క్షణికావేశం

క్షణికావేశం

పెదపాటి నాగేశ్వరరావు
సెల్ : 8332982892

                        "అవును ఆ అమ్మాయిని పెళ్లి పీటల మీదే గొంతు కోసి చంపేస్తాను. అరిచాడతడు”. 
ఉలిక్కిపడి చూశాడు, కిరాణాషాపులో కూర్చుని వున్న గణపతి. ఎదురుగా నుంచుని వున్నాడు, రాంబాబు. తాగివున్నట్లువున్నాడు, కొంచెం తూలుతూ, సరిగ్గా నిలబడ లేక పోతున్నాడు. కళ్ళు ఎర్రగా వున్నాయి. వంటిమీద బట్టలు చెమటతో తడిసి వున్నాయి.  కాస్సేపటిముందు  గణపతిని 'తనకో మంచి కూరగాయలు కోసే కత్తి కావాలని ' అడిగాడు. 
        గణపతి కెందుకో అనుమానమొచ్చి, "కత్తా.......ఎందుకు?"  అడిగాడు.                                                                                                               “    “ఒకమ్మాయి గొంతు కోయడానికి" కసిగా అన్నాడు, రాంబాబు.
       "అవును దాన్ని పెళ్లి పీటల మీదే గొంతు కోసి చంపేస్తాను. అప్పుడు గాని ..... అప్పుడు గాని ....నా మనసు శాంతించదు " అరిచాడతడు.   గణపతి అతని కేసి నిశితంగా చూశాడు. రాంబాబు తనకి పరిచయం ఉన్నవాడే. అప్పుడప్పుడు ఒక అమ్మాయితో కల్సి వచ్చి ఏ కూల్డ్రింకో తాగుతూ తమ షాపుముందున్న బల్లమీద కూచుని గంటలతరబడి కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు.
        తనో సారి అతన్ని అడిగేడు, 'ఎవరా అమ్మాయి ' అని.   "మేము త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం సార్" అన్నాడు. ఇంతలోనే ఏంజరిగిందో .....
       "రాంబాబు! ఏంటి నువ్వు మాట్లాడుతుంది . నువ్వు మాట్లాడేది నీకు ఏమైనా అర్ధమౌతుందా ?” కొంచెం  కోపంగా అడిగేడు, గణపతి.   "అదంతా తరువాత చెప్తాను.  ముందు నాకు కత్తివ్వండి, ఇదిగో డబ్బులు " అంటూ వందరూపాయల నోటు గణపతి వేపు విసిరి, అక్కడున్న కత్తుల పాకెట్లోంచి ఒక కత్తి తీసుకున్నాడు, రాంబాబు. 
        ఏమి చెయ్యాలో ......తోచని గణపతి గబా గబా షాపులోంచి బయటకొచ్చాడు.  రాంబాబు భుజాల మీద చేతులేసి, అతను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నా బలవంతంగా బల్ల మీద కూర్చోబెట్టి, తాను కూడా ప్రక్కనే కూర్చున్నాడు.                      "అసలేం జరిగింది రాంబాబు" అనునయంగా అడిగాడు, గణపతి.   షాపులోంచి వాటర్ బాటిలు తీసుకొచ్చి, తాగమన్నట్లుగా రాంబాబు కిచ్చాడు.
        కొంచెం నీళ్ళుతాగి ఆ బాటిల్ని తిరిగి గణపతి కిచ్చి, అతని వేపు చూశాడు, రాంబాబు.
      " మీరు చూసారుగా అంకుల్, నాతో ఎంత ప్రేమగా మాట్లాడేదో, ఎన్ని కబుర్లు చెప్పేదో, ..... నేనే సర్వస్వమంది ......నేను లేకపోతే బతకలేనంది......అన్ని మరిచిపోయి ఇవాళ వేరేవాడితో తాళి కట్టించుకునేందుకు సిద్ధమైపోయింది.” వ్యంగ్యంగా అంటూ కాస్సేపాగి,     
        "అదిగో..... అక్కడ” . అంటూ కాస్తదూరంలో వున్నా కల్యాణమండపం వైపు చేత్తో చూపించాడు. 
        అర్ధమైనట్లుగా తలాడించాడు, గణపతి.   " ఎంతమోసం చేసింది, అంకుల్ .... నేనేం అన్యాయం చేశానని,,, యిలా చేస్తోంది. నన్నింత క్రూరంగా మోసం చేసిన వగలాడిని నేను వదిలి పెట్టను.  
       చంపేస్తాను. చంపేస్తానంతే ....." తాగిన మైకంలో కొంచెం గొంతు వణకుతుండగా  గొణిగాడు,  రాంబాబు.
      "రాంబాబు .....నేను చెప్పేది విను.  క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి తప్ప ఎవరికీ ప్రయోజనం ఉండదు. కాసేపు నిదానంగా ఆలోచించు.ఏ పరిస్థితుల్లో ఆ అమ్మాయి ఇంతగా ప్రేమించిన నిన్ను కాదని మరొకరితో పెళ్ళికి సిద్దమైయిందో...నిన్ను వదిలి మరో వ్యక్తితో మూడుముళ్లు వేయించుకోవడానికి వెనక ఏ కారణముందో తెలుసుకోకుండా .....నిర్ణయం తీసుకుంటే... ఆ అమ్మాయి జీవితంతో పాటు నీ జీవితం కూడా నాశనమైపోతుంది " ఇంకా ఏదో చెప్పబోయాడు గణపతి.
      "వద్దు అంకుల్... మీరేం చెప్పినా నేను వినను.  దాన్ని గొంతు కోసి చంపుతానంతే”. చేతిలో  ఉన్న కత్తిని గాల్లో ఆడిస్తూ అన్నాడు, రాంబాబు.
      చీకటి పడబోతోంది.  వీధిలో లైట్లు వెలగడం మొదలయ్యాయి. కొద్ది దూరంలో ఉన్న కల్యాణ మండపంలో కూడా రంగు రంగుల దీపాలు వెలిగేయి. మైకులోంచి పెళ్లి పాటలు వినపడుతున్నాయి. 
     "సరే నేను చెప్పింది కాస్సేపు, విను.  ఆ తరువాత నువ్వే నిర్ణయం తీసుకున్నా.... నీ ఇష్టం" అన్నాడు, గణపతి.   రాంబాబు ఏమి మాట్లాడలేదు. గణపతోసారి దీర్ఘంగా నిట్టూర్చి, చెప్పడం మొదలుపెట్టాడు. 
     *                                      *                                   *
"అన్నపూర్ణ ఐస్క్రీంపార్లర్" కస్టమర్లతో చాలా సందడిగా వుంది.  అక్కడున్న టేబుళ్లన్నీ చాలావరకూ జనంతోనిండిపోయి రద్దీగా ఉంది.  కొంతమంది డ్రింక్స్ తాగుతున్నారు.  మరికొంతమంది ఐస్క్రీమ్ తింటున్నారు.  ఇంకా కొంతమంది  కబుర్లు చెప్పుకుంటున్నారు. 
      అన్నపూర్ణ కౌంటర్లో కూర్చుని బిల్లులు వసూలు చేసుకొంటూ ఉండగా కొడుకు అభిరాం, కూతురు అరుణ ...ఎవరెవరికి ఏమి కావాలో సర్వ్ చేస్తున్నారు.   ప్రతిరోజు  కాలేజీ నుంచి వచ్చిన తరువాత ఇద్దరూ పార్లర్లోనే రాత్రి వరకూ పనిచేస్తువుంటారు.
      అప్పుడే అక్కడకొచ్చిన మేఘన ఖాళీగా ఉన్న ఒక టేబుల్ ముందు కూర్చుంది.  కాలేజీ వదలగానే ఆ జంక్షన్లో బస్సు దిగి ఆ పార్లర్లో కాసేపు కూచుని ఇంటికి నడిచి వెళ్లిపోవడం మేఘనకి రోజు అలవాటే. 
      మేఘనకి  తల్లితండ్రులిద్దరూ యాక్సిడెంట్లో చనిపోవడంతో మేనమామ ఇంటిదగ్గర ఉండి చదువుకుంటోంది.   మేఘన అన్నయ్య శివరాం దుబాయిలో పనిచేస్తూ నెలనెలా కొంత డబ్బు మేఘనకి పంపిస్తూ ఉంటాడు.   మేఘనంటే అభిరాం చెల్లెలు అరుణకు కూడా చాలా ఇష్టం.  త్వరలోనే తల్లి అన్నపూర్ణకు కూడా తమ ప్రేమ విషయం చెపుదామని అనుకున్నారు,  అన్నాచెల్లెళ్ళిద్దరూ.
      కొన్ని రోజులు గడిచాయి.  ఉన్నట్లుండి  మేఘన పార్లర్కి రావడం  మానివేసింది.  ఏమి జరిగిందో తెలియక అభిరాం చాలా కలవరపడ్డాడు.   ఒకరోజు ఉదయాన్నే మేఘన వాళ్ళ మేనమామ ఇంటికి బయల్దేరాడు.  కాస్త దూరంలో వాళ్ళిల్లు ఉందనగా .. అతనికో మోటారుసైకిలు ఎదురయింది.  ఎవరో పొడుగ్గా ఉన్న ఒకతను బండి నడుపుతున్నాడు.  వెనకాల కూచుని వుంది, మేఘన.   
      గబగబా అటువైపు నడిచాడు, అభిరాం.    వాళ్ళిద్దరిని అలా చూసి "ఎవరబ్బా" అనుకుంటూ మేఘన వేపు చూస్తూ చేయి ఊపాడు.   మేఘన అభిరాం వేపు చూసి చూడగానే, కంగారుగా తల తిప్పుకుంది.    మోటారుసైకిల్ అభిరాంని దాటుకుని ముందుకు వెళ్ళింది. అభిరాం కి అంతా అయోమయంగా అనిపించింది.  మేఘన ఎందుకు తనని చూసి తల తిప్పుకుందో  అర్థంకాక మనసంతా గందరగోళంగా మారడంతో కాళ్ళీడ్చుకుంటూ పార్లర్ వేపు నడిచాడు. 
      ముభావంగా వున్న అభిరాంని చూస్తూ, "ఏమిటన్నయ్య!  ఏమైంది, అలా ఉన్నావు,  ఏమి జరిగింది."  అడిగింది అరుణ గాభరాగా.   జరిగిందంతా చెప్పాడు, అభిరాం.                                                                                                                                     
      "ఆ...అంతేనా…. ఎవరో చుట్టాలబ్బాయి అయుంటాడులే.  నువ్వేం వర్రీ కాకు." తేలిగ్గా అంది అరుణ.  కానీ అంత తేలిగ్గా అనుకోలేదు, అభిరాం.
                                 *                               *                              *
         రెండు రోజుల తర్వాత...పాతగాజువాకలో బస్సు దిగి వడ్లపూడి వెళ్లే మరో బస్సు కోసం ఎదురు చూస్తున్నాడు , అభిరామ్.    బస్టాపులో ఉన్న ఒక కుర్చీలో కూర్చుని మేఘన గురించిన ఆలోచనలు ముసురుకుంటూ ఉండడంతో దిగులుగా కూచుని ఉన్నాడు. 
         అప్పుడే అక్కడ ఆగిన బస్సులోంచి దిగింది, మేఘన.  తనని చూసి కొన్ని రోజులే అయినా , ఎన్నో యుగాలు తర్వాత తనని చూసినట్లుగా, అనిపించిందతనికి .    గబుక్కున తాను కూర్చున్న కుర్చీలోంచి లేచి మేఘన వైపు పరుగులాంటి నడకతో వెళ్ళాడు. అంతలోనే మేఘన ప్రక్కగా ఒక మోటారు సైకిలు వచ్చి ఆగింది. 
         "మేఘన .....రా కూర్చో " బైకు మీద వచ్చినతను అన్నాడు.
         మేఘన ఒకక్షణం అభిరామ్ వైపు చూసింది.  మరుక్షణంలో తల తిప్పుకొని బైక్ మీద కూర్చుంది .
         బైకు ముందుకెళ్ళిపోయింది .   అవాక్కయి నిలబడిపోయాడు , అభిరామ్.   అతనికనిపించింది, మేఘన తనని కావాలనే ' ఎవోయిడ్ చేస్తోందని’.   మనసంతా శూన్యమయి పోయినట్లనిపించిందతనికి,  పిచ్చెక్కినట్టయింది.  
        "ఎందుకు....మేఘన ఎందుకు ఇలా చేసింది?" జవాబు రాని ప్రశ్నగా మిగిలిపోయిందతనికి.   మనసు పరిపరి విధాలా ఆలోచింపసాగింది .   'మేఘన తనని మోసం చేసింది.' అలా అనుకోగానే అతనికి దుఃఖం పొంగుకొచ్చింది.   చుట్టూ జనం తనని చూస్తున్నారనే ధ్యాస కూడా లేకుండా భోరుమంటూ ఏడవసాగాడతను.
                            *                                          *                                                *                                                                                                                                                     
         చాలాసేపట్నుంచి బార్లో తాగుతూ ఉన్నారు, అభిరాం, ఆనంద్.  "ఎవర్రా, నిన్ను కాదన్న ఆ అమ్మాయి" హేళనగా అన్నాడు ఆనంద్.   పిచ్చివాడిలా తాగుతున్న అభిరామ్ ని చూస్తుంటే ఆనంద్ కి ఆనందంగా ఉంది.    
            గతంలో తనని కాలేజీలో అవమానించిన మేఘన అంటే అతనికి చాలా  కోపం.   రెండు గ్లాసుల్లో మందు పోసి ఒక గ్లాసు అభిరామ్ వైపు జరిపి, అడిగాడు.   ఏమి మాట్లాడకుండా వుండిపోయి,  గ్లాసులోని మందు గటగటా తాగేశాడు, అభిరామ్.  గొంతు మండిపోతుంది.  ‘గొంతుతో పాటు మనసు కూడా మండిపోతుంది.' అనుకున్నాడు మనసులోనే.
             "ఒరేయ్, ఆనందు.....నన్నింత మోసం చేసిన ఆ అమ్మాయిని ఏం చేయాలి ...తనని మర్చిపోవాలంటేనే నా గుండెల్లో గునపాలు దిగుతున్నట్లుగా అనిపిస్తోందిరా ..." ఏడుపు గొంతుతో అన్నాడు అభిరామ్.                                                                                             “ఛీ పిరికి వెధవ ....ఏడుస్తున్నావా....నిన్ను మోసం చేసిందాన్ని వూరికే వదిలి .....నువ్విక్కడ దేవదాసులా తాగుతూ కూర్చుంటావా ....నువ్విలా వూరుకుంటే అమ్మాయిలంతా మగాళ్లని వెర్రి దద్ధమ్మల్లాగా చూస్తారు . ఏదో ఒకటి  చెయ్.  మరే ఆడపిల్లా మగాళ్లని మోసం చెయ్యకుండా ...దానికి గుణపాఠం చెప్పు.." అభిరామ్ ని రెచ్చగొట్టసాగెడు, ఆనంద్.
             "అవును...ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేయకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. అందగత్తెనని పొగరుతోనే కదా తనని పట్టించుకోకుండా వెళ్లి పోయింది.   ఆ అందాన్ని నాశనం చెయ్యాలి.   అందగత్థేనని విర్రవీగే  మేఘనని కురూపిగా  మార్చాలి”.   మళ్ళీ గ్లాసులోని మందు గొంతులో పోసుకుంటూ, అనుకున్నాడు. అభిరామ్.                                                                
             “ఇదిగో. కాలేజ్ నుంచి కెమిస్ట్రీలేబ్ అటెండర్ వెంకట అప్పారావుకి వంద రూపాయలు ఇచ్చి తెచ్చానిది.  దాని మొఖం మీద విసిరేయ్.  దాని పొగరణిగి పోతుంది.  దెబ్బకి నీ కాళ్ళదగ్గరకొచ్చి పడుతుంది."  అంటూ ఒక గాజు సీసాని అభిరామ్ కి అందించాడు, ఆనంద్.    ఆ సీసాలో ఏసిడ్ ఉంది.
           చాలా సేపటి తర్వాత తప్పతాగి తూలుకుంటూ బార్లోంచి బయటకి నడిచారు, అభిరామ్, ఆనందలిద్దరు.   
          మేఘన ఇంట్లోంచి బస్సుస్టాప్ వేపు నడుచుకుంటూ వస్తోంది.  అప్పటివరకు అక్కడే కాచుకు కూర్చుని వున్న అభిరామ్ ఒక్క సారిగా లేచి నుంచున్నాడు. . అభిరామ్కి ‘ఎవరిదో బైకు వెనక కూర్చుని వున్న మేఘన’  దృశ్యమే కళ్ళముందు కదులుతుంది.   మేఘన ప్రక్కనే నడిచి వస్తున్న మరో యువతీ కానీ.... చుట్టుప్రక్కల వున్న జనం కానీ కనిపించడం లేదు.   అప్పటికే ఫుల్లుగా తాగివున్నాడేమో కొంచెం తూలుతూ ఉన్నాడతను.
         తనతో తెచ్చుకున్న ఏసిడ్ బాటిల్ మూత తీసి ఒక్కసారిగా మేఘన మొఖం మీద పడేలా విసిరేసి,  అక్కడనుంచి పారిపోయాడు.   అనుకోని ఈ సంఘటనతో అవాక్కయిన మేఘన వెంటనే తేరుకుని మొఖం పక్కకి తిప్పుకోవడంతో కుడి చెంప మీద ఏసిడ్ పడి, ఆ విసురుకి పక్కనే నడిచి వస్తున్నా మరో అమ్మాయి ఎడమ చెంప మీద తూలీ, ఇద్దరి ముఖాలు కాలిపోయాయి.      
          అకస్మాత్తుగా జరిగిన యీ సంఘటనతో చుట్టుప్రక్కల వున్న జనం కేకలు పెట్టసాగేరు.    
          ముఖం మీద ఏసిడ్ పడడంతోనే భాధగా అరవసాగేరు, మేఘన….. పక్కనే వున్న మరో యువతి.   ఎవరో ఫోన్ చేసినట్లుంది.   ఆంబులెన్స్ వచ్చింది.  మేఘనాని,  ప్రక్కనున్న యువతిని అంబులెన్సులోకి ఎక్కించి హాస్పిటల్ వేపు తీసుకుపోయారు.
           *                                  *                                   *
            అభిరామ్ కోసం పోలీసులు వెదకసాగేరు.  కొన్నిరోజుల తర్వాత, ముంబాయి రైల్వే స్టేషన్లో అతడ్ని పట్టుకుని వైజాగ్ తీసుకొచ్చారు. కోర్టులో అతనికి రిమాండు విధించి, సెంట్రల్ జైలుకి తరలించారు.
            ఒకరోజు ములాఖాత్ లో  తనని కలవడానికి ఎవరో వచ్చారని చెప్పడంతో విజిటర్స్ లాంజిలోకి వచ్చాడు, అభిరామ్.  "ఎవరో అమ్మాయి.... చున్నీ ముఖం చుట్టు కప్పుకొని వుంది.  అభిరామ్ ఆమెను చూసాడు.  'మేఘన తనని చూడటానికి వచ్చిందా' అనుకున్నాడు మనసులో....    ఆ అమ్మాయి మరింత దగ్గరగా వచ్చింది.    ఏదో తెలీని అపరాధభావంతో మౌనంగా ఆమెవేపే చూస్తున్నాడు,    అభిరామ్ కటకటాల అవతల నుండి. 
            మరింత దగ్గరగా వచ్చిన ఆ అమ్మాయి ముఖానికి కప్పుకున్న చున్నీతీసి మెడలో వేసుకుంది.   ఆమెని చూడగానే అదిరిపడ్డాడు,  అభిరామ్. అరుణ.... తన చెల్లెలు.  ముఖం ఒక పక్క కాలిపోయి చర్మం ముడతలుపడివుంది.                                                                    కళ్ళంబడి కన్నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి.  అభిరామ్కి. అంతా అయోమయంగా అనిపించింది.    ఏదో అడగా లనుకుంటున్నాడు.   కానీ, నోరు పెగలడం లేదు. 
            ముందుగా తేరుకున్న అరుణ అడిగింది. "అన్నయ్యా!  ఎందుకిలా చేసావ్?".                                                                                                      
            అభిరాంకి అంతా అయోమయంగా ఉంది.  గుండెలోతుల్లోంచి వస్తోన్న దుఃఖాన్ని ఆపుకోవడానికి విఫలయత్నం  చేస్తున్నాడతడు .                      
            కాసేపటి తర్వాత అభిరామ్ అడిగాడు. " అరుణా ! అసలేం జరిగింది?"                                                                                     
            జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూన్నట్లుగా ఆగి చెప్పసాగింది, అరుణ.                                                                                               
            "ఆ రోజు .... ఆ రోజు .... మేఘన మన పార్లర్ కి ఎందుకు రావడం లేదో ... కనుక్కుందామని వాళ్ళింటికి వెళ్ళాను.  అప్పుడు మేఘన చెప్పింది.   వాళ్ళన్నయ్య దుబాయ్ నుంచి శలవు మీద వచ్చాడని.   వచ్చిన వెంటనే నీ గురించి ఎలా చెప్పాలో తెలియక....కొన్నిరోజులు పోయాక చెప్దామని అనుకుందట.   ఆవిషయాలన్నీ యిద్దరం మాట్లాడుకొని, బయటకు వస్తూ ఉంటె .....సడన్ గా నువ్వు ఎదురుపడి ఏసిడ్ తన ముఖం మీద విసిరావ్,  తన కుడి చెంపమీద పడి తూలి.....నా ఎడమ చెంప మీద పడిందది.   ఎవరో మా యిద్దర్ని హాస్పిటల్లో జాయిన్ చేసారు. 
             ఈ విషయం తెల్సి......ఆ వీధిలో ఉన్నవాళ్లు మన పార్లర్ ని ధ్వంసం చేసారు.   ఇదంతా తెల్సిన అమ్మ తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయింది.   నువ్వెక్కడున్నావోనని ఎలా వున్నావోనని ఎదురుచూస్తున్న మాకు పోలీసులు నిన్ను అరెస్టు చేశారని తెలిసింది.  జైలుకి వచ్చి నిన్ను చూడాలని వున్నా హాస్పిటల్లో ఉండడము వల్ల రాలేకపోయాము.   నన్ను యివాళే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు.   మేఘన యింకా హాస్పిటల్ లోనే ఉంది. "  చెప్పడం ముగించింది అరుణ.   ఏమి మాట్లాడాలో అర్థం కాక నిశ్చేష్టుడై నిలబడిపోయిన అభిరామ్, అరుణ వేపు వెర్రిచూపులు చూడసాగాడు.  
             ‘టైమైపోయిందంటున్న’   జైలు సిబ్బంది వేపు చూస్తూ యాంత్రికంగా లోపలి కి నడిచాడు.
                                        *                               *                                *
              అంతవరకు చెప్పి, ఆగి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు, గణపతి.  రాంబాబు వేపు చూసాడు.
              "తర్వాతేంజరిగింది ?" ఆతృతగా గణపతి వేపు చూస్తూ అడిగేడు, రాంబాబు.                                                                                      
              కరెంటు పోయినట్లుంది.  వీధంతా చీకట్లు అలముకున్నాయి.  కల్యాణమండపం దగ్గర కూడా లైట్లన్నీ ఆరిపోయి, మైకులు మూగబోయి.... అంతటా నిశ్శబ్దం రాజ్యమేలుతూవుంది.                                                                                                                              
             తాను క్షణికావేశంలో చేసిన తప్పేమిటో అర్థం అయింది, అభిరాంకి.   తాను చేసిన సరిదిద్దుకోలేని వెధవ పనివల్ల తన తల్లిని పోగొట్టుకోవడమే కాకుండా, తన చెల్లెల్ని, తన స్నేహితురాల్ని ఆస్పత్రి పాల్జేసి ...సమాజంలో చెడ్డ పేరు మూటగట్టుకున్న విషయం అతని మనసును తొలిచేయసాగింది.  “లాయరుగారి సలహాతో, జడ్జి గారిదగ్గర తాను చేసిన తప్పును ఒప్పుకొని క్షమాభిక్ష ప్రసాదించమని అభ్యర్థించాడు.   మేఘన కూడా అభిరాంని పెళ్లిచేసుకునేలా అవకాశం కల్పించమని, తనకు జీవితం ప్రసాదించమని జడ్జిగారిని కోరుకోవడంతో ...అభిరాంకి తక్కువ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.”  చెప్పడం ఆపి రాంబాబు వేపు చూసాడు, గణపతి.                                                                                                  
             "ఆ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారా ?" అడిగాడు, రాంబాబు.
             గణపతి కాస్సేపు మౌనంగా ఉండిపోయాడు.  రాంబాబుకి అప్పటికి తాగిన మందు యొక్క మైకం దిగినట్లుంది,  గణపతికేసి చూస్తూ ఉండిపోయాడు, గణపతి షాపులోకి చూస్తూ, "వసంతా..." అంటూ పిలిచాడు.  షాపు గుమ్మంలోంచి ఒకామె ఎమర్జెన్సీ లాంపుతో బయటకొచ్చింది.  చీకట్లో ఆమె మొహం సరిగా కనిపించడంలేదు.    చీర కొంగు తల చుట్టు కప్పుకొని వుంది.        
             అప్పుడే కరెంటు వచ్చినట్లుంది,   భళ్లున వీధిలోని లైట్లన్నీ వెలిగాయి.  ఒక్కసారిగా వీచిన గాలికి ఆమె ముఖం మీద కప్పుకున్న చీర కొంగు జారిపోయింది.   లైట్ల వెలుగులో ఆమె ముఖం వేపు చూసిన రాంబాబు అదిరిపడ్డాడు.  ముఖానికి ఒక పక్కంతా కాలిపోయిన చర్మం కమిలిపోయి ఉంది.  చూడ్డానికి భయంకరంగా ఉన్న ఆమె ముఖం వేపే అలా చూస్తుండిపోయేడు, రాంబాబు.                                                      
            అంతటా నిశ్శబ్దం.                                                                                                                                       
           "ఇంతవరకు నీకు చెప్పిన కథలోని మేఘనే యీ వసంత. అందాలరాశి మేఘనాని అందవికారంగా మార్చిన దౌర్భాగ్యుడ్ని నేనే, అభిరాంని."  నిర్లిప్తంగా అన్నాడు, గణపతి.                                                                                                                                                           
          రాంబాబు చేతిలో ఉన్న కత్తి శబ్దం చేస్తూ కిందపడింది.                                                                                                             
         దూరంగా కల్యాణమండపం దగ్గర లైట్లన్నీ వెలిగాయి.  మైకుల్లో పెళ్ళిపాటలు మళ్ళీ మొదలయ్యాయి.                                         
    “యత్రనార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః”
   ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో…అక్కడ దేవతలు నాట్యం చేస్తారట.  స్త్రీలని గౌరవించడం మన సంప్రదాయం.  అలా అని వాళ్ళని పూజించ మనడం లేదు.  గర్భంలో ఉండగానే స్త్రీ శిశువుల్ని చంపడం ఆపండి.  ఆడపిల్లలున్న కుటుంబాల్ని చిన్న చూపు చూడడం మానండి.  అతివలపై జరుగుతున్న ఆసిడ్ దాడులు, గొంతులు కోయడాలు, అత్యాచారాలు సంభవించకుండా మీ పిల్లల్ని పెంచండి.  అప్పుడే మగువలంతా ధైర్యంగా, ఆనందంగా  చిరునవ్వులు  చిందిస్తారు

4 కామెంట్‌లు:

  1. కథ ఆసాంతం చదివించే విధంగా వుంది. ముగింపు లోని ట్విస్ట్ అర్థవంతంగా వుండి నేటి యువతకు దశ దిశ నిర్దేశం చేసేలా వుంది. నాగేశ్వర రావు గారికి అభినందనలు.

    రిప్లయితొలగించండి