి అని చుట్టు పక్కల వాళ్లతో మర్యాదగా, స్నేహంగా వుంటాడని
చెప్పారు అందరూ.
బాగా అలోచించిన
ఎస్సై రమేష్ మళ్ళీ జగదీష్ ఇంటికి వెళ్లి ఆ చుట్టుపక్కల ఉన్న
సీ సీ టీ వీ ఫుటేజ్ లను చెక్ చేసాడు. వైర్లు కత్తిరించడoతో ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఏంచెయ్యాలో పాలు
పోలేదు. అప్పటికి మూడు నెలలు గడిచిపోయాయి.మరుసటి రోజు సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టేషన్ కి వచ్చి కేసు గురించి వివరాలు అడిగి ఎటువంటి పురోగతి లేకపోవడంతో మందలించాడు. వెంటనే ఆ చుట్టు పక్కనున్న
కిరాయి హంతకుల్ని, రౌడీ షీటర్స్
ని పిలిచి తీవ్రoగా విచారించాడు. అయినా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. పిచ్చెక్కి నట్టై
పోయింది రమేష్ కి. ఆ
ఫ్రస్ట్రేషన్ ని స్టేషన్లో అందరి మీద చూపించాడు.
మరుసటి రోజు
మళ్ళీ జగదీష్ ఇంటికి వెళ్లి విచారించాడు. ఇల్లంతా ఆణువణువూ వెతికాడు. వ్యాపారానికి సంభందించిన
కొన్ని ముఖ్యమైన పత్రాలు,లావాదేవీల గురించి
విచారించాడు. మరొకసారి విచారించడంతో మళ్ళీ అదే సమాధానం చెప్పారు జగదీష్ భార్య, యతిష్. ఎటువంటి
అనుమానం కలగలేదు వారిపై. పత్రాలు,లావా
దేవీల్లో కూడా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. గత పదిహేనేళ్లుగా
పోలీస్ డిపార్టుమెంట్ లో పనిచేస్తున్న తనకు ఇప్పటి వరకు ఇటువంటి పరిస్థితి ఎదురుకాలేదు. ఏ కోణం లో
విచారణ చేసినా డెడ్ ఎండ్ కి వెళ్తుందే కానీ ఒక్క ఆధారం కూడా దొరకడం లేదు. ఎంతో నిరాశగా
ఇంటికి వెళ్ళాడు రమేష్.
మరుసటి రోజు
స్టేషన్ లో కూర్చుని పాత కేసు ఫైల్స్ తిరగేస్తున్నాడు రమేష్ , ఏదైనా లీడ్ దొరుకుతుందేమోనని. సార్, మిమ్మల్ని కలవడానికి
ఎవరో వచ్చారని చెప్పాడు కానిస్టేబుల్. ఎవరు? అడిగాడు. ఆమె
పేరు దుర్గoట సార్. ఏంటి విషయం?, ఏమీ చెప్పడం లేదు సార్, మీతోనే చెప్తానంటుంది. కొద్ది సేపు వేచివుండమని చెప్పు అన్నాడు రమేష్ దాటవేసే ధోరణిలో, కాసేపాగి వెళ్లిపోతుందిలే
అని. మధ్యాహ్నం
భోజనానినికి ఇంటికి వెళ్ళబుతుండగా స్టేషన్లోనే ఓ మూల కూర్చున్న
ఆమెలేచి నిలబడింది. చూసి చూడనట్టుగా
వెళ్ల బోయాడు రమేష్. అడ్డుపడి,సార్
మా అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు. ఈ మధ్య సరిగా
చదవడం లేదు, ఎప్పడూ ఫోన్
లో ఎదో ఒక గేమ్స్ ఆడుతూ, సినిమాలు చూస్తున్నాడు. ఈ మధ్య ఓ .టి .టీ లో
వచ్చేవి కూడా చూస్తూ చదువుని పూర్తిగా పక్కన పెట్టేసాడు. ఇంతకు ముందు సెమిస్టర్ లో మూడు సబ్జెక్టుల్లో తప్పాడు. ఈ సెమిస్టర్
లో పూర్తిగా ఫెయిల్ అవుతాడేమోనని భయంగా ఉంది. నేను ఎంత
చెప్పినా వినడం లేదు. నాభర్త చనిపోయాడు.
ఎంతో కష్టపడి వాడ్ని చదివిస్తుంటే, నా కష్టాన్ని గుర్తించకుండా ఇలా తయారయ్యాడు, వాడు సరిగ్గా చదివి, ఏదైనా ఉద్యోగం
చేసి ప్రయోజకుడై, నన్ను సరిగ్గా చూడకపోతే నాకు ఆత్మహత్యే గతి. మీరు పోలీస్ ఇన్ స్పెక్టర్ గనుక భయపెట్టి చదువుకోమని చెప్తారేమోనని వచ్చాను సార్ అంది ఏడుస్తూ. సరే మీ
అబ్బాయిని తీసుకుని రేపు ఉదయం రండి అన్నాడు రమేష్ ఎదో
ఒకటి చెప్పి వదిలించుకునే ఉద్దేశంతో.
చెప్పినట్టుగానే మరుసటి రోజు ఉదయం ఆమె ఇరవై ఏళ్ల కొడుకుని తీసుకుని వచ్చింది. ఏo.. సరిగా చదవడం
లేదంట. లాస్ట్ సెమిస్టర్
లో ఫెయిల్ అయ్యావంట.. ఫోన్ లో గేమ్స్ ఆడుతూ సినిమాలు ఎక్కువగా చూస్తున్నావంటా.. అంటూ గద్దించి అడిగాడు పోలీస్ పద్దతిలో కోపంగా. మళ్ళీ ఆ
ఫోన్ వాడి సరిగ్గా చదవడంలేదని ఫిర్యాదు వచ్చిందో, ఈ సారి
ఇలా నిలబెట్టి మాట్లాడటం ఉండదు , స్టేషన్లో పెట్టి బట్టలూడదీసి కుక్కని కొట్టినట్టు కొడతా జాగ్రత్త అన్నాడు వేలుచూపించి గద్దిస్తూ సీరియస్ గా. భయపడి
ఒణికిపోతూ... అ..అ.అలాగే సార్ మీరు చెప్పినట్లే చేస్తాను అన్నాడు. చాలా థాంక్స్
సార్ అంటూ కొడుకుని తీసుకుని వెళ్లబోయింది. గుమ్మం దాకా వెళ్లిన వాళ్ళని ఆగండి అని అపి, ఆ
యువకుడ్ని వెనక్కి రమ్మని పిలిచాడు. వెనక్కి వచ్చిన
ఆ కుర్రాడిని ఫోన్
లో ఏం చూసావో చూపించు అన్నాడు. ఫోన్ లో
తాను ఆడే ఆటల్ని, చూసే వీడియోల్ని, ఇటీవల ఓ .టి .టీలో ప్రసారమైన వెబ్ సిరీస్ ల గురించి చెప్తూ
ఒక్కోదాన్ని వివరిస్తున్నాడు. నిశితంగా గమనిస్తున్న రమేష్ కి హఠాత్తుగా ఓ వీడియో కంటపడింది. ఆ వీడియో పూర్తిగా
చూసి మొత్తం వివరాలు అడిగాడు ఎదో గుర్తొచ్చిన వాడిలా. అది ఒక
సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ అని, అందులోని
మెయిన్ రోల్ చేసిన వ్యక్తి ఓ మానసిక రోగి
తనకు ఎవరైనా ఏదయినా చెప్తే నచ్చదు, తన ఇష్టాన్ని
వ్యతిరేకించే వారిని, ఎదురు చెప్పేవారిని
పగలు నిశితంగా
పరిశీలించి రాత్రిళ్ళు ఎవరికీ తెలియకుండా చంపేస్తాడు, అతను చేసే హత్య లకు ఎటువంటి ఆధారాలు దొరకవని, కుడి చేతి
మణి కట్టు వెనుక స్టాప్ ట్రాఫిక్ సిగ్నల్ గుర్తు ఉంటుందని, దానికి అర్ధం
తనకు నచ్చని వాడ్ని హత్య చేసి ఆపేయాలని అర్ధం. ఆ
ఒక్కటే అతన్ని పట్టుకోడానికి ఆధారం అని, ఆ
గుర్తు హత్య చేసే టప్పుడే ఉంటుందని, ఆ ఆధారంతోనే
అతన్ని పట్టుకుంటారని చెప్పాడు. వెంటనే రమేష్
మెదడులో తళుక్కున ఓ ఆలోచన మెదిలింది.
* * *
మర్నాడు కాలేజికి
వెళ్లి ప్రిన్సిపాల్ ని కలిశాడు. అక్కడ ఓ
షాకింగ్ నిజం తెలిసింది. బయటకు వస్తుండగా
ఓ విద్యార్థి సెల్
ఫోన్ లో గేమ్ ఆడుతూ కనిపించాడు. వెంటనే అతని చేతిలోని ఫోన్ లాక్కుని ప్రిన్సిపాల్ కి ఇచ్చి, కాలేజీకి వచ్చింది
చదువుకోడానికే కానీ గేమ్స్ ఆడుతూ చాటింగ్ చేస్తూ,ఫోన్ మాట్లాడుతూ,
యూట్యూబ్ లో వీడియోలు సినిమాలు చూస్తూ సమయం వృధా చేయడానికి కాదని గట్టిగా చెప్పాడు. అంతే కాదు
అతని ఫై కోపంగా, దురుసుగా ప్రవర్తించాడు.
అదే
రోజు రాత్రి సమయం రాత్రి ఒంటి గంట అయ్యింది. ఓ ముసుగు
వ్యక్తి రమేష్ బెడ్ రూమ్ లోకి కత్తితో ప్రవేశించాడు,అతనికి చేతి మణికట్టు వెనుక స్టాప్ టాటూ ఉంది. అతను మెల్లిగా
కత్తిలేపి దుప్పటి కప్పుకుని పడుకున్నవ్యక్తి పొట్టలో పొడిచాడు. ఆశ్చర్యం …. అక్కడ
మనిషి లేడు. అతని స్థానంలో
దిండ్లు, వాటికి దుప్పటి
కప్పి వుంది. వెనుక నుండి
ఆ వ్యక్తిని హఠాత్తుగా
వెళ్లి గట్టిగా పట్టుకున్నాడు రమేష్. ఆ హఠాత్
పరిణామానికి నివ్వెరపోయాడా వ్యక్తి.
* * *
ప్రెస్ మీట్
మొదలు కాబోతోంది.అన్ని పత్రికల
విలేఖరులు, టీ.వీల వాళ్ళు వచ్చారు. జగదీష్ భార్య
కూడా వారిలో ఉంది ఎస్.పి
ఆయనవెంట రమేష్ వచ్చారు. ఎస్,పి ప్రెస్ మీట్ ని మొదలుపెట్టాడు. ఇక్కడికి వచ్చిన అందరికి నమస్కారం. ఈ ప్రెస్
మీట్ పెట్టడానికి ఓ ప్రత్యేక మైన
కారణం ఉంది. ఇప్పటివరకు మీరు
ఎన్నో హత్యల్ని టీ.వీ
ల్లోనూ, పేపర్లలోనూ చూసి
ఉంటారు, చదివుంటారు. కానీ
ఇది వాటన్నిటికీ ప్రత్యేకమైనది. ఎందుకనేది చెప్తా వినండి అని, కేసు
వివరాలను చెప్పడం ప్రారంభించాడు ఎస్.పి.
ఓ కొడుకు
ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఆ కొడుకు మీద
ప్రేమ తో తండ్రి సెల్ ఫోన్ కొనిచ్చాడు. కానీ దానికి బానిసై, వ్యసనపరుడైన కొడుకు
రోజుకు పదిహేను గంటలు సెల్ ఫోన్లో ఆటలు ఆడుతూ, ఇంటర్నెట్ లో
వెబ్ సిరీస్ లు చూస్తూ గడిపేస్తున్నాడు. మొదటి
రొండు సంవత్సరాలలో సగం సబ్జెక్టులు తప్పాడు. ఈ పరిస్థితికి
దిగజారడానికి సెల్ ఫోనే కారణం అని తెలిసిన తండ్రి, తన కొడుకు
ఫై సీరియస్ అయ్యి, కొడుకుని తీవ్రంగా
మందలించాడు. కొద్దిరోజులు ఇంటికి తీసుకెళ్లి, ఓ గదిలో
ఉంచి గమనిస్తూ సెల్ ఫోన్ వాడకుండా నియంత్రించాడు. ఆ తర్వాత కొన్నాళ్ళు
బెంగళూరు లోని మొబైల్ డి అడిక్షన్ కేంద్రానికి తీసుకెళ్లి చికిత్స కూడా చేయించాడు. మళ్ళీ సెల్
ఫోన్ వాడనని బాగా చదువు కుంటానని కొడుకు చెప్పడంతో తానే స్వయంగా తీసుకెళ్లి కాలేజీలో వదిలేసి వచ్చాడు, కానీ సెల్
ఫోన్ ఇవ్వలేదు. వ్యసనం నుండి
బయట పడలేని కొడుకు మళ్ళీ
కొత్త మొబైల్ కొని అదేపనిగా వాడుతూ మళ్ళీ దొరికిపోయాడు. విషయo తెలిసిన తండ్రి, కొడుకుని కొట్టి సెల్
ఫోన్ లాక్కుని ఇoటికి
వచ్చేశాడు. సెల్ ఫోన్
కి బాగా అలవాటుపడిపోయి, అది లేక పోయేసరికి పిచ్చివాడై ఉన్మాదిలా తయారయ్యాడు. తాను చూసిన వెబ్ సిరీస్ లో మాదిరిగా ఓ పధకం ప్రకారం తండ్రిని
హత్య చేసి సెల్ ఫోన్, డబ్బులు దొంగతనం చేశాడు. హత్యని దొంగతనoలా చిత్రీకరించే ప్రయత్నo చేశాడు. హత్య కు సంభందించిన ఆయుధాన్ని కాల్చివేసి ఎటువంటి గుర్తులూ, ఆధారాలు లేకుండా
చే శాడు. ఈ హత్య
కేసుని మా ఎస్సై రమేష్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి హంతకుడ్ని పట్టుకున్నాడు అన్నాడు ప్రశంసా పూర్వకంగా. చివరిగా మీపిల్లలను సెల్
ఫోన్లు అతిగా వాడనివ్వకండి, వాటికి బానిసని కానివ్వకండి అంటూ సందేశం ఇచ్చి సమావేశాన్ని ముగించాడు.
హంతకుడ్ని చూపించండి
అన్నారు పత్రికల విలేఖరులు, టీ.వీల వాళ్ళు. హంతకుడ్ని తీసుకురమ్మని
చేత్తో సైగ చేసాడు. ఓ యువకుణ్ణి
నల్లటి ముసుగు, చేతులు వెనక్కి
కట్టేసి తీసుకొచ్చాడు కానిస్టేబుల్. జగదీష్ ని హత్య చేసింది ఈ యువకుడే. ఈ
యువకుడు ఎవరో కాదు జగదీష్ కొడుకే అని ముసుగు తొలగించాడు ఎస్.పి. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్య పోయారు. మరికొందరు నోరెళ్ళ
బెట్టి అలాగే చూస్తున్నారు. ఎదురుగా ఉన్న తల్లిని చూసి సిగ్గు, అవమానంతో తలదించుకున్నాడు
యతిష్.
ఓ టీ టీ లో వస్తున్న క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సీరీస్ లు చూసి తనకు వ్యతిరేకంగా వున్న వ్యక్తిని ఒక ప్లాన్ ప్రకారం చంపిన పర్వెట్టెడ్ యువకుణ్ని చాకచక్యంగా ఎస్సై రమేష్ పట్టుకున్న తీరు నిజంగా ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ను స్ఫురింపించింది.
రిప్లయితొలగించండి