విజయ గీతిక

విజయ గీతిక

- వాత్సల్య గుడిమళ్ళ

సమయం సాయంత్రం ఆరున్నర గంటలు. హైదరాబాదులో శిల్పకళా వేదిక అహుతులతో కిటకిటలాడుతోంది.


మహిళా పారిశ్రామికవేత్తలని ప్రోత్సహించడానికి ఉత్తమ అంకుర సంస్థలకి ప్రతి ఏటా ఇచ్చే 'శక్తి' అవార్డుల ప్రదానోత్సవ సభ జరుగుతోందక్కడ. . ప్రాంగణమంతా బహుమతులు అందుకోబోయే మహిళా పారిశ్రామీకవేత్తలతో, "వారి బంధువులతో నిండిపోయింది. అవార్డు గ్రహీతలలో చాలామంది ముప్ఫైలు,లేదా నలభైలకి దగ్గరపడుతున్నవారే. అరవై సంవత్సరాలున్న విజయే వారందరిలోకీ పెద్దది.


సాధారణంగా ఆ వయసు వారు అనుభవబజులైన పారిశ్రామికవేత్తలయ్యుంటారు కాబట్టి 'ఈవిడ ఈ వయసులో అంకుర సంస్థని స్థాపించిందా?' అన్నట్లుగా అందరూ ఆమెని ఆశ్చర్యంగా చూస్తున్నారు.


విజయ ఆ ప్రాంగణం లోపలకి వచ్చేటప్పుడు కూడా ఆమె కూడా అవార్డుగ్రహీత అని ఎవ్వరూ అనుకోలేదు.


ఆమె భర్త శంకరానికి భార్యని చూస్తే గర్వంగా ఉంది. ఇంక పిల్లలు కార్తికేయ,మీనాక్షిల ఆనందానికయితే హద్దు లేదు. ఒకప్పుడు ఇల్లు,పిల్లలు తప్ప లోకం ఎరుగని ఇల్లాలిగా తల్లిని చూసిన కార్తికేయకి అమ్మ సాధించిన విజయం తలచుకుంటే నమ్మశక్యంగా లేదు. అతని మనసు ఒక్కసారిగా మూడు సంవత్సరాల వెనక్కి వెళ్ళింది.


********


ఆఫీసులో పనిచేసుకుంటున్న కార్తికేయ ఫోను మ్రోగడంతో ఫోను స్కీను మీద మేనబావ ప్రసాద్‌ నంబరు చూసి, వీడు ఇప్పుడు చేస్తున్నాడేమిటి అనుకుని కంగారుగా ఫోను ఎత్తాడు.


"కార్తీ! అత్తయ్య రిపోర్టులు అన్నీ చూసానురా.అంతా బాగుంది, ఒక్క మాటలో చెప్పాలంటే క్లినికల్లీ షీ ఈజ్‌ ఫిట్‌. కానీ మెంటల్లీ ఏమన్నా బెంగ పెట్టుకుందేమో కనుక్కో. మానసికంగా ఏమైనా బెంగ ఉందేమోనని నేను అత్తయ్యని మరీ గుచ్చి గుచ్చి అడగలేను. ఒకవేళ అ అలా అడిగితే అత్తయ్య నొచ్చుకుంటుందేమో కూడాను" అని ఉపోద్దాతం ఏమీ లేకుండా సూటిగా కార్తికేయ తల్లి విజయ ఆరోగ్యం గురించి చెప్పాడు ప్రసాద్‌.

"నాకు తెలిసి అమ్మకి కుటుంబపరమైన ఒత్తిళ్ళు కూడా ఏమీ లేవురా! అమ్మ కష్టపడకూడదనే ఇంట్లో వంటకి ఒకళ్ళు, ఇంటి పనికి ఒకళ్ళని కూడా పెట్టాము. అయినా ఎందుకిలా నీరసంగా ఉత్సాహం లేకుండా ఉంటోందో తెలియట్లేదు!" అని కార్తికేయ వాపోయాడు.

ఇద్దరూ కాసేపు కుశలం మాట్లాడుకున్నాకా కార్తికేయ ఫోను పెట్టేసాడు.

కార్తికేయ మనసంతా తల్లి ఆలోచనలతో నిండిపోయింది. గత ఆర్నెల్లుగా అమ్మ ఫోనులో మాట్లాడటానికి కూడా అంత ఆసక్తి కనపరచటం లేదు అని కార్తికేయ గమనిస్తూనే ఉన్నాడు. తల్లిని అడిగినా కానీ 'నాకేమి కాలేదు కార్తీ! బాగానే ఉన్నాను' అని దాటేసేది తప్ప తను మునుపటిలా ఉత్సాహంగా లేకపోవడానికి కారణం మాత్రం చెప్పలేదు.

ఇక కార్తీ చేసేదేమీ లేక తల్లితండ్రులు ఉంటున్న ఊర్లోనే డాక్టరుగా పనిచేస్తున్న తన మేనత్త కొడుకు ప్రసాదుకి పరిస్థితి వివరించడంతో ఏదో క్రొత్త ఆరోగ్య భీమా కోసమని చెప్పి ఆమెకి అన్ని రకాల వైద్య పరీక్షలూ చేసారు. రిపోర్టులన్నీ బాగున్నాయి, కానీ అమ్మ దిగులుకి కారణమేమిటో మాత్రం ఎంత ఆలోచించినా కార్తికేయకి తట్టలేదు.

ఆఫీసునుండి ముభావంగా ఇంటికొచ్చిన కార్తికేయని చూసి "అత్తయ్యగారి రిపోర్టులు అన్నీ బాగానే ఉన్నాయని ప్రసాద్‌ చెప్పాడుట కదా! అయినా అలా ఉన్నారేమిటని అతని భార్య శ్రీవల్లి అడిగింది.

"ఫలానా సమస్య అని తెలిస్తే దానికి చికిత్స ఉంటుంది వల్లీ! కానీ అమ్మకి ఏమన్నా మానసిక సమస్యేమో అని వాడు అనేసరికి నాకు ఏమీ అర్ధం కావడం లేదు.అసలు అమ్మకి అంతగా బాధపడే సమస్యలు ఏముంటాయి?ఇంటి పనితో అలసిపోతుంది అని అనుకోవడానికి కూడా లేదు.ఎంత ఆలోచించినా తట్టట్లేదోయ్"అన్నాడు కార్తికేయ దిగులుగా.

శ్రీవల్లికి కూడా ఎంత ఆలోచించినా ఆవిడకి ఉన్న సమస్య ఇదీ అని ఇతమిద్ధంగా అనుకోలేకపోతోంది. పోనీ ఆవిడనే అడుగుదామంటే అత్తగారు మహా గుంభనమైన మనిషి అని తెలుసు.

"పోనీ నేను ఓ ఇరవై రోజులు అత్తయ్య, మామయ్యగారి గారి దగ్గర ఉండి వస్తాను, ఎలాగూ పిల్లలకి ఓ నెలరోజులు శలవలేగా"అని భార్య అనగానే ఇదేదో బాగానే ఉందనిపించింది కార్తికేయకి.

ఒక వారం రోజుల్లో శ్రీవల్లి పిల్లలతో సహా అత్తగారింట్లో ఉంది. మనవలని చూసినా కానీ ఆవిడలో మునుపటి ఉత్సాహం లేదని గమనించింది శ్రీవల్లి.

ఒకరోజు సాయంత్రం ఆవిడని అలా వాకింగుకని తీసుకెళ్ళింది శ్రీవల్లి.

"అత్తయ్యగారూ!,ఇంకో నాల్రోజుల్లో పిల్లలని తీసుకుని అమ్మ దగ్గరకి వెళ్ళి ఓ వారం ఉండి వస్తాను, ఆలోపు మేము వెనక్కి వెళ్ళడానికి కార్తీ టికెట్లు రిజర్వ్‌ చేస్తాడు. నేను అమ్మ దగ్గరనుండి వచ్చేసరికల్లా కార్తికేయకి ఇష్టమైన అరిసెలు, చక్కినాలు, పిల్లలకోసమని సగ్గుబియ్యం కారప్పూస, నా కోసం నిమ్మకాయ పచ్చడి తయారుచేస్తే పట్టుకెళతాను"
అనగానే,

"నాకెందుకు చెప్తున్నావు? వంటావిడ ఉందిగా ఆవిడకే చెప్పు. నేను పనిచేస్తే మీ మామయ్యగారు కోప్పడతారు. వెంటనే ఆ వార్త వాడికి తెలిసి వాడు,వాళ్ళక్క కలిసి వేసే అక్షింతలు వినడానికి సిద్ధంగా లేను"అందావిడ నిష్టూరంగా.

"అయ్యో అత్తయ్యగారూ! వాళ్ళకి నేను చెప్తాను కానీ ఈసారికి మీరు మా కోసం ఇవన్నీ చెయ్యండి" అనగానే,

"అయినా మీరు వచ్చినప్పుడు తప్ప అసలు ఎవరికైనా వంట చేసి ఆప్యాయంగా వడ్డించే అవకాశం నాకు లేదు. వండి పెడదామన్నా కానీ ఎవరూ లేరు. మీనాక్షి పిల్లలేమో పెద్దవాళ్ళయిపోయారు, వాళ్ళకి ఇవన్నీ నచ్చట్లేదిప్పుడు. ఏమిటో చేసిపెడతానంటే తినేవాళ్ళు లేరు" అంది విజయ బాధగా.

శ్రీవల్లికి ఆవిడ దిగులుకి కారణం లీలగా తెలుస్తోంది.

"పోనీ మీరూ మామయ్యగారూ వచ్చి మా దగ్గర ఒక ఆర్నెల్లు ఉండండి.అక్కడికొచ్చి మాకు వండిపెడుదురుగాని"అంది శ్రీవల్లి చనువుగా.

"లేదమ్మా!ఒకవేళ మేము వచ్చినా ఇక్కడ అలవాటైన పరిసరాలని వదిలి మన భాష కాని చోట ఎక్కువ కాలం ఉండలేము" అందావిడ.

గత మూడున్నర దశాబ్దాలుగా తనకి నచ్చిన ఇంటిపని ఆనందంగా చేసుకుంటూ ఇంటికొచ్చిన అతిధులకి ఆదరంగా వండిపెట్టే చేతికి ఒక్కసారిగా ఎక్కువ విశ్రాంతి దొరికేసరికి వచ్చిన దిగులే ఇది అని గ్రహించింది శ్రీవల్లి.

కార్తికేయతో మాట్లాడి తనకి వచ్చిన ఆలోచనని అమలుచేసి ఆవిడ దిగులు పోగొట్టాలి అనుకుంది.ఇంతలో మరునాడే జనతా కర్ఫ్యూ, ఆ వెంటనే లాక్టాన్‌ అమలుచేయడంతో శ్రీవల్లి పిల్లలతో అత్తగారింట్లోనే ఉండిపోవలసివచ్చింది.

ఒకరోజు ప్రొద్దున్నే కాఫీ త్రాగుతూ బాల్కనీలోకొచ్చిన శ్రీవల్లికి ప్రక్క ప్లాట్‌ బాల్కనీలో అమ్మాయి కనిపించడంతో పలకరింపుగా నవ్వింది.ఆమె కూడా తిరిగి చిన్నగా నవ్వింది కానీ ఆ నవ్వులో జీవం లేదు.

ఎప్పుడూ ఆ అమ్మాయి ఆఫీసుకి వెళ్ళేటప్పుడో వచ్చేటప్పుడో తప్ప ఆమెతో మాట్లాడిన సందర్భం లేదు, కనీసం ఆ అమ్మాయి పేరు కూడా తెలీదు.

చూస్తే క్రొత్తగా పెళ్ళైన జంటలా ఉన్నారు. పాపం చిన్న పిల్ల ఎందుకు దిగులుగా ఉందో అని మొదట శ్రీవల్లే మాట కలిపింది.కాఫీ త్రాగుదాం రమ్మని పిలిచింది ఆ అమ్మాయిని.

మాటల్లో ఆ అమ్మాయి పేరు మనీష అనీ, భార్యా భర్తలిద్దరూ ఐటీ ఉద్యోగులనీ,ఎప్పుడూ బయట తినడం తప్ప వండుకోవడం అలవాటు లేదనీ, వారాంతంలో వంటావిడ ఈ లాక్లౌన్‌ వల్ల పని ఒత్తిడితో పాటూ వంట కష్టంగా ఉంటోందనీ, దానివల్ల తమ మధ్య గొడవలు జరుగుతున్నాయనీ బేలగా చెప్తున్న ఆ పిల్లకేసి జాలిగా చూసింది శ్రీవల్లి.

వీళ్ళిద్దరూ మాట్లాడుతుండగానే విజయ ఒక బాక్సులో ఇడ్లీలు,చట్నీ వేసి పట్టుకొచ్చి మనీష చేతిలో పెట్టింది.

ఘుమఘుమలాడే ఇడ్లీలని తిరస్కరించాలని లేకపోయినా మొహమాటం కొ, ద్దీ "ఆంటీ.." అని ఇంకా ఏదో అనబో, తున్న మనీషాని మధ్యలోనే ఆపి

"ఇన్నాళ్ళకి నాకు వంటింట్లోకెళ్ళే అవకాశం వచ్చింది, అతిథిదేవోధవ అని మర్చిపోయావా? ఇంకేమీ మాట్లాడకు" అనడంతో మనీష ఆ బాక్సు తీసుకుని ఇంటికెళ్ళింది .

మధ్యాహ్నం కూడా విజయ ఎంతో ఆదరంతో క్యారేజీ నిండా అన్నం,కూరలు సర్ది మనీషా వాళ్లింటికి పంపించింది.

ఆరోజు సాయంత్రం మనీష, ఆమె భర్త, విజయ వాళ్ళింటికొచ్చి భోజనం చాలా బాగుందని, చెప్పి పదే పదే ధన్యవాదాలు చెప్పారిద్దరూ.

"ఈ లాక్టాన్‌ ఉన్నన్నిరోజులూ నేనే మీకు వంట చేసి పంపిస్తాను. మీరు దానికి ప్రతిఫలంగా మీరు అల్లం వేసి చేసే ఘుమఘుమలాడే మసాలా టీ నాకు శనాదివారాలు సాయంత్రం ఇవ్వాలి, సరేనా?" అని విజయ అనగానే,

"నాకు ఓకే ఆంటీ!" అని సంతోషంగా అంటున్న భర్తని సున్నితంగా మోచేత్తో పొడిచింది మనీష.

"నేనేమీ ఉచితంగా చేసిపెట్టట్టేదమ్మా, నీ చేత టీ పెట్టించుకుంటున్నాను కదా! మీరు చేసుకునే ఆ సాండ్‌ విచ్‌లు అవీ అప్పుడప్పుడు నా మనవలకీ పంపించు" అంటున్న భార్యకేసి అబ్బురంగా చూసారు శంకరంగారు.

ఎవరైనా ఆకలితో ఉంటే చూడలేని విజయ నైజానికి, వాళ్ళ కడుపులు నింపడానికి ఆమె ఉపయోగించిన చాకచక్యం చూసి ఆమె తన అర్ధాంగి కావడం అదృష్టమని పొంగిపోయారు ఆయన.

ఇక ఆరోజు మొదలు, రోజు మనీషా వాళ్ళకి విజయ కడుపునిండా భోజనం పెట్టేది. ఒకరోజు సాయంత్రం మనీష భర్తతో కలిసి విజయని కలవడానికొచ్చింది .

"వంట నేర్చేసుకున్నారా ఏమిటి? రేపటినుండీ నాకు అల్లం టీ లేదా?"అని దిగులు నటిస్తూ అంటున్న విజయని చూసి ఫక్కున నవ్వారిద్దరూ.

"అది కాదాంటీ.." అని నసిగింది మనీష.
"ఫరవాలేదు చెప్పమ్మా!" అంది విజయ ఆప్యాయంగా.
"మా స్నేహితులలో ఒకరికి నలతగా ఉంటే మీరు పంపించిన కూరలు వాళ్ళకి పంపించాము. వాళ్ళకి మీ వంట బాగా నచ్చింది. తమకి కూడా ఈ లాక్టాన్‌ అయ్యేవరకూ ప్రతీరోజూ భోజనం పంపగలరేమో అడగమన్నారు కానీ ఉచితంగా మాత్రం కాదుట ఆంటీ..." అని ఆగింది.
"అంటే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని భోజనం పెట్టాలా?"
విజయ గొంతులో విసురు గమనించి ఉలిక్కిపడింది మనీష.
"అది కాదాంటీ..మీకు వాళ్ళు తెలీదు కదా..."
ఇంకా ఏదో చెప్పబోతున్న మనీష మాటని మధ్యలోనే తుంచేసి "ఇంక పొడిగించకు మనీష!,నేను డబ్బులకి ఎప్పుడూ ఎవరికీ భోజనం పెట్టలేదు, పెట్టను కూడా" అనడంతో ఇంక మాట్లాడలేకపోయింది మనీష.

మనీష వాళ్ళు వెళ్ళాకా శ్రీవల్లి వంటింట్లో ఉన్న అత్తగారికి సాయం చేసే నెపంతో మాటలు కలిపింది.

"అత్తయ్యగారూ!మనీష మంచి మాటే చెప్పింది కదా! మీరూ మీకు ఇష్టమైన వంటకి దూరమయ్యారని బాధపడ్డారు. ఈ లాక్టాన్‌ పుణ్యమా అని మళ్ళీ మీ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టి మా అందరి కడుపులూ నింపుతున్నారు. మనీష వాళ్ళతో పాటు ఇంకో ఇద్దరికి వండితే ఇబ్బంది ఉండదు కదా? నేనూ సాయం చేస్తాను".

"వండటానికి ఇబ్బంది కాదు వల్లీ! డబ్బులు ఇస్తాను అంది చూడు, అది చాలా బాధ కలిగించింది"

"తప్పేముంది అత్తయ్యాగారూ? మీ కష్టానికి తగిన ప్రతిఫలమే తీసుకోండి. ఎక్కువ ఏమీ తీసుకోవద్దు. ఆ తీసుకున్న తృణమో పణమో మన ఇంట్లో వంటావిడ వాళ్ళ కుటుంబానికో, పనిమనిషి మంగ కుటుంబానికో ఇద్దాము. మనం జీతం ఇస్తున్నా కానీ ఈ ఆపత్కాలంలో ఇచ్చే అదనపు సొమ్ము వారికి పెన్నిధి కదా? ఆలోచించండి. లేదా వచ్చిన ఆదాయంలో మన ఖర్చులుపోను మిగిలిన దానితో మనమే వంట చేసి రోడ్డు మీద ఉండే బీదలకి పంచిపెడదాము" అనడంతో ఆలోచనలో పడింది విజయ.

ఒక వారం రోజుల్లో మనీష స్నేహితులిద్దరికి కూడా భోజనం పంపడం మొదలుపెట్టింది విజయ.ఆనోటా ఈ నోటా ఈ విషయం పాకి మెల్లిగా ఆమెకి దాదాపు రోజుకి పాతిక ఆర్డర్లు రాసాగాయి.

శ్రీవల్లి సాయంతో ఆనందంగా అందరి కడుపులు నింపుతూ వచ్చిన ఆదాయాన్ని ఖర్చులకి పోనూ మిగిలినది బీదా బిక్కీ ఆకలి తీర్చడానికి ఉపయోగించేది.

భోజనం తీసుకున్న వాళ్ళ కళ్ళల్లో కనిపించే తృప్తి ఆమెకి వెయ్యి ఏనుగుల బలాన్నించి మరింత ఉత్సాహంగా పని చేయసాగింది .

భార్య అంత ఉత్సాహంగా పనిచేసుకుంటుంటే శంకరం గారికి అబ్బురంగా అనిపించింది. తాను కూడా ఒక చెయ్యి వేస్తానని ఆయన కూడా కూరలవీ తరిగి ఇచ్చేవారు.

ఇంత పని చేస్తే తల్లి ఆరోగ్యం ఎలా ఉంటుందో అని మొదట్లో కార్తికేయ సందేహించాడు కానీ శ్రీవల్లి ఇచ్చిన భరోసాతో మరిక మాట్లాడలేదు.

ఈలోగా శ్రీవల్లి అత్తగారికి తెలియకుండానే ఆవిడ పేరు మీద అంకుర పరిశ్రమని రిజిస్టర్‌ చేసి తన స్నేహితుల ద్వారా ఇంటికి దగ్గర్లో ఖాళీగా ఉన్న ఒక స్థలంలో చిన్న వంటగదిని ఏర్పాటు చేసింది.

మెల్లిగా లాక్టాన్‌ సడలించడంతో పనివారు కూడా దొరకడం సులభమయ్యింది. తన ఇంట్లో పని చేసే వంటావిడ, కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన ఇంకో ముగ్గురు స్త్రీలతో విజయ పర్యవేక్షణలో 'విజయాన్‌ కిచెన్‌' ప్రారంభమయ్యింది.

రుచి, శుచికి మారుపేరుగా పేరొందిన విజయాస్‌ కిచెన్‌ అనతికాలంలోనే లాభాల బాట పట్టింది. ఆమె వంట రుచి చూసిన ఒక కార్పోరేటు సంస్థ యజమాని తమ ఉద్యోగులకి మధ్యాహ్న భోజనానికి విజయతో కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు.

కేవలం అన్నం, కూరలే కాకుండా చిరుధాన్యాలతో అనేక వంటలు అందిస్తూ ముందు సాగడం వల్ల కరోనా అంతమయ్యాకా కూడా ఆమె వ్యాపారానికి ఢోకా లేకుండా పోయింది.

విజయ స్వయంగా బ్యాంకు అధికారులతో మాట్లాడి బుణం తీసుకుని డిమాండుకి తగ్గట్టుగా వంటగదిని ఆధునీకరించింది.అందులో పని చెయ్యడానికి ప్రభుత్వ సంస్థల్లో ఆశ్రయం పొందుతున్న స్త్రీలని నియమించి తన మాటల ద్వారా వారిలో పునురుత్తేజాన్ని కల్పించి, వాళ్ళ కాళ్ళ మీడ వాళ్ళు నిలబడేలా చేసి సమాజములో వారికి గౌరవనీయమయిన స్థానాన్ని కల్పించింది. సంస్థ లాభాల బాట పట్టడంతో విజయ తన సేవా కార్యక్రమాలకి ఒక ట్రస్టు ఏర్పాటు చేసింది.

********

'శ్రీమతి విజయ' అన్న పేరు వినపడి ఈ లోకంలోకి వచ్చాడు కార్తికేయ.తన పేరు పిలవగానే విజయ లేచి అందరికీ నమస్కారం చేసి హుందాగా వేదిక మీదకి నడిచింది.

అవార్డు ప్రదానం చేసిన గౌరవనీయులైన మంత్రిగారు విజయని అభినందించి అంకుర సంస్థ స్థాపనకి గల కారణాన్ని,_తన ప్రయాణాన్ని ఆమె ఇతరులతో పంచుకుంటే మిగిలిన వారికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందనీ ఆమె చేతికి మైకు అందించారు.

"అందరికీ నమస్కారం.నేను ఈ వయసులో ఈ విజయాన్ని ఎలా అందుకోగలిగాను అని మీ అందరికీ సందేహం కలగచ్చు. పని చెయ్యాలనే ఉత్సాహము,చేసే పనిలో శ్రద్ధ ఉంటే చాలు ఏ వయసులో అయినా మీరు ఎంచుకున్న రంగములో విజయాన్ని అందుకోవచ్చు.

అందరు అమ్మలలాగే నేనూ ఇల్లు,పిల్లలే లోకంగా గడిపాను. దశాబ్దాల పాటు నేను కుటుంబం కోసం కష్టపడ్డాను కాబట్టి నన్ను ఇక విశ్రాంతి తీసుకోమని చెప్పి మా పిల్లలు నాకూ, మావారికీ పనుల్లో సాయం కోసమని ఇద్దరు మనుష్యులని పెట్టారు. మొదట్లో బాగానే ఉన్నా క్రమేపీ నన్ను నీరసం ఆవహించింది. నాకు ఓపికుంది అని చెప్పినా పిల్లలేమో
హాయిగా తిని కూర్చోమంటే బాధెందుకు అన్నారే కానీ నా వైపు నుండి ఆలోచించలేదు. అది వారికి నా మీద ఉన్న ప్రేమ అని నాకు తెలుసు.

లాక్డౌన్‌ సమయంలో నేను వంట చేసి ఇద్దరి ఆకలి తీర్చినప్పుడు ఈ అంకుర సంస్థకి బీజం పడింది. నేను ఏ పనిని ఆస్వాదిస్తూ చేస్తానో దానినే మా పిల్లలు నాకు ఆదాయవనరుగా మార్చారు.మా వారికి వచ్చే పెన్షన్‌ మేము ఇద్దరమూ గౌరవంగా బ్రతకడానికి చాలు అందుకని ఈ సంస్ధ మీద వచ్చే లాభం అంతా కూడా మా అత్తగారి "పేరు మీద నెలకొల్పిన
విజయాంబికా ట్రస్టుకే చెందేలే ఏర్పాటు చేసాను. ఆవిడ నుండే నేను ఆకలిగా ఉన్నవారికి భోజనం పెట్టడములో ఉన్న ఆనందాన్ని తెలుసుకున్నాను కాబట్టే ట్రస్టుకి ఆవిడ పేరు పెట్టి దాని ద్వారా అన్నార్తులకి మూడు పూటలా భోజనం అందే ఏర్పాటు చేస్తున్నాము. సమాజానికి మనకి చేతనైనంత ఇవ్వడములో ఉన్న ఆనందాన్ని మీరు ఒక్కసారి అనుభవిస్తే తెలుస్తుంది.

నాకు వంట అంటే ఇష్టం, ఇంకొకరికి ఇంకో పనిలో నైపుణ్యం ఉండవచ్చు. మీరందరూ మీ పెద్దవారిరిని వారికి ఉత్సాహం ఉన్న వ్యాపకంలో ప్రోత్సహిస్తే ఈసారి ఈ అవార్డుల రేసులో పెద్దవారే ఉన్నా ఆశ్చర్యం లేదు.

ఇక్కడ చాలా మంది యువత ఉన్నారు.మీ అందరికీ నేను చెప్పేదొక్కటే.రిటైర్‌ అవ్వగానే లేదా కొంత వయసు వచ్చిన తరువాత పెద్ద వారికి విశ్రాంతి అవసరమే కానీ వారు మేము పని చెయ్యగలము అంటున్నా కానీ మీ అతి ప్రేమతో వారి రెక్కలు కత్తిరించకండి.వారికి ఓపిక ఉన్నన్నిరోజులు వారికి నచ్చిన వ్యాపకంలో మునగనీయండి. తల్లితండ్రులని నిర్లక్ష్యం చెయ్యడం ఎంత గర్హనీయమో వారి రెక్కలు కత్తిరించడం కూడా అంతే అని గుర్తించండి.మాకు ఓపిక లేదని వారు చెప్పిన రోజున అక్కున చేర్చుకోవడం మాత్రం మరిచిపోవద్దు.

ఒక్కటి మాత్రం గుర్తెరగండి, ఏ తల్లీతండ్రీ కూడా నోరు తెరిచి మమ్మల్ని పట్టించుకోండి అని అడగరు.వారి మనసులని గుర్తెరిగి మసలుకోవడం బ్రహ్మవిద్య ఏమీ కాదు.మీ ప్రవర్తనతో అనుబంధాలు ధృడపరచుకోండి కానీ అగాధాలు సృష్టించుకోవద్దు.

మాకు కావాల్సిందల్లా నాలుగు ఆప్యాయమైన మాటలు,మా కబుర్లు వినడానికి మనుషులు...ఇంతే!ఇవి మాలో ఎనలేని ఉత్సాహాన్ని నింపి ఎంతటి అనారోగ్యాన్నైనా జయించే శక్తిని కలుగచేస్తాయి. కానీ ఒక్క మాట!కొంతమందికి రిటైర్‌ అయ్యాకా ఇక జీవితములో పెట్టిన పరుగు చాలు, పిల్లల చెంత గడుపుదాము అనిపించవచ్చు లేదా చూడాల్సిన ప్రదేశాలు చుట్టివద్దామనుకోవచ్చు.వారిని అలాగే ఉండనీయండి, వీలైనంత సమయం వారితో గడపండి.

ధనార్జన ముఖ్యమే కానీ అదే ధ్యేయముగా పెట్టే పరుగులో తలమునకలై విలువైన మీ సమయాన్ని కోల్పోకండి,ఒక్కసారి కనుక పెద్దవారి మనసులు విరిగిపోయి జీవఛ్చవాల్లాగ బ్రతుకులీడుస్తుంటే మీ సంపాదనకి విలువ లేదని గుర్తించండి.

నాకు ఈ అవార్డు రావడానికి నా కుటుంబం అందించిన ప్రోత్సాహం, సిబ్బంది తోడ్పాటు మరువలేనిది, వారు లేకపోతే నేను మీ ముందు నిలబడగలిగి ఉండేదానిని కాదు. నాతో పాటు విజేతలైన ఇతర మహిళలందరికీ అభినందనలు” అని విజయ అనగానే ఆహుతులందరూ లేచి నిలబడి కరతాళధ్వనులతో ఆమెకి అభినందనలు తెలిపారు.

"ఇంక అత్తయ్య ఆరోగ్యం గురించి బెంగ అక్కర్లేదు కార్తీ!తను ప్రాణం పోసిన అంకురం ద్వారా తన సేవా కార్యక్రమాలని విస్తరించుకోవడంలోనో లేకపోతే తన కస్టమర్ల కోసం ఆ రసం, ఈ రసం తయారుచెయ్యడంలో తలమునకలై ఉంటుందే తప్ప నీరసం అన్న మాట వినపడదు" అంటున్న ప్రసాద్‌ మాటలకి మనస్ఫూర్తిగా నవ్వాడు కార్తికేయ.

3 కామెంట్‌లు:

  1. ధనార్జన ముఖ్యమే కానీ అదే ధ్యేయముగా పెట్టే పరుగులో తలమునకలై విలువైన మీ సమయాన్ని కోల్పోకండి,ఒక్కసారి కనుక పెద్దవారి మనసులు విరిగిపోయి జీవఛ్చవాల్లాగ బ్రతుకులీడుస్తుంటే మీ సంపాదనకి విలువ లేదని గుర్తించండి. అన్న సందేశం యువతకి ఈరోజుల్లో చాలా ముఖ్యం. పెద్దల మనసుని ఎప్పటికప్పుడు ఎరిగి ప్రవర్తిస్తే ఎలాంటి అరమరికలూ వుండవని రచయిత్రి చెప్పటం బాగా నచ్చింది.

    రిప్లయితొలగించండి
  2. గుడిపాటి నాగప్రమీల26 జులై, 2023 9:54 AMకి

    మారుతున్నకాలంతోపాటు మనుషులు కూడా మారాలి. కథలో కొడుకు, కోడలు తీసుకున్న నిర్ణయానికి అత్తగారు బాధపడిపోయి... సర్వంకోల్పోయినట్లుగా భావించి నీరసపడిపోయింది. తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాలకి పంపిస్తున్న పిల్లలున్న ఈరోజుల్లో విజయకొడుకు, కూతురు తీసుకున్న నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోవటం విచారకరం. అయితే కోడలు చొరవతీసుకొని విజయ ఎందుకు బాధపడుతుందో అర్థంచేసుకొని దానికి రెమిడీగా కథ కనుక ఒక నిర్ణయంతీసుకుంది. అత్తగారి ఆరోగ్యాన్ని బాగుచేసుకుంది. వాస్తవ జీవితంలో విజయలా ఆలోచించే తల్లిదండ్రులు పిల్లల మనసుని కూడా గుర్తించి ప్రవర్తిస్తే బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
  3. విజయ గీతిక కథ చదువుతుంటే 60 వయసులో కూడా ఇష్టమైన పని చేస్తుంటే నిస్సత్తువ కలగదని అర్థమవుతుంది. ఇల్లు,భర్త, పిల్లలు తోడిదే లోకం లా బతికిన విజయ గారు ఆ వయసులోనూ శక్తి అవార్డ్ అందుకోవటం వెనుక ఉన్నది - చేసే పనిలో ఇష్టం ,ఉత్సాహం,శ్రద్ధ. మంచి స్ఫూర్తిదాయకం ఐన కథ.

    రిప్లయితొలగించండి