శివలీలలు 16

బెజ్జమహాదేవి కథ

లోకమున ముగ్ధభక్త తత్త్వవేత్త్వ అగు ‘‘బెజ్జమహాదేవి’’ అను భక్తురాలుకలదు. ఆమె నిరంతరం పరమశివుని పాదపదమ్మములను ఆరాధించునది. ఆమెకి సమస్య ఎదురయినది. ప్రతిమనిషికి తల్లిదండ్రి, బంధువులు, మిత్రులు ఇలా ఎందరో పరివారము ఉన్నారుకదా! ఆ పరమేశ్వరునికి తల్లిలేక పోవటం చాలా విచిత్రముగా ఉందే అని అనుకొన్నది. తల్లి లేకుండా సంతతి లోకమున ఉండదుగదా!  ఇతడు ఎట్లు జన్మించెను? లేక, ఒకవేళ తల్లి మరణించినదో? అనే శంక అమెను ఎంతగానో బాధించినది. వేధించినది కూడా. అసలు ఈ సమస్యకు పరిష్కారమేమిటని తలంచినది. ఇలా ఆలోచించుచూ బెజ్జమహాదేవి తనకు తల్లి లేకపోవటం చేత తానెన్ని కష్టాలు పడినది తనకు బాగా తెలుసు కనక తల్లి మరుణించుటచే తానెంతో శ్రమపడి జీవించవలసి వచ్చినది అని తలంచుకొని బాధపడుచూ దు:ఖం అందరికీ దు:ఖమే కదా! అనుచూ శివుని పరిస్థితిని గూర్చి చింతించుచూ ఇలా మనసున అనుకొనుచున్నది. నిజమునకు శివునకే తల్లి ఉన్నట్లయితే ఆయనను తపస్సు చేయుటకు పంపించునా? తల నిండా జడలు కట్టి తలకు బాధ కలుగునట్లు ఆజుట్టును ఉంచునా! తల్లే బ్రతికి ఉన్నా విషమును త్రాగుటకు అంగీకరించునా! తల్లే ఉండినా జంతుచర్మములను వస్త్రముగా ధరించుటకు అవకాశమిచ్చునా! తల్లే అతనికి నిజముగాఉండిన శరీరమంతా పాములు పారాడుతూ ఉంటే భరించగలదా! శరీరమంతా పాములు పారకాడుతూ ఉంటే భరించగలదా! శరీరమంతా శవముల బూడిదను పూసుకొనుటకు తల్లి అంగీకరించునా! బిచ్చమెత్తుకొని తినుటకు ఆమె పంపించునా! తల్లే ఉంటే అతనిని వల్లకాటిలో ఉంటానంటే మాత్రమే ఉండనిచ్చునా! తల్లిలేని బిడ్డడు కనుకనే ఇన్ని ఇబ్బందులు తట్టుకోవలసి వచ్చినది అని బాధపడి చన్నుగుడిపి అడిగినప్పుడల్లా వెన్నపెట్టి కడుపునిండా పాలుపోసి ఆడుకొనిరాగా పొట్టచూసి ఎత్తుకొని పాలిచ్చే తల్లేగనుక ఉంటే ఈశ్వరుని మనసారా పెంచుకొనేది కాదా! తల్లి లేకుండగానే ఇంతవాడు అయినాడుకదా! నా అయ్యా! తల్లి ఉండి ఉంటే ఇక తానెంత వాడయ్యేవాడోగదా! పెండ్లిళ్లల్లో, నోములలో, పేరంటాలలో పండుగలో, జాతరలలో చక్కగా కనిపెట్టి చూసుకుంటుందిగదా! తల్లి ఉంటే! తల్లిలేకపోతే గాలికి పెరగరా ఎటువంటి మగబిడ్డలైనా!కష్టాలపాలుగారా! కనుక నేను నాకేమి పట్టనట్లు ఉపేక్షించి ఊరకుండవచ్చా! నేనే తల్లి నై నా తండ్రిని జాగ్రత్తగా పెంచుకొంటాను. అని నిశ్చయించుకొని బెజ్జమహాదేవి సర్వకాలసర్వావస్థలయందు తానే పరమశివుడి తల్లిని అనుకుంటూ ప్రవర్తించసాగినది.శివుని పసివాడిగా భావించి అంగలు చాచి పడుకోబెట్టుకొని లింగమూర్తికి ఆమె తలంటి స్నానం చేయించేది. ముక్కువొత్తి చెక్కువొత్తి కన్నులు పులిమేది. అక్కువత్తి కడుపువొత్తి వీపునిమిరేది. వొళ్లు చేసిపెరగాలని పాదాలు చేతులు సాగదీసేది. రకరకాల నలుగులుపెట్టి నలుస్తూ ఉండేది. ఏడ్చిన లెక్కచేయకుండా నిలబెట్టి వీపున నీళ్లు చరిచేది. బయటపడకుండా వెన్నుమీద తట్టేది. దోసిటిలో నీళ్లు, మాడుమీద ఒత్తుడుగా పోసేది. నీళ్లు నోట్లోకి పోతాయేమోనని నోటికి చేయి అడ్డంపెట్టి నీళ్లు పోసేది. పొట్టను నొక్కినీళ్లు పోసేది. పసుపు పూసి నీళ్లలో తలనిండా స్నానం చేయించేది.కన్నుల్లో చెవుల్లో నలుసులు ఏమీలేకుండా గట్టిగా ఊదేది. వేలునోట్లో జొనిపి అంగిట ముల్లునొత్తేది. తొడమీద నుంచి ఎత్తి నీళ్లు నోట్లోకి పోకుండా చూసేది. చేతుల్తో నీళ్లు తీసుకొని తలచుట్టూ తూతూ అని త్రిప్పి పోసేది. చక్కగా బొట్టుపెట్టేది. చట్టిలో అడుగున ఉన్న విభూది పిడికను బొటనవ్రేలితో చిదిమి నొసటనిండా విభూతి పూసేది. ఎత్తుకు ఎగురవేస్తే ఎదగడని జంకుతూ రొమ్మున అదుముకొనేది. కాటుక పెడితే కళ్లు కళకళ లాడతాయని మూడు కన్నుల చక్కగా కాటుక అలదుతుంది. పొట్టనిండా చన్నిస్తుంది. పక్షులను పైన పారనీయదు. తరువాత కాస్త వెన్నపెడుతుంది. చెక్కిలిని గోటితో మీటుతుంది. పిల్లవాడు రాగాలు తీస్తే ఒక్కవేలు నోట్లో ఉంచి నెమ్మదిగాపాలుపోస్తుంది. రోజూ ఉగ్గులు పోస్తుంది. ఎంతో సంబరంగా ముద్దులు కురిపిస్తుంది. ముద్దియ్యరా నాన్నా! అని పలుమార్లు వేడుకుంటుంది. పొట్టకు అదుముకొని వేరెవరూ కన్నవారు అంటూ ఉదరాన్ని పాన్పు చేస్తూ జోకొడుతూ మధురంగా పాడుతుంది. తన కొడుకుని ఈ విధంగా లాలిస్తూ ఉండగా ఆ నెలత నిశ్చల ముగ్ధభావానికి శివుడెంతగానో మెచ్చి ఆమెకు లోబడిపోయినాడు. ఆమెను తల్లిగా భావించుకొన్నాడు. ఆమె చేసే బాల్యోపచారాలన్ని స్వీకరించాడు. ఒక సారి నోరంతా పొక్కి, తల్లి రొమ్మునోట్లో పెట్టుకోలేని అతి జఠిలమైన వ్యాధిపట్టుకొని బాధిస్తున్నట్లు తల్లిపాలు త్రాగలేకపోయినాడు. వెన్నతినటానికి నోరే తెరవలేకపోయినాడు. అదిచూసి ఆమె గుండెబాదుకుంది. అమితముగా తల్లడిల్లినది. నాకన్న నా పట్టి నా బాబు ఏమయ్యిందిరా నాయనా! పాలస్సలు త్రాగుటలేదు. నీచెమట చూస్తుంటే నాకు నెత్తురోడినట్లుగా ఉన్నది. నా కాలుచేయి ఆడటంలేదు. ఇంతకష్టం ఎలా భరించగలనురాతండ్రీ! లేకలేక ఒక్కడివి పుట్టియున్నావు అని పొంగిపోతిని గదరా తర్రడి! నేలపైన కాళ్లు నిలవటం లేదురానాన్నా! ఎందుకు పలుకవు? చెప్పవయ్యా! నా తర్రడీ నీకు వచ్చిన బాధేమిటిరా అని పలికి అజీర్ణమా! కడుపులో బాధా! లేక అంగిటి ముల్లో ఏమీ తెలుసుకోలేక ఉన్నానురా అంటూ మందు మాకు ఏమీ నాకు తెలియవే అని తల్లడిల్లి దు:ఖింపసాగెను. పసివాడిని ఒళ్లు నిమురుతుంది. గట్టిగా ఱొమ్మునకు అదుముకుంటుంది. బట్టకప్పుతుంది. వెంటనే తీస్తుంది మళ్లీ కప్పుతుంది, తీస్తుంది. కళ్లు కాసేట్టుగానో ఆ పసివాడి వైపు చూస్తూ కూర్చొని ఉంటుంది. ఏమీ చేయునది లేక వ్రేలాడపడి పోయి శుష్కించిన కొడుకును చూస్తూ పరిపరివిధాల వాపోయింది. పనీపాటలేకుండా వాళ్లింటికీ వీళ్లింటికీ వెళతావు. అక్కడ ఇక్కడా తిరుగుతావు. ఆకటిపట్టున ఎప్పుడైనా నీవు ఇంత తిన్నావటరా! సగం కాలేకడుపులోనే ఒడయనంబికి సహాయము చేయుటకు పోయితివా! అక్కడ ఏమీ తినటానికి లేక కుమ్మరిగుండయ్య వాయిద్యం వాయిస్తుంటే ఆడితివాఏమీ! కరికాళవ్వ ఇంటికి వెళ్లి మామిడి పండ్లు తింటివాఏమి? ఇక్కడి ఆగినది నీదూర్తత్వం! ‘‘ చిరుతొండనంబి ఇంటికి వెళ్లి మరీ అడిగి ఆయన కొడుకు మాంసం లొట్టలేసుకుంటూ ఆరగించితివా! ఈవిధముగా తినరాని తిండ్లను తిని ఆరోగ్యమేమగునురా! తినరాని పదార్థములు తినుటవలన నీ కడుపునకు ఏమి వాటివలన వచ్చే అనారోగ్యం తప్ప! ఇక నుంచైనా అల్లరి చిల్లరి చేష్టలు మాని నా అదుపాజ్ఞలో వుంటావా లేదా? వున్నట్లు లేకపోతే నీతో నేను వేగలేను. నేను చెప్పినట్లు విని ఉంటే నీకీరోగము ఎట్లువచ్చును? నిప్పునకు చెదలంటునా! నీకు నీవే రోగమును తెచ్చిపెట్టుకుంటివి. అయిన నీకు ఈ రోగము దాపరించి బాధను కల్గించుచున్నది. ఆ బాధ నేను మాట్లాడు మాటలవలనపోవునా! కనుక నిన్నీ స్థితిలో చూడలేను. నాకు చావుదప్ప వేరు ఉపాయము లేదు. అని అంటూ తన తలను తాను నరుకుకొనుటకై బెజ్జమహాదేవి ఉద్యుత్తురాలు కాగా వెంటనే ఆ దేవదేవుడు ప్రత్యక్షమయినాడు. తల్లీ! నీ మాతృహృదయమున దాగివున్న మాతృత్వగుణము నా మనసును హరించినది. నీకేమి కావాలో కోరుకో ఇచ్చెదనని పరమేశ్వరుడు పల్కెను. నాయనా! నాకు కోరికలున్నాయా లేవు. నీవు రోగరహితుడవై నిత్యుడవై సుఖముగా ఉంటే నాకదే చాలు. నీకు ఒక విషయం తెలియజెప్పినను తెలుసుకొనలేవురా కన్నతండ్రీ. కన్న మోహముకంటే పెంచిన మోహం పెద్దది. కనుక నిన్ను కన్నులారా చూసుకుంటూ ఉండటమే నాకునీవిచ్చు గొప్పవరం అని పల్కినది బెజ్జమహాదేవి. ఆ తల్లి మాట్లాడు అమాయకపు మాటలు విని శివుడు మన్దస్మితారవిన్ద వినోదిjైు ఆమె భక్తిపారవశ్యం నుంచి ఉద్భవించు లలితమనోజ్ఞ పదజాలమును సుఖారవిందుడై గ్రోలుచూ తల్లిని వెన్నురాస్తూ భుజములు నొక్కుతూ హృదయమునకుహత్తుకొనెను. అమ్మా! నీవు నాకు తల్లివికనుక, ముల్లోకములకు నీవు తల్లివే అగుచున్నావు. అని ఆమె మురిసిపోవునట్లు పలికెను. నీకు అనామయంతోపాటు అమృతత్త్వ సిద్ధికూడా ఇస్తానని ఆ తల్లికి మోక్షమొసంగెను. ఆ పరమశివుడు పరమశివునకే అమ్మఅయి శివుని సేవించుటచే ఆమెకు లోకమున అమ్మవ్వ అని ప్రసిద్ధనామము కూడా కలదు. 

ఇందు మాతృత్వ హృదయము ఎట్లుండునో లోకమునకు ఉపదేశముగా తెలియజెప్పెను.బాల్యమున తల్లి చేయు ఉపచారములు ఎట్లుండవలెనో బెజ్జమహాదేవి సూచించినది. పిల్లలు శారీరకముగా ఆరోగ్యవంతులగుటకు తల్లిచేయించు స్నానమును గూర్చి ఆమె వివరించెను. పిల్లలను కనుటకంటే పెంచుటలోనే అధిక మమకారముండునని బెజ్జమహాదేవి కథ సామాజికులకు ఉపదేశమిచ్చుననుటలో అతిశయోక్తిలేదు. పరమశివుడే వరమును కోరుకోమని అభ్యర్థించెనను మంచి ఆరోగ్యములో నిత్యమూ నీవు ఉండగలిగిన అదియే నాకు వరమని తెలుపుటచేత తల్లులు ఎన్ని కష్టములు అనుభవించిననూ పిల్లల శ్రేయస్సే ప్రధానమని భావించుట ఇందు ప్రధానముగా కానవచ్చుచూ, మాతృహృదయమును తెలుపుచున్నది. నిరంతరము శివధ్యాన తత్పరతయందు ఆసక్తిని ప్రదర్శించి తన ముగ్ధభక్తి తత్త్వమును బెజ్జమహాదేవి తెలిపెను అనుటలో అతిశయోక్తిలేదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి