అనుబంధాలు
‘I take the privilege of announcing national level women open chess tournament results ….. Third prize goes to anu agarvaal , second prize goes to semen dastaani..and
First prize goes to saahiti …. Give her a big hand…….’
క్రిక్కిరిసిన హాల్ లోని జనాలు పాత్రికేయులందరి కరతాళ ధ్వనుల మధ్య వేదిక ఎక్కి అందరికీ నమస్కరించాను. నా కళ్ళ
ముందు ఈ రోజుకై ఎదురు చూసిన నాన్న
దీవిస్తూ కనబడ్డాడు. కళ్ళు మసక బారాయి.
మామయ్యా గుర్తు వచ్చాడు. ఇది తీసుకెళ్ళి నాన్న పటం ముందు పెట్టాక మామయ్యకే
ఇవ్వాలి. ఎంత సంతోష పడతాడో... ఆ కళ్ళల్లో ఎంత గర్వం ఉంటుందో... వాళ్ళు సాధించ
లేనిది నేను సాధించి నందుకు ఎంత మందికి ఎన్ని రకాలుగా చెబుతారో... గౌరవ అతిధులు ,
మంత్రివరేన్యుల చేతుల నుండి ఆగకుండా
మోగుతున్న చప్పట్ల మధ్య మెడల్ , జ్ఞాపిక షాల్ సత్కారం స్వీకరించాను . నా స్పందన
కోసం మైక్ నాకిచ్చారు. అందరూ ఆత్రుతగా చూస్తున్నారు.
‘సభా
సరస్వతికి మనసా శిరసా వందనం... నా ఈ ప్రస్తానం లో సహకరించిన ప్రతి ఒక్కరికీ
ధన్యవాదాలు. చిన్నప్పుడు మా నాన్న, మామయ్యా ఆడుకుంటుంటే ఎంతో ఆసక్తి గా
గమనించేదాన్ని...
అయినా
నాకప్పుడు అర్ధం కాలేదు... పేదకుటుంబం కావడంతో ఎవరూ ఆ వైపు ప్రోత్సహించలేదు.
నేను
చదివిన,స్కూల్ , కాలేజీ ఎందులో కూడా ఆడలేదు. పెళ్ళయ్యాక ఆఫీసులో క్లబ్ డే లలో ఆడి బహుమతులు తెచ్చుకున్నప్పుడు
మా వారు నా ఇష్టాన్ని చూసి ప్రోత్సహించడం తో అప్పుడు చెప్పా మామయ్యకి , నాన్న కి ‘నాకు
చెస్ అంటే ఇష్టం’ అని. వాళ్ళు నేను సాధించిన బహుమతులకు ఆశ్చర్య పోయి ,ఇంతవరకు
గమనించనందుకు బాధ పడి , ఇప్పుడయినా ఫర్వాలేదని మెళకువలు నేర్పారు. ఇన్నిరోజులు తాము గుర్తించనందుకు
వాళ్ళు బాధ పడ్డా, వాళ్ళు ఎంత సాధించాలనుకున్నా సాధించలేక పోయిన, నేషనల్ టైటిల్
నేను సాధించాలని ఎంతో ప్రోత్సహించారు. ఈ రోజు సాధించేసరికి నాన్న లేకుండా పోవడం
బాధగానే ఉన్నా, నా ఈ విజయం చదరంగం లో ఓనమాలు
నేర్పించిన నాన్నకు, మామయ్య కు అంకిత
మిస్తున్నా...’ అప్పటికే నా కళ్ళు సజలం కావడంతో మరి మాట్లాడలేక పోయాను.
ఆ తర్వాత నా ఇంటర్వ్యు లాంటి వన్నీ తీసుకున్నారు...
అప్పటి వరకు దూరంగా ఉండి ఫోటోలు వీడియోలు తీస్తున్న మా వారు నా దగ్గరకు వచ్చి ,’ సతీ
..అప్పటి నుండి మీ అమ్మ నీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది.. లెట్ అస్ మూవ్
ఫస్ట్...’ అన్నారు నా చేయి పట్టుకుని వేగంగా బయటకు నడుస్తూ ..నాకు అభినందనలు
తెలుపడానికి అని అనుకున్నానే గాని, మరి కొద్ది క్షణాల్లో ఘోరమైన వార్త వినాల్సి
వస్తుందని ఆ క్షణం నాకు తెలీదు. అందరూ సాహితీ అన్నా ఆయన మొదటి నుండే ‘సతీ’ అని
పిలవడం అలవాటు.
టాక్సీ లో కూర్చోగానే అమ్మ ఫోన్...’అమ్మా....
నిజంగా ఎంత బాగా జరిగిందో తెల్సా... నిజంగా నాన్న ఉంటె ఎంత సంతోషించేవాడో....
పోనీలే.... మామయ్య అయినా సంతోషిస్తాడు...’ కళ్ళల్లో నీళ్ళు ఖర్చిఫ్ తో తుడుచుకుంటూ
అన్నాను అమ్మ మాట్లాడబోతున్నది గమనించకుండా .
‘చిట్టీ....
అర్జెంట్ గా రా.... మామయ్యకు చాలా సీరియస్ గా ఉంది....’ అమ్మ కంఠం లో జీర, వణుకు
స్పష్టంగా తెలుస్తోంది... మనసెందుకో కీడు శంకించింది.
‘అమ్మా...
అమ్మా.. ఏమయ్యింది... అప్పుడెప్పుడో కొంచెం ఆరోగ్యం బాలేదు అన్నారు... చూద్దామని
ఎప్పుడు అనుకున్నా వీలవలేదు... ఫోన్ లో మాట్లాడా.... ఇప్పుడు ఏమయ్యింది..
ప్రాబ్లం ఏమీ లేదు కదా ... ఎనీథింగ్
సీరియస్...’ అంటుంటే నా గొంతు వణికింది.
‘ఎం
లేదు ..నువ్వు త్వరగా రా ..’ పొడి పొడిగా అని పెట్టేసింది... ఇంతక ముందు వరకు ఉన్న
సంతోషం నిప్పులపై నీళ్ళు చల్లినట్లు చప్పున ఆరి పోయింది. మనస్సు గతం లోకి వెళ్ళిపోయింది.
.
నాన్న ఆర్ యం పీ డాక్టర్... మామయ్య
ఆర్ టీ సి లో కండక్టర్ గా పనిచేసేవాడు. కాని
ఇద్దరూ విపరీతంగా పుస్తకాలు చదివేవారు ...
ప్రతీ
ఆదివారం ఇద్దరూ కల్సి చదరంగం ఆడేవారు... తనకు ఇద్దరితో చాలా మాలిమి కావడంతో
వాళ్ళిద్దరూ చుట్టూ పరిసరాలు మర్చి ఆడుతుంటే అక్కడే వాళ్ళ పక్కన కూర్చుని ఎంతో
ఇష్టంగా గమనించేదాన్ని. ఒకసారి ఆడిన ఆట
మరోసారి రాకుండా చిత్ర విచిత్రంగా పావులని కదుపుతున్నవారిని చూస్తుంటే ఆ ఆట కనుక్కున్నవారి తెలివి అమోఘం అనిపించేది. వారు
ఆడిన ఆట గురించి ఆట అయిపోయాక ,’గుర్రంతో భలే
ఇబ్బంది పెట్టావు బావా ....’
’నేను
అసలు ముందు ఈ పావు ఇలా కదపకుండా ఉండాల్సింది హరీ ’
‘అస్సలు
నా ఏనుగుపై కన్నేసిన నీ ఒంటేని ముందే
తినేయ్యకుండా తప్పు పని చేశా’ లాంటి మాటలు నాలో ఉత్సుకత రేకెత్తించేవి ...
కేవలం ఈ ఆట తోనే కాక పెద్ద మామయ్య నాతొ
కాలేజీ కి వచ్చాక రచనల గురించి , రచయితల గురించి చాలా చర్చించేవాడు. ఆయన
ప్రోద్భలంతో నేను కూడా అప్పుడు మా ఇంటి నుండి రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న
లైబ్రరీ లో మెంబర్ షిప్ తీసుకున్నాను. అందరూ నెలయినా పుస్తకాలు వాపస్ ఇవ్వక
పోయేవారు. కాని నేను,మామయ్యా మాత్రం
వారానికి రెండు పుస్తకాలు తీసుకుని ఒకరివి ఒకరం ఇచ్చి పుచ్చుకుని చదివి మరీ ఇచ్చేవాళ్ళం. ప్రతీ రాఖీ పౌర్ణమి కి అమ్మ రాఖీ కట్టడానికి
వెళ్ళినపుడు తను వెంట వెళ్ళేది. పేద కుటుంబమే అయినా తప్పక చీర పెట్టేవాడు. ‘అంత
ఖర్చు ఎందుకు అన్నా... నువ్వు మంచిగా ఉంటె అంతే చాలు ‘ అనేది అమ్మ. ‘డబ్బులు
ఇవ్వాళ ఉండి రేపు పోతాయి కాని బంధాలే శాశ్వతమే... నా శ్రేయస్సు కోరుతూ అంత దూరం
నుండి వచ్చిన నీకు కనీసం నా అభిమానాన్ని ఈ
విధంగా నైనా తెలుపనివ్వు’ అనేవాడు నవ్వుతూ .
ఆలోచనల మధ్య కారు గమ్యం చేరింది. అల్లంత
దూరం ఉండగానే మామయ్య ఇంటి ముందు కనిపించిన షామియానా నన్ను అయోమయంలో
ముంచెత్తింది...
’ఏమిటండీ
ఇది.....’ నోట్లో మాట నోట్లో ఉండగానే.... ’బాధ
పడకు ... ఆయనకు అప్పటి నుండే ఆరోగ్యం బాలేదు... కాని అయినా ఇంతదూరం వస్తుందను
కోలేదు...’ అంతా తెల్సిన ఆయన అంటున్న మాటలు నాకు ఏవీ చెవి కి ఎక్కడం లేదు . కళ్ళు రెండు శ్రావణ మేఘాలయ్యాయి. కారు తలుపు
తెరచుకుని కాలు బయట పెడుతూనే బయట కనబడ్డ కాలుతున్న కట్టెలు ఏమూలో మిణుకు మిణుకు
మంటున్న ఆశను ఆమూలాగ్రం తుడిపేసింది. నిజంగా ఈ బిజీ ప్రపంచం లో పడి మామయ్యను
చూడ్డానికి రాలేక పోయాను .. బంధాలు ముఖ్యం అని పదే పదే చెప్పే మామయ్య నాకు ప్రాణం
అని చెబుతూ ఆయన మాటలు మాత్రం గౌరవించలేకపోయాను... మనం తప్పు చేసినా కాలం మాత్రం ఎప్పుడూ
తప్పు చేయదు..తన పని తాను చేసుకు పోతుంది...నాలో ఉవ్వెత్తున ఎగసే దుఖ్ఖం
...లోపల అగ్ని పర్వతం బద్దలవుతోంది ...ఎవరు
కనబడితే వారిపై పడి ఏడవాలని ఉంది...
వీధి తలుపు నుండి లోనికి అడుగుపెట్టాను.
ఎదురుగా ఎదురయ్యాడు తమ్ముడు.... ఒక్క క్షణం కళ్ళు కలుసుకున్నాయి... నాలో దుఖ్ఖం
ఉప్పొంగుతోంది... వాడి కళ్ళూ ఎర్రగా ఉన్నాయి.
మరుక్షణం నన్ను తప్పుకుని పక్క
నుండి బయటకు వెళ్ళిపోయాడు. మనస్సు చివుక్కుమంది. ఏడుపు ఉదృతం అయ్యింది.
ఎదురుగా పెద్ద వాకిట్లో ఓ పక్కగా కింద చాపపై
పడుకోబెట్టారు. చుట్టూ అత్తమ్మ , అమ్మ, చిన్నమ్మలు, అక్క, చెల్లెలు, వాళ్ళ పిల్లలు
, బంధువులు అందరూ కూర్చుని ఉన్నారు. నన్ను
చూడగానే రోదనలు మిన్నంటాయి.
‘చిట్టీ..చిట్టీ
అని రోజోక్కసారయినా కలవరించేవాడు.... నువ్వు వస్తే నీకేం చెప్పేవాడో... నీ
కివ్వడానికి ఏవో ఏవో పుస్తకాలు దగ్గర పెట్టుకున్నాడు.... నీకు కడసారి చూపయినా
దక్కలేదు తల్లీ...’ గుండెలవిసేలా రోదిస్తుంది అత్తమ్మ.
‘
నాన్న లేకపోయినా మామయ్య ప్రేమలో మర్చిపోయేదానివి.... నీ మెడల్ చూపించడానికి వచ్చావా
తల్లీ ... ఆయన కోరిక తీర్చానని చెప్పడానికి వచ్చావా తల్లీ.... కాని నీ మాట విననంత
కానరాని లోకాలకు వెళ్ళాడమ్మా మీ మామయ్యా..’ అమ్మ కన్నీరు మున్నీరవుతోంది.
అలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి గుర్తు
చేస్తుంటే ఏడుస్తూ ఇన్ని రోజులు చూడడానికి
రాని నా దౌర్భాగ్యాన్ని తిట్టుకున్నాను.
నా కన్నీళ్ళు మామయ్యా పాదాలను అభిషేకిస్తున్నాయి.
కాస్సేపు అయ్యాక ఎవరో తాగడానికి నీళ్ళు
తెచ్చి ఇచ్చారు. అమ్మ తాగి అక్క కి , తను తాగి చిన్నమ్మకు , చిన్నమ్మ పక్కనే ఉన్న
నన్ను చూసినా , చూడనట్లు తల తిప్పుకుంటూ నా ముందు ఉన్న చెల్లికి ఇచ్చింది. బాధ
నిపించింది. అసలు అప్పటి వరకు చిన్నమ్మ పక్కనే ఉన్నదని చూడలేదు. కింద నేను
కూర్చున్న పక్క నున్న బందువు ఎవరో వెళ్లిపోవడంతో నేను తన పక్కకు వచ్చానని
అర్ధమయ్యింది. చెల్లి తాగి నాకిచ్చింది . నేను
తాగి నా పక్క నున్నవారికి అందిస్తూ ఉలిక్కి పడ్డాను. పక్క నున్నది ఎవరో కాదు అక్క
కూతురు సుమతి . పెళ్ళయ్యాక దాన్ని చూడడం అదే ప్రధమం . ముఖం తిప్పుకున్నాను. ఇదేం ఖర్మ రా భగవంతుడా... ఇలా మాట్లాడని
వారందరినీ ఒక్క చోట చేర్చి వినోదం చూస్తున్నావు.... అనుకున్నాను చిరాగ్గా...
అటు ఎప్పుడో ఏదో ఫంక్షన్ లో చిన్న మాట పట్టింపు లో
భేదాభిప్రాయాలు వచ్చి చిన్నమ్మ మాట్లాడ్డం లేదు. ఇటు నేను తిట్టిన సుమతి.
తర్వాత పెద్దమనుషులు తొందర పెట్టడంతో పాడె పైకి లేచింది. అందరి రోదనలు మిన్నంటాయి. అమ్మ,
అక్క, చెల్లెలు, నేను అక్క కూతురు సునంద, సుమతి వరసగా ఎలా కూర్చున్నవాళ్ళం అలాగే
నిలబడ్డాం. ఎడతెగని ఒక వలయంలా
ఉండడానికి ,ఏడుస్తూనే అమ్మ నడుం చుట్టూ
అక్క ఒక చేయివేసి మరో చేయి తన పక్క నున్న చెల్లెలు పై వేసింది, చెల్లెలు కూడా ఒక
చేయి అక్క నడుం పై వేసి మరో చేయి నా పై
వేసింది. నేను చెల్లె నడుం పై చేయి వేసి నా పక్క నున్న సుమతి పై వేయాలి. అది నాపై,
తన పక్క నున్న సునంద పై వేయాలి. కాని నేను
వేయలేదు. అంటే నా దగ్గర లైన్ తెగింది అన్న మాట . ఎందుకంటే సుమతి అక్క పెద్ద కూతురు
, పెళ్లి మొత్తం నిర్ణయించి ఎంగేజ్ మెంట్ అయ్యాక , చెప్పా పెట్టకుండా ఆ వీధి లోని కుర్రోనితో
లేచి పోయింది. అప్పుడు అక్క ఏడ్చినా ఏడుపు నా కింకా గుర్తే .... అల్లారు ముద్దుగా
చిన్నప్పటి నుండి పెంచుకున్న ప్రతీ విషయం గుర్తు చేసుకుంటూ
తర్వాత
మరో కూతురు పెళ్లి ఎలా జరుగుతుందని, సమాజంలో ఎలా తలెత్తుకు తిరిగేదని ,చావే శరణ్యం
అంటూ కంటికి మింటికి ఏకధారగా ఏడ్చింది... అప్పుడు నేను ఓదారుస్తూ, ‘అలాంటి కూతురు
లేదనుకో , ఎంతో ఇష్టంగా పతివ్రత అయిన సుమతి పేరు పెట్టావు.. దానికి
సిగ్గులేదు..అటువంటిది ఉన్నా ఒకటే , లేకున్నా ఒకటే’ అంటూ సుమతి ని తిడుతూ ధైర్యం చెప్పాను.. కాని చిత్రంగా తర్వాత కూతురు
జాడ తెల్సింది, అటు ఇటు ఫోన్ లలో మాట్లాడటాలు అప్పుడు ఇప్పుడు చాటుగా కల్సుకోవడాలు
జరిగి చివరకు బహిరంగం గానే తల్లిగారింటికి రాక పోకలు సాగుతున్నాయి. అయితే నేను
వారందరికీ కాస్త దూరంలో ఉన్నందున పెళ్ళయ్యాక విషయాలు అమ్మ, అక్క, చెల్లెలి ద్వారా తెలుస్తుండేవి.
అంతేకాని నేను సుమతి ని చూసింది లేదు. అలాగే మాట పట్టింపు నాతొ వస్తేనేం అమ్మ,
చిన్నమ్మ , అక్క, సుమతి అందరూ మాట్లాడు
కుంటారు.
ఇక నాన్న చనిపోయినప్పుడు నాన్న పై ఉన్న
బ్రాస్లేట్, ఉంగరాలతో ,మేము అక్కాచెల్లెళ్లము అందరం కల్సి అమ్మకు చేతులకు గాజులు చేయించామని
తమ్ముడికి కోపం. నాన్న ఉన్నంతవరకు
చేతినిండా రెండు డజన్ల గాజులతో, నుదిటిపై
రూపాయి కాసంత ఎర్రటి సిందూరంతో అలరారిన అమ్మ చేతులు బోసిగా ఉండకుండా బావుండాలని ,
నాన్న బంగారం అమ్మ కు గుర్తుగా ఉండాలని గాజులు చేయిస్తే , ‘ అమ్మ పోయాక అమ్మ మీది
సొమ్ము బిడ్డలకే కాబట్టి మీరు ప్లాన్ తో అలా చేయించారని’ గొడవ పెట్టాడు తమ్ముడు .
అసలు అంత ఘోరంగా కూడా ఆలోచిస్తారని తెలియని మేము నివ్వెరపోయాము. అలా అప్పుడయిన
గొడవ తో తమ్ముడికి మా అక్క చెల్లెళ్ళకు మధ్య మాటలు లేకుండా పోయాయి. నాన్న
పోవడంతోనే తల్లిగారిల్లు దూరం అయిందని
అందరం బాధ పడ్డాం . అప్పటి నుండి అప్పుడో
ఇప్పుడో అక్క, చెల్లి , నేను ఇలా మేమే అమ్మను
తెచ్చుకుని మా దగ్గర కొన్ని రోజులు ఉంచుకుని మళ్ళీ అమ్మ వాళ్ళింట్లో
వదిలేసేవాళ్ళం.
తర్వాత ఏదీ మన కోసం ఆగదు అన్నట్లు
కార్యక్రమం జరిగిపోయింది. ముందు రోజు రాత్రి చనిపోవడంతో , దహనం అయిన తెల్లవారి
మూడో రోజు కావడంతో పిట్టకు పెట్టడానికి అంత దూరం నుండి రాలేమని అందరం ఆగిపోయాం.
ఉన్నానే కాని ఎటు వెళ్ళినా అటు తమ్ముడో, ఇటు చిన్నమ్మో, అటు సుమతో తగులుతుండడం తో
నాకు చాలా చిరాగ్గా ఉంది.
అలా
మాట్లాడిని వాళ్ళందరి మధ్య నాకు ఊపిరి
ఆడనట్లు అనిపించింది. ఒక్కదాన్ని విడివడి
మామయ్య గదికి వెళ్లాను. చిన్న గదినే అయినా అరల్లో ఉన్న పుస్తకాలన్నీ ఆప్యాయంగా
పలకరించాయి. ఒక పుస్తకం చేతిలోకి తీసుకున్నాను. మామయ్య చేతి రాతలో ‘ఓం సాయిరాం ‘అని
రాసి ,తన పేరు రాసి, కొన్న తేదీ వేసాడు. మామయ్యా ఇంకు పెన్ను ఉపయోగించేవాడు.
ముత్యాల్లాంటి చేతిరాత ... కళ్ళకి నీటి తెర అడ్డం పడింది.
ముందు రాత్రి నిద్ర లేకపోవడంతో, ఏడ్చి ఏడ్చి అలసి ఉండడంతో అంతా గాఢ నిద్రలో ఉన్నారు. అమ్మ పక్కకు పడుకున్నా నన్న మాటే గాని నా కస్సలు నిద్ర పట్టడం లేదు. ఇంతలో పక్క నున్న గది నుండి చిన్నగా మాటలు వినబడుతున్నాయి.
‘ఇప్పుడేదో
గండం గట్టెక్కడానికి ఇరవై వేలు అప్పుతెచ్చాను
.... పది రోజుల వరకు కార్యక్రమాలన్నీ కావాలంటే మాత్రం చాలా కష్టమే.... ఎప్పటికి ఇచ్చే సే ట్ దగ్గరకు వెళితే ఏమీ తాకట్టు పెట్టకుండా ఇవ్వనన్నాడట...’
అది మామయ్యా కొడుకు సురేష్ గొంతు.
‘తాకట్టు
పెట్టడానికి ఏముంది... రిటైర్ అవగానే వచ్చిందికాస్తా చెల్లెలి పెళ్ళికి, ఆయన మందు లకే
సరిపాయే....ఎం చేస్తాం..ఇక ఉన్నది ఆయన కు ప్రాణమైన ఆయన జ్ఞాపకాలు ఉన్న ఈ ఇల్లే కదా....
ఇది
కూడా ఆయనతో పాటే పోయేలా రాసి పెట్టి ఉందేమో ... అదే పెట్టు. ప్రస్తుతానికి కార్యం నడవాలి కదా’ అత్తమ్మ
గొంతులో వద్దన్నా జీర..
దోబూచులాడుతున్న నిద్ర మొత్తానికే ఎగిరి
పోయింది. పొద్దుటే అమ్మమ్మ లేచి బీడీల ఆకు కత్తిరిస్తూ కూర్చుంటే, అమ్మతో పాటు
అప్పుడో ఇప్పుడో అమ్మమ్మ ఇంటికి వచ్చే తాము కూడా లేచి పోయేవాళ్ళం. ‘ఇంకాస్సేపు
పడుకోక ఇంత పొద్దుటే ఎందుకు లేచి పోయారు.మీ
కడుపుల అంబలి పడ..’ ముద్దుగా తిట్టేది అమ్మమ్మ.
అవేం లెక్క చేయకుండా ముందు రోజు కత్తిరించిన ఎండిన బీడీ
ఆకుతో వాకిట్లో చలిమంట పెట్టిన మామయ్య చుట్టూ చేరేవాళ్ళం అందరం. అప్పుడు ఇప్పటిలా
స్వెట్టర్లు ఉండేవి కావు . బయట చల్లగా ఉందని, అమ్మమ్మ చీరతో తలపై నుండి మెడ చుట్టూ
ముడేస్తూ చలి పెట్టకుండా ‘అరికట్లం’ కట్టేది అమ్మ. చలిమంట చుట్టూ మామయ్య, అక్క, అమ్మ, చెల్లెలు ,
మామయ్య కొడుకు సురేష్ , కూతురు స్వరూప అందరం చేరి మామయ్య చెప్పే కధలు వినేవాళ్ళం.
అందులో రామాయణం, భారతం దగ్గర నుండి రెక్కల గుర్రం, రాజ కుమారుడు, ఒంటి కొమ్ము
రాక్షసుడు , వంటకు పోయినప్పుడు ‘మాను’ అనుకుని కొండచిలువ కే పొయ్యి పెట్టడం ,
దయ్యాల కధలు ఇలా రకరకాలు చెబుతుంటే ఎంతో ఆసక్తిగా వినేవాళ్ళం. ఈ లోగా తెల్లవారేది.
ఆరు అవుతుంటేనే పక్కనే ఉన్న బాటరీ తో ఉండే రేడియో
ఆన్
చేసేవాడు. వందేమాతరం నుండి అన్నీ పని
చేసుకుంటూనే రేడియో నుండి వినేవాళ్ళం.
శ్రీ హనుమాను గురుదేవుడు నా ఎద పలికెద సీతా రామ కధ నే పలికెద సీతా రామ కధ....’ అంటూ లయ బద్దం గా వినబడే రామారావు గారి గాత్రం నుండి మొదలయ్యి ప్రాంతీయ వార్తలు ఆ తర్వాత ‘ ‘ కేయూరాణి న భూషయంతి; పురుషం హారా న చంద్రోజ్వలా ... న స్నానం న విలేపనం న ; కుసుమం నా లజ్ఞ్క్రుతా మూర్ధజా:....వాణ్యేకా సమలజ్కరోతి పురుషం; యా సంస్కృతా ధార్యతే....
క్షీయాన్తెఖిల
భూషణాని సతతం; వాగ్భూషణం భూషణం....’ అంటూ వచ్చే
వీనుల విందుగా వినపడే భర్తృహరి నీతి శతకం
లోని ఈ సుభాషితం ను ‘భుజ కీర్తులు గానీ దండ కడియాల వంటి అలంకరణలు పురుషుని
అలంకరింప వు. చంద్రుని కాంతి వలే ఉజ్వలముగా ప్రకాశించునటువంటి
ముత్యాల
హారములు, చంద్ర హారములు , సూర్య హారములు వంటి హారములు గానీ పురుషుని అలంకరింపవు.
పన్నీటి జలకాలు, సుగంధ ద్రవ్యాల సువాసనలతో కూడిన శరీర లేపనములు మై పూతలు పురుషుని
అలంకరింపవు. పూల ధారణలు, వివిధ రకాల కేశాలంకరణల పురుషునికి నిజమైన అలంకరణలు
కాజాలవు .
వ్యాకరణాది శాస్త్రముల చేత సంస్కరింప బడినటువంటి
ఏ వాక్కు అయితే పురుషునిచే ధరింప బడుచున్నదో
ఆ ఒక్క వాక్కు మాత్రమె పురుషునికి సరియైన అలంకార ప్రాయమగు భూషణము. తక్కిన సువర్ణమయాది
భూషణములన్నియును క్రమేనా క్షీణించును. ఎల్లప్పుడును ధరింప బడి యున్నట్టి వాక్భుషణమే
నశించనటువంటి నిజమైన భూషణము...’ కాలు జారినా తీయవచ్చు కాని అదే మాట జారితే ఎంత
మాత్రం తీయలెం..’ అంటూ చక్కగా అర్దాలు చెప్పేవాడు మామయ్య .
పొలం
కబుర్లు, పెద్దక్క, చిన్నక్క , ఏకాంబరం అంటూ రేడియోతో మంచి అనుబంధం ఉండేది.
ఇవన్నీ
ఇక్కడకు రాగానే గుర్తొచ్చే మధుర స్మృతులు.ఒకసారి ఇల్లు పోతే, పరాయిదయిపోతే ఈ
స్మృతులన్నీ ఇక్కడే సమాధి అయిపోవూ..... గుండె బరువెక్కింది....
తెల్లవారి పిట్టకు పెట్టడానికి స్మశానానికి
వెళ్ళాం... చుట్టూ ఎన్నో పక్షులున్నా ,అస్సలు ఎంత సేపు ఎదురు చూసినా అస్సలే
ముట్టవు...దూరం గా వెళ్లి నిలబడ్డాం..దగ్గరగా ఉండడం వల్ల రావడం
లేదేమోనని..ఊహు... ఎంతకీ రావు....అత్తమ్మ,
సురేష్, అమ్మ,మనవలు, మనవరాళ్ళు అందరం
మొక్కాం...
కాని ముట్టడం లేదు.
‘చిట్టీ
ఏమైనా మామయ్య కు కోరిక లు ఉన్నాయేమో..ఇష్టమైన మేనకోడలివి కదా... మొక్కు ‘ అమ్మ, అత్తమ్మ అన్నారు.
నాకు నమ్మకం లేదు. అయినా ఒక్క సారి కళ్ళు మూసుకున్నాను... మామయ్య
మాటలు గుర్తొచ్చాయి... మనసారా మొక్కాను .... అంతే నేను ఆ పిండం దగ్గర నుండి దూరం
కూడా రాలేదు.. చిత్రం..ఆశ్చర్యం ... పిట్టలు, కాకులు గుంపుగా వచ్చి ముట్టి నోట
కరుచుకుని పోయాయి...
‘ఎం
మొక్కావే చిట్టీ....అలా అంతసేపు దూరం తిరిగినవి కాస్తా అలా ఒకేసారి మీద పడ్డాయి..’
అంతా అడుగుతున్నారు... నేనింకా ఆ షాక్ నుండి తేరుకోలేదు...
ఇక వెంటనే బయలుదేరి వచ్చేసాను. మళ్ళీ తొమ్మిదవ
రోజు వెళ్ళాము. అందరూ ఆ రోజే చేరుకుంటున్నారు. నేను వెళ్ళిన కొద్ది సేపటికి అమ్మతో
కల్సి తమ్ముడు వచ్చాడు.
‘ఏరా...
మొన్న ఆరోగ్యం బాలేక హాస్పిటల్ కి వెళ్ళావట... అసలు షుగర్ ఎందు కొచ్చింది...’ అమ్మ
చేతి నుండి బాగ్ అందుకుంటూ అడిగాను. వాడు ఒక్క క్షణం తెల్ల బోయినా, ‘ఎదో నాన్న
పోయిన బాధ లో నాన్న జ్ఞాపకంగా బంగారు
ఉంగరం నేను ఉంచుకుందామనుకుంటే మీరు అలా చేసేసరికి కోపంతో ఆవేశంలో ఏవో ఏవో
అన్నాను... ఆడబిడ్డల్ని అన్న పాపం ఊరికే పోదు కదా ..అందుకే ఏవో బాధలు... అయినా మీకన్నా చిన్నవాన్ని కదా ఎదో కోపంతో
అంటే రాఖీ కట్టడం, పంపడం కూడా
మానేస్తారా.. నాన్నతో పాటూ నేనూ పోయాననుకున్నారా ...’ కళ్ళల్లో నీళ్ళు
తిరుగుతుండగా అన్నాడు.
చప్పున
బాగ్ అక్కడ పడేసి వెనుదిరిగాను’ఎంతమాట రా.. నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి..’ అంటూ
వాడి కన్నీరు తుడిచి హత్తుకున్నాను.
‘ఇప్పుడు
మీ ఆశీస్సులు ఉంటె చాలు ..ఆరోగ్యం అదే వస్తుంది...’ నవ్వాడు. అమ్మ కళ్ళల్లో నిండిన
నీళ్ళల్లో శత కోటి చంద్రికల వెలుగు కనబడింది.
‘సుమతి వాళ్ళ కారు పంచర్ అయ్యిందట... ఇక్కడికి
నాలుగు కిలోమీటర్ల దూరంలో ఆగారట...’ ఫోన్ లో అటు నుండి మాట్లాడుతున్న సుమతి మాటలు
వింటూ ఆందోళనగా అంటుంది అక్క.
‘అక్కా..
వారి సెల్ నంబర్ మీ మరిదికి ఇవ్వు. ఆయన
ఇక్కడి నుండి కార్లో మెకానిక్ ని తీసుకుని
వాళ్ళని తీసుకుని వస్తాడు..’ అన్నాను ఆయనకు సైగ చేస్తూ.. అక్క విస్మయంగా చూసింది.
సుమతి వాళ్ళు వస్తూనే,’చిన్నమ్మా....మాకు
తెలీని ఊరు... అసలు భయం వేసిందనుకో.... చాలా థాంక్స్ చిన్నమ్మా.... మీ అల్లుడయితే
ఇంత మంచి మామ ఉన్నాడని, ఎప్పుడూ పరిచయం చేయలేదని నన్ను తప్పు పడుతున్నాడు... ఆయన
నేను ప్రేమించుకున్నాం... చెప్పడానికి భయం... ఇద్దరం చావాలనుకుని వెళ్లాం... కాని
తరవాత ఆయనే, పెళ్ళయితే చేస్కుందాం...
తర్వాత సాల్వ్ కాక పొతే అప్పుడు చనిపోదాం అన్నాడు. మేము చేసింది తప్పే కాని
చిన్నతనం.. ఎం చేయాలో తెలీలేదు..మమ్మల్ని క్షమించండి చిన్నమ్మ..’ కాళ్ళపై
పడబోతున్న సుమతిని అక్కున చేర్చుకుంటూ ,’ఎం మాటలే అవి... ఆడబిడ్డలు కాళ్ళు
మొక్కొద్దు...’ అన్నాను.
లోపల వంటలు సాగుతున్నాయి... వంటలో ఉన్న
చిన్నమ్మ , ‘గంజి వంచాలి ఎవరైనా అక్కడున్న బట్ట పట్టుకురండి ‘ అంటూ అరుస్తుంటే
బట్ట తీసుకుని, ‘చిన్నమ్మా.. నువ్వు జరుగు..నేను వంచుతాను...’ అంటూ పెద్ద గిన్నెను
బట్టతో పట్ట బోతుంటే, ‘అంత బరువు
ఎత్తకే..నడుం నొప్పి లేస్తుంది... ఇలా ఇద్దరం చెరోవైపు పడదాం..లేదా ఆ జాలితో వడ బోద్దాం..’
అంది.. ఆ పని కాగానే, ‘నువ్వు చాలా తెలివైన దానివని మీ బాబాయి ఎప్పటికీ అంటాడు..ఏదో
ఎప్పుడో ఏదో విషయం లో గొడవ అయ్యింది.. ఎందుకో కూడా మర్చి పోయాం... ఇప్పటికయినా
చేరువయ్యావు సంతోషం..’ అంది కళ్ళ నిండా నీళ్ళతో.
ఆ సాయంత్రం అందరూ కూర్చుని తెల్లవారి
కార్యక్రమం గురించి చర్చిస్తున్నారు. ఇంతలో సురేష్ లోపలనుండి ఒక డైరీ తీసుకుని
వచ్చాడు. అందరి ముందు దానిని చూపుతూ ,’ఇది నాన్న డైరీ ...
ఇందులో రాసినది కొంత రేపటి కార్యక్రమానికి సంబంధించి కూడా ఉంది ... నిన్ననే చూసాను.. ఒక్కసారి అందరూ వినండి..’ అంటూ ‘అక్కా ఇది చదవవా..’ అంటూ నా చేతి కిచ్చ్చాడు.. చిన్నప్పటి నుండి కల్సి మెలసి ఉన్నాం కనుక, మరిది అయినా’ అక్క’ ని పిలవడమే అలవాటు సురేష్ కి . వణికే చేతులతో తీసుకున్నాను. అందులోని వాక్యాలు పైకి చదువుతున్నాను .
‘
ఒక వేళ నేను ఎవరి కయినా ఏమీ చెప్పకుండానే చనిపోతే, నా ఆత్మ శాంతి కోసం నా కిష్టమైన
కింది పనులు చేయండి.
1.మన
కుటుంబం లో జరిగిన కొన్ని సంఘటనలు నాకు బాధను కలిగించాయి. ఎందుకంటే
అందరూ
ఈ మధ్య వస్తువులకు విపరీతమైన విలువ ఇస్తున్నారు. అలాగే బంధాలను నిర్లక్ష్యం
చేస్తున్నారు.. కాని దయచేసి బంధాలను ప్రేమించండి. విలువ నివ్వండి. వస్తువులకు
కాదు.
బంధం
ఇచ్చ్సినంత ధైర్యం మరేదీ ఇవ్వదు. డబ్బు ఇవ్వాళ పోతే రేపు సంపాదించవచ్చు. కాని బంధాలను తిరిగి తెచ్చుకోవాలంటే జీవితకాలం
సరిపోదు ఒక్కోసారి.
అందుకే
కనీసం మన పూర్తి కుటుంబం అయినా ఎలాంటి
పొరపొచ్చాలు లేకుండా అందరోక్కటిగా అందరికీ ఆదర్శంగా ఉండాలి.
2.
ఈ ఇల్లు నా స్వార్జితం .దీనిపై సర్వ హక్కులు నాకున్నవి.నా తదనంతరం నా భార్య బతికి
ఉంటె ఆమెకే సర్వ హక్కులు ఉంటాయి. ఆమె ఇష్టానుసారంగా ఎవరికైనా ఇవ్వవచ్చు.
౩.
చివరిగా నా కిష్టమైన మా బావ చనిపోయినపుడు , బావను, అక్కను పక్క పక్క కూర్చోబెట్టి
అక్కకు పసుపురాసి, బొట్టుపెట్టి, పూలు పెట్టి అందరి మధ్య ఒక బలిపశువుగా
స్మశానానికి అదే చివరిసారి అని తీసుకెళ్లడం.. ఆ తర్వాత బొట్టు గాజులు తీసేసి,
తెల్ల చీర కట్టబెట్టి మూల కూర్చోబెట్టడం చాలా చాలా హేయమైన చర్య... మా అక్క అనుభవించిన
నరకం కళ్ళారా చూసాను. అందుకే
నేను
చనిపోయే సరికి నా భార్య బతికుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ అనాగరిక చర్య నా భార్యకు జరగకూడదు.
ఒక్క నా భార్యకే కాదు మరే ఇతర స్త్రీకి జరగకుండా చర్యలు తీసుకోండి. ఎందుకంటే
బొట్టు, గాజులు ,పసుపు పుట్టినప్పటి నుండి వారికి ఉన్నవే. అవి మధ్యలో భర్తతో
వచ్చినవి కావు అతనితో కల్సి పోవడానికి. అందుకే ఇది నా చివరి కోరిక.
చదువుతున్న నా కళ్ళ నిండా నీళ్ళు నిండాయి.
ఆడవాళ్ళంతా కన్నీళ్లు పెట్టుకున్నారు, సుమతి భర్త, మా వారు సురేష్ మరికొందరు వయసులో ఉన్నవాళ్ళు దీన్ని
సమర్దించారు. అక్కడే తెల్లవారి తంతు గురించి చర్చిస్తున్న పెద్ద మనుషులు అలా చేయక పొతే అరిష్టమని గోల చేసారు.
కాని చివరి కోరిక, పైగా మా వారు లాంటి వాళ్ళంతా దీన్ని సమర్దించే సరికి వాళ్ళూ సరే
నన్నారు.
‘చిట్టీ.. ఇంతకీ ఆ రోజు నువ్వు ఏం మొక్కితే పిట్ట ముట్టిందో చెప్పనే లేదు..’
అత్తమ్మ అడిగింది.
‘
మామయ్య కు ఏంతో ఇష్టమైన ఈ ఇల్లు తన పేరు
పై ఇలాగె ఉండి, తన సంతకం తో ఉన్న పుస్తకాలు ఈ వాకిట్లో ఉన్న చిన్న గదినే లైబ్రరీగా
మార్చి అందరికీ మామయ్య పేరుపై గ్రంధాలయం గా ఏర్పాటు చేస్తానని, మన కుటుంబం లో ఉన్న
బంధాలను మళ్ళీ పునర్నిర్మిస్తానని మొక్కాను...’
‘ఎక్కడిది
తల్లీ.అయిపాయే... ఇల్లు తాకట్టు పెట్టేశాం కదా.’ గుడ్లల్లో నీళ్ళు తిరుగుతుండగా
అంది అత్తమ్మ.
‘లేదత్తమ్మా..ఆ
రోజు మీరు మాట్లాడు కుంటుంటే విన్నాను. సురేష్ తో అలా వద్దని ఈ కార్యక్రమానికి
కావాల్సిన మొత్తం నేను ఇస్తానని చెప్పా ను. ఆ లైబ్రరీకి కూడా ప్రతి నెలా మెయింటే
నేన్స్ నేనే ఇస్తాను. ఎదో దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో కొంత పెడుతున్నాను..
ఎంతయినా మామయ్య చేసిన విద్యా దానం, సంస్కార దానం కిందకు ఏదీ సరి కాదు..’ అంటున్న
నన్ను అక్కున చేర్చుకుంది అత్తమ్మ.
నిజానికి చివరగా మామయ్య రాసినట్లు రాసిన
కోరిక అభ్యుదయ బావాలున్న సురేష్ తో
మాట్లాడి
నేను
మా వారు కల్సి తీసుకున్న నిర్ణయం... ఆ రోజు నాన్న చనిపోయాక అమ్మ ఎదుర్కొన్న
ప్రత్యక్ష నరకాన్ని కనులారా చూసి కలత చెంది మరే స్త్రీకి జరగకుండా, వయస్సు
తక్కువయినా నేను చెబితే వినరని సెంటి మెంట్ తో చెప్పించాను... అంతే కాదు చేతిరాత
కొంచెం మార్పు ఉందని ఎవరూ గుర్తుపట్టకుండా నా తోనే చదివించేలా సురేష్ తో ముందే
ఒప్పందం చేసుకున్నాను. నేను అలా ‘మామయ్య పేరు అడ్డం పెట్టుకుని మామయ్య రాసినట్లు
అలా రాయడం , మామయ్యకు ద్రోహం చేసినట్లు ‘ అని మామయ్య అనుకుంటే , తెల్లవారి పిట్టకు పెట్టినప్పుడు పిట్ట ముట్ట
కూడదు అనుకున్నాను. కాని చిత్రంగా గుంపులుగా వచ్చిన పిట్టలు, కాకులు నన్ను
ఆనందసాగరంలో ముంచాయి.
తమ్ముడి తో పాటు పక్కన కూ ర్చున్న అత్తమ్మ ను
చూసి సంతోష పడ్డట్లు మామయ్య నిండైన మోముతో ఉన్న పటం నుండి పువ్వు ఆశీర్వదిస్తున్నట్లు కిందకు
రాలింది. చిన్నమ్మ , సుమతి, తమ్ముడు నా చుట్టూ కూర్చుని ఇన్ని రోజులు రాని మాటలు ఆ వేళ నే వచ్చినట్లు సంతోషంగా మాట్లాడు తున్నారు.
దూరంగా గుడిలోని జే గంటలు ‘శుభం’ అన్నట్లు
మోగాయి.
**********************
చదివి తమ విలువైన అభిప్రాయాలు వెలిబుచ్చుతున్న పాఠక మహాశయులకు వినమ్ర కృతజ్ఞతాభి వందనాలు
నామనిసుజనా దేవి గారు రాసిన అనుబంధాలు కథ ఇప్పుడే చదవాలి మానవ సంబంధాలు మానవ సంబంధాలు వాటి అనుబంధాల గుండె లోతుల్లోని భావోద్వేగాలు చాలా చక్కగా వివరించారు నాకు ఈ కథలోని ముఖ్యమైన అంశం ఒకటి నన్ను భావోద్వేగాన్ని గురిచేసింది వస్తువుకు ఇచ్చిన విలువ సాటి మనిషికి ఇవ్వడం లేదు ఒక మంచి కథ చదివిన తర్వాత కలిగిన అనుభూతి ఈమె కథలో నేను సహానుభూతిపొందాను.... ఒక కుటుంబంలో ఆస్తికోసం ఎంత స్వార్ధంగా ప్రవర్తిస్తారో ఈ కథ తెలియజేసింది కథ చదువుతున్నంత seapuu. hrudayam ద్రవించింది..పొత్తూరి సీతారామరాజు కవి రచయిత కాకినాడ..
రిప్లయితొలగించండిExcellent Story.
రిప్లయితొలగించండిసుజనా దేవి గారు అనుబంధాలు కథ ,కథనం బాగుంది .సమాజంలో నేటి పరిస్థితి కన్నులకు కట్టినట్లు చూపారు .మీ కలం నుండి మరిన్ని కథలు రావాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను .
రిప్లయితొలగించండిసుజనా దేవి గారు నాకు వ్యక్తిగతంగా పరిచయం. ఆవిడ లో సృజనత్మాకత కు నేను ఎప్పటికి అపుడు అబ్బుర పడుతూనే ఉంటాను. ఒక వ్యక్తిగా ఆవిడ multi tasking చూస్తే కూడా ముచ్చట వేస్తుంది. ఒక గృహిణి గా, ఒక ఉద్యోగస్తురాలిగా, ఒక తల్లిగా, ఒక sports woman గా ఒక రచయిత్రిగా, కవయిత్రిగా.. Wowwww... Wonderful... I admire her like anything... అనుబంధాలు కథ కథనం చాలా చక్కగా ఉన్నాయి. ఆ పరమాత్ముడి కృప సుజనా దేవి మీద అపారంగా ఉండాలని ఆశిస్తూ... Geethanjali
రిప్లయితొలగించండిబంధాలు అనుబంధాలకు దూరమై చిన్న చిన్న విషయాలకే బంధుత్వాలు జిల్లా చదరవుతున్న నేటి పరిస్థితుల్లో అందరి కళ్ళు తెరిపించేలా ఉంది ఈ కథ
రిప్లయితొలగించండిఅందరూ ఇలా మీరు కథలో చెప్పినట్లు okallani okallu అర్థం చేసుకుంటే జీవితం ఎంతో bavuntundi
తొలగించండి👌🏼 👍
రిప్లయితొలగించండిమామయ్య కర్మకాండలప్పుడు మనసులో మొక్కుకున్న అన్నింటినీ సాహితి ఈడేర్చిన క్రమంలో అపోహలు తొలగి అనుబంధాలు ఆత్మీయతలు హృద్యంగా అల్లుకోవటం కథను పాఠకులకు దగ్గరచేస్తుంది. రచయిత్రి గారికి అభినందనలు.
రిప్లయితొలగించండి