పెళ్ళి విలువ
శ్రీ విజయదుర్గ ఎల్
సెల్: 6000712943
అది పెళ్ళిళ్ళ సీజన్ అవ్వడంతో, తన అసిస్టెంట్
అయిన గురవయ్యను తోడు పెట్టుకుని వరుసగా పెళ్ళిళ్ళు జరిపిస్తూ... చివరిగా
ఆనందనిలయంలో కూడా రాఘవ, రేణుల పెళ్ళిని జరిపించడానికి వచ్చారు దీక్షితులు గారు.
ఇద్దరూ బావ మరదలు అవ్వడంతో, ఇద్దరికీ ఒకే దగ్గర
పెళ్లికూతురు పెళ్ళికొడుకుని చేయడం నుంచి ప్రతి కార్యక్రమం కలిపే చేశారు.
సాంప్రదాయానికి ఎంతో విలువ ఇచ్చే దీక్షితులు
గారికి, పెళ్లికూతురు పెళ్ళికొడుకు చేసే వెర్రి మొర్రి చేష్టలకి చిరాకుగా
అనిపించింది. పిల్లలు ఏదో తెలియక చేస్తుంటే, వారికి బుద్ధి చెప్పకుండా... ఇంకా
ప్రోత్సహిస్తున్నట్టుగా పెద్దవాళ్ళు కూడా వాళ్ళు వేసే వెర్రి వేషాలకి పగలబడి
నవ్వుతూ... సాంప్రదాయం ప్రకారం జరిగే పూజల కంటే ఫోటోలకే విలువ ఇస్తూ ఉండడంతో, సహనం
నశించిపోయింది. అయినా మనకెందుకులే, పెళ్ళి జరిపించి మన దారిన మనం వెళ్ళిపోతే చాలు
కదా అని, అన్నిటినీ సహించి పెళ్లి సమయానికి మండపంలో అన్ని అమర్చుకుని సిద్ధంగా
ఉన్నారు.
పెళ్లికూతురిని గౌరీ పూజకి తీసుకురమ్మని ఎంత
పిలుస్తున్నా... రాకపోయేసరికి, కాస్త కోపంగానే అక్కడ ఉన్న ఆడవాళ్ళని అరిచి
తీసుకురమ్మన్నారు.
బ్యూటిషన్ సహాయంతో అందంగా అలంకరించుకుని తయారైన
పెళ్లికూతురు రేణు, అక్కడ ఉన్న తన స్నేహితురాలు అందరితో సెల్ఫీలు దిగుతూ...
పెళ్ళికొడుకైన తన బావ రాఘవను కూడా పిలిచి, ఇద్దరు అసభ్యకరమైన రీతిలో ఒకరినొకరు
కౌగిలించుకోవాలి, ముద్దులు పెట్టుకుంటూ సెల్ఫీలు దిగారు.
సమయానికి పూజ
మొదలు పెట్టకపోతే, అనుకున్న ముహూర్తానికి తాళి కట్టించడం జరగదని దీక్షితులు గారు
గొడవ చేయడంతో, రేణు విసుగ్గా...
“మనం పెళ్లయిపోయిన తర్వాత
తీసుకుందాం లే బావ.” అని, మరోసారి
రాఘవని హత్తుకుని బుగ్గ పైన ముద్దు పెట్టి, ఏమాత్రం సిగ్గు పడకుండా పరుగున వచ్చి,
పీటల మీద కూర్చుని, పంతులుగారు చెప్పిన పూజని నిర్లక్ష్యంగా చేసింది.
నిర్లక్ష్యంగా
పూజ చేస్తున్న రేణుని చూసి, దీక్షితులు గారికి ‘ఇలాంటి పెళ్ళి
నేను చేయడం అవసరమా?’ అనిపించింది.
అప్పటికే ఆలస్యం అవ్వడంతో, పూజకి అమ్మాయి
తల్లిదండ్రులని పిలిపించి, వారిని కూడా అమ్మాయితో పాటు కూర్చోబెట్టి పూజ
చేయించారు. అత్తవారితో ఇప్పించిన ప్రథానం చీర మార్చుకుని రమ్మనగానే, రేణు
పెద్దవారని చూడకుండా... దీక్షితులు గారి మీద కోపం చూపిస్తూ, “వాట్? ఇప్పుడు నేను మళ్ళీ చీర మార్చుకోవాలా?
నేను కట్టుకున్న చీర ఎంత కాస్ట్లీయో తెలుసా! రెండు లక్షలు పెట్టి ఎంతో ఇష్టంగా మా
బావ నా కోసం కొన్నాడు. సో పెళ్లి అంతా నేను ఇదే కట్టుకుంటాను.” అంది.
అప్పటికే చిరాకు
వచ్చిన దీక్షితులు గారు “ఏదోటి ఏడండి.
సాంప్రదాయానికైనా కాసేపు భుజం నిండుగా కప్పుకోమ్మా! కాస్త నువ్వు పక్కకు వెళితే,
అబ్బాయి తోటి పూజ చేయించాలి.” అన్నారు.
కాస్త ఫ్రీ టైం
దొరకడంతో, ఫ్రెండ్స్ తోటి సెల్ఫీలు తీసుకోవడానికి పక్కకి వెళ్ళిపోయింది
రేణు.
దీక్షితులు గారు
పెళ్ళికొడుకుని పిలిచి, గణపతి పూజ చేయించి పూజ అవడంతో అమ్మాయిని తిరిగి పీటల మీదకు
పిలిచారు.
ముందే ప్లాన్
చేసుకున్నట్టుగా డిజె సౌండ్ లో చెవులు పగిలేలాగా పాట మోగుతూ ఉంటే, నలుగురు
స్నేహితులని వెనక ఉంచుకుని, పెళ్లికూతురు పిచ్చిపిచ్చిగా గంతులు వేస్తూ దానిని
డాన్స్ అనుకుంటూ... మండపం పైకి వచ్చింది.
దీక్షితులు గారు
కోపంగా లేచి నిలబడి, “ఇది వివాహం
అనుకుంటున్నారా? ఏమైనా జాతరనుకుంటున్నారా? అసలు అమ్మాయివేనా నువ్వు? కొంచమైనా
సిగ్గు ఉండక్కర్లే! ఏంటీ వింత పొగడలు” అని అరిచారు.
ఎంతో శాంతంగా ఉండే దీక్షితులు గారు ఒక్కసారిగా
అరవడంతో, పెళ్లికూతురు తల్లి తండ్రి పెళ్ళికొడుకు తల్లి తండ్రి పరుగున వచ్చి, “దీక్షితులు గారు కోపం వద్దండి. ఇప్పుడు ఇదే
ట్రెండ్! అమ్మాయి సిగ్గుపడుతూ పందిట్లోకి వచ్చే రోజులు ఎప్పుడో పోయాయి.” అన్నారు.
తప్పు అని చెప్పాల్సిన తల్లిదండ్రులు అంత అలా
వెనకేసుకొచ్చేసరికి, మనసులోనే వాళ్ళని తిట్టుకుని, ఇలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా
దండగే అని, ఆయన కూర్చుని, ముహూర్తానికి సమయం అవుతుంది కాళ్లు కడగాలి. అమ్మాయి
తల్లి తండ్రి కూడా అమ్మాయితో పాటు కూర్చోండి అని, అమ్మాయికి అబ్బాయికి మధ్యలో
అడ్డుతెర కట్టించి పూజ చేయించి, అబ్బాయి కాళ్లు కడిగించారు. కాళ్లు కడిగిన తర్వాత, అమ్మాయి అబ్బాయి చేతిలో
జీలకర్ర బెల్లం ఉంచి, ఒకరి తల పై ఒకరు ఉంచుకుని తర్వాత అడ్డుతెర తీయగానే, ఒకరి
కళ్ళల్లో ఒకరు చూసుకోమని చెప్పారు.
ఒకరి తల మీద ఒకరు
జీలకర్ర బెల్లం పెట్టుకోగానే, “ఇటు చూడండి ఇటు
చూడండి.” అంటూ ఫోజులు చెబుతూ... ఫోటోగ్రాఫర్ ఒక ఐదు
నిమిషాలు పాటు అన్ని యాంగిల్స్ ఫోటో తీస్తూనే ఉన్నాడు. ఒకానొక సందర్భంలో, ఇద్దరి
మధ్యలోనూ కింద వైపుకి కెమెరా పెట్టే సరికి దీక్షితులు గారికి ఒళ్ళు మండి తన చేతిలో
ఉన్న అక్షింతలతో కెమెరా లెన్స్ పై గట్టిగా కొట్టారు. ఆ ఫోటోగ్రాఫర్ భయపడి కెమెరా
తీసుకుని పక్కకెళ్ళిపోయాడు.
దీక్షితులు గారు భారంగా ఊపిరి తీసుకుని వదిలి, “అంతా అక్షింతలు వేయండి.” అనడంతో అంతా వధూవరులకి ఎక్కడ కూర్చున్న వారు
అక్కడే కూర్చుని, కనీసం నిలబడకుండానే అక్షింతలు వేశారు. అది చూసిన దీక్షితులు గారు “హతవిధీ!” అని తల
కొట్టుకుని, ఇద్దరి తల మీద నుంచి చేతులు తీయించి ఒకరి పక్కన ఒకరిని కూర్చోబెట్టి,
ఇద్దరితో మంగళ సూత్రానికి పూజ చేయించి, పూజ పూర్తవుగానే రాఘవ చేతికి తాళిని
అందించి, అమ్మాయి మెడలో మూడు ముడులూ వేసి ఆ ముడి మీద కుంకుమ బొట్టు పెట్టమన్నారు.
రాఘవ పైకి లేచి రేణు
తాళి మెడలో కట్టడానికి ముందు ఒంగగానే, రేణు అటుపక్కకి ఇటుపక్కకి తప్పుకుంటూ మెడలో
తాళి కట్టనివ్వకుండా ఆటలాడింది.
దీక్షితులు
గారికి మరింత కోపం పెరుగుతూ ఉంటే, ఆ కోపాన్ని తగ్గించుకోవడానికి పిడికిలిని
బిగించి బలవంతంగా కళ్ళు మూసుకున్నారు.
అలా చేయకూడదు తప్పు అని చెప్పాల్సిన తల్లి
తండ్రి, అత్తమామలు కిలకిలా నవ్వుతూ ఉంటే, ఆ క్షణం లేచి వెళ్లిపోవాలనిపించింది. తన
వృత్తికి గౌరవం ఇచ్చి కదలకుండా అలాగే కూర్చుని, అంతా సహించారు. ఒక రెండు నిమిషాల ఆట తర్వాత, అబ్బాయి
తాళికట్టగానే... అబ్బాయి అమ్మాయి ఆ పెళ్లి పీటల మీదే ఒకరి పెదవులు ఒకరు అందుకుని
ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు. ఫోటోగ్రాఫర్ ఇంకా ఇంకా అంటూ వాళ్ళని
ప్రోత్సహించి, వివిధ రకాల కోణాల్లో ఫోటోలు తీసుకున్నాడు.
ఇక నా వల్ల కాదు.
పాపం అంటుకుంటే అంటుకుంటుంది. అని, సహనం చచ్చిపోయిన దీక్షితులు గారు కోపంగా లేచి
నిలబడి అబ్బాయి చంపన అమ్మాయి చంపన లాగిపెట్టి కొట్టి, అమ్మాయి తల్లిదండ్రులని
అబ్బాయి తల్లి లను పిలిచి...
“మీరు అసలు
తల్లిదండ్రులేనా? పిల్లలకి నేర్పాల్సింది ఇదేనా? ఎంత బావ మరదలు అయితే మాత్రం మరీ
ఇంత భరితెగింపా... సాంప్రదాయగా చేసుకోవాల్సిన వివాహాన్ని ఎంత అపహాస్యం చేసేసారు.
అసలు పెళ్లంటే విలువ తెలుస్తుందా మీకు? ఈ రోజుల్లో పెళ్లికి అర్థమే మార్చేశారు.
మీకు నచ్చినపుడు చేసుకునే దానికి ఫోటోలు ఫోజులిచ్చుకోవడమే ముఖ్యం అనుకునే మీకు,
పెళ్లికి ముహూర్తాలు ఎందుకు? అసలు పెళ్లంటే ఏంటో తెలుసా? పెళ్లిలో మంత్రాలు ఎందుకు
చదువుతారో తెలుసా? పెళ్లిలో జరిగే ప్రతి తంతుకి ఒక అర్థం ఉందని మీకు తెలుసా? ముందు
అవి తెలుసుకోండి. ఆ తర్వాత మీరు చేస్తున్న ఈ వెర్రి మొర్రి చేష్టలను చేసుకోండి. పక్క దేశాల వాళ్లు కూడా మన భారతీయ వివాహ
వ్యవస్థని ఎంతో గౌరవిస్తున్నారు. వారే వచ్చి ఇక్కడ మన పద్ధతిలో వివాహాన్ని చేసుకుంటున్నారు.
కానీ, మీరు మాత్రం సాంప్రదాయాన్ని గంగలో కలిపేసి వింత పోకడలకు పోతూ... వింతగా
వింతగా ప్రవర్తిస్తూ పెళ్ళిని అపహస్యం చేస్తున్నారు. ఇప్పటికైనా మంచి చెడ్డలు
తెలుసుకోండి. అసలు పెళ్ళి అంటే ఏంటో చెబుతాను వినండి” అంటూ...
అసలు పెళ్ళి
అనేది.. భారతీయ సంప్రదాయంలోనికి ఎలా వచ్చింది? అనేది. వివరించడం మొదలుపెట్టారు.
పెళ్ళి అనేది, కేవలం ఇద్దరి మధ్యే కాదు రెండు
కుటుంబాల మధ్య అని చెప్పేందుకే అయిదు రోజుల, మూడు రోజుల, ఒకే రోజు, ఒకే పూట, ఒకే
గంట ఇలా వివాహం. ఎలా జరిగినా వధూవరుల సుఖ సంతోషాల కోసము బంధువుల సమక్షంలో.. పెద్దల
దీవెనలతో ఇద్దరూ కలిసి ఒక్కరుగా జంటగా మారిపోయారడినికి, ‘స్త్రీ, పురుషుల మధ్య మానసిక, శారీరక, ఆర్థిక,
సాంఘిక సంబంధాలని ఏర్పరచే సామాజికమైన ఒప్పందం పేరే పెళ్ళి.’ పెళ్లంటే నూరేళ్లు.. తాళాలు, తప్పట్లు, పెళ్ళి
పందిళ్లు, మంగళ వాయిద్యాలు, మూడు ముళ్లు, బంధువుల సందడి. ఇది భారతీయ హిందూ
సంప్రదాయ పెళ్ళి. ఇల్లంతా పచ్చటి
తోరణాలు, చుట్టాల ముచ్చట్లు, ఆడవాళ్ల ఆభరణాలు, పట్టుచీరల సోయగాలు, పిల్లల
కోలాహలంతో.. పెళ్లి ఇంటి సందడే సందడి. ఇక మూడు ముళ్లతో ఒక్కటయ్యే జంట సంగతి
చెప్పనక్కరలేదు.
చిలిపి ఆలోచనలు, సిగ్గు తెరలు, ముసిముసి
నవ్వులు, అందమైన అలంకరణలో మెరిసిపోతుంటారు. వధువు, వరుడు. పవిత్రంగా భావించే హిందూ సంప్రదాయ పెళ్ళిలో..
చాలా విశిష్టతలున్నాయి. చాలా ఆచారాలు, సందప్రదాయాలు ఉన్నాయి. అగ్నిహోత్రం వెలుతురులో, కొత్త జీవితాన్ని
ఆహ్వానిస్తున్న వధూవరులు, పెళ్ళికి పరమార్ధం చెప్పే వేదమంత్రాలు, శ్రావ్యంగా
వినిపించే మంగళవాయిద్యాలు, మనస్పూర్తిగా దీవించే పెద్దలు. ఇంకా.. అందరికీ ఆహ్వానం
పలికే పచ్చటి పందిరి, ఘుమఘుమలు సువాసనలతో నోరూరించే విందు భోజనం, అన్నింటినీ
మేళవించేదే! తెలుగింటి పెళ్ళి వైభోగం. పెళ్ళి జరిగేటప్పుడు నిర్వహించే ఘట్టం, ప్రతి
ఆచారం, ప్రతి వాగ్దానం వెనక చాలా అర్థాలు, పరమార్థాలు ఉన్నాయి. అందుకే ఈ
ఆచారాలకు.. అంత ప్రాధాన్యత ఉంది. హిందూ సంప్రదాయానికి అద్దం పట్టే తెలుగు
పెళ్ళిలోని విశేషాలు, వాటి విశిష్టతలు ఏంటో! మీ అందరికీ ఒక్కొక్కటిగా వివరించి
చెబుతాను. ఓపికగా వినండి నాయన.
మొదటిగా పెళ్ళి ముందుగా వధూవరులకు దృష్టి దోష
నివారణకు, సున్నిత భాగాలపై దృష్టి దోషం తగలకుండా ఉండటానికి నుదుటన బాసికాన్ని
కడతారు. వధూవరుల నుదుటి పై కాంతులీనే ఆభరణమే బాసికం. దీన్ని పూలతో, బియ్యపు గింజల
కూర్పుతో, ముత్యాలతో తయారు చేస్తారు. దీన్ని పెళ్ళి సమయంలో ఖచ్చితంగా వధూవరులు
కట్టుకోవాలి. ఇక తరువాత ముఖ్యమైన
వాటిలో, వధూవరుల మధ్యలో తెర. వధువును జీవాత్మగా, వరుడిని పరమాత్మగా భావిస్తే..
మధ్యలో ఉండే తెర మాయ. జీవాత్మకు.. పరమాత్మ దర్శనం కావాలంటే, మాయను తొలగించి, తల పై
చేతులు ఉండగా.. భూమధ్య స్థానంలోనే చూస్తే, వాళ్ల బంధం బలపడుతుంది.
తదుపరి జీలకర్ర, బెల్లం తల పై పెట్టించడం.
జీలకర్ర, బెల్లం కలిపితే.. ధన విద్యుత్ ఉత్పన్నమై వస్తువులను ఆకర్షించే శక్తి
కలుగుతుందని, సైన్స్ చెబుతోంది. జీలకర్ర, బెల్లం పెట్టడం వల్ల తల పై ఉండే
బ్రహ్మరంధ్రం తెరుచుకుంటుంది. అలాగే జీలకర్ర బెల్లం మిశ్రమం బాగా కలిసిపోతుంది.
అలా వధూవరులు కూడా కలిసిపోవాలని.. పూర్వీకులు ఈ సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు.
తదుపరి కన్యా దానం. కన్యాదానం దానం చేస్తే.. ఆ వస్తువుతో మనకు
అన్ని సంబంధాలు తెగిపోతాయి. కానీ, పెళ్ళిలో మాత్రం అలా కాదు. దానాలలో అతి శ్రేష్టమైనది
కన్యాదానం. పెళ్ళి కూతురి తండ్రి తన కూతురిని, వరుడికి దానం ఇస్తారు. పంచ భూతాల
సాక్షిగా, అల్లారు ముద్దుగా.. పెంచి పెద్ద చేసిన కూతురిని ధర్మ, అర్థ, కామ,
మోక్షాలకై అల్లుడికి దానమిస్తాడు, వధువు తండ్రి. ఈ దానం వల్ల తనకు బ్రహ్మలోక
ప్రాప్తి కలుగుతుంది.
మంగళ సూత్రధారణ పెళ్ళినాడు వరుడు.. వధువుకు తాళికట్టే
సాంప్రదాయం ఆరో శతాబ్దంలోనే ఆరంభమయింది. మంగళ సూత్రం అనే శబ్దం సంస్కృతం నుండి
పుట్టింది. సంస్కృతంలో “మంగళ” అంటే శోభాయమానం, శుభప్రదం అని అర్థం. సూత్రం
అంటే తాడు, ఆధారమైనది అని అర్ధం. మంగళప్రదమైంది కనుగ మంగళ సూత్రం. ఇది వైవాహిక
జీవితం నుంచి సమస్త కీడులను తొలగిస్తుందని నమ్మకం. ఈ మాంగల్యాన్ని వరుడు, వధువు
మెడలో వేసి మూడుసార్లు ముడి వేస్తాడు. మనకు మూడుతో విడదీయరాని సంబంధం ఉంది.
త్రిమూర్తులు, త్రిగుణాలు, త్రికాలాలు, ఇలా ఏది చూసినా మూడే ఉంటాయి. అలా మూడుకు ఉన్న
ప్రాధాన్యాన్ని బట్టి ముడులు కూడా మూడు ఉన్నాయి.
అలాగే మనకు స్థూల, సూక్ష్మ, కారణ అని మూడు
శరీరాలు ఉన్నాయి. ఆ మూడు శరీరాలకు మూడు ముళ్లు అనే అర్థం కూడా ఉంది. కాబట్టి స్థూల
శరీరం ఉన్నా, లేకున్నా! వారి మధ్య ఆ బంధం ఉండాలి అనేది అందులోని పరమార్థం. మంగళ సూత్రధారణ
జరుగుతున్నప్పుడు.. ఈ మంత్రమున్ని పఠిస్తారు.
“మాంగల్య తంతునానేనా! మామ జీవన హేతునా!
కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం!
మాంగల్య ధారణ ముహూర్తః సుముహూర్తః అస్తు”
అంటే నా
జీవితానికి కారణమైన.. ఈ సూత్రంతో, నేను నీ మెడలో మాంగళ్యం అనే ఈ బంధాన్ని వేస్తున్నాను.
నీ మెడలోని మాంగల్యంతో.. నీవు శత వసంతాలు జీవించాలి. నీ మాంగళ్యమే నాకు రక్ష. నా
జీవితం, నా జీవనగమనం ఈ మాంగళ్యంపైనే ఆధారపడి ఉందని అర్థం.
ఈ మూడు ముడుల
అర్ధం:
1. ధర్మ
పురుషార్ధానికి సంకేతము.
2. అర్ధ
పురుషార్ధమునకు సంకేతము.
3. కామ
పురుషార్ధమునకు సంకేతము అని, ఆర్యుల వచనం.
1. గత జన్మ బంధం
2. ఈ జన్మ బంధం
3. భవిష్యత్ జన్మ
బంధం అని, కొందరు అంటారు.
అంటే! అన్యోన్య
అనురాగంతో.. జన్మ జన్మలకు, ఈ మైత్రి బంధం మన ఉభయులకూ, అలాగే సాగాలని! ప్రేమ బంధం
మూడు మారులు వెయ్యడం జరుగుతుంది.
మరి కొందరు, త్రి
కరణయా! మనసా, వాచా, కర్మణా, నీ భారం వహిస్తాను. కనుక, నీవు నా భార్యవు అని మూడు
ముడులు వేస్తారు.
తరువాత తలంబ్రాలు. తలంబ్రాలు వివాహంలో ముఖ్య ఘట్టం. వధూవరులు భావి
జీవితం మంగళమయం కావటానికి, మంగళ ద్రవ్యాలచే చేయించే పవిత్ర కర్మ ఈ తలంబ్రాలు.
వీటికి వాడేవి అక్షతలు. అక్షత అంటే విరిగిపోనివి అని అర్థం. ఇక దానికి బియ్యాన్నే
ఎందుకు ఉపయోగిస్తారంటే బియ్యం ఇంటి నిండా సమృద్ధిగా ఎప్పుడూ ఉండాలని, గృహస్థు
ఇంట్లో ధాన్యానికి ఎప్పుడూ కొరత లేకుండా ఉండాలని, ఇద్దరూ ఒకరి పై ఒకరు తలంబ్రాలు
పోసుకొంటారు. మాకు కావలసిన సిరిసంపదలు సంవృద్ధిగా ఉండాలి. మాకు కీర్తి ప్రతిష్ఠలు
సంమృద్ధిగా ఉండాలి. అని, కోరుకుంటారు.
తరువాత బ్రహ్మముడి. బ్రహ్మముడి వధువ చీర అంచును, వరుడి ఉత్తరీయం
చివరలను కలిపి ముడి వేయటం. అంటే! జీవితాంతం ఆశీస్సులను, బ్రాహ్మణాశీర్వచనాలను
దంపతుల కొంగులతో ముడివేయటమే. వధూవరుల బంధం శాశ్వతంగా, స్థిరంగా ఉండాలని ఈ ముడి
వేయిస్తారు.
అంగుళీకాలు తీయడం లేదా ఉంగారాల ఆట: ఉంగరాలు తీయడాన్నే ప్రధానాంగుళీయకం అంటారు.
పెళ్లిలో ఉంగరాలు తీసే కార్యక్రమం, వధూవరులతో పాటు.. చుట్టూ ఉన్న వాళ్లందరికీ చాలా
సరదా. చూడటానికి చాలా సరదాగా
కనిపించే తంతు ఇది. పోటీ పడి గెలవాలనే పట్టుదలని, అంతలోనే తను ఓడిపోయి ఎదుటి
మనిషిని గెలిపించాలనే ప్రేమ భావనని చిగురింపజేస్తుంది. ఇది కేవలం అప్పటిదాకా
పరిచయం లేని వదూవరులకు.. స్పర్శ తాలూకు సాన్నిహిత్యాన్ని తెలియచేయడానికి
ఉద్దేశించబడిన కార్యక్రమం.
పాణిగ్రహణం: కన్య చేతిని వరుడు గ్రహించటమే పాణిగ్రహణం.
వరుడు తన కుడి చేతితో.. వధువు కుడి చేతిని పట్టుకోవటాన్ని “పాణిగ్రహణం” అంటారు. ఇక పై నేనే నీ రక్షణా భారం వహిస్తానని
సూచించటానికి, పురుషుని కుడి చేయి బోర్లించి, స్త్రీ కుడి చేయి పైకి ఉండేలా చేయి
పట్టుకోవాలి. దీనికి అర్థం ఇంటి యజమానురాలిగా, ఇంటిని తీర్చిదిద్దే ఇల్లాలిగా
ఇంటికి రమ్మని ఆహ్వానించటం.
ఏడు అడుగులు:
హోమం పవిత్రమైన
అగ్ని.. మనిషికి, దేవునికి వారధిగా ఉంటుంది. హోమం చుట్టూ పెళ్ళి కొడుకు, పెళ్ళి
కూతురు మనస్సాక్షిగా ఒకరిని ఒకరు
అంగీకరిస్తున్నట్టు. అందరి ముందు ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఏడు సార్లు తిరుగుతారు. భార్యా భర్తలు ఇద్దరూ కలిసి వేసే ఏడు అడుగుల్లో
ప్రతి అడుగుకి అర్థం ఉంది.
1. ఇద్దరూ కలిసి
సంసార బాధ్యతలు తీసుకుంటామని,
2. ఇద్దరం
ధైర్యంతో, శక్తితో అన్ని అవసరాలని తీర్చుకుంటామని,
3. ఇద్దరం కలిసి
కుటుంబం సుఖ సంతోషాల కోసం పాటుపడతామని,
4. కష్టసుఖాలలో
కలిసి ఉంటామని,
5. ఇద్దరం కలిసి
పిల్లల్ని మంచిదారిలో పెంచుతామని,
6. ఇద్దరం కలిసి
సుఖ, శాంతి కోసం పాటుపడతామని, ఆధ్యాత్మికంగా పురోగతి సాదిస్తామని,
7. జీవితాంతం
పెళ్లి బంధంలో ఉంటామని చెబుతారు.
అరుంధతీ నక్షత్రం: వివాహం జరిగిన రాత్రి వధూవరులను ఇంటి బయట
తూర్పు లేదా ఉత్తరానికి తీసుకువెళ్లి మొదట ధృవ నక్షత్రాన్ని, తర్వాత అరుంధతీ
నక్షత్రాన్నీ చూపిస్తారు. ధృవ నక్షత్రం
వారు నిశ్చలమైన మనస్తత్వం తో స్థిరంగా ఉండాలని, వధువు అరుంధతిలా మహా పతివ్రత
కావాలనే ఆకాంక్ష. అంతేకాకుండా అరుంధతీ ఎన్నడూ.. వశిష్ట మహర్షిని విడిచి ఉండలేదు.
అలా నువ్వు కూడా నన్ను విడిచి ఉండకుండా.. అరుంధతీ తారలాగ నిలవాలని వరుడు వధువునకు
అరుందతి నక్షత్రాన్ని చూపుతాడు.
పెళ్ళిలో ఆఖరు ఘట్టం అప్పగింతలు. పిల్లని అప్పచెప్పడానికిగాను.. ఒక పళ్ళెంలో
పాలు పోయించి.. పెళ్ళి కూతురు అర చేతులలో, తల్లి తండ్రులు తమలపాకుతో పాలు రాసి.. ఆ
పాల చేతులను పెళ్ళి కొడుకు చాచిన అరచేతులకు రాయిస్తారు. ఈ కార్యక్రమం జరుగుతున్నంత సేపూ.. వధువు
తల్లితండ్రుల బాధ చెప్పనలవి కానిది. ఇరవై, పాతికేళ్ళు పెంచి విద్యా బుద్ధులు
చెప్పించి, అపురూపంగా చూసుకున్న.. ఆ ఇంటి మహలక్ష్మి అనుకున్న అమ్మాయిని.. వివాహం
చేసి పంపుతూ, ఇక తన కూతురు తన ఇంటికి అతిథిగా రావాల్సిందే కదా! అన్న ఆలోచనతో.. ఆ
తల్లి తండ్రులు వైభవంగా పెళ్ళి చేసి.. బేలగా అప్పగింతలు జరపుతారు
కొత్తగా పెళ్ళి అయిన అమ్మాయి.. అత్తగారింట్లో
కాలు పెట్టే ముందు బియ్యాన్ని కాలితో నెట్టి లోనికి వస్తుంది. లక్ష్మీ నివాసముండే
వరి బియ్యం లేదా బియ్యంతో నిండిన కలశంను గడప పై ఉంచుతారు. ఇలా దీన్ని ఇంట్లోకి
నెట్టుతూ.. లోపలికి పెళ్ళి కూతురు వస్తే.. లక్ష్మీ దేవినే! ఆ ఇంట్లోకి
తీసుకొచ్చినట్టు అవుతుందని అర్థం. ఆ ఇంటికి లక్ష్మి కటాక్షం వస్తుందని నమ్మకం. అంతేగాక.. ఇంకా కొన్ని ముఖ్యమైన తెలుసుకోవలసిన
విషయాలు ఉన్నాయి.
*మంగళ సూత్రంతో పాటు..
నల్ల పూసలు గొలుసుగా ధరించడం, హిందూ సాంప్రదాయం. దుష్ట శక్తులు తన మాంగల్యం మీద
పడకుండా ఉండటానికి ధరిస్తారు. అంతే కాకుండా.. నల్ల పూసలు సంతాన సాఫల్యానికి,
దానానికి, సుఖానికి చిహ్నాలు. నల్లపూసలు మంగళకరమైన, సౌభాగ్యమైన ఆభరణము.
*భార్య, భర్తకు
ఎలాంటి కార్యాలలోనైనా.. ఎడమ వైపునే ఉండాలన్నది నియమం. పూజలు, దానాలు, ధర్మాలు
చేసేటప్పుడు భార్య, భర్తకు ఎడమవైపునే ఉండాలి. కన్యాదానం, విగ్రహ ప్రతిష్టలప్పుడు
కుడి వైపున ఉండాలి.
ఇవి పెళ్ళి తంతులో
ముఖ్యమైన విషయాలు.
“వీటిని గౌరవిస్తూ.. మీ
సహధర్మచారిణితో అన్యోన్యంగా వివాహ జీవితాన్ని కొనసాగిస్తూ... నిండు నూరేళ్లు
సంతోషంగా జీవించాలి. అందుకే, ఇంత ఆర్భాటంగా పదిమంది పెద్దలను పిలుచుకుని
బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళి చేసుకునేది. ఇకనైనా మారండి పెళ్ళికి విలువ ఇవ్వండి.” అని చెప్పడం ముగించారు. దీక్షితులు గారు.
దీక్షితులు గారి
మాటల్లో నిజాలను గ్రహించిన అంతా... దీక్షితులు గారికి నమస్కరించి, క్షమించమని
కోరారు. ఒకరిని చూసి ఒకరు, ‘పులిని చూసి నక్క
వాత పెట్టుకున్న’ చందంగా... అసలు
సంప్రదాయాలను పక్కన పెడుతూ నచ్చినట్టుగా మార్చేసుకున్న వివాహ వ్యవస్థలో తప్పులను
గ్రహించి, ఇక ఎప్పుడు అలా చేయము అని... మా కళ్ళ ముందు అలా జరుగుతున్నా వాటిని
ఖండిస్తాము అని దీక్షితులు గారికి మాట ఇచ్చారు.
ఆ మాటతో
దీక్షితులుగారు సంతోషించి, వధూవరులకు అక్షింతలు వేసి “నిండు నూరేళ్లు పిల్లాపాపలతో సుఖంగా జీవించండి” అని ఆశీర్వదించి ఆ తర్వాత జరిగే తలంబ్రాల
కార్యక్రమం అన్ని పూర్తి చేసి సంభావన తీసుకుని వెళ్ళిపోయారు.
***సమాప్తం***
ఇప్పడు జరుగుతున్న పెళ్ళిళ్ళ ను బాగా వ్రాసారు. పురోహితుని తిరుగుబాటు బావుంది.
రిప్లయితొలగించండిమీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియ చేసినందుకు దన్యవాదాలు 🙏🙏🙏
తొలగించండిపెళ్ళిలో పరమార్థం బాగా వివరించారు. మూడు ముళ్లు బ్రహ్మ గ్రంధి విష్ణు గ్రంధి రుద్ర గ్రంధి అని మన కుండలినీ యోగసాధన లో కూడా ఉంటుంది. మూడు ముళ్లు తాళి బంధం వెనక చాలా మంచి ఆలోచన దాగుంది. కానీ నేటి పెళ్ళిలో డాన్సులు వేసే వధువులు ఎక్కువయ్యారు. మీ రచనకు A1 గ్రేడ్ ఇస్తున్నాను మేడం.
రిప్లయితొలగించండివరాహ కృష్ణ @ CVK
హిందూ సాంప్రదాయంలో పెళ్లి తంతుకి ప్రత్యేక స్థానం ఉంది పవిత్రమైన ఆ కార్యక్రమం అగ్నిసాక్షిగా జరుగుతుంది వధూవరులను పవిత్రంగా పెళ్లి పీటల మీద చూస్తూ పురోహితుడి వేదమంత్రాల నడుమ తాళి కట్టి తలంబ్రాలు పోస్తూ నాతిచరామి అంటూ వాగ్దానాలు చేసే పెండ్లి కొడుకు తలవంచి అతన్ని అనుసరించే పెండ్లి కూతుర్ని చూస్తూ తమ ఆశీస్సులు అందించే పెద్దలు ఉన్న పెళ్లి పెళ్లి ఇప్పుడు అవన్నీ గంగ లో కలసిపోయాయి మీ రచన చాలా బాగుంది హిందూ సాంప్రదాయ వివాహ వేడుకను చాలా బాగా వర్ణించారు
రిప్లయితొలగించండిమహాలక్ష్మి రవిరేల
రిప్లయితొలగించండి🙏🙏🙏
తొలగించండిచాలా బావుంది.. పెళ్లిలో జరిగే ప్రతి తంతు గురించి చాలా గొప్పగా చెప్పారు
రిప్లయితొలగించండిNice.Explained very well
రిప్లయితొలగించండిహిందూ వివాహ సంప్రదాయం గగురించి చాలా చక్కగా వివరించారు 👌
రిప్లయితొలగించండిసూపర్ ఉంది 👌చాలా బాగా చెప్పారు.
రిప్లయితొలగించండిThank you 🙏
తొలగించండిపెళ్లిళ్ల సంప్రదాయాలు మర్చిపోకుండా వాటిని ముందు తరాల వరకు తీసుకొని వెళ్లే తిరుగుబాటు పంతులు 👌
రిప్లయితొలగించండిపెళ్లి విలువ కథ నేటి వివాహ వేడుకను కళ్ళెదుట చూపించింది. నిజానికి పెళ్ళంటే ఫోటోల కోసం జరిగే తంతులా తయారైంది.పసుపు కొట్టడంతో మొదలయ్యే హడావుడి వ్రతంతో ముగిసేవరకు క్రియేటివిటీ పేరుతో ఎగస్ట్రాలు ఎక్కువై పెళ్లివేడుక లోని అనుభూతిని దూరం చేస్తున్నాయి. చుట్టాలు,మిత్రుల మధ్య సింపుల్ గా శాస్త్రోక్తంగా జరుపుకునే పెళ్లి నిజానికి ఎన్నో ముచ్చట్లను మిగుల్చుతుంది.
రిప్లయితొలగించండిదీక్షితులు గారి ఆగ్రహం సమంజసమే కాక చాలా విషయాలను తెలియజేసింది.
రచయిత్రి గారికి అభినందనలు.
మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియ చేసినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏
తొలగించండి