![]() |
విద్యాధర్ మునిపల్లె |
1889 ఏప్రిల్ 2 ఉదయం 8.30
రాజమహేంద్రవరంలో తులసి ఇల్లు...
నిత్య యవ్వనం దేవతలకే వుంటుందంటారు.. అదేవిటో ఎప్పుడూ ఆమెలో యవ్వనపు పరిమళాలు వెదజల్లుతునే వుంటాయి. నిత్యం ఆమె శరీరం నుండి చందన, కస్తూరి, జవ్వాది, పునుగు, అగరు వంటి సుంగధ ద్రవ్యాలను పోలిన సువాసనలు ఆమె చుట్టూ వీస్తుంటాయి. సన్నటి నడుము, నాజూకైన చర్మ లావణ్యం, కవ్వించే కంటిచూపు, పలువరస కనిపించేలా చిరునవ్వు, కోటేరులాంటి ముక్కు, పిరుదులు దాటిన జెడ ఇలా ఆమె అందాన్ని వర్ణించటానికి కాళిదాసుకూడా లెక్కకుమించిన కావ్యాలు రాసేవాడని రాజమహేంద్ర కవులు బహిరంగంగానే గుసగుసలాడుకునే వారు.
తులసి దర్శనం కావాలంటే... సంవత్సరానికి ఒక్కసారే.. కోటిలింగాల రేవులో తులసి నాట్య ప్రదర్శన నాడు తప్ప తన మేడ వదిలిరాదు. ఎవరైనా తనింటికి వస్తే కాదనదు. కాకపోతే కాసులు కుమ్మరించాలి. కుమ్మరించిన కాసులని బట్టి తన అందాలను వారికి కుమ్మరిస్తుంది. కాసులు కుమ్మరించలేని వారు ఆమె కడగంటి చూపుకోసం కనకమేడలవాడలోని ఆమె ఒంటి స్థంబపు ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు.
తులసి దర్శనం మాత్రమే కోరేవారికి రెండుతులాల బంగారం సమర్పించుకుంటే చాలు.
మాటా మంతీ జరపాలంటే కాసులపేరు..
అందాలను చూసి ఆస్వాదించాలంటే.. పైన చెప్పిన వాటితోపాటు వడ్డాణం కూడా తీసుకురావాలి.
తులసికి మంగళసూత్రాలంటే మహామోజు.
అది కూడా వేరేవాడి భార్య మెడలోని మంగళసూత్రం తెచ్చి తనపాదాలదగ్గర పెట్టించుకోవటంలో తులసి పొందే పైశాచిక ఆనందమే వేరు.
అలా చేస్తే ఆమె ప్రసన్నత పొందినట్లే.
పైన చెప్పిన బంగారం ఇవ్వకపోయినా.. ఈ ఒక్కటిచ్చుకుంటే చాలు.. కోరిందీ.. కోరందీ. అన్నీ తులసి వారికి సమర్పించుకుంటుంది.
ఈ కిటికు తెలిసిన వాళ్ళు రాజమహేంద్రవరంలో ఒకరిద్దరు తప్ప లేరు.
వారే తులసికి నిత్య పోషకులు.
వారిని చూసిన చాలా మంది తులసి సాంగత్యం చేస్తున్నారంటే వీరు చాలా డబ్బున్న వాళ్ళు కాబోలని అనుకునేవారు.
లక్ష్మయ్య అనే తాకట్టు వ్యాపారి తులసి వద్దకు కొందరిని తీసుకెళ్ళి పరిచయం చేసేవాడు.
ఎంతో మంది పురప్రముఖులు తమతమ ఆస్తులని తులసి అందాలముందు ఆరపరచేవారు.
కుబేరులు కూడా తులసి సాంగత్యంతో కుచేలులయ్యారు.
అలా వీధిన పడినవారి కుటుంబస్త్రీలు తులసిని నానామాటలు అనేవారు.
ఎక్కడి నుండి వచ్చిందో పాపిష్ఠి ముండ.. రాజమహేంద్రవరానికి శనిలా దాపురించింది అంటూ దుమ్మెత్తి పోశారు.
అయినా తులసి తన ధోరణీ మార్చుకోలేదు.
ఆస్తులను కూడబెట్టుకోవటంలో తగ్గలేదు.
తులసి లక్ష్మయ్యని తనతోనే వుంచేసుకుంది.
ఒకనాడు లక్ష్మయ్య సింహాచలానికి చెందిన విరూపాక్ష కవీంద్రుడిని తులసికి పరిచయం చేశాడు.
అదే అతను చేసిన పొరపాటు.
విరూపాక్షుని సాంగత్యంతో తులసి జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.
ఆమెకి తెలియకుండానే తన దాన్నిగా మార్చేసుకున్నాడు విరూపాక్షకవి.
ఒక మంచిరోజు చూసుకొని లక్ష్మయ్య మీద దొంగతనం నేరం మోపి ఇంటి నుండి వెళ్ళగొట్టించాడు విరూపాక్షుడు.
తులసి కూడా విరూపాక్షుని మాటలు నమ్మేసి లక్ష్మయ్యను కాలదన్నింది.
అటుపై విరూపాక్షుని వాసం సింహాచలం నుండి రాజమహేంద్రవరంలోని తులసి ఒంటిస్థంబం మేడకి మారింది.
దీంతో లక్ష్మయ్య మరో సాని కొంప చూసుకోవాల్సి వచ్చింది.
నగరంలో ఎందరు సానులున్నా తులసి కాలిగోటికి చాలేవారు కారు.
ఎందరు శిల్పులు ఎన్నిరాత్రులు కష్టపడి తమ శ్వేదాన్ని చిందించి వీర్యాన్ని త్యజించి తమతమ కామవాంఛలను అందంగా అమర్చి శ్రమకోర్చి ఒక్కో అంగాన్నీ ఏర్చికూర్చి మలచిన అపురూప సజీవశిల్పమో కదా.. ఈ తులసీ అని పలువురు సరసుల భావన.
తులసి అందగత్తె మాత్రమే కాదు మాటకారి కూడా.. ఈ మాటకారి తనం అంతా కూడా తనకి దూరపు బంధువు, వరసకు అక్క అయిన మధురవాణి నుంచి నేర్చుకున్నది. రామప్పంతులు, గిరీశం వంటి ఘటికులను తన కొంగున కట్టేసుకొని ఆడించిన మధురవాణి తెలివితేటల్లో కొన్ని తులసి ఆకళింపు చేసుకుంది. అదే ఆమెకి అదనపు ఆకర్షణ.
ఒక్కసారిగా విరూపాక్ష కవీంద్రునికి తులసితో తన గతమంతా కళ్ళముందు కదలాడింది. మరోవైపు ముకుందుడు, విశ్వనాధుడు తనకి చేసిన అవమానం గుండెల్లో అగ్ని పర్వతంలా ప్రజ్వరిల్లుతోంది.
తెలుగు సాహిత్యానికి గురజాడ అప్పారావు, వీరేశలింగం పంతులు వంటివారు చేస్తున్న సేవలు తెలుసు. వారి పటిమా విరూపాక్షునికి తెలుసు. అయితే వారు వారివారి శైలిలో రచనలు చేసుకుంటున్నారే తప్ప తనంతటి వాడికి అడ్డువచ్చేవారు కారు. వీరిరువురి రచనలు దాదాపు దేశభక్తి, సంస్కరణలవైపే వుంటాయి. ఆంగ్లేయుల పాలనలో వీటివల్ల ఎలాంటి ఉపయోగమూలేదు.. వీరు కోరే స్వాతంత్ర్యమూ రాదు. వారు చేస్తోంది వృధాప్రయాస.. ఆంధ్ర సాహితీ వినీలాకాశంలో ధృవతారలుగా మిగిలిపోయే రచనలు కేవలం తమవంటి వారి రచనలే అని విరూపాక్షుని నమ్మకం. అందుకే మా వంటి కవిపండితులు చేసే రచనలు యువతీయువకులని గిలిగింతలు పెట్టేలా.. శృంగార రసంలో వారిని ఓలలాడించేలా వుండాలి అని నిర్ణయించుకున్నాడు. అలాగే రచనలూ చేసేవాడు. జవ్వంగి రాజావారు శృంగార సాహితీ ప్రియులు కావటంతో ఇతనికి ఆడింది ఆటా పాడింది పాటగా వుంది. వారి నుండి ఎన్నో బహుమానాలు, స్థలాలూ, పొలాలూ, మేడలు బహుమానంగా పొందటం జరిగింది. అందుకే తనంతటి పండితులు ఆంధ్రదేశంలో లేరు అని అతని పొగరు. వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావుల మీద ఇతనికి సరైన అభిప్రాయమూలేదు. ఎందుకంటే తనే గొప్ప.. వారంతా ముసలితనంతో కూడిన చాదస్తులనీ, వారి రచనల్లో పనికొచ్చే అంశాలే వుండవనీ అతని అభిప్రాయం.
ఎటొచ్చీ.. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే..
పాఠకలోకం విశ్వనాధుని కవిత్వానికీ, రచనలకీ ఎందుకు ఎగబడుతున్నారో.. అతనికి అర్ధంకాలేదు.
ఇంతవరకూ విరూపాక్షుడు అతని సాహిత్యాన్ని చదవలేదు.. వినలేదు.
కానీ అతని పేరు ప్రఖ్యాతలు మాత్రం మదరాసు వరకూ వ్యాపించటం.. ప్రెసిడెన్సీ కళాశాలకు వెళ్ళినప్పుడు పలువురు అతని గురించి మాట్లాడటం వినివున్నాడు.
అతను విన్నదాన్ని బట్టి ఆంధ్రనాట విశ్వనాధశాస్త్రి పేరు తొలివరసలో వినిపిస్తోంది.
అందుకే అతనికీ జవ్వంగి రాజావారినుండి ప్రత్యేక ఆహ్వానాన్ని అందించాల్సి వచ్చింది విరూపాక్షుడు.
ఇలా అతను ఆలోచనలో మునిగిపోయాడు.
ఇంతలో విశ్వనాధశాస్త్రి సాహిత్యాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు విరూపాక్షుని శిష్యుడు మాధవరావు.
విరూపాక్షుడు కనీసం ఆ పుస్తకాలను కంటితో కూడా చూడదలచుకోలేదు..
అందుకే మాధవరావుని చదవమని ఆజ్ఞాపించాడు.
మాధవరావు చదువుతున్నాడు.. విరూపాక్షుడు వింటున్నాడు.
కాసేపటికి విరూపాక్షుడు మాధవరావుని చదవటం ఆపేసి పుస్తకాలు అక్కడ పెట్టి వెళ్ళిపోమన్నాడు.
మాధవరావుకి విషయం అర్ధంకానప్పటికీ గురువుగారు చెప్పారని పుస్తకాలు విరూపాక్షుని పాదాలవద్ద పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
విరూపాక్షునికి అర్ధమైపోయింది విశ్వనాధుని కలంబలం.
అతను కనుక ఉగాది సాహితీ సమరంలో పాల్గొంటే గెలుపు అతనిదే అవుతుంది.
రాజావారు బహుమతిగా ప్రకటించిన గజారోహణం, పదివేలనూటపదహార్లు, ఆంగ్లపత్రికలో ఛాయాచిత్రం(ఫోటో) ఇవన్నీ విశ్వనాధునికి దక్కుతాయి.
అతని పేరు మదరాసు మాత్రమే కాదు లండను వరకూ కూడా వ్యాపిస్తుంది.
అలా జరగటానికి వీల్లేదు.
గౌరవం తనకే దక్కాలి.. అందుకు విశ్వనాధుని నోట కవనం వెలువడకూడదు.
ఎలా ఎలా అని ఆలోచిస్తుండగా అప్పుడే తులసి అలంకరించుకొని విరూపాక్షుని ముందుకు వచ్చి నిలబడింది.
సహజంగానే అహంకారి, కుత్సిత బుద్ధి కల విరూపాక్షునికి ఏం చెయ్యాలో క్షణాల్లోనే అర్ధమైంది..
అతని పెదవులమీద విషపు నవ్వు మెరిసింది.
(సశేషం)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి