కబీరు దోహాలు 31‌-45

31.బండరాతి యందు భగవంతు డుండిన

    కొండ దరికి చేరి కొలువ వచ్చు

    విత్తు పిండి జేయు సత్తువ గల దంచు

    తిరుగలిని కొలిచెదు తీరుమేలు.


32. ప్రాణభయము తోడ ప్రాకులాడినపుడు

    తనువు గోలుపోవు తధ్యమిద్ది

    కత్తిరించ పెరుగు వత్తి వెలుగు వోలె

    వెరపు వీడి పోవ విజయుడగును.


33. నలువ రాతలొకట నమలు పరచవచ్చు

    ఒకరు మారవచ్చు నుర్వికాని

    ఎరుక పరచగలడు గురువు తలచినట్లు

    గురువు కన్న భువిని గొప్పలేదు


34.నేత్ర యుగ్మమందు నేరుగా జేరుము

    కప్పియుంతు స్వామి కనులు మూసి

    కాంచనీను ఇరుల కాంచనెవ్వరి నేను

    దాచు కొందు పెన్నిధాన మటుల


35.కాంతపైన ఆశ కనకమ్ముపై నాశ

    ఉండ నట్టి ఉత్తమోత్తముడెవ

    డట్టి సాధు జనున కంజలి ఘటియించి

    పాద రేణువగుచు బరగువాడ


36.చావ దలచి తేని చచ్చిపోవుటె మేలు

    వెతల కాపురాన వేగలేక

    అను దినమ్ము తాను అంతమొదుట కన్న

    ముక్తి నొసగు చావె యుక్త మగును


37. అంకుశాగ్రమందు ఆవాస మెవడుండు?

    గరళ మయిన మ్రింగు ఘటికుడెవడు?

    జాగరూకు డగుచు చరియించు నెవ్వడు?

    మరణ మట్టి వాని దరికి రాదు

38. బాటలోన జనుచు పడిపోయినట్లైన

    దోషముండ దతని త్రోవ తరుగు

    కూరుచున్న వాడు క్రోసుల దూరమ్ము

    నడువ వలసి యుండు ననె కబీరు


39.సిద్ధమైత్రి నేను చెడ్డవారి వెదక

    దొరకడయ్యె నాకు దుష్టుడెవడు

    అంతరాత్మ నడుగ అర్థమయ్యెను నాకు

    ఎన్న దుష్టుడెవడు? నన్ను మించి


40. శీల వంతు పోల్చి చెప్పవలయు నన్న

    తుల్యమొండు నీకు తోచ గలదె?

    వల్ల మాలినంత ముల్లోక సంపద

    సాటి రాదు శీల సంపదకును


41. సాహసించి దూకు సంద్రమందెవ్వాడు

    అద్వితీయ మణుల నతడు పొందు

    పాలు మాలినంత ఫలమేమి యుండదు

    వీడ వలయు వెరపు విజయ మొంద


42. కాని పనుల కొరకు కాలయాపనె గాని

    దైవ నిర్ణయంబు దాట నగునె?

    బుతువు రాక చెట్లు ఇచ్చునే ఫలముల

    ఎన్ని నీళ్ళు పోసి యున్నగాని


43. సహజ లక్షణంబె చక్కనంబారిగా

    జ్ఞాన గజము నెక్కి జ్ఞాని సాగ

    ఉబుసు పోని జనులు ఊరకుక్కల వోలె

    వెంట పోవ, నేమి వెలితి యగును?


44.పైడి యగును యినుము పరసు వేదిని తాకి

    పామరుండు మారు భక్తి తగిలి

    ధ్యాన మహిమ జనుల ధన్యుల జేయును

    భక్తి మార్గమందె ముక్తి దొరకు


45.ఫలము లొసగు తరులు పరుల తిండి కొరకె

    పారు చుండు నదుల పరుల కొరకె

    పరుల సేవ యందె పరమార్ధమును గాంచు

    సాధు జనుల కిదియె సహజ గుణము

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి