శివలీలలు 9

 మడివాడు మాచయ్యకథ

‘‘మడివాడు మాచయ్యనే పరిపూర్ణ వార వ్రతాచార సంపన్నులు. వీరు చాకలివృత్తిని అనుపాలనంచేసిన ప్రత్యక్ష రుద్రావతారులు. వీరు జంగమారాధనాశక్తితో కల్యాణకటకమునకు విచ్చేసిరి. అపుడు బసవేశ్వరుడు మహాదేవ భక్తుడైన మాచయ్యకు సకల సేవానిరతిని ఆపేక్షించి వారిని సేవించిరి. జంగమకోటిని ఆరాధిస్తూ మాచయ్యగారి కళ్యాణకటకమునందే నివసించుచుండిరి. కామక్లేశం కలిగించే ఎటువంటి పనులనైనా చేయుటకు వెనుకాడక చేయుటను తక్కువగా భావించకుండా నిరంతరం శివభక్తులకు సేవచేయుట అను వ్రతమునకు పూనుకొనెను.

శైవభక్తుల వస్త్రములను ఉతుకుట అను కార్యముచే తన శివుని పైగల తన భక్తిని నిరూపించుకొను ఒక అవకాశంగా భావించుకొనెను. ప్రతిరోజూ వేకువరaామునే లేచి శివభక్తుల వస్త్రములను మూటగట్టుగొని రేవునకు వెళ్లి చక్కగా ఉతికి ఆరవేసి, ఆరిన ఆ వస్త్రములను చక్కగా మడతవేసి స్వచ్ఛమైన సంప్రదాయపద్ధతిలో ఆ మూటను తీసుకొని తను ఉండుచోటుకి వచ్చి, ఎవరి వస్త్రములను వారికి అప్పగించి శివభక్తులనుండి ధరించుటకు సరియైన వస్త్రములేనివానికి వస్త్రదానం చేసి శివభక్తులకు సేవచేయుట యందు మిక్కిలి ఆసక్తి ప్రదర్శించెను. వీరు రేవులకు వస్త్రములను తీసుకొని వెళ్ళినపుడుగాని తిరిగి వచ్చునపుడుగాని ఎవరూ నాకెదురుపడకూడదు, ఎవరూ తాకకూడదని కూడా హెచ్చరికగా కేకలు వేయుచూ, తన దగ్గరున్న పెద్దగంటను దారిపొడుగనా వాయించుచూ భక్తులుండు మఠము నుంచి రేవునకు వెళ్ళితిరిగి మళ్ళీ అదే పద్ధతిని శివభక్తులుండు మఠమునకు వెళ్ళెడివారు. 

ఇటువంటి మాచయ్యగారిని గూర్చి బసవేశ్వరుడు (ఇతడు నందీశ్వరావతారమని కన్నడిగులు నమ్ముదురు) సందర్భము వచ్చినప్పుడల్లా ప్రస్తుతిస్తూ ఉండెడివారు. వీరవ్రతాచార నిష్ఠుడైన మాచయ్యగారు ఒకరోజున మార్గమధ్యలో గంటను వాయించుచూ పెద్దపెద్దగా కేకలు వేయుచూ పెద్ద గుట్టవంటి బట్టలమూటను మోయుచూ వెళ్లు చుండగా ఆ ప్రాంతవాసిగాని వ్యక్తి ఒకరు మాచయ్యగారు తీసుకొనివచ్చు బట్టలమూటను తాకెను. అపుడు మాచయ్యగారు వీరావేశాన్ని పొంది అప్రతిహత శౌర్యపరాక్రములచే గుడ్డల మూటతాకిన వ్యక్తిని చంపివేసెను. తరువాయి మాచయ్యగారు తనదారిని తానుపోయెను. 

ఈ సంఘటనను చూసిన ఆ వీధిప్రజలు దిగ్భ్రాంతులై భయకంపితులై రాజుగారివద్దకు వెళ్లి ఈ విధముగా పలికిరి. భక్తుడుగా చెప్పుకొను ఒక ఉన్మాది చాకలి తాను చాలాగొప్ప శివభక్తుడని చాటించుకొంటూ కత్తికఠారును వేసిలలో ధరించి త్రోవాంతనైయిచరిస్తూ వచ్చువారికికానీ, వెళ్ళువారికికానీ దారి ఇవ్వక తాను మాత్రమే వెళ్ళుచూ అందరికీ భయభ్రాంతులు కలిగించునట్టి కేకలువేయుచూ, ఎవరిని లక్ష్యపెట్టక వెళ్లెడివాడు. ఆ బట్టలమూటను ఎవరైనా రాచుకుంటూ నడిచిన వారిని పొడిచేస్తానని కేకలు వేసెడివాడు. ఆ ప్రాంతమున ఉండు జనులకు మాచయ్యగారు వచ్చునప్పుడుగాని వెళ్లునప్పుడుగాని నిర్భయముగా వారొచ్చు ప్రాంతమున తిరుగుటకుకూడా వీలులేకుండెను. వారు వచ్చుమార్గములో ఎవరై ఆ వీధని అడుగుపెట్టిన చాలు హడలుగొట్టి పరుగులెత్తునట్లు చేసెడివాడు. ఆ వీధిన మనుషులేకాదు గుర్రం ఏనుగులాంటి జంతువులుకూడా తిరుగుటకు భయపడుతున్నవి. ప్రాణములనన్నియు అరచేతిన పెట్టుకొని జనులంతా గడగడలాడుచున్నారు. చాకలివాడు మార్గమున వచ్చుచున్నాడని తెలిస్తేచాలు ఎక్కడివాళ్ళు అక్కడకు పరుగుల తీయుచున్నారు.ఇవ్వాళ్ల వాడెవరో పాపం పరదేశికాబోలు. ఇతనిగూర్చి అతనికి తెలియదు కాబోలు. సంతకుపోతూ మాదయ్యగారు వస్తున్న వీధిలో అతనికి తారసపడెను. పొరపాటునో గ్రహపాటునో అతడెదురు కాగానే మాచయ్యగారు పొడిచి ఆకాశము పైకి ఎగురవేసిరి. ఓ మహారాజా! శవము కూడా కనిపించుటలేదు. ఒక అందుకారణంచే మీకు తెలియజెప్పుటకు మేమివచ్చితిమి అనిపలికెను. 

అప్పుడు మహారాజు మహోగ్ర కోపతప్తుడై బసవేశ్వరునిపైకి తిరిగిచూచుచు 

‘‘ఇదేం విపరీతమయ్యా ? ఇక ప్రజలు ఎట్లు బ్రతికెదరు? నీ భక్తుల ఆగడాలను భరించుటయే ప్రజలకు కష్టమాయె కదా! చాకలివాడేమిటి? ఇంత అహంభావ మేమిటి? తననెవ్వరూ తాకకూడదట! తాకితే పొడిచేస్తాడట! ఇటువంటి వార్త ఎక్కడైనా వినుటకు తగినదా! అతని వస్త్రాలు ముట్టినా మురికైపోతాయి కాబోలు. దుర్వాసన వచ్చును కాబోలు! నగర జనులకు ముందే ఆ వీధిన నడవకూడదని ఆంక్షవిధించటమా! ఇంత ఎంతటి అహంభావం? ఇక పరదేశీయులకు మనదేశమునకు వచ్చుటకు అవకాశమే లేకున్నదా ఏమి? సంతకు పోవుచున్న వెఱ్ఱిబాగులవాడిని భలేవింతగా చంపేశాడు ఈ మడివాలు. చంపటమే కాదు, శవాన్నికూడా మాయం చేశాడు! ఎక్కడైనా శవములు ఎగిరి ఆకాశంలోకి మాయమవుతాయా? వీడెవ్వడో రజకరాక్షసుడు దాపరించాడు మన నగరానికి. మనుషులను పొట్టను పెట్టుకొనుచున్నాడు. ఇతనినేమైనా ఆ మనిషిని కొట్టాడా..? తిట్టాడా..? మీదకు వచ్చాడా..? తాకినంత మాత్రంచేత ఇంత తామసమా..? పరాయి వాళ్ళను ముట్టుకున్నాడన్న  నెపంచేత చంపవచ్చా..? నేనుచాలా గొప్ప భక్తుణ్ణని విఱ్ఱవీగుతూ ఇట్లా ఎంతమందిని చంపుతాడు ఈ చాకలి? నగరాన్ని వల్లకాడు చేస్తాడా ఏమిటి? ’’

అని నగర రక్షోద్యోగులవైపు చూసి నగరం కావలికాసే భటులను పిలిపించి 

‘‘ చాకలి ఎక్కడ కనబడితే అక్కడ చంపివేయమని ఆజ్ఞాపించెను. వాడు చంపినవాడి శవమేమైందో కూడా చూసిరండి. లేదా ఆ మనిషిని మాకు చూపి అప్పగిస్తే ఏమీచేయకుండానే తిరిగి రమ్మని’’ ఆజ్ఞాపించెను.

అప్పుడు బసవుడు మహారాజుతో ఇట్లు పలికెను. 

‘‘ఓ మహారాజా! మాచయ్య ఎంతటి భక్తుడో నీకర్ధం కానట్లున్నది. అతడు నిరంతర శివభక్తి తత్పరుడు. కేవలము భక్తులకైంకర్యమునకై తన జీవితమును అర్పించవలెనని కుతూహలములతో వస్త్రములను ఉతికి, ఆరవేసి తీసుకొని వచ్చి, భక్తులకు ఇచ్చెడివాడు. నిరంతరం మడీ అను ఆచారముతో భక్తుల వస్త్రములను ఉతికి తీసుకొని వచ్చు అతని ఆచారమును మంటగల్పుటకు ప్రయత్నించిన ఆ దూర్జటి ఊరుకొనునా! అతడు రేవునకు వెళ్లు నపుడుగాని వచ్చునపుడు గానీ శివభక్తిలేని వారిని చూడకూడదని వారిని స్పృశించకూడదని అను నియమములచే శివభక్తిని ప్రకటించెనేగాని ఎవరిని ద్వేషించుటకు ఆయన సిద్ధపడలేదని మనకు తెలియుచున్నదికదా! అని పలికెను. ’’

ఆ మాట విన్న వెంటనే తీవ్రమైన కోపంతో రాజు ‘‘ ఓ బసవేశ్వరా! ఏవేవో కారణములు, కథలు, మహిమలు,మహాత్మ్యాలు కల్పించకుండా కళ్లప్పగించి చూస్తూ ఉండు’’ అని కసురుకొనెను. 

మహారాజు కావలి వారిని పిలిపించి వారికొక ఉపాయాన్ని చెప్పి దానిని అనుసరించమని ఆదేశించెను. అదేమనగా ‘‘మాచయ్యగారు’’ వచ్చే త్రోవలో మీరు ధైర్యంగా ప్రొంచి ఉండి అతడు మీదగ్గరకు వచ్చు సమయమున మదగజమును అతనిపై ఉసిగొల్పగలరు అని పల్కెను. అప్పుడు వెంటనే వారు మగదజమును సిద్ధం చేసుకొని ఆ మాచయ్యగారు వచ్చు సమయం చూసి గజమును అతనిపైకి పంపగా అప్పుడు మాచయ్యగారు రాజుగారి భద్రగజం కల్గి నాధుని భద్రగజం ముందు పిల్లి ఏనుగు వంటిది. మీరెందుకు నిష్కారణముగా చచ్చెదరు. మానవంతులారా! తొలగించండి! తొలగించండి! అని బిగ్గరగా హెచ్చరిస్తూ పలికెను. గంటను ఒక చేతిని మరొక చేతిని కత్తిని తీసుకొని మదగజమునకు ఎదురుగా నిలిచెను. ఎప్పుడూ మదగజం మాచయ్యను దర్శించెనో దాని బలం అంతా నశించినది. అంతటిలో మావటివాడు ఊరుకొనక మదగజమును ప్రేరేపించెను. మదగజము తప్పక మాచయ్యగారికి మీదకు పోబోతుండగా అప్పుడు మాచయ్యగారు తన శరీరంను ఉగ్రరూపంగా పెంచి ఏనుగు తొండమునుపట్టుకొని ముందుకు గుంజి నేలకూల్చెను. మావటి వాడిని తన చేతి దెబ్బలతో హతమార్చెను. అపుడు తన స్వరూపం చూసిన వీరభద్రాకృతివలె కన్పించెను. ఆ గజం కిందపడే లోపులోనే తన చేతిలో చరచి మాచయ్యగారు పెద్దపెట్టున హుంకరించుచూ గజాసురుణ్ణి పరమేశ్వరుడు చీల్చి చండాలినట్లు యీ మదగజమును నుజ్జుగుజ్జుచేసి ఎముకలను పిండిపిండి అయ్యేటట్లుగా మర్ధించెను. మాచయ్యగారు. మాలకు మాంసం, గోడారికి చర్మంకూడా దక్కకుండా ఆ ఏనుగును ముద్దగా కొట్టి విసిరి పారేసెను. తను వెళ్ళు త్రోవలో ఎవరైనా శివనింద చేయువారు కాని, శివభక్తులను ఇబ్బంది పెట్టేవారు కానీ, తనకు ఎదురువచ్చినవారిని చంపివేయుదనను ప్రతిజ్ఞను మాచయ్యగారి నిలబెట్టుకొనిరి. 

ఈ మాచయ్యగారు చేసిన పనిచే శివభక్తులందరూ మహదానందమునొందిరి. అప్పుడు ఈ విషయంను తెలుసుకున్న మహారాజు బసవని వైపు చూసి తలవంచుకొనెను. అపుడు బసవుడు పరమానందమునొంది ఆ మహారాజుతో ఇట్లు పల్కెను.

‘‘ వద్దువద్దని ఎన్నిమార్లు పలికినను నీ మూర్ఖ గుణముచే ఏనుగును పంపితివి. ఏనుగు మరణించినది. నీ పరువుకాస్తా పోయినది. నీ ధైర్యంచెడినది. శివద్రోహం సంభవించినదని రాజు యొక్క అహంకారమును తొలగించెను.’’

ఈ కథాంశమునందు భక్తిభావము కలుగుటకు నిర్మల మనసుతోపాటు వస్త్రము, శరీరముకూడా స్వచ్ఛముగా ఉండవలెను అను భక్తితత్వమును పొందుటకు ఉండవలసిన విధానమును గూర్చి తెలియజెప్పెను. 

నిరంతరము‘‘మాచయ్యగారు’’ శివభక్తుల వస్త్రములను ఉతుకుట అను పనియందు నిమగ్నుడై ఉండుటచే మనసును స్థిరముగా శివునిపై నిలుపుటకు అవకాశం ఏర్పడును అను ఉద్దేశ్యంతో వస్త్రములు ఉతుకుటకు ఇష్టపడెను. శివభక్తులు నిరంతరము శివధ్యానమునుండు నిమగ్నులై శరీరమున ధరించిన వస్త్రములకు కూడా శివశక్తి అంటుకొనునట్లు వారి భక్తి ఉండుటచే మాచ్యగారు వస్త్రములు ఉతుకుట అను నిరంతర కార్యమునందు భక్తితత్పరతను గ్రోలెను అనుటలో ఎటువంటి అతిశయోక్తి లేదు.  

భక్తులకు మాత్రమే సేవచేయుటచే సేవయొక్క పరమోత్కృష్ట శక్తిని పొందుటకు అవకాశం కల్పించబడును అని నిర్ణయించుకొని శిశభక్తుల సేవయందే ఆసక్తుడై ఉండెను. భక్తులు కానివారిని చూచుటచే వచ్చు నాస్తికభావమును చేరువ చేసుకొనుటకు కూడా నిరాకరించెను. నిరంతర భక్తిభావము మోక్షమునకు సాధనం అను విషయమును ఇందు నిరూపించబడెను. మోక్షమనగా విడుచుట అని అర్థము. శివభక్తి యందు ఆసక్తిలేని వారిని తనకు దగ్గరగా ఉంచుకొనకపోవుటచే స్వచ్ఛ, భక్తి తత్త్వం అలవడును అను ఉద్దేశ్యముతో ‘‘మాచయ్య’’గారు శివ భక్తులకు మాత్రమే తన సేవను అందించెడివాడు. శివ భక్తులను మాత్రమే చూసెడివాడు. శివభక్తి తత్పరతయందే ఆసక్తుడై ముగ్ధభక్తునిగా సమాజమునకు మార్గదర్శకత్వమును వహించుటలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి