శివలీలలు 13

నరసింగనాయనారు కథ

‘‘నరసింగనాయనారు’’ అనే కథను, ‘‘చిరుతొండడి’’కి పరమశివుడు చెప్పెను. నరసింగనాయనారనే రాజు చోడదేశమును పరిపాలించుచుండెను. ఆయన భార్య ఒకరోజు ఆ ఊరియందున్న శివాలయమునకు శివపూజచేయుట కొరకై బయలుదేరినది. ఒక బుట్టనిండా పరమేశ్వరుని పూజించుటకు కావలసిన సురభిళ పుష్పములను తీసుకొని వెళ్లుచుండగా ఆమెకి ముచ్చటని పెంచి పూజ కొరకై తీసుకొని వెళ్లు పూల బుట్టనుంచి సువాసనగల పుష్సమొక దానిని తీసుకొని దానిని వాసన చూసెను. ఆ వాసనకు శరీరము మైమరచిపోవునట్లుగా ఆనందమును పొందుచూ ఆలయ సమీపమునకు వెళ్లుచుండినది. ఈమె శివుని పూజించుటకై తీసుకొని వచ్చు పుష్పములలో ఒక పుష్పమునందు దాగిన సుగంధమును ఆఘ్రాణించుటచే ఆ దేవాలయ పూజారి కుమారునకు తీవ్రమైన కోపం వచ్చి, ఈమె తీవ్రమైన అపరాధము చేసినది అని భావించి తన చేతియందున్న ఒక చాకుతో పట్టపురాణియొక్క ముక్కును కోసివేసెను. ఈ సంగతి తెలిసిన చోడరాజు వెంటనే ఆ దేవాలయ ప్రాంతమునకు వచ్చెను. అక్కడున్న పరివారం రాజుకు నమస్కరించి జరిగిన విషయంను విన్నవించెను. రాణీగారి చెలికత్తె ఇట్లు పల్కెను. ఓప్రభూ! ఈమె తప్పేమీలేదు. ఆలయంలో పూజ చేయుటకు వెళుతూ ఒక పువ్వునుచేతిలోనికి తీసుకొని వాసన చూసినది. ఇంతలో ఈ పూజారి కుమారుడు లింగపూజకోసం ఉద్దేశించిన చెంగల్వపూవును వాసనచూడటం ఎంత అపరాధం అంటూ మహారాణి యొక్క ముక్కును కోసివేసెను అని.

అంతట రాజుగారు ఈ పూజారి ఎంతపనిచేశాడు! అని పలుకుచూ పూజారి కొడుకును పిలిపించెను. ఏమయ్యా నీ భక్తి పాడైనట్లేఉంది. నీ జ్ఞానమేమైనది. ఎంత అవివేకివినీవు. పువ్వు ముట్టుకున్న చెయ్యిని వదిలేసి వాసన మాత్రము చూసిన ముక్కు కోస్తావా! నీతెలివి తెల్లవారినట్లే ఉన్నది. ఆచెయ్యిని కోసిన తర్వాత కదా ముక్కును కోయవలసినది. ఇప్పుడు నిన్ను నేనేమంటే ప్రయోజనముంది? ఈ మాత్రం విచక్షణ నీకు లేకపోయినది అని, రాణిని తన ముందుకు తీసుకుని రావలసిందిగా ఆజ్ఞాపించెను రాజు. అప్పుడు స్వయముగా తానే కత్తి తీసుకొని ఇటుపై తెలియకుండా మదమెక్కి శివపూజార్థం తీసుకుని వెళ్లు పూలను వాసనచూచుటయా? ఏమీ? పరమశివునియందు అంతా అవివేకపు భక్తా? చెయ్యి చాచు అని, ఆజ్ఞాపించి ముందు ఆ పువ్వును పట్టుకొని వేళ్లను మొదలంట నరికివేసెను. పువ్వుపట్టుకోవటానికి వంచిన మణికట్టును నరకెను. మణికట్టు కిందకు వంచుటకు సహకరించిన మోచేయిని తెగగొట్టెను.దానికాధారమైన చేయిని కూడా నరకబోవుచుండగా నేను ప్రత్యక్షమై ఆమె చేయిని ఖండిచిన భాగములన్నింటిని అనుగ్రహించితిని. ముక్కుని కూడా ఆమెకు ప్రసాదించితిని. 

మహారాజునకు నా సన్నిధిలో సామీప్య ముక్తినిచ్చితినని నరసింగనయానారు కథ చెప్పెను.

ఈకథయందు భగవంతుని విషయమున రాజులైనను సామాన్య ప్రజలైనను శిక్షను పొందుటకు అర్హులని తెలియబడుచున్నది. భగంతునికి అపరాధముచేసినయెడల శిక్షించుటకు కేవలం రాజు మాత్రమే అర్హుడుకాడు. భక్తులందరూ కూడా శిక్షించుటకు కూడా అర్హులని ఈ కథాంశము తెలియజెప్పుచుకున్నది. 

సామాజిక నిర్మాణంలో భక్తి అనునది ఒక క్రమమైన వ్యవస్థను తయారు చేయుటకు ఉపయోగ పడునదిగా మనకిందు దృగ్గోచరమవుచున్నది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి