గుణనిధి కధ (కొనసాగింపు)
భర్త ఇంటికి రాగానే కాళ్ళకు నీళ్ళిచ్చింది. యజ్ఞదత్తుడు హతాశుడై నేలమీద కూలబడ్డాడు. అతడి కళ్ళు బైర్లు కమ్మాయి. భార్య అతని కాళ్ళు కడిగి ‘‘ నాధా నీ విచారానికి కారణం ఏంటి?’’ అని అడిగింది.
యజ్ఞదత్తుడు కొద్దిగా తేరుకొని ‘‘రాజుగారు నాకు బహూకరించిన వజ్రపుటుంగరం ఏదీ’’ అన్నాడు.
‘‘ ఓస్! దానికోసమేనా ఇంత ఇది. ఆ ఉంగరం లోపల పెట్టెలో భద్రంగా వుంది’’ అంది సోమిదేవమ్మ.
ఒక్కసారి తీసుకురమ్మన్నాడు యజ్ఞదత్తుడు.
‘‘ముందు స్నానం చేసి భోజనం చెయ్యండి. ఆ ఉంగరం ఎక్కడికీ పోదు. లేవండి ’’ అంటూ మాట తప్పించటానికి ప్రయత్నించింది.
దానికి కోపగించిన యజ్ఞదత్తుడు ‘‘ ఓసీ! పాపిష్ఠిదానా ! నిజం చెప్పు. నీ కొడుకు వేదమంత్రాలు వల్లిస్తున్నాడా? అసలు గురువు దగ్గరకు వెళుతున్నాడా? స్నానము, సంధ్యావందనము, జపము, అగ్నిహోత్రము ఈ మాటలైనా వాడికి తెలుసా? నీమాటలు నిజమని ఇంతకాలం నమ్మాను. నీమూలంగా ఈ రోజు నా పరువు ప్రతిష్ఠలు పూర్తిగా పోయాయి. ఎంతపనిచేశావు’’ అంటూ గద్దించాడు.
భార్య మారు మాట్లాడలేదు కంట తడిపెట్టింది. ఈ విషయం గుణనిధికి తెలిసింది. ఇంటికి వెళ్ళే ధైర్యం చాలలేదు. ఏం చెయ్యాలో తెలీక ఊరు వదిలిపారిపోయాడు. ఉన్నప్పుడు తినటం, లేనప్పుడు పస్తు. ఎక్కడికి వెళ్ళాలి? ఏం చెయ్యాలి? ఇలా ఆలోచిస్తూ, ఒక గ్రామం చేరాడు. ఆ ఊళ్ళో ఒక శివాలయం వుంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియని గుణనిధి శివాలయంలోకి వెళ్ళాడు.
ఆరోజు శివరాత్రి. ఆ రాత్రంతా భక్తలు అక్కడ చేరి భజనలు చేస్తున్నారు. గత రెండు రోజులుగా భోజనం చెయ్యలేదు గుణనిధి.
శరీరం నీరసించి పోతోంది. శరీరం తూలిపోతోంది. నిద్రపోదామంటే అంతా భజన గోలగా వుంది. ఇంతలో భక్తులు పూజలు పూర్తయ్యాయి. భగవంతునికి నివేదనలు చేశారు. వారంతా ఆ రోజు ఉపవాసమున్నారు కాబట్టి ఆ ప్రాసదమెవ్వరూ తినలేదు. తెలవారబోతోంది. భక్తులు స్నాన సంధ్యలు పూర్తిచేసుకోటానికి బయటకు వెళ్ళారు. ఆలయంలో ఎవ్వరూలేరు. దేవుడి విగ్రహం దగ్గర అనేక రకాలైన తినుబండారాలు. ఘుమఘుమ వాసనలు. ఆకలి బాధతో అలమటిస్తున్న గుణనిధికి శివుని అనుగ్రహం లభించినట్లనిపించింది. మెల్లగా ేచి గర్భాలయంలోకి ప్రవేశించాడు. అక్కడ దీపారాధన కొండెక్కింది. పైనున్న బట్ట చింపి నూనెలో ముంచి వెలిగించాడు. ఆ వెలుతురులో ప్రసాదమున్న పాత్రలు చేతిలోకి తీసుకున్నాడు. ఇంతలో బయట ఎవరో వస్తున్న అలికిడి అయ్యింది. వాళ్ళు వచ్చి తనని అడ్డగిస్తారేమో అని భయపడి పారిపోబోయాడు. అతన్ని చూసిన భక్తులు దొంగ దొంగ అని అరచి పట్టుకో ప్రయత్నించారు. ఆ ఖంగారులో గర్భగుడి బయటకు వచ్చి అక్కడున్న నందీశ్వరుడి మీద పడ్డాడు. తలకు బలమైన గాయమైంది. స్పృహ కోల్పోయి కొద్ది క్షణాల్లోనే మరణించాడు.
గుణనిధి ప్రాణాలు తీసుకుపోటానికి యమదూతలు వచ్చారు. అతని కోసం శివభటులు కూడా వచ్చారు.
‘‘ఇతడు పాపి, జూదరి, దొంగ కాబట్టి యమలోకానికి రావాలి’’ అన్నారు యమకింకరు.
‘‘మహాశివరాత్రి నాడు ఉపవాసం వున్నాడు. రాత్రంతా జాగారం చేశాడు. పైగా తెల్లవారకుండానే ప్రాణాలు కూడా వదిలాడు. కాబట్టి కైలాసానికి రావాలి’’ అన్నారు శివభటులు.
ఈరకంగా వీరి మధ్య వాదోపవాదాలు జరుగుతుండగా ఆకాశం నుండి దివ్య విమానం వచ్చింది. అప్పుడు శివదూతలు ‘‘ ఓ యమభటులారా! లోకంలో ఎవరైనా సరే తెలిసిగానీ, తెలియకగానీ శివరాత్రి ఉపవాసముండి జాగారము చేసినట్లైతే వారికి కైలాసప్రాప్తి కలుగుతుంది.
గుణనిధి ఈ రెండు పనులు చేశాడు. పైపెచ్చు శివరాత్రి రోజున మరణించాడు. కాబట్టి ఇతనికి శాశ్వత కైలాసంలో ఉండే యోగ్యత లభించింది. అందుచే గుణనిధిని కైలాసానికి తీసుకుపోతున్నాము. ’’ అంటూ అతన్ని దివ్య విమానం ఎక్కించి కైలాసానికి తీసుకుపోయారు.
గుణనిధి కైలాసంలో చాలాకాలం వుండి తర్వాత కళింగదేశపు రాజకుమారునిగా జన్మించాడు. తండ్రి తర్వాత తనే రాజయ్యాడు.అతని పేరు ‘ఆరిందముడు’ ఇతడు గొప్ప శివభక్తుడు. శివాలయాలు కట్టించాడు. యజ్ఞయాగాలు చేశాడు. పండితులకు అగ్రహారాలు దానం చేశాడు. శివకేశవులకు భేదం లేదని ప్రచారం చేశాడు. నిరతాన్నదానం చేశాడు. చివరికి అవసానకాలంలో అష్టాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ప్రాణాలు వదిలాడు. బ్రహ్మ మానసపుత్రుడైన పులస్త్యుని కుమారుడు విశ్రువు. విశ్రువు భరద్వాజుని కుమార్తె దేవవర్ణిని వివాహమాడాడు. అరిందముడు మరణించిన తర్వాత స్వర్గసుఖాలనుభవించి దేవవర్ణి గర్భాన వైశ్రావణునిగా జన్మించాడు. ఇతడే కుబేరుడు.
కుబేరుని అందచందాలు, బలపరాక్రమాలుచూసి, ముచ్చటపడి పాతాళలోకంలో వున్న సుమతి, తన కుమార్తె కైకసిని పిలిచి, ‘‘నువ్వు ఏరకంగానైనా సరే విశ్రవుని వివామమాడి అతడి వల్ల కుబేరుని వంటి కుమారుని కనవలసింది’ అన్నాడు. తండ్రిమాట శిరసావహించి కైకసి విశ్రువు వద్దకు వెళ్ళింది. ఆమె మనోభీష్టాన్ని గ్రహించిన మహర్షి ఆమె కోర్కెను మన్నించాడు. అది అసురసంధ్య కావటం చేత ఆమెకు రాక్షసులు జన్మించారు. వారే రావణ, కుంభకర్ణులు, కుబేరుడు శివుని గురించి తపస్సు చేసి వరాలు పొందాడు. విశ్వకర్మ లంకానగరాన్ని నిర్మించి కుబేరునికిచ్చాడు. రావణుడు కుబేరుని ఓడించి లంకానగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు.
కుబేరుడు కాశీనగరం చేరి, అన్నపానీయాలు విసర్జించి, శివుని గురించి ఘోరతపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి శివుడు ‘అలకాపురి’ అనే పట్టణాన్ని ఇచ్చాడు. అందులో చైత్రరధము అనే మనోహరమైన ఉద్యానవనాన్ని నిర్మించాడు. కుబేరుణ్ణి యక్షులకు నాయకునిగా చేశాడు. నవనిధులకు అధిపతిని చేశాడు పరమేశ్వరుడు. అంతేకాదు పరమేశ్వరుడు అతని తన స్నేహితునిగా వుండేలా అనుగ్రహించాడు.
ఈ రకంగా గుణనిధి చెడ్డపనులు చేసినప్పటికీ ఈశ్వరానుగ్రహం వల్ల కుబేరుడైనాడు. ఈశ్వరానుగ్రహం వుంటే ఎవరైనా ఎంతటివారైనా అవ్వవచ్చు అనటానికి ఉదాహరణే గుణనిధి కధ. (గుణనిధి కథ సమాప్తం)
(సశేషం)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి