76. బాట యందునున్న బండరాళ్ళను బోలి
కాలి కడ్డు తగులు గర్వమతులు
భక్తవరుడు వాని ప్రక్కకు తొలగించి
ముందు కేగినపుడు ముక్తి పొందు
77. మహిని కాగితముగ మలచి వృక్ష వితతి
కలప నెల్ల జేసి కలములుగను
సప్త సాగరముల జలము సిరా జేసి
గురుని మహిమ వ్రాయ కొదవయుండు
78.గురు సమానుడైన గొప్పదాతయె లేడు
శిష్యుడర్ధి యయిన సృష్టియందు
తా నొసంగు గురువు త్రైలోక్య జ్ఞానంబు
ఆకళింప గలుగు అర్థియున్న
79. శాస్త్ర గ్రంథములను చదువంగ ఫలమేమి?
ప్రేమ నెరుగకున్న విలువ లేదు
చిత్రమైన ప్రేమ చిన్న పదమె కాని
తెలుప లేని గొప్ప విలువ కలదు
80. సుందర వనమొకటి శోభిల్లు ప్రేమతో
చిందు వేయు దందు చిత్తమలర
పేమ మొయిలు కురియ వికసించు హృదయమ్ము
ప్రీతి పాత్రమేది ప్రేమ కన్న
81. గురువు చేయు సేవ కొలుచు పాత్ర కలదా?
ఆది దేవుడయిన హరుని జూపు
మంచి గురుని కన్న మహిమాన్వితుండిల
కానరాడు నిజము కనుగొనంగ
82. పసుపు సున్న మొంది పారాణియైనట్లు
వర్ణ మెద్ది యైన భక్తి కలుపు
దైవ సృష్టిలోన తనువులు వేరయ్యు
అఖిల జనుల అంతరాత్మ యొకటి
83. విద్య నేర్చుకొనగ వేడ్మయుండియు కూడ
దొడ్డ గురుని అండ దొరకకున్న
పూర్తి జ్ఞానమబ్బ బోవదు వానికి
సద్దురుండె బ్రతుకు చక్క దిద్దు
84. గోచరించ బోడు గురువు దైవమటుల
బ్రతుకు బాట దిద్దు వాని వలెనె
అహము వదలి గురుని సహకారమును పొంద
బ్రహ్మ తత్వ మెరుగు బ్రాహ్మణుడగు
85. మనసు, తనువు, వాక్కు మలినమ్ము కానీదు
దైవ చింత యొకటి ధన్యుజేయు
దుఃఖ వార్ధి దాటు దొడ్డ నావ గలదె?
దైవ మొకటి గాక తరణి మొండు
86. చెప్పవలెనె ఒరులు? తప్పిదంబిదియని
దుర్దనాళి చెలిమి దోషమవదె?
విస్తరిల్లు గాదె వెల్లుల్లి వాసనల్
దాగి యుండి తినిన దాచగలమె?
87. స్వామి స్మరణ మాని సంసార కడలిలో
ఈదులాడు వాడు ఇందె యుండు
తుదకు వెంట రారు తోబుట్టువులు కూడ
చివరి యాత్ర నొకడె చేయవలయు
88. జ్ఞాన మున్న యెడనె నర్తించు ధర్మంబు
అన్ఫత మున్న దనుట కఘమె సాక్షి
కలుగు లోభమెచట కాలుండు అటనుండు
సహన మునికి పట్టు స్వచ్చతకును
89. అలల తేలియాడు ఆనంద ముప్పొంగ
సాగరమున నావ సాగునటుల
చక్రి చింతనమున సంసారమను యాత్ర
ఒడు దొడుకులు లేక ఒద్దు జేరు
90. రామ నామ మనెడు రమ్యమౌ రత్నమ్ము
మూట గట్టి దాతు ముక్తినంద
రత్న వర్తకులెవరడుగురాక! కబీరు
చూచుటకును నైన చూపననియె
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి