వ్యవసాయం

 వ్యవసాయం

- మహాలక్ష్మి రావోల
సెల్ : 8886918265

మార్నింగ్ వాక్ చేయడానికి నేతాజీ పార్క్ వెళ్లాడు ఆదిత్య .జాగింగ్ చేస్తూ, 10 రౌండ్లు వేసిన తర్వాత ,కొద్దిగా అలసట అనిపించి, బెంచ్ మీద కూర్చున్నాడు .

అప్పుడే తెల్ల తెల్లవారుతుంది. చైత్రమాసం వెళ్ళిపోయింది. వైశాఖo మొదలైన తరుణంలో సూర్యభగవానుడు ఉదయించిన కొద్దిసేపటికి, తన ప్రచండ ప్రతాపాన్ని చూపిస్తూ, వడివడిగా పైకి లేస్తున్నాడు.

త్వరగా వాకింగ్ పూర్తి చేసుకుని వెళ్లాలని, బెంచ్ మీద నుండి లేచి రెండు అడుగులు వేశాడో లేదో, 'ధభీ ' మని తన ముందర కింద పడిపోయిన మనిషిని చూశాడు.
అయ్యో! అనుకుంటూ, పడిపోయిన ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి, వంగి అతనిని లేపడానికి ప్రయత్నించాడు. 

ఒంటినిండా చెమటలు పట్టి, నోటి నుండి లైట్ గా నురుగు వస్తూ, గాలి పీల్చుకోవడానికి ఆయాస పడుతూ ,కాళ్లు చేతులు తన్నుకుంటున్నాడు అతడు.

అతనికి ఏమయిందో అర్థం కాలేదు. ఒకవేళ గుండెపోటు వచ్చిందేమో అనుకున్నాడు. ఈమధ్య సోషల్ మీడియాలో అనేక వార్తలు వింటూనే ఉన్నాడు .

గుండెపోటు వచ్చిన వాళ్లు ఇలాగే పడిపోతారని ....

అప్పటికే అక్కడ కొంతమంది మూగారు.
తలా ఒక మాట అంటూ ఉన్నారు. నీళ్లు తెచ్చి అతని ముఖం మీద చల్లారు.

 అంబులెన్స్ కు కూడా కాల్ చేశారు. ఇంకా అతని పరిస్థితి అలాగే ఉంది .ఏమైతే అది అయిందని ఆదిత్య , అతనిని ఇంకొక మనిషి సాయంతో బల్ల మీదికి చేర్చాడు.

తన రెండు చేతులను అతని గుండె మీద పెట్టి , గట్టిగా ప్రెస్ చేయటం మొదలుపెట్టాడు.
ఇంతలో అంబులెన్స్ వచ్చింది.

స్ట్రెచర్ మీద అతనిని , అంబులెన్స్ లో ఎక్కించి ఎటువాళ్లు అటు వెళ్ళిపోయారు.
ఇతని తాలూకు మనిషి ఎవరైనా ఉంటే, వాళ్లు కూడా అంబులెన్స్ లోకి ఎక్కండి....

 అంటూ చెప్పగానే, 
"అతను ఎవరో నాకు తెలియదు. పార్కులో వాకింగ్కు వచ్చాను. అతడు పడిపోతే మీకు కాల్ చేశాను" అని చెప్పాడు ఆదిత్య.

అతని జేబులు వెతికి అతను ఎవరో తెలుసుకోవడానికి టైం పట్టేటట్టు ఉంది. అతని పరిస్థితి చూస్తుంటే క్రిటికల్ గా ఉంది.

 అందుకే ఇంకేమీ ఆలోచించకుండా అంబులెన్స్ లోకి ఎక్కాడు ఆదిత్య.

ఇంటికి ఫోన్ చేసి, జరిగిన విషయాన్ని దీప్తికి చెప్పి, తన హాస్పటల్ కు వెళుతున్నట్టు కూడా చెప్పాడు.

ఆ తర్వాత మెల్లిగా అతడి జేబులో ఏమైనా దొరుకుతాయేమోనని వెతికాడు.
కానీ ఏమీ దొరకలేదు. కనీసం సెల్ ఫోన్ కూడా లేదు.

ఏమి చేయటానికి పాలు పోక, అతన్ని హాస్పటల్లో అడ్మిట్ చేసి ,గార్డియన్ సంతకం పెట్టి, అతని ఫోటో ఒకటి తీసి పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి, విషయం చెప్పి, ఆ ఫోటోలు ఫార్వర్డ్ చేశాడు.

ఎవరైనా అతనికి సంబంధించిన వాళ్ళు ఉంటే వస్తారు కదా !అన్న ఆశతో అలా చేశాడు.

ఆఫీసుకు వెళ్ళాడే కానీ అతనికి ఎలా ఉందో అన్న టెన్షన్ లోనే గడిపేసాడు.

లంచ్ బ్రేక్ లో హాస్పటల్ కి ఫోన్ చేసి కనుక్కుంటే, అతనికి ప్రాణాపాయం తప్పిందని, ఇప్పుడు బానే ఉన్నాడుఅని చెప్పగానే, మనసంతా హాయిగా అనిపించింది.


మర్నాడు కొన్ని పండ్లు తీసుకొని, హాస్పటల్ కి వెళ్ళాడు.
అతని బెడ్డు దగ్గర కూర్చున్న ఆమె అతని భార్య అనుకుంటా.... ఆదిత్యను చూడగానే కళ్ళ వెంట నీళ్లు తిరిగి ,

అతనికి చేతులెత్తి నమస్కరిస్తూ, తన భర్తను కాపాడినందుకు ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు.... మాటిమాటికి దండాలు పెట్టింది. 
ఆదిత్యనే చూస్తూ కాళ్ళ మీద పడి దండం పెట్టాలని అతని దగ్గరకు వచ్చింది.

కళ్ళు తెరిచి ఆదిత్యను చూసిన ఆ పెద్దమనిషి కూడా కళ్ళతోనే కృతజ్ఞతలు తెలియజేస్తూ, రెండు కన్నీటి బొట్లు కార్చా డు.
పల్లెటూరి నుంచి వచ్చిన రైతు లాగా ఉన్నాడు.

ఆమె మాటలను బట్టి పండిన పంటను అమ్ముకోవడానికి వచ్చి, సరైన రేటు లేక, తక్కువ రేటుకు అమ్ముకోవలసి రావటoతో, నిరాశ చెంది, ఒంటరిగా ఆ పార్కులో కూర్చున్న అతనికి, గుండెపోటు వచ్చింది. అని అర్థం అయింది ఆదిత్య కు.

వాళ్ల దయనీయ పరిస్థితికి చాలా బాధపడి, తను ఏమి చేయలేని నిస్సహాయతతో, అక్కడే కొద్దిసేపు కూర్చుని బయటికి వచ్చాడు ఆదిత్య.

ఆదిత్య ఎప్పుడెప్పుడు బయటికి వస్తాడా! అని ఒక పదిమంది మనుషులు రిసెప్షన్ లో కూర్చుని ఉన్నారు.

ఆదిత్య రాగానే అతన్ని చుట్టుముట్టి రామయ్యను కాపాడింది మీరే నటగా! మా నెత్తిన పాలు పోశారు.

అని వాళ్లంతా అనగానే 
అబ్బో! ముసలాయన చాలా మంచివాడు లాగా ఉన్నాడు. ఆయన కోసం ఎంతమంది వచ్చారంటే ?ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడు... అనుకున్నాడు ఆదిత్య.

"మీరు గనక ఆ పని చేయకపోయి ఉంటే మేమంతా మునిగిపోయి ఉండేవాళ్ళము.
అంటూ చెప్తున్న వాళ్ల మాటలు ,ఆదిత్య కి ఏమీ అర్థం కాలేదు.

"అదేమిటి! మీరంతా ఆయనకేమీ కారా?"
అంటున్న ఆదిత్య ను పిచ్చివాడిలా చూస్తూ, మేమంతా ఆయన కు అప్పు ఇచ్చిన వాళ్ళం.

మా అప్పు తీర్చకుండా పోయాడేమోనని భయపడ్డాం !అంటున్న వాళ్ళను చూస్తుంటే చిరాకు పుట్టింది ఆదిత్య కు.

ఇందాక వాళ్ళను చూసినప్పుడు ఎంతో గౌరవం అనిపించింది.
 ఇప్పుడు వాళ్లను చూస్తుంటే, నక్కల కన్నా హీనంగా ఉన్నారు అనిపిoచ్చింది .

ఆ మాటను పైకి అనలేక ,అసహ్యం నిండిన ఒక చూపు చూసి వెళ్ళిపోయాడు.

డబ్బిచ్చి పగ తెచ్చుకోవడం అంటే ఇదే కాబోలు... అంటూ గొనుక్కుంటూ కూర్చున్నారు వాళ్ళు.

@@@@@@@

రోజు పేపర్లో చూస్తూనే ఉన్నాడు. రైతుల ఆత్మహత్యలు. అంతంత అప్పులు చేసి, పంటలు వేస్తే ,అవి సరిగ్గా పండి, పండక, కనీసం పండిన ధాన్యాన్ని, కూరగాయలను అమ్ముకోపోతే సరైన ధరలు లేక, దళారుల చేతుల్లో మోసపోయిన రైతులు ,ఇంకేమీ చేయగలరు.?

ఎన్ని ప్రభుత్వాలు మారిన రైతుల కష్టాలు తీర్చే వారే లేరు.

ఆఫీసులో ఉన్నా కూడా ఆదిత్య ఆలోచనలు ఇలాగే సాగుతున్నాయి.
ఇంతలో తన సెల్ ఫోన్ మోగింది.
హాస్పటల్ నుంచి వచ్చింది కాల్.

అయ్యో పాపం ! ఆ రైతుకు ఎలా ఉందో ఏమిటో! అనుకుంటు, ఆదుర్దా గా ఫోన్ లిఫ్ట్ చేసాడు.

అటు నుంచి రిసెప్షన్ కాల్ లిఫ్ట్ చేసి,
"సార్ ,మీరు హాస్పిటల్ లో జాయిన్ చేసిన, రామయ్య గారి మిస్సెస్ సీతమ్మ గారు, మీతో మాట్లాడాలి అంటున్నారు.

ఫోన్ ఇవ్వమంటారా?"
 అంటూ అడిగింది.

"ఓకే ..ఇవ్వండి అమ్మ...." అన్నాడు ఆదిత్య.

"నమస్కారం సారూ! ఒకసారి హాస్పటల్ కి వస్తారా సార్? మీతో అర్జెంటుగా మాట్లాడాలని, మా ఇంటి ఆయన కంగారు పడుతున్నాడు. మా మీద దయవుంచి ఒక్కపాలి దావుకానాకి రాండి సారు !" అంటూ ప్రాధేయపడుతోంది.

"ఏమైందమ్మా? రామయ్య గారు బానే ఉన్నాడు కదా!" అంటూ గాభరాగా అడిగాడు ఆదిత్య.

"మీ దయ వల్ల బానే ఉన్నాడు సారూ.
ఒక్కపాలి మీతో మాట్లాడాలని అంటున్నాడు." అన్నది సీతమ్మ.

"వీలు చూసుకుని సాయంత్రం రాండి సారు...." అంటూ.... ప్రాధేయపడింది.


హాస్పటల్ కి వెళ్ళిన ఆదిత్య కు రామయ్య ఏదో చెప్పాలని తహతహ లాడిపోయాడు.

భార్యని కూడా బయటికి పంపించేశాడు.

"ఎందుకు రామయ్య ....అంత ఆదుర్దా పడుతున్నావు. నీకు ప్రమాదం ఏమీ లేదని డాక్టర్ గారు చెప్పారు కదా!
అన్నాడు ఆదిత్య.

"నేను ఇంకా కష్టపడి పని చేయకూడదని ఎక్కువగా ఎండకు తిరగకూడదు అని డాక్టర్ గారు చెప్పారు సారు.

అందుకే మీరు నాకు ఒక సహాయం చేసి పెట్టాలి. కాదు అని అనకూడదు..."

అన్నాడు రామయ్య
"డబ్బేమన్నా కావాలా? అంటూ అడిగాడు ఆదిత్య.

"వద్దు సారు... ఇప్పటికే నువ్వు చేసిన సహాయానికి, నీ రుణం ఎట్లా తీర్చుకోవాలో తెలియడం లేదు .వచ్చే జన్మంటూ ఉంటే, మీ ఇంట్లో కుక్క నై పుట్టి, రుణం తీర్చుకుంటాను..."అన్నాడు రామయ్య.

"అంత పెద్ద మాటలు ఎందుకులే రామయ్య! నువ్వు ఎక్కువగా మాట్లాడకూడదు. రెస్ట్ తీసుకో. ఏమి మాట్లాడాలన్నా తరువాత మాట్లాడుకుందాం అన్నాడు ఆదిత్య.

"కాదు సారు.... నాకు నెత్తి మీద బాధ్యతలు చాలా ఉన్నాయి .అవి తీర్చుకోనిదే నా ప్రాణం పోదు.

నేనెలాగో పనిచేయటానికి పనికిరాని కాబట్టి, నా శరీరంలో ఉన్న పనికొచ్చే భాగాలను, ఎవరికైనా ఉపయోగపడే వారికి ఇచ్చేసి,

 ఆ వచ్చిన డబ్బును, నాకు బాకీ ఇచ్చిన వాళ్లకు సర్దుబాటు చేసి, ఇంకేమన్నా మిగిలితే, నాకోసం ఆరాటపడుతున్న నా ఇంటి దానికి ఇప్పిస్తే ....

ప్రశాంతంగా ప్రాణం వదులుతాను ."

అని చెప్పలేక, కళ్ళ వెంట నీళ్లు కారుతుంటే, బాధతో, ఒక్కొక్క అక్షరం కూడా పలుక్కొని చెప్పాడు రామయ్య.

అతని మాటలు విని నిస్చేస్టుడయ్యాడు ఆదిత్య .

ఏమి మాట్లాడాలో అర్థం కాలేదు .
తన అవయవాలను అమ్ముకుని మరి బాకీలు తీర్చాలని ఆరాటపడుతున్న రామయ్య ను చూస్తుంటే!


ఇటువంటి వాళ్లు ఉండబట్టే కదా, భరతఖండం ప్రపంచ పటంలో ఒక ప్రత్యేకతను సంతరించుకుంది ...అనుకోకుండా ఉండలేకపోయాడు ఆదిత్య.

 
బాకీలు చేసి అతడు అనుభవించినదేమి లేకపోయినా! ఒక బాధ్యతగా వాటిని అన్నింటిని తీర్చాలనుకునే బడుగు రైతు.... 'ఎంతటి త్యాగశీలి!'

తమ విలాసాల కోసం బ్యాంకుల లో, కోట్లు కోట్లు లోన్లు తీసుకొని, కట్టకుండా విదేశాలకు పారిపోయిన, ఎంతోమంది పెద్ద మనుషులు, సిగ్గుతో తలవంచి పాదాభివందనం చేయవలసిన గొప్ప వ్యక్తిగా రామయ్య ఆదిత్య కు కనిపించాడు .

అవయవాలను అమ్ముకొని అప్పులను తీర్చే పరిస్థితి ఏ బడుగు రైతుకు రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి ?

అనే దాని గురించి ఆలోచించటం మొదలుపెట్టారు ఆదిత్య.

ఇలాంటి ఆలోచన ప్రతి ఉద్యోగస్తుడికి వస్తే, అప్పుడు రైతుల ఆత్మహత్యలు ఆగిపోతాయి.

ప్రతి ఉద్యోగస్తుడి పూర్వీకులు వ్యవసాయదారులే అయి ఉంటారని, కచ్చితంగా అందరికీ తెలిసిన విషయమే.

అందరూ పట్నాలలో ఉద్యోగాలు చేస్తూ ఉంటే, పంటలు పండించేవారు ఎవరు? తిండి పెట్టేవారు ఎవరు ?ఈ ఆలోచన యువతలో రావాలి....

అది తనతోనే మొదలు కావాలని,
ఆ మంచి ఆలోచనకు ఆరోజే శ్రీకారం చుట్టాడు ఆదిత్య.

ప్రతివారం వీకెండ్ లో రామయ్య ఊరికి వెళ్లి, అతడు చేస్తున్న వ్యవసాయాన్ని ,వేస్తున్న పంటలను పరిశీలించి ,తగిన సలహాలను ఇస్తూ ఆదుకున్నాడు.

అంతేకాకుండా తన ఆలోచనను తన కంపెనీలో ఉన్న ఉద్యోగస్తులందరితో కలిసి పంచుకోవటమే కాకుండా, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసి,

 కష్టాల ఊబిలో మునిగిపోతున్న వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి పథం లో నడిపించడానికి ముందడుగు వేశాడు.

6 కామెంట్‌లు:

  1. చాలా బాగా చెప్పారు అమ్మ, అందరి ఆకలి తీర్చే రైతు ఎప్పుడు వెనుక పడిపోతూనే ఉంటాడు, ఆదిత్యల అందరూ ఆలోచించాలి..

    రిప్లయితొలగించండి
  2. నిజంగా.. ప్రతి ఒక్కరి పూర్వికులు వ్యవసాయం చేసేవారు.. నిజంగా అలా ఆలోచిస్తే అందరం రైతుబిడ్డలు మే.. ఆదిత్య ఆలోచన చాలా బావుంది..

    రిప్లయితొలగించండి
  3. స్ఫూర్తిదాయక మైన కథ! రైతుల కష్టాలు తీరే
    రోజు ఎప్పుడు వస్తుందో? ప్రభుత్వం ఐనా వారి
    గురించి పట్టించుకుంటే బావుంటుంది

    రిప్లయితొలగించండి
  4. రైతు భాధలు బాగా వర్ణించారు. రైతు కష్టం లో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలి. ఆదిత్య ఆలోచన బాగుంది. మంచి కథ అందించిన రచయిత్రి గారికి అభినందనలు

    రిప్లయితొలగించండి
  5. ఆదిత్య లాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు. రైతుని అర్ధం చేసుకునే వాళ్ళే లేరు. నిజం గా కళ్ళ ముందు జరిగినట్టు అనిపించింది.. బావుందండి.

    రిప్లయితొలగించండి
  6. రైతులు దాదాపు అందరూ ఆత్మాభిమానం కలిగివుంటారు.భూమిని నమ్ముకున్న వాళ్ళు అప్పులు ఎగ్గొట్టే ఆలోచన ఎప్పుడూ చెయ్యరు. కథలో రామయ్య ఆర్తి,ఆరాటం ఆ విషయాన్నే ఋజువు చేస్తాయి. సాయం లేని వ్యవసాయాన్ని ప్రభుత్వాలు ఆదుకోవడం తో పాటు ఆదిత్య లాంటి వారు ఇంకా రావాలి.
    అన్నదాత నిజాయితీని, త్యాగాన్ని,ఆత్మాభిమానాన్ని చాటిన కథ వ్యవసాయం ’ . రచయిత్రి గారికి అభినందనలు.

    రిప్లయితొలగించండి