కుసుమం 1

 అగస్టు 14 వతారీఖు తెల్లవారు ఝామున గుంటూరు నుండి కదిలింది పలనాడు ఎక్స్‌ప్రెస్‌

'' మరిచిపోకు నేస్తమా మన మూగబాసలు..... తిరిగిరావు నేస్తమా మనం గడిపిన క్షణాలు '' 

ఇవే మాటలు పదేపదే తలపునకు రాసాగాయి ఆమెకు.... 
ఎన్నో ఆశలు...మరెన్నో భావాలు ఆమె మనసులో.......
రైలు వేగంగా వెళుతోంది. 
ఆవేగానికి అణుగుణంగా తాళంవేస్తున్నాయి రైలు పట్టాలు.....
ఆ తాళానికి స్వరం కలుపుతున్నాయి ఆమె మనసులోని కోరికలు..
ప్రస్తుతం ఆమె ప్రయాణం భాగ్యనగరానికి.....
తన దౌర్భాగ్యస్థితినుండి బయటపడానికి ......
కిటికీలోంచి వచ్చే చల్లనిగాలి ఈమె కురులను చిందర వందరచేయాలని ప్రయత్నిస్తోంది. 
అయితే గాలికి ఆమె ఆ అవకాశాన్నివ్వలేదు. 
కిటికీ అద్దాలు క్రిందకు దించింది. 
పొద్దున్నే గుంటూరులో పలనాడుఎక్స్‌ప్రెస్‌ ఎక్కింది. 
బహుశ ఆవచ్చే వూరు సత్తెనపల్లి అనుకుంటా......
‘‘ ఏంటీ అతను వచ్చి వుాండా....వస్తానని నమ్మకంగా చెప్పాడు.’’ అని కిటికీ అద్దాలు  పైకెత్తి ప్లాట్ ఫారంమీదకు చూసింది.
స్టేషన్‌లో కొద్దిమంది వున్నారు. 
ఆమె కళ్ళు తీక్షణంగా అతనికోసం గాలిస్తున్నాయి. 
‘‘ ట్రైన్‌ కదిలే టైం అయిపోయింది. ఇంతవరకూ రాలేదు. వస్తాడా.... గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.’’
ట్రైన్‌ కూతవేస్తూ కదిలింది. దూరంనుండి తెల్లప్యాంట్ తెల్లచొక్కా వేసుకున్న వ్యక్తి పరిగెత్తుతూ వస్తున్నాడు.
ట్రైన్‌ చాలా స్లోగా కదులుతోంది.....చిన్నగా వేగాన్ని అందుకుంది. 
‘‘త్వరగా రా...... '' అని చెయ్యి అందించింది.... 
ఆ వ్యక్తి రన్నింగ్‌ ట్రైన్‌ ఎక్కాడు..
''థ్యాంక్యూ మేడం...ఈట్రైన్‌ మిస్‌ అయితే ఇంటర్వ్యూకి అటెండ్‌ అయ్యేవాడిని కాను.''
''అయినా అంతగా ఇంటర్వ్యూకి  వెళ్ళాలనుకున్నవాడు ఇంటిదగ్గర త్వరగా బయల్దేరచ్చుగా'' మనసులో అనుకుంది.
తెరచిన కిటికీలోంచి బయటకు చూస్తూ..... 
‘‘ఎందుకని రాలేదితను. వస్తానని నమ్మకంగా చెప్పాడు. ఈ మగాళ్ళు ఎప్పుడూ ఇంతే .... వస్తానన్న టైంకి అస్సలు రారు. ఛిఛి. బహుశ వెనుక పాసింజర్‌ ట్రైన్‌కేమన్నా వస్తున్నాడా....ఒక వేళ అదే కనుక అయితే సాయంత్రం దాకా పిచ్చిపీనుగలాగా అతనికోసం ఎదురు చూస్తూ స్టేషన్‌లోనే కూర్చోవాలి..... అసలు నమ్మిరావటం నాదే తప్పు.'' మనసులో తిట్టుకుంటూ వుంది.
‘‘ మీరు ఎక్కడిదాకా మేడమ్‌'' అడగాడతను.
''పరిచయం లేనితనేిం ఇలా అడుగుతున్నాడు. అందమైన అమ్మాయిల్ని చూస్తే చాలు , పరిచయం పెంచుకోవాలని చూస్తారు కంతిరి సన్నాసులు'' అని మనసులో అనుకుంటూ 
‘‘ సికింద్రాబాద్‌'' అని ముభావంగా చెప్పి తిరిగి కిటికీ లోంచి బయటకు చూస్తోంది. 
‘‘ నా పేరు రాహుల్‌. యం.బి.ఏ.''
‘‘....'' నవ్వి వూరుకుంది. '' 
‘‘నసపెట్టి చంపుతున్నాడు. వీడెవడండీ బాబూ... నా టెన్షన్‌లో నేనుంటే...'' అని మనసులో తిట్టుకుంటూ చిన్నగా తన బ్యాగ్‌ ఓపెన్‌ చేసింది. అందులోంచి తన వెంటతెచ్చుకున్న నవల తీసి చదువుతోంది. 
ఇంతలో నల్గొండ స్టేజీవచ్చింది. 
ప్లాట్ ఫాం మీద టీ, కాఫీ అమ్ముతున్నారు. 
రాహుల్‌ ట్రైన్‌ దిగాడు టీ తాగుదామని. 
మళ్ళీ ట్రైన్‌ పెద్దగా కూత పెడుతూ పరుగు ప్రారంభించింది. 
రాహుల్‌ ట్రైన్‌ ఎక్కలేదు. 
అతను ట్రైన్‌ వెనుక పరిగెత్తి మళ్ళీ ఎలాగోలా రన్నింగ్‌ ట్రైన్‌ ఎక్కాడు. 
నవ్వుతూ వచ్చి ఈమె ముందు కూర్చున్నాడు. 
ముభావంగా నవ్వింది. రాహుల్‌ ఏదో చెబుదామని చెప్పబోతుండగా....
'' మీరు  ఏపనైనా పీకలమీదకు వచ్చిందాకా చెయ్యరనుకుంటా...''
'' అర్ధం కాలేదు ''
'' ఇందాక సత్తెనపల్లిలో, ఇప్పుడు నల్గొండలో...''
'' అదా....!'' అన్నాడు తేలిగ్గా నవ్వుతూ.... తనుకూడా నవ్వేసింది అతనితో...... ఎందుకో తెలీదు.....కాసేపలా నవ్వుకుంటూనే తిరిగి తను పుస్తకం చదవటంలో లీనమయింది. 
ఉన్నట్లుండి ఆమె వీపుమీద మెత్తగా ఏదో తాకిన స్పర్శ. ఉలిక్కిపడి వెనక్కు చూసింది. నవ్వుతూ కనిపించాడు సుధీర్‌.
'' ఏంటి రాలేదనుకున్నావా...'' అన్నాడు
'' .....'' ఒక్క క్షణం ఆనందం...మరునిముషం కోపం ఆమె ముఖంలో చోటుచేసుకున్నాయి.
'' ఎందుకు శ్రావణి అంత కోపం. వచ్చేశాను కదా....''
'' బుద్ధివుందా నీకు . అయినా ఎక్కడున్నావ్‌ ఇప్పిదాకా......''
'' ఇదిగో .... నీ వెనుక సీట్ లోనే....''
'' ప్లాట్  ఫాం మీద కనబడలేదు...''
'' రెండో వైపునుండి ఎక్కా....''
'' ఉద్దరించలేకపోయావ్‌''
'' సారీ శ్రావణీ....ఇదిగో నీ కోసం టిఫెన్‌ ''
'' నువ్వు తిన్నావా....''
'' తర్వాత తింలే.....''
'' వద్దులే...ఇద్దరం కలిసే తిందాం...రాహుల్‌ ఇఫ్‌ యు డోంట్ మైన్‌.....'' అన్నది ఎదురు సీట్ సుధీర్‌కు కావాలన్నట్లు.
'' ఓ.కె. విత్‌ ప్లజర్‌'' అంటూ తను సుధీర్‌ సీట్ కు షిఫ్ట్‌ అయ్యాడు
ట్రైన్‌ సికింద్రాబాద్‌ స్టేషన్‌ చేరింది. సమయం 11.30 నిముషాలు. ఇద్దరూ స్టేషన్‌ బయటకు రాగానే ముందుగా అనుకున్న ప్రకారం అక్కడ స్కార్పియో పార్కింగ్‌లో వుంది. 
ఇద్దరూ వెళ్ళి దాంట్లో కూర్చున్నారు. 
సుధీర్‌ స్కార్పియో నడుపుతూ.. దానిని బేగంపేట విమానాశ్రయం వైపు పోనిస్తున్నాడు. 
సుధీర్‌ ఒక రెస్టారెంట్ ముందాపాడు. 
అతనితో కూడా శ్రావణి రెస్టారెంట్లోకి నడిచింది. 
ఇద్దరూ ఎదురెదురుగా కూర్చుని ఒకరినొకరు చూసుకుంటున్నారు. 
బేరర్‌ వచ్చి  ''ఆర్డర్‌ ప్లీజ్‌'' వినయంగా అడిగాడు.
‘‘ శ్రావణి నీకేంకావాలో ఆర్డరివ్వు ....నేను చేతులు వాష్‌ చేసుకొస్తా...'' అని వాష్‌ బేసిన్‌ వైపు కదిలాడు...

(సశేషం)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి