మృత్యుంజయుడు

 

మృత్యుంజయుడు

-      అన్నపురెడ్డి ఇంద్రాణి

పక్షుల కిలకిల రావాలతో.. కోడిపుంజుల కూతలతో.. దూరంగా వున్న గుడినుండి వినిపిస్తున్న అమ్మవారి శ్లోకాలతో తూరుపు దిక్కున ఉదయభానుడు తన లేలేత కిరణాలతో ఆ ఇంటిని, ఆ ఊరిని తట్టిలేపుతున్నాడు. ప్రాతఃకాల కాంతులు సుబ్రహ్మణ్యం ఇల్లు బంగారు వర్ణంతో మెరిసిపోతోంది. ఆ ఇంటి ఇల్లాలు గాయత్రి వేస్తున్న ధూపం వాతావరణాన్ని పవిత్రమయం చేస్తోంది.

గాయత్రి పూజ గదిలోంచి దేవుళ్ళని స్మరించుకుంటూ హాల్లోకి వచ్చి దేవుళ్ళ ఫోటోలకి సాంబ్రాణి వేసింది. తన కొడుకు సిద్ధార్థ ఇంకా నిద్రలేవలేదని గ్రహించిన ఆమె కొడుకు బెడ్ రూంలోకి వెళ్ళి అతని చెవిపట్టుకొని హాల్లోకి తీసుకొచ్చి మొహంమీద సాంబ్రాణి పొగవేసి దేవుళ్ళకి దణ్ణం పెట్టిస్తుంది. సిద్ధార్థ మగత నిద్రలో తల్లి చెప్పినట్లే చేస్తాడు. అదే సమయానికి బయటి నుండి చేతిలో న్యూస్ పేపర్ పట్టుకొని హాల్లోకి వచ్చిన సుబ్రహ్మణ్యం తన భార్య గాయత్రి తనని కూడా సాంబ్రాణి పొగకి బలి చేస్తుందని భయపడి బయటికి పరుగుతీశాడు. భర్త బయటికి వెళ్ళటాన్ని గమనించని గాయత్రి తన భర్తకోసం వారి బెడ్ రూంలోకి వెళ్ళింది. భార్య హాల్లో కనిపించకపోవటంతో ఆమె పూజ గదిలోకి వెళ్ళిందనుకున్న సుబ్రహ్మణ్యం హుషారుగా ఈలవేసుకుంటూ హాల్లోకి వచ్చాడు. సుబ్రహ్మణ్యం బెడ్రూంలో లేకపోవటంతో బయటి నుండి భర్త ఈల విని హాల్లోకి వచ్చింది. భార్యని చూసి షాక్ అయ్యాడు సుబ్రహ్మణ్యం. భర్తని చూసి సంతృప్తిగా నవ్వింది గాయత్రి. వీరిద్దరి పరిస్థితీ చూసి తనలో తనే నవ్వుకున్నాడు సిద్ధార్థ. గాయత్రి తన భర్తకి ధూపం వేసి దేవుడికి దండం పెట్టుకోమని కళ్ళతోనే ఆజ్ఞాపించింది. సుబ్రహ్మణ్యం వద్దన్నట్లుగా కళ్ళతోనే ప్రాధేయపడుతూ తలూపాడు.. గాయత్రి తప్పదన్నట్లుగా కళ్ళతోనే ఆజ్ఞాపించింది. చేసేదేంలేక సుబ్రహ్మణ్యం దండం పెట్టుకుని చాలా అన్నట్లుగా చూశాడు.. గాయత్రి నవ్వుతూ భర్త బుగ్గల్ని ప్రేమగా గిల్లుతూ నవ్వుకుంటూ లోనికి వెళ్ళిపోయింది.. సిద్ధార్థ పకపకా నవ్వేశాడు.

ఇది వారింట్లో కొత్తేంకాదు. ప్రతిరోజూ జరిగేతంతే.. తండ్రీ కొడుకులకి ఈ సాంబ్రాణి ధూపం అనేది పెద్ద టార్చర్ లా అనిపిస్తోంది. ఎలాగైనా దీనినుండి బయటపడాలని వారు రకరకాలుగా ప్లాన్స్ వేస్తునే వున్నారు. కానీ ఏ రోజూ కూడా వారి ప్లాన్స్ భక్తురాలైన గాయత్రి ముందు పారలేదు.

సిద్దార్థ డాక్టర్ చదువుకున్నాడు. ఇంకొన్ని రోజుల్లో కాన్వొకేషన్లో సర్టిఫికేట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. కొడుకుతో ఎలాగైనా పెద్ద హాస్పిటల్ పెట్టించాలనీ, బాగా డబ్బులు సంపాదించాలన్నది సుబ్రహ్మణ్యం ఆలోచన. ఈ విషయంలో ఎప్పుడూ సుబ్రహ్మణ్యం ఇంట్లో అతని మేనమామ బ్రహ్మయ్యతో వాదన జరుగుతునే వుంటుంది. ఈ వాదన తారాస్థాయికి చేరే సమయంలో గాయత్రి కలుగ చేసుకొని తన భర్త సుబ్రహ్మణ్యాన్నీ, అతని మేనమామ బ్రహ్మయ్యనీ సర్దుతుంది. అప్పటికి ఆ గొడవని సద్దుమనిగేలా చేస్తుంది.

ఎప్పుడు చూసినా సుబ్రహ్మణ్యం బ్రహ్మయ్యని చులకనగా చూస్తుంటాడు. కొన్నిసార్లు అతనిమీద ఇండైరెక్ట్ గానూ, డైరెక్టుగానూ సెటైర్లు వేస్తుంటాడు. దానికి తగినట్లే బ్రహ్మయ్య కూడా సుబ్రహ్మణ్యానికి కౌంటర్లు ఇస్తుంటాడు. బ్రహ్మయ్య ఒంటరి జీవి. ఆయన కొడుకులూ కూతుళ్ళు ఉద్యోగాలు వ్యాపారాలకోసం ఎక్కడెక్కడో సెటిల్ అయ్యారు. దానితో ఆయన కాఫీలు, టిఫిన్లూ , భోజనాలంటూ తనింటిమీద పడి దోచుకుతింటున్నాడని సుబ్రహ్మణ్యం ఉద్దేశం.

అసలు విషయం ఏంటంటే సుబ్రహ్మణ్యం పుట్టగానే తల్లితండ్రులు చనిపోతారు. బ్రహ్మయ్యే తన మేనల్లుడ్ని గారాబంగా పెంచాడు. అనాధ అయినా ఎంతో సంప్రదాయబద్ధంగా నడుచుకునే గాయత్రినిచ్చి పెళ్ళి చేస్తాడు. పెంచిన ప్రేమ దగ్గరగా వున్న ఒకేఒక్క రక్త సంబంధం.. పైగా పక్కపక్క ఇళ్ళు కావటంతో రోజుకు నాలుగైదుసార్లు వచ్చి పలకరించి వెళుతుంటాడు బ్రహ్మయ్య. సహజంగానే మంచి వ్యక్తి అయిన గాయత్రి తన భర్తపట్ల బ్రహ్మయ్య చూపించే ప్రేమకీ, బాధ్యతకీ ఆమె కృతజ్ఞతగా అతనికి టైంటు టై అన్నీ వడ్డిస్తుంటుంది.

ప్రతి సారీ గాయత్రి బ్రహ్మయ్యతో ‘‘ బాబాయ్ నువ్వూ మాతోనే వుండచ్చు కదా.. అన్ని సార్లూ ఈ ఇంటికీ, ఆ ఇంటికీ తిరుగుతుంటావ్..’’

దానికి బ్రహ్మయ్య.. ‘‘ చూడమ్మా.. అది నేను పుట్టి పెరిగిన ఇల్లు. నా వంట్లో ప్రాణమున్నంతవరకూ ఆ ఇంటిని వదల్లేను. వేరే వాళ్ళని ఆ ఇంట్లో వుండనివ్వలేను. పోనీ అక్కడే వుందామంటే నీ మొగుడు వెధవ.. వాడ్నీచేతుల్లో పెంచాను కదా.. చూడకుండా వుండలేను. వీడు గుర్తొచ్చినప్పడు వస్తాను. ఇల్లు గుర్తొచ్చినప్పుడు అక్కడికి వెల్తాను. నువ్వు చాదస్తమనుకున్నా అంతే... ’’ అంటాడు నవ్వేస్తూ...

బ్రహ్మయ్య మాటలు కూడా నిజమనే అనిపిస్తుంది గాయత్రికి..

కానీ స్వార్థాన్ని తన ఒళ్ళంతా నింపేసుకున్న సుబ్రహ్మణ్యం బ్రహ్మయ్య రాకని చూసి తట్టుకోలేక అతన్ని ఇండైరెక్టుగా, ఒక్కోసారి డైరెక్టుగా కూడా ఏదో ఒక అవాకులూ, చవాకులూ పేలుతుంటాడు. చినక్నప్పటి నుండీ పెంచిన తన మేనల్లుడి మనస్తత్వం తెలిసిన బ్రహ్మయ్య ఏమాత్రం బాధపడకుండా.. తొణక్కుండా గట్టిగా తన చేతికర్రతో వాగ్దాటితో బదులిస్తుంటాడు. రోజూ సుబ్రహ్మణ్యం ఇంట్లో జరిగే తంతుల్లో ఇదీ ఒకటి.

రోజూలాగే ఆ రోజు కూడా బ్రహ్మయ్య మేనల్లుడి కుటుంబాన్ని పలకరించాలని వారింటికి వచ్చాడు. అప్పుడు సిద్దార్థ ఇంట్లోనే వున్నాడు. సిద్ధార్థని పలకరిస్తూ..

‘‘ ఏరా డాక్టరూ... ఎప్పటి నుండి ప్రాక్టీసు మొదలు పెడతావు. మీ నాన్న నీమీద బోలెడు ఆశలు పెట్టుకున్నాడు.. నీతో పెద్ద హాస్పిటల్ కట్టించాలనీ, లక్షలు లక్షలు డబ్బులు కూడబెట్టాలనీ.. ’’ అంటూ మేనల్లుడ్ని దెప్పుతుండగా...

‘‘ తాతయ్యా... కాన్వొకేషన్ అవ్వగానే నాకు సర్టిఫికేట్ వస్తుంది. తర్వాత జూనియర్ డాక్టర్ గా పెద్ద డాక్టర్ దగ్గర రెండేళ్ళయినా చెయ్యాలి. ఆ తర్వాత నేను గిరిజన ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పేదవారికి సేవ చెయ్యాలనుకుంటున్నాను’’ అని సిద్దార్థ చెప్పాడు.

కొడుకు నోట్లోంచి ఆ మాట వచ్చిందో లేదో అంతెత్తున ఎగిరి పడ్డాడు సుబ్రహ్మణ్యం.

‘‘ నీకిదేం పాడుబుద్ధిరా.. ఉచితంగా సేవ చేసి మేల్ మదర్ థెరిస్సా అనిపించుకోవాలనుకుంటున్నావా? ’’ అన్నాడు సుబ్రహ్మణ్యం.

‘‘ థెరిస్సా పేరు కోసం సేవ ప్రారంభించలేదు. సేవ చేసింది కాబట్టే పేరొచ్చింది. అయినా ఆమెలో వున్న సేవాదృక్ఫదాన్ని ఆదర్శంగా తీసుకున్నానే తప్ప డబ్బులు రోగి శరీరంతో డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశం నాకు లేదు. ప్రతి మనిషి జీవితంలో కొన్ని అడుగులైనా ఆమె నడిచిన బాటలో నడవ గలిగితే ఈ ప్రపంచంలో ఆర్తుల ఆక్రందనలు వినిపించవు, అకాల మరణాలు కనిపించవు.’’ అన్నాడు సిద్దార్థ తన నిర్ణయాన్ని చెబుతూ...

సిద్దార్థ నిర్ణయాన్ని బ్రహ్మయ్య సమర్థించాడు. సుబ్రహ్మణ్యం వ్యతిరేకించాడు. బ్రహ్మయ్య తన చేతికర్రతో మేనల్లుడికి సమాధానమిచ్చాడు. సుబ్రహ్మణ్యం చేసేదేం లేక అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

----

బ్రహ్మయ్య తన కొడుకుల దగ్గరికి వెళ్ళాడు. ఆరోజు రాత్రి అనుకోకుండా సుబ్రహ్మణ్యానికి మైల్డ్ స్టోక్ వచ్చింది. దీంతో అతన్ని సిద్ధార్థ, గాయత్రిలు హాస్పిటల్లో చేర్పించారు. హాస్పటల్లో తన సీనియర్ డాక్టర్లతో మాట్లాడి సిద్దార్థ తక్కువ ఖర్చుతో సుబ్రహ్మణ్యాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. ఊరినుంచి వచ్చిన బ్రహ్మయ్యకి విషయం తెలిసి సుబ్రహ్మణ్యాన్ని చూడ్డానికి ఇంటికొచ్చాడు. వస్తూనే చిందులేశాడు. సుబ్రహ్మణ్యం తన మేనమామని పట్టుకొని భోరుమన్నాడు. సుబ్రహ్మణ్యం ధైర్యం చెప్పాడు. తనకి విషయం తెలిస్తే వచ్చే వాడిని కదాని అంటూ గాయత్రిమీద, సిద్దార్థమీద కేకలేశాడు. కాసేపటికి నిదానించి ట్రీట్మెంట్ విషయంలో సిద్దార్థ తీసుకున్న చొరవని గుర్తించి సిద్దార్థని అభినందిస్తాడు.

-----

సిద్దార్థ కాన్వొకేషన్ కి వెళ్ళాడు. ఇంట్లో గాయత్రి తన భర్త సుబ్రహ్మణ్యానికి సేవలు చేస్తోంది. బ్రహ్మయ్య దగ్గరుండి మేనల్లుడి మంచి చెడ్డలు చూసుకుంటూ వున్నాడు. అదే సమయంలో కాన్వొకేషన్ నుంచి పట్టా అందుకున్న సిద్దార్థ తల్లిదండ్రులకి ఫోన్చేసి విషయం చెప్పాడు. బ్రహ్మయ్య కూడా ఆనందించాడు.  తను నేరుగా ఇంటికి వస్తున్నానని చెప్పాడు సిద్ధార్థ. తమ కొడుకు డాక్టర్ అయ్యాడన్న ఆనందంలో సెలబ్రేషన్ చేసుకుంటూ వున్నారు.  తన కొడుకుతో పెద్ద ఆసుపత్రి పెట్టించినట్లూ, లక్షలు లక్షలు డబ్బులు సంపాదించినట్లూ ఊహించుకుంటాడు సుబ్రహ్మణ్యం. అదే సమయంలో సిద్ధార్థ రోడ్డు యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడని వార్త వారికి తెలిసింది. అంతే వారి ఆశలన్నీ నీరుకారిపోయాయి. కొడుకు పోయిన బాధ గుండెల్ని కలచివేసింది. ఎంతో భవిష్యత్తుందనుకున్న కొడుకు అలా అయిపోయాడని తలచుకొని తలచుకొని గాయత్రి కన్నీరు మున్నీరైంది. తన ఆశలన్నీ కూలిపోయేసరికి సుబ్రహ్మణ్యం పిచ్చి వాడైపోయాడు.

-----

కొన్ని రోజులు దొర్లిపోయాయి. ఒక రోజు కొడుకు బ్రతికే వున్నాడన్న భ్రమతో సిద్ధార్థని ఇంటికి తీసుకొస్తానంటూ మతిస్థిమితాన్ని కోల్పోయిన సుబ్రహ్మణ్యం ఆవేశంగా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. తను ఎటువెళ్ళాడో ఏంటో ఎవ్వరికీ తెలీదు. అతనే వస్తాడులే అని బ్రహ్మయ్య, గాయత్రిలు ఎదురు చూస్తున్నారు. కానీ అతను రాలేదు.. కొన్నాళ్ళు గడిచిపోయాయి.. గాయత్రికి తను ఎవరి కోసం బ్రతుకుతుందో... ఎందుకు బ్రతుకుతోందో అర్థంకాని పరిస్థితికి చేరుకుంది. నిద్రపట్టటంలేదంటే డాక్టరు ఇచ్చిన నిద్రమాత్రలు మింగి ప్రాణాలు తీసుకోవాలనుకుంది.. అంతలోనే నలుగురు వ్యక్తుల్ని తీసుకొచ్చాడు బ్రహ్మయ్య.. వారిని ఆశ్చర్యంగా చూస్తున్న గాయత్రితో వారిని వారు పరిచయం చేసుకున్నారు. సిద్దార్థ చనిపోయే సమయంలో తమకి అవయవ దానం చేశాడనీ. అనాధలైన తమకు ఆ అవయవదానం వల్లనేనేమో అమ్మ చేతివంట తినాలనీ, అమ్మతో గడపాలనీ అనిపిస్తోందనీ, తమకి ఆపరేషన్ చేసిన డాక్టర్ ని సంపాదిస్తే ఈ అడ్రసు ఇచ్చాడని వారు చెప్పటంతో గాయత్రి గుండె కరిగింది. అప్పుడు బ్రహ్మయ్య గాయత్రితో...

‘‘ ఆ దేవుడు మీ ఒక్కగానొక్క కొడుకుని తీసుకు పోయి మీకింత గర్భశోకం కలిగించాడంటే దీనివెనక మీకు మరో నలుగురు కొడుకులనివ్వాలన్న పరమార్ధముంది. సిద్ధార్థ దూరమైనా ఈ నలుగురి రూపంలో బ్రతికే వున్నాడనీ, సిద్దార్థ మృత్యుంజయుడనీ’’ చెప్పాడు.

దీంతో గాయత్రి ఆ నలుగురిలో తన కొడుకుని చూసుకోవాలని నిర్ణయించుకుంది. ఇంటినుంచి వెళ్ళిపోయిన సుబ్రహ్మణ్యాన్ని వెతికి తీసుకొస్తామని నలుగురూ చెప్పటంతో గాయత్రి ఊపిరి పీల్చుకుంది.

-------

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి