దూరం

 దూరం

రచన : శ్రీరాజ్

‘‘చూడమ్మా, బేబీ! మనసు చంపుకొని చీకట్లో బ్రతకడానికి నాలాగా పిరికిదానివి కావొద్దు. అవసరం అయితే, నీకు అడ్డొచ్చే ఎవరినైనా ఎదురించు. ఈ తలుపులు, కిటికీలు బద్దలు కొట్టుకొని బయటపడు. నిన్ను ప్రేమించిన వ్యక్తితో జీవితాన్ని పండించుకో..’’

*****

అప్పుడే గదిలోకి అడుగు పెట్టిన కవిత చెంప ఛెళ్ళుమనిపించాడు మంగపతి తన ఉద్వేగాన్ని అణచుకోలేక. 

పద్దెనిమిదేళ్ళ కవిత తల్లి ఒడిలో పడింది. తూలిపడ్డ కూతుర్ని పొదవి పట్టుకొని లలిత ఆపింది.

కవిత కళ్ళు తుడుచుకొని కుడిచేతి మీది పచ్చబొట్టు తండ్రికి చూపించింది.

‘‘ ఓహో చెయ్యి దాటి కథ చాలా దూరం జరిగిందన్నమాట’’ అతను అవమానంగా బిగిసిన పిడికిలిని ఎడంచేత్తో నొక్కి పట్టుకున్నాడు.

చెయ్యి దాటి చాలా దూరం జరిగిన ప్రేమకథ బయట పడింది. చినుకు చినుకు తుఫానుగా మారింది. సమాధికి పునాది సిద్ధమయింది. 

‘‘ వాడిది మన కులమేనా?’’

‘‘నో...’’

‘‘ వాడికి డాక్టరేట్ ఉందా’’

‘‘నో...’’

‘‘ పోనీ డబ్బయినా వుందా?’’

‘‘నో….’’

‘‘ఏదయినా సోషల్ స్టేటస్సుందా?’’

‘‘నో….’’

‘‘కనీసం మంచి పేరుం దా?’’

‘‘నో….’’

‘‘నో నో నో … అన్నీ ‘నో…’ ‘నో’ అనకుం డా ‘యస్సె ’లా అన్నావ్? వాడిలో ఏ అర్హత చూసి ప్రేమించావ్?’

‘‘ ఏ గొప్ప వాళ్ళకీ లేని గొప్పగుణం ఉంది. నాకోసం ప్రాణం కూడా ఇవ్వగల మంచి మనసుంది డాడీ!’’

‘‘ ఉన్న ఒక్క ప్రాణాన్ని ఎరగా చూపించి డబ్బున్న ఆడపిల్లని లొంగదీసుకోవటం అలాంటి ముష్ఠి వెధవలకి బాగా తెలుసు’’

మంగపతికీ అతనిలో రచయితకీ మధ్య చాలా దూరం వుంది.

స్వయం ప్రతిపత్తిలేని రచయిత, సర్వాధికారాలున్న అతను.

‘‘ మీ రచనల్లో ఆశించే అభ్యుదయం ఇదేనా?’’

‘‘ అది రాతలవరకే.. చేతల వరకు వస్తే మనం అడుక్కుతినాల్సిందే’’

‘‘ అంటే మీరు పాఠకుల్ని మోసం చేస్తున్నారు. జీవితంలోంచి పుట్టుకొచ్చిన కథలే చరిత్రలో నిలబడతాయి డాడీ.’’ 

‘‘ షటప్.. మెలోడైలాగ్ చెప్పకు.. జీవితం గురించి కథ గురించి నాకు నేర్పించకు’’

‘‘ సరే.. నా అభిప్రాయం నాకుంది. నేను చావటానికయినా సిద్ధపడతాను గానీ అతన్ని తప్ప మరెవర్నీ పెళ్ళిచేసుకోను.’’ 

‘‘ మాటలు నేర్చినంత మాత్రాన నీ ఇష్ట ప్రకారం పెళ్ళి జరిపిస్తానని ఆశపడకు.’’

అలాంటి సన్నివేశాలు తన కథల్లో ఎన్నో రాసినప్పటికీ జీవితంలో ఎదురైన సంఘటనలకు తట్టుకోవటం కష్టమే అనిపించింది మంగపతికి. 

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవుండదు. అలాగే రచయిత తలచుకుంటే డైలాగులకు కొదవుండదు. ఎడాపెడా మాట్లాడేడు. 

రాబర్టు బ్రౌనింగ్ పాత్రల పద్ధతిలో అతను వ్యవహరించాడు. ఈ కాంటెంపరరీ సొసైటీలో అన్నింటా రిచ్ గా బతుకుతున్న తనలాంటి ఏవన్ రైటర్- ఓ టాన్ డిక్ ఎన్ హేరీగాడ్ని తన అల్లుడిగా  ఎలా స్వీకరించగలడు? ఉన్న ఒక్కగానొక్క కూతర్ని బంగారు బంగళాలో వున్న ఓ హేండ్సమ్ ప్రిన్స్ తో పెళ్ళి జరిపించాలనుకోవటం స్వార్థం ఎలా అవుతుంది?

కవిత బంగారు పంజరంలో బంధీ అయింది. ఫలితంగా సాగరంలోకి ఉరకలు ఉరకలుగా సాగే నది మధ్యలోనే ఆగి ఆవిరయిపోతుంది.

కమిటెడ్ గా కనిపిస్తూ కమర్షియల్ రచనలు చేసేవారు కొందరు లేకపోలేదు. అలాంటి రచయితల్లో తన భర్త మొదటివాడని లలితకు తెలుసు. తెలిసినా ఏమి చేయలేని అసహాయ స్థితిలో ఆమె ఉంది. బాధపడటం తప్ప భర్తను ఎదిరించే శక్తీ, ధైర్యమూ ఆమెకి లేవు. లేవు కనుకనే కూతుర్ని ఓదార్చలేక పోయింది. ఏ విధంగానూ సాయపడలేకపోతుంది.

లలితకు కన్నీళ్ళొచ్చాయి. కవిత తలంపుకి రాగానే.

కవిత తొందరపడి ఏ అఘాయిత్యానికో పూనుకుంటే?, తను భరించలేదు.

తన భర్తలాంటి హంతకుడ్ని ఏ చట్టం శిక్షించలేదు. అతను రాతలకు చేతలకు వేరు వేరు నిర్వచనం చెప్పగల గొప్పరచయిత కనుక.

సమాజంలో రచయిత పాత్ర, అతనికున్న బాధ్యత ప్రత్యేకమైనవి. వాటిని విస్మరించి, స్వార్థం పెంచుకుంటే సామాజిక స్పృహ ఎప్పుడొస్తుంది? మనిషికీ మనసుకీ మధ్య గీత చెరిగి ఎదుటివాడి కన్నీరు తుడిచే రోజు ఎప్పుడొస్తుంది.

జీవితంలో మొదటిసారి లలిత ఆలోచించింది. గబగబా తాళం తీసి కవిత ఉన్న గదిలోకి ప్రవేశించింది.

‘‘చూడమ్మా.. బేబీ! మనసు చంపుకొని చీకట్లో బతకటానికి నాలాగా పిరికిదానివి కావద్దు. అవసరం అయితే, నీకు అడ్డొచ్చే ఎవరినైనా ఎదిరించు. ఈ తలుపులు, కిటికీలు బద్దలు కొట్టుకొని బయటపడు. నిన్నను ప్రేమించిన వ్యక్తితో జీవితాన్ని పండించుకో.’’

తనలో గుండెధైర్యాన్ని నూరిపోస్తున్న తల్లి మాటలకు కవిత వింతగా చూసింది.

అంతే ! బంగారు పంజరంలో చిలక టపటపా రెక్కలాడిస్తూ స్వేచ్ఛగా బయటకు ఎగిరింది. దూరంగా వడివడిగా నడిచివెళ్తునన కూతుర్ని చూస్తూ లలిత తృప్తిగా నిట్టూర్చింది.

‘‘ పెదవుల మీద చిరునవ్వు. గొంతుకు మార్దవం, కళ్ళల్లో కరుణ, గుండెల్లో నిజాయితీ, వేళ్ళకు ఒరిజినాలిటీ - ఇవే అందాన్నిచ్చేవి ఏ స్త్రీకయినా, రచయితకైనా’’

ఎప్పుడో ఎక్కడో చదివిన ఇంగ్లీషు సామెత లలిత మస్తిష్కంలో లీలగా కదిలింది.


*****

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి