వెలుగు వాకిట్లోకి
- శ్రీరాజ్
యువ- దీపావళి ప్రత్యేక సంచిక 1981
తెల్లవారింది కదండీ?
అవును , తెల్లవారకపోతే – ఆ చెట్టుమీద పిట్టలు అంత
సందడిగా ఎందు కుంటాయి? పెరట్లో చల్లగాలి నన్ను పలకరించదే? పాలవాడు వాకిట్లో తలుపులు
దబదబా కొట్టడు కదా? మరికాసేపట్లో తూర్పున సింధూరం చూసి ప్రతి ఒక్కరూ జీవన పోరాటానికి
సిద్ధం కావలసిందే.
అబ్బా! ఆకాశాన్ని పులుముకొని, అలముకొనే ఆ ఎరుపుని
ఎన్నిసార్లు చూశాను. నా జీవితంలో ఎన్ని పోరాటాలు సాగించాను. ఎన్ని సాహసాలు చేశాను.
ఎన్ని విప్లవాల గొంతులు విన్నాను, ఆ జీవితం, ఆ దృశ్యాలు చెరిగి కరిగిపోయే కలలు
కావండీ.. ఎవర్ లాస్టింగెమోషనల్ త్రిల్లింగ్స్.
ఇప్పుడు నా వయస్సెంతనుకుంటున్నారు? ఓన్లీ సిక్స్టీ ఇయర్స్- అరవయ్యేళ్ళనే సరికి పళ్ళు ఊడిపోయాయని, జుత్తు నెరిసిపోయిందని, జవసత్వాలుడిగి పోయాయని, ఓ ముసలిగుంట నక్కనని అనుకుంటు న్నారా? నో... నో.. నేనెంత దృఢంగా ఉన్నానో మా ఆవిడ సుందరాన్ని అడగండి. నా జుత్తు యింకా నల్లగా నిగనిగలాడుతుందని కూడా చెప్తుంది. నా పరిస్థితి మరోలా ఉంటే ఈ ఇంట్లో మా అబ్బాయిలూ, అమ్మాయి. కోడళ్ళు, అల్లుళ్ళు, వాళ్ళపిల్లలు, బంధువులు, స్నేహితుల సమక్షంలో బ్రహ్మాండంగా షష్టిపూర్తి జరిపించుకొనేవాణ్ణి పనికొచ్చేవాటికి ఆయుధపూజ, సింధూరం బొట్లుగాని పనికిరాని తుప్పుపట్టిన యంత్రానికి ఎందుకు? అయినా, మా ఇంటి ఆర్థిక పరిస్థితి బావులేదని పెద్దకోడలు పదే పదే గుర్తుచేస్తుంది. అవును... విలాసాలకి, విందులకు డబ్బు వృథాచేయడం న్యాయం కాదు సుమండీ.
ఒకప్పుడు నాది చాలా పెద్ద ప్రపంచం. ఒక సామ్రాజ్యం.
అందులో ఒక సింహాసం.... ఆ సింహాసనాన్ని అధిష్టించిన సమ్రాట్టును నేను. ఆ తేజస్సు
ఎంతో గొప్పగా ఉండేది. ఇప్పుడు నాది చాలా చిన్నలోకం. పదడుగులు కూడా లేని ఇరుకుగది.
అందులో విరిగిన ఒక పాత వాలుకుర్చీ, దాంట్లో యిరవై నాలుగుగంటలూ కూలబడే నిస్సహాయుణ్ణి నేను. ఈ చీకటి
ఎంత బాధగా ఉంటుంది?
మనిషిచేసే పాపపుణ్యాలకి ప్రతిఫలం ఎక్కడో పై లోకాల్లో
ఉంటుందంటారు. అది వట్టి అబద్దం. అయి డోంట్ బిలీవిట్. ఇట్స్ ట్రాష్. మనిషి
చచ్చేముందు తను చేసిన తప్పుకిగాని ఒప్పుకిగాని చెడైనా మంచైనా యిక్కడే అనుభవించక
తప్పదు. అందుకు నా జీవితమే పెద్ద ఉదాహరణ.
నేను చెడ్డవాణ్ణ ని మీరూహించుకొని, భయపడుతున్నారా? ఒక చెడ్డవాడు కథ వినిపిస్తున్నాడని, అందులో
అబద్ధం మాత్రమే ఉంటుందని అనుకుంటున్నారా? ఒకప్పుడు నేను చెడ్డవాణ్డే. కాదనను. కానీ, చెడ్డవాడు కూడా అంతరాత్మ ముంధు మంచివాడేనండీ.
అప్పుడు నేను చేసే ప్రతీ చర్య నాకు మంచిగా తోచేది. నాలో స్వార్ధం ఉన్నప్పటికీ నేను
చాలా మంచి అధికారినని అనుకొనేవాడిని. నీతి నిజాయితీలతో రుజుమార్గాన నడుస్తున్న
ఉత్తమోత్తముణ్ణని భ్రమపడేవాణ్ణి, కానీ, యిప్పుడు నాలో ఆ చెడ్దతనం లేదు. నేను అబద్ధం
చెప్పను. ఉన్న నిజాన్ని, జరిగిన వాస్తవాన్ని మీకు చెప్తాను. ఇప్పుడు నేను అంతరాత్మ ముందు
చేతులు కట్టుకొని, తల వంచుకొని నిలబడిన మంచివాణ్ణి.
సారీ మాస్టారూ! మీ అనుమతిలేకుండా, పూర్తిగా తెల్లవారకుండా, మిమ్మల్ని ఏ పనీపాటా చేసుకోనివ్వ కుండా నా కథ
వినిపిస్తున్నానని చిరాకు పడకండి.ఏవిటో ఈ రోజు మీతో కాసేపు మాట్లాడలనిపించింది.
పదేళ్ళ క్రిందట-
ఓహ్! ఆ పాలవాడు చూడండీ, పాపం చేతులు నొప్పెట్టుంటాయి. ఎంత సేపట్నుంచో మా
తలుపులు బాదుతున్నా ఒక్కరూ లేచి రావడం లేదు. ఒన్ మినిట్. వాడ్ని పంపించాక, కథ ప్రారంభిస్తాను.
“సుందరం... సుందరం..” పాలవాడు పిలుస్తున్నాడు.
పాపం! సుందరం రాత్రి ఏ పన్నెండుకు నడుంవాల్చిందో?
సుందరం లేచి వచ్చి, పాలు తీసుకుందనుకుంటా. చూశారా? వాడు వెళ్ళిన తర్వాత వాన వెలిసినట్లుంది.
ఆఁ...
పదేళ్ళ క్రిందట...
నేను ఎక్కడ గుమస్తాగా పనిచేశ్తానో, అదే ఆఫీసుకి మేనేజరుగా వచ్చాను.
మాది చాలా పెద్ద ఆర్గనైజేషన్. ప్రజాసేవకి
అంకితమైన సంస్థ. అందులో ఒక విభాగానికి చెందిన ఆఫీసర్ని. మా
ఆఫీసులో వాతావరణం చాలా చిత్రంగా ఉంటుంది. క్రమశిక్షణ కనిపించదు. అంతా కంపార్ట్ మెంటలైజేషన్.
చాలాచాలా కేడర్సున్నాయి. ఒక్కో కేడరుకి ఒక్కో లీడరు. ఎన్నో యూనియన్లు. మరెన్నో
పాలిటిక్సు. బంట్రోతు మొదలుకొని ఆఫీసరు వరకు ఎవరికి వాళ్ళు ఓ గిరి గీసుకుని, అందులో వాళ్ళ ఆధిక్యతను చూపించుకోవటానికి
తాపత్రయపడతారు. ప్రతి విషయంలో వాదనలు, ప్రతివాదనలు చెలరేగుతాయి.వాళ్ళందరికీ మేనేజరు
కాస్త మెతగ్గా కనిపిస్తే లోకువైపోతాడు. అలాంటి వాతావరణం నేను భరించలేక పోయాను. ఆఫీసులో
అందరూ తెలియడం వలన నా దగ్గర అతిచనువు తీసుకోవడం మొదలు పెట్టారు. బట్ అయ్ కాంట్
యాక్‌సెఫ్ట్. అధికారిగా నాకొక ప్రత్యేకత కావాలి. అందుకు ఆఫీసు సిబ్బందితో కఠినంగా
ఉండాలి. పెద్దవాణ్ణీ తిట్లడం తెలిసిన మనిషికి కొట్టే వాణ్ణి 'ఎందుకు' అని నిలదీసే ధైర్యం లేదు.
ఛార్జీ తీసుకున్న నెల రోజుల్లో అందరికీ నా గురించి
తెలిసిపోయింది. నేను ప్రతి విషయానికి పొసగనని, నాలో
ఎలాంటి దయాదాక్షిణ్యాల్లేవని, అవసరమైతే అడ్మినిస్ట్రేషన్ని ఎదిరించిన వ్యక్తిని
ఎంత కఠినంగానైనా శిక్షించగలనని, యూనియను లీడర్సుతో చీటికి మాటికి సంప్రదింపులు
చేయనని... యింకా చాలా చాలా తెల్సుకున్నారు.
మొదట అందరి కాన్ఫిడెన్షియల్ రికార్డు తిరగేశాను. రౌడీ
జట్టులాంటి ఓ పదిమందికి సర్కిలాఫీసుకి రాసి, వేరువేరు.
ప్రాంతాలకి బదిలీలు చేయించాను. పని దొంగలు కొందర్ని పని ఒత్తిడి ఉన్న సీట్లకు
మార్చాను. సెలవులు ఎక్కువ తీసుకునేవాళ్ళకి యింక్రిమెంట్లు కోత పెట్టాను.
అప్పగించిన పని సవ్యంగా సకాలంలో అందివ్వని అసమర్థుల ‘సీనియార్సు’ పాడుచేశాను. కొన్ని
కొన్ని కారణాలకి కొందర్ని డీప్రమోట్ చేశాను. యూనిఫారం వేసుకోని బంట్రోతులకు
మెమోలతో బుద్ధి చెప్పాను. ఎవరిలో ఎలాంటి అవకతవకలు కనిపించినా నేను సహించలేదు.
నిజానికి, ఆఫీసరు నెత్తిమీద ఎంతో బాధ్యత పెట్టి, చాలా
తక్కువ పవర్సు యిచ్చారు. అయితే, ఆ తక్కువ అధికారంతో నేను ఏమీ సాధించలేను. ఎవర్నీ
అదుపులో ఉంచలేను. నేను అందరిలో కలిసిపోయి, కొట్టుకుపోవాలి. అది నాకు యిష్టంలేదు. అందుకే
కొన్ని విషయాల్లో అతిక్రమించి చర్య తీసుకోవడం, అవసరం అయితే ఫాల్స్ ఛార్జెస్ బనాయించి స్టాపును
గుప్పెట్లో పెట్టుకోవడం నేను చేశాను. మీరు అడగవచ్చు నన్ను - అన్ని యూనియన్లు ఉండి
కూడా మీ ఆటను కట్టించలేదా అని. చూశారా... అన్ని అన్ని యూనియన్లు ఉన్నాయి గనుకే
నన్వెవరూ ఏమీ చేయలేక పోయారు. పేలికలై చీలికలై ఒక్కొక్కటిగా విడిపోయిన దారప్పోగులు
దేన్ని బంధించగలవు?
నెలరోజుల్లో మా ఆఫీసు వాతావరణం మారిపోయింది.
ఆఫీసులో గొడవా గోలా వినిపించడం లేదు. ఆరోగ్యకరమైన నిశ్శబ్దం. పని చకచకా
సాగిపోతుంది. ఆఫీసు కవతల ఎవరైనా నన్ను తిట్టవచ్చును గాని నా ఎదుట అంతా
పిరికివాళ్లు. ఎప్పుడైనా ఏ అమాయకుడో నన్ను గాని, నా చర్యల్ని గాని విమర్శిస్తున్నట్లు కనబడితే -
పాపం అతడి చరిత్ర మారి పోతుంది.
అందుకే, నాకు ఓ చక్కని బిరుదిచ్చారు. ఇచ్చినవాడెవడో
యిప్పటికీ నాకు తెలీదు. బహుశా, అందరూ ఈ చిన్నవిషయంలో ఒక్కమాటగా నిలబడి
ఉండొచ్చును.
కాసేపు కథ ఆపుదాం. బయట వాకిట్లో బిచ్చగాడు చాలాసేపట్నుంచి
అరుస్తున్నాడు.
“రెండు కళ్ళులేని అనాద జన్మ తల్లీ... బిచ్చం
ఎయ్యండమ్మా... దరమ తల్లులు... కబోదిని. కనికరించండి”.
గుడ్డివాడికి లోకం కనిపించకపోవచ్చును. ఏది ఎలా
ఉంటుందో తెలీక పోవచ్చును. కానీ, ఆకలి, బాధా, ఏడుపులాంటివి ఎందుకు తెలియవు.
వాడు గొంతుపోయ్‌నట్లు, ఎంతగా అరుస్తున్నప్పటికీ మా ఇంట్లో ఎవరూ
వినిపించుకోవడం లేదు. ఈ సమయంలో కాన్వెంటుకి టైమవుతుందని పిల్లలిద్దర్నీ పెద్దకోడలు
ముస్తాబు చేస్తుంటుంది. సుందరం పెరట్లో పంచ పాత్ర తోవుతూ ఉండాలి. షెద్దబ్బాయి
విష్ణు తన గదిలో టేబులు ముందు కూర్చొని ఆఫిసు వాల్యూం పేజీలు తిరగేస్తూ ఉంటాడు.
చిన్నవాడు కిష్ణ సబ్బు నురుగెక్కించి, గడ్డం చేసుకుంటూ ఉంటాడు. చిన్నకోడలు పురుడు కోసం
వాళ్ళ పుట్టింటికి వెళ్లిందిలెండి. ఎవరి పనుల్లో వాళ్ళుంటారు. ఎదుట మనిషి ఉన్నదీ లేనిదీ
కళ్ళు ." లేనివాడు గుర్తించలేడని కాబోలు -ఎవరూ వాడీ కేకల్ని పట్టించుకోవడం
లేదు.
ఆ బిచ్చగాడ్ని పొమ్మని నేను చెప్పలేక పోతున్నాను.
పిలిచిన కాసేపటికి సుందరం రుసరుసలాడుతూ లోపల్నుంచి
వచ్చి, ముష్టివాడికి పిడికెడు బియ్యంతోపాటు పుట్టెడు
చీవాట్లు కూడా వేసింది. బిచ్చగాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు అరుపులు లేవు.
మనం మళ్ళీ కథలోకి వద్దాం.
ఆరోజు మా ఆఫీసులో ఆగస్టు పదిహేను వేడుకలు జరిగాయి.
కార్యక్రమం చివరిలో “మరో రాక్షసుడు' అనే నాటిక ప్రదర్శించారు. ఆనాటికను ఆఫీసులో పని
చేస్తున్న ఓ డర్టీ రాస్కెల్ కుర్ర గుమస్తాగాడు రాశాడు. నిరంకుశత్వం సాగించే ఓ
ఆఫీసరు ఉంటాడు. అతని జులుంకి సిబ్బంది ఎన్నో యిబ్బందులు ఎదుర్కుంటుంటారు. వాళ్ళకి
స్వాతంత్రం పోయి, రిక్తహస్తాలతో జుత్తులు పీక్కుంటున్న సమయంలో - ఆ
ఆఫీసులో ఒక కథానాయకుడు ఉద్భవించి, మరో
రాక్షసుడిగా అవతరించిన ఆఫీసరుకి బుద్ధి చెప్పడం ఆ
నాటికలో ఉన్న సారాంశం. నూటికి నూరు పాళ్ళు నన్ను ఎత్తి చూపించడం కోసమే ఆ నాటిక
రాయబడింది. డామిట్ నన్నెంత అవమానపరిచాడు! అందరూ చప్పట్లు కొట్టి ఆనందిస్తుంటే, నేను కుతకుతలాడిపోయాను. నా అహంకారం దెబ్బతింది.
మర్నాడు ఆ రాస్కెల్ని నా ఛాంబరులోకి పిలిచి, చెడామడా తిట్టాను. వాడి రికార్డులో ఎర్రసిరాతో
కసిదీరా రాశాను.
“ఇది నిరంకుశత్వం. అన్యాయం” అని అరిచాడు.
“స్టుపిడ్. అరవకు. నేను రాక్షసత్వం చూపిస్తే
నువ్వు వీధుల్లో ఉంటావు. అప్పుడు నీ కలం, గళం ఎందుకూ పనికిరావు. ఆకలితో మాడి చస్తావు”.
“మీరు బెదిరిస్తున్నారా?”
“కాదు. 'హెచ్చరిస్తున్నాను. పాపం. పదిహేను సంవత్సరాలు
కష్టపడి చదివి ఈ ఉద్యోగంలో చేరావు. నిన్ను డిస్‌మిస్ చేస్తే పాడయిపోయిన నీ
రికార్డు చూసి ఎవడూ కనికరించి నీకు జీవనోపాధి కల్పంచడు”.
మాట్లాడకుండా అసహాయంగా వెళ్ళిపోయాడు.
దేశాన్నీ దీన ప్రజానీకాన్ని జాగృతం చేసి, వెలుగులోకి నడిపించగల రచయితను గడ్డిపువ్వులా పీకి, అవతలకి పారేశాను. అమ్మో! ఈ రాస్కెల్ని
విడిచిపెడితే, ఎన్ని
విప్లవాలు లేవదీస్తాడో? ఎన్ని శంఖారావాలు వినిపిస్తాడో? ఎలాంటి చరిత్రను సృష్టిస్తాడో?
మా విభాగంలోనే కాదు, మా సంస్థలో కూడా నాకు మంచి పేరొచ్చింది. స్టాపును
అదుపులో ఉంచటంలో గాని, ఆదాయం పెరగటంలో గాని, ఆఫీసు ఖర్చు తగ్గించటంలో గాని, కొత్త ప్రతిపాదల్ని అమలుపర్చటంలో గాని నాతో ఎవరూ
పోటీ చేయలేరన్నంత ఎత్తుకి ఎదిగిపోయాను. ఇది నిజం సుమండీ! నా చేతికింద పనిచేసే
వాళ్ళ కష్టనష్టాలతో నాకేవిటి పని?
ఒకసారి ఒకానొక దూరపుబంధువు ఉద్యోగం కావాలంటూ నా
దగ్గరకి వచ్చాడు. ఈ రోజుల్లో కూడా జాతిపితను మా జాతివాడని చెప్పుకు తిరిగేవాళ్ళు
ఎందరోఉన్నారు. “కులం మతం వద్దు'’ అని గొంతు చించుకుమాట్లాడే మనుషుల అంతరాంతరాల్లో కూడా కావలసినవాడు, నా కులం వాదనే నినాదం వినవస్తుంది. కావాలంటే విని
చూడండి. మా వాడ్ని నా ఆఫీసులో
వేసుకుంటే నాకెంతో మద్దతు దొరుకుతుంది.
వెంటనే మా వాడ్ని. పిలిచి, మా ఇంట్లో పెట్టుకున్నాను. అతనికి ఉద్యోగం
యివ్వాలి. ఆఫీసులో ఖాళీల్లేవు. కింకర్తవ్యం - మా ఆఫీసులో ఒక గుమస్తా ఉన్నాడు. అతను
యిరవై నాలుగు గంటలూ నిషాలో ఉంటాడు. అతని కెన్నో మెమోలు, చార్జీషీట్లూ యిచ్చాను. ఫలితం లేకపోయింది. ఉద్యోగం
నుండి తీసెయ్యటానికి సరైన అవకాశం దొరకడం లేదు. కారణం - అతడు పనిచేసేది రెండు మూడు
గంటలే అయినా. రెండు రోజుల పనిని సునాయాసంగా, క్షుణ్ణంగా
చేస్తాడు. కాబట్టి ఎక్స్‌ప్లాయిటేషన్ చేయాలి.
“అతన్ని పిలిచి, కాశ్మీరు వెళ్ళి రమ్మని 'ఎల్టీసీ' రెండువేలు. గ్రాంటు చేశాను. ఫ్యామిలీతో టూరు
“చేయమని పది రోజులు సెలవు కూడా యిచ్చాను. అతను సంబరపడిపోయాడు. ఎగిరి గంతేసి, నా కాళ్ళు పట్టుకున్నంత పనిచేశాడు. నా ఉదారత వెనుక
ఎలాంటి ఉచ్చులు
పన్ని ఉంచానో అతనికి తెలీదు. తాగుబోతు చేతిలో డబ్బు
పడితే, ఏం జరుగుతుందో నాకు తెలుసు.
అతనూ టూరు వెళ్ళలేదు. డబ్బంతా జల్సాగా బారులకి, రేసులకి తగల బెట్టాడు. దొంగ టిక్కెట్లతో బిల్లు
పెట్టి ఫ్రాడ్ చేసినట్లు దొరికిపోయాడు. ఉద్యోగం ఊడిపోయింది.
అతని యిల్లాలు తన ముగ్గురు పిల్లల్ని తీసుకువచ్చి నా
కాళ్ళా వేళ్ళా పడింది. ఆ ఇంటిదీపం వెలిగించమని,వాళ్ళ దరిద్రపు గొట్టు బతుకుల్ని మరీ చీకటి
చెయ్యొద్దని గోలుగోలున ఏడ్చింది. నా మనసు కరిగిపోలేదు. ఎందుకు కరుగుతుంది? ముందుగా ఆలోచించి, చేసిన కుట్ర ఇది. నికార్సయిన అన్యాయం
జరిగిపోయింది. ఆ ఇల్లాలు కన్నీటిని తుడవటానికి కోటి చేతులు లేచి
వస్తాయనుకుంటున్నారా? నో... నో... ఒక్క కన్నీటి బొట్టును తుడవటానికి పిక్కచేయి కూడా
ముందుకి రాలేదు. ఎలా వస్తుంది? ఎవడి స్వార్ధం వాడి చేతుల్లో పెట్టుకొని,
గుండెకి గొంతు దగ్గర న్నప్పుడు కన్నీటిని
తుడవటానికి చేతులకి ఖాలీ ఎక్కడుంటుంది?
అందుకే అధికార దాహం పెరిగిన నాలాంటి ఆఫీసర్లు ఏం
చేసినా కిక్కురుమనలేదు. నాకు అమోఘమైన తెలివితేటలున్నాయి. వంచన చేస్తో కుట్ర పన్నో
ఎవరి జీవితాన్నయినా తారుమారు చేయగలను. అవినీతి, బంధుప్రీతి, చీకటి బజారు, అధికారం, సింహాసనం, స్వార్ధం
- వీటి మీద ఎన్ని పుటలైనా వ్రాయగలను. అయితే, అటువంటి రాతలు నిషేధించబడ్డాయి గనుక ఆ ప్రయత్నం
చేయలేదు.
మా బంధువుకి ఉద్యోగం వేయించాను.
కాసేపు ఆగండి సార్: మా విష్ణు ఆఫీసుకు బయల్దేరినట్లుంది.
అదిగో స్కూటరు స్టార్టు చేశాడు. పిల్లలిద్దరూ స్కూటరు మీద కూర్చొని వాళ్ళమ్మకి 'టాటా' చెప్తున్నారు. అంటే ఇప్పుడు తొమ్మిది దాటిందన్నమాట.
కాస్త కాఫీ కడుపులో పడితేగాని లాభం లేదు.
“సుందరం... సుందరం...”
చూస్తుండగానే ఆకాశంలో హరివిల్లు కరిగిపోయినట్లు నా
పరిస్థితి మారిపోయింది. ఒకరి సాయం ఉంటే తప్ప కదల్లేను. ఇరవై నాలుగ్గంటలూ నాకు
చీకటే తోడు. నన్నెవరూ పట్టించుకోరు.
సుందరం కాఫీ తీసుకొచ్చింది.
కాఫీ చల్లగా ఉంది. పంచదార కూడా లేదు. “అది లేదూ
ఇది లేదూ' అంటే సుందరానికి కోపం వస్తుంది. మౌనంగా కాఫీ తాగి, ఖాళీ కప్పు యిచ్చేశాను. సుందరం వెళ్ళిపోయింది.
మాష్టారూ! పంచదార ధర మహా ఘోరంగా ఉందికదూ? బ్లాక్‌లో కిలో పన్నెండు రూపాయలట. అక్రమ ఆర్జనతో
తెగ బలిసిపోతున్న బడా బాబుల్ని ఊరికే విడిచిపెట్ట కూడదండీ. అలా విడిచి పెడితే, మీ ఊరికే ప్రమాదం. ఏం మాస్టార్లూ! నా మాటలకి
నవ్వుతున్నారా? మీ నవ్వుకి అర్థం నాకు తెలునులెండి. కథ పూర్తిగా
చెప్పనివ్వండి.
పన్నెండేళ్ళు అపజయం అంటే ఏమిటో తెలియకుండా అదే
ఊళ్ళో, అదే ఆఫీసులో, అదే సీట్లో పనిచేశాను. బహుశా, ఈ దేశంలో ఈ విషయంలో ఇదే రికార్డేమో? నన్నెవరూ బదిలీ చేయలేకపోయారు. నా పై అధికారుల
బలహీనతలు నాకు బాగా తెలుసు. అందుకే, నా యిష్టానికి వ్యతిరేకంగా ఆర్డర్సు జారీ చేయలేదు.
రాజకీయ శక్తులతో నన్ను కబళించాలని కొందరు ప్రయత్నించారు. కానీ, ఆ రంగంలో ఉన్న వాళ్ళందరూ నా వర్గం మనుషులు. నాలాంటి
వాణ్ణి దూరం చేసుకోవటానికి వాళ్ళు యిష్టపడరు.
ఆ ఏడాది మా సంస్థలో అన్ని విభాగాల్లో ఉన్న ఆఫీసర్ల
మధ్య అకర్షణీయమైన ఓ పోటీ ప్రవేశ పెట్టారు. ఉత్తమ అధికారిగా ఎన్నిక చేయబడ్డ వాళ్ళకి
ప్రపంచ పర్యటనతోబాటు విలువైన బహుమతి ప్రదానం కూడా చేస్తారు. మనిషి మానసిక
ప్రవృత్తి చాలా చిత్రమైంది.అపురూపం అనుకున్నది, విలువైనది తనకే కావాలన కుంటాడు. తను కోరుకున్నది.
పొందడం కోసం ప్రక్కవాణ్ణి పతనం చేయటానికైనా సిద్ధపడతాడు. మంచి ఆలోచనతో పెద్దవాళ్ళు
వృత్తిల్లోను, ప్రవృత్తిలోను పోటీ పెట్టినప్పటికీ అది ఆరోగ్యకరం
కాదని, నేనంటాను. ఈ పోటీల్లో ఎక్కువగా చోటు చేసుకొనేవి -
అవినీతి, అసూయా, అశాంతి, అల్లరీ, అవమానమూ మాత్రమే.
ఈ పోటీ నేను నెగ్గాలి. విదేశాలు తిరిగి రావాలి.అవార్డు
తీసుకోవాలి. ఆ అదృష్టం నా పరం కావటానికి నేనేమైనా చేస్తాను. ఎవరి జీవితాన్నయినా
నాశనం చేస్తాను. ఏ అధికారి కాళ్లయినా పట్టుకుంటాను.
పిసరు పిసరుగా కూడిన స్వార్థం నాలో ఓ మాంసపు, ముద్దగా చోటుచేసుకుంది. ఆఫీసులో ఉన్న ప్రతి ఒక్కరి
చేత వాళ్ళ రక్తం పిండి, సంపద పెంచాను. శ్రమపడే వాడి కనీస అవసరాల్ని కూడా లెక్కచేయకుండా ఆఫీసు
డబ్బు మిగిల్చి వాళ్ళ కన్నీళ్ళనే ఖర్చు చేశాను. క్రమశిక్షణ కోసమని, చాలామందికి ప్రమోషన్లు వెనకబెట్టాను. ఎంతో
తెలివిగా పై ఆఫీసర్లతో, ఆడిటర్లతో ప్రవర్తించాను.
సెంట్రలాఫీసు నుండి. డైరెక్టరుగారు వచ్చారు.అతని
చేతుల్లో నా అదృష్టం ఉంది. అతన్ని ప్రసన్నం చేసుకోవాలి.
ఆఫీసు విషయంలో మా డైరెక్టరుగారు మంచి రిమార్కు
రాశారు. తర్వాత అతని గౌరవార్థం పోష్ హోటల్లో ఖరీదైన విందు ఏర్పాటు చేశాను.
ఆ రాత్రి తను ఒంటరిగా నిద్రపోలేననీ, తనకి తోడుగా ఓ అందాల భామ కావాలని, ఆ అందాల తోడు స్టెనో మధుమతై ఉండాలని కోరాడు. అరవైయేళ్ళు
దగ్గరపడుతున్న ముసలి పీనుగు డైరెక్టరు. ఉదయం ఇనస్స్పెక్షన్ జరుగుతున్నంత సేపు
మధుమతిని అతనికెదురుగా కూర్చో బెట్టుకున్నాడు. ఆ అమ్మాయిలో అతని కూతురే
కనిపిస్తుంది కాబోలు, అతి చనువుగా మాట్లాడుతున్నాడని నేను సరిపెట్టుకున్నాను. ఓ హెల్. దుర్మార్గుడిది ఎంత లోతు గుండె.
తప్పదు. క్షుద్రదేవత కోరుకున్న బలి యివ్వాలి. అప్పుడే
నాకు బంగారు బాట దొరుకుతుంది. కానీ, మధుమతి
నిప్పులాంటి పిల్ల. ఆమెను బలిపీఠమ్మీదికి పంపించాలంటే సామాన్య విషయం కాదు. గంటన్నరసేపు
బుర్రబద్దలు కొట్టుకొని ఆలోచించాను. చివరికి మెరుపులాంటి అయిడియా వచ్చింది.
నేనే మధుమతి ఇంటికి వెళ్ళాను. ఎంతో అందంగా కనిపించే
అమ్మాయి. జీవితం ఆ ఇంటి వాతావరణం యింత జుగుప్సాకరంగా ఉంటాయని నేను ఊహించలేదు.
పక్షవాతంతో ఉన్న తండ్రి, ఆకలీ ఏడుపులతో చిన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు, పెచ్చులూడిపోయి పాతబడి పోయిన డొక్కు పెంకుటిల్లు, గుడ్డి వెలుతురులో అస్తవ్యస్తంగా కనిపించే
వస్తువులు - చూస్తే సహజంగా మనిషన్న వాడికి జాలీ దయ కలగాలి. కానీ, నాకవేమీ
అనిపించలేదు. డైరెక్టరుగార్ని తృప్తిపరచగలననే నమ్మకం ఏర్పడింది. నన్ను చూసి మధుమతి
ఆశ్చర్యపోయింది. నాకు మర్యాద చేయటానికెంతో అవస్తపడింది.
“మధుమతీ! నిన్ను డైరెక్టరుగారు చాలా మెచ్చుకున్నారు.
హెడ్ క్వార్టర్సు కెళ్ళగానే, నీకు ప్రమోషన్ ఆర్జర్సు వేస్తామన్నారు”.
కాసేపాగి మళ్ళీ నేనే మాట్లాడాను.
“అ... ఇంతకూ నేనెందుకొచ్చానంటే రేపు డైరెక్టరుగారు
వెళ్ళిపోతారట. అర్జంటు లెటర్సు కొన్ని రాత్రికి రాత్రే టైపు చేసి పెట్టాలట...
ప్లీజ్! నువ్వు కోపరేట్ చేయాలి”.
అంత సౌమ్యంగా నేనెప్పుడూ ఎవ్వర్నీ ఏదీ అడగలేదు.
మధుమతి నా మాటలకి కాస్త యిబ్బంది ఫీలయింది. మొహమాటంలో పడింది. కాదన లేకపోయింది.
“అలాగే సార్! పిల్లలకు భోజనాలు వడ్డించి, ఇప్పుడే
వస్తాను”.
మధుమతి వచ్చేవరకు అక్కడే నేను కూర్చుండిపోయాను. ఆ
అమ్మాయి గబగబా పనులు చక్కబెట్టుకొని నాతో బయలుదేరింది. మరికొన్ని క్షణాల్లో తను ఏంకాబోతుందో
తెలియని అమాయకురాలు. నన్ను అనుసరిస్తుంది. కాసేపు డైరెక్టరు గారితో మాట్లాడేక
డిక్టేషను తీసుకోమని చెప్పి, మధుమతిని గదిలో విడిచి, గెస్టుహౌస్ బయటపడ్డాను. బయట ఆర్డర్లీతో
అయ్యగార్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఇంటికీ వెళ్ళి పోయాను.
'ఏవయ్యా! నీ కన్నకూతుర్ని కావాలని అడిగితే, దట్
ఓల్డ్ డెవిల్ ఇలాగే సమర్పించుకుంటావా? నీలో నీతీ నెత్తూరు ఉన్నాయా?” అని మీరు ప్రశ్నించాలను కుంటున్నారు కదూ?
మీ ప్రశ్నకి జవాబు యిస్తాను. కాసేపు ఆగండి.
ఆ... సుందరం భోజనం తీసుకొచ్చింది. రెండయి ఉంటుంది.
ఇంట్లో అందరికీ అందిన తర్వాతే నాకు తినటానికైనా తాగటానికైనా సుందరం తీసుకు
వస్తుంది. నిజమేలెండి. సంపాదన లేనివాడికి అడిగే హక్కు ఉండకూడదు. ఇచ్చినప్పుడే
పుచ్చుకోవాలి.
ఎక్స్‌క్యూజ్మీ. ఆకలిగా ఉంది. మీరు అనుమతిస్తే, నేను భోం
చేస్తాను. కాసేపు కథను ఆపుదాం:
విశ్రాంతి.
****
ఆ... యిందాక మీరేదో ప్రశ్న వేయబోయారు కదూ? అదే ప్రశ్న ఆ మర్నాడు నా ఆర్డర్లీ ఎంత ధైర్యంగా
నన్నడిగాడో తెలుసాండీ?
“అయ్యా రేతిరి గోరం జరిగిపోనాది. ఆ డవిరెక్టుబాబు
మదమ్మను బలత్కారం చేసి సెరిపేశారు. ఆయమ్మ కేకలేసింది. తలుపులు బాదింది. ఆడు గెడతియ్యనేదు.
నన్ను మాటాడనియ్యనేదు. మదమ్మ బతుకు బుగ్గిసేసీసినాడు. ఇదన్నేయం బాబూ...”వాడు
విలవిల్లాడిపోతున్నాడని ఆ ముఖం చెప్పంది.
“షటప్... అబద్ధాలాడకు.... ఆ_ వయసుగల కూతుళ్ళు డైరెక్టరుగారికున్నారు” కళ్ళెర్ర
జేశాను.
“మీరు లోనకంపింది ఆడి కూతుర్ని కాదు గదండీ....
బాబూ! మీ కూతుర్నో, మీ అప్పసెల్లెల్నో అడిగితే, అల్లాగే ఆడిగదిలోకి అంపించీవోరా?.... మీరెరి గుండే... ఆయమ్మను తారిసారు..”
విప్లవం అనేది యిదిగో యిలాంటి బురద మనిషి చదువూ
సంధ్యాలేని మొండి వెధవ నుండే పుడుతుంది.
ఆర్జర్లీ చెంప ఛెళ్ళుమనిపించాను.
“డర్టీగూస్... ఒక్కమాట ఎక్కువగా మాటాడితే నిన్ను
నీలువునా చీరేస్తాను. అనవసరమైన విషయాల్లో తలదూర్చకు... వెళ్ళు... రాత్రి జరిగింది
పూర్తిగా మర్చిపో... లేకపోతే నిన్ను...”
నా మాట పూర్తికాకుండానే వాడు బయటకు వెళ్ళి పోయాడు.
నేను అధికారమదంతో ఏవైనా చేయగలను. ఆఫ్టరాల్ ఆర్డర్లీ అంటే నా అడుగులకి మడుగులొత్తే
ఓ స్కౌండ్రల్. వాడు రొమ్ము చరిచి, గొంతుపెంచి, నా వాళ్ళ గురించే వాగితే నేను సహించగలనా.
నాకు పూర్తి భరోసా యిచ్చి, డైరెక్టరు గారు వెళ్ళిపోయారు.
“అమందానంద కందళిత హృదయారవిందుడనైతి నోయ్' అని నాతో కరచాలనం చేశాడు. అబ్బా! ముసలి పీనుగులో
ఎంత సంతోషం కనిపించింది. ఆ మర్నాడు మధుమతి ఆత్మహత్య చేసుకున్నట్లు వార్త వచ్చింది.
“ఎందుకూ, ఏమిటీ... లాంటి కారణాలు ఎవరికీ తెలియవు. నన్ను
అనుమానించే పురుగు ఒక్కటీ లేదు. పైగా ఆ అమ్మాయి తన చావుకి కారణం ఎవరూ కాదని రాసిపెట్టి
మరీ చచ్చిపోయింది. థాంక్స్ టు హెర్. దేశంలో రోజు ఎంతమంది చనిపోవడం లదు. పోయిన
వాళ్ళలో మధుమతీ ఒక్కరై. మే హెర్ సోల్ రెస్టింది హెవెన్.
వారం రోజులు గడిచాయి.
సెంట్రలాఫీసు నుండి నాకు డైరెక్టరు గారు ఫోన్ చేసి, ఉత్తమ అధికారి అవార్డు నాకు లభించినట్లు చెప్పారు.
అనుకున్నది నేను సాధించగలను. నా నమ్మకం నన్నెప్పుడూ నిరాశ పరచలేదు.
చీకటిపడింది. ఇంటికి బయల్దేరాను. ఇంట్లో సుందరానికి, పిల్లలకి అవార్డు విషయం చెప్పాలి.
సడన్‌గా నా కాళ్ళకి బ్రేక్ పడింది. ఆఫీసు స్టాపు
మూకుమ్మడిగా నన్ను చుట్టుముడుతున్నారు. అన్ని కళ్ళల్లో కోపం బుసలు కొడుతుంది. అన్నిచేతులూ
ఒక్క గొలుసులా కలిసిపోయాయి. సమాధి నుండి లేచిన పీనుగులు వికటాట్టహాసం చేస్తూ నన్ను
కబళించటానికి బరువైన అడుగులు వేస్తూ క్షణక్షణం సమీపిస్తున్నాయి.
యూనియన్ల తారతమ్యం లేదు. నువ్వూ నేనూ అనే భేదం
లేదు. పేలికలు చీలికలై పోయిన దారప్పోగులు ఒక్క మోకుగా, ఒక విప్ణవంలా, ఒక పెను తుఫానులా నా మీదికి విరుచుకుపడ్డాయి. జీవితంలో
మొదటిసారి భయపడ్డాను. రాక్షసత్వం కూడా సంఘటిత శక్తి ముందు " కదిలిపోతుంది కాబోలు.
నన్ను తమ యిష్టం వచ్చినట్లు తిట్టారు. ఎందర్ని ఉసురుపెట్టానో, అందరూ... యింకా అందరూ నన్ను హింసించారు. కసిదీరా
చావగొట్టారు. కళ్ళు బైర్లు కమ్మాయి. నెత్తురు ప్రవహిస్తోంది. నిస్సహా యంగా కిందికి
ఒదిగిపోయాను.
రెండు రోజులు అపస్మారకంలోనే ఉన్నాను.
నాకు తెలివొచ్చేసరికి నా చుట్టూ నా ఇల్లాలు, పిల్లలు
తప్ప మరెవరూ లేరు. ఈ ప్రమాదం ఎలా జరిగిందని వాళ్ళడిగితే నేను ఎలాంటి సమాధానం యివ్వలేక
పోయాను. నా అత్యాచారానికి అందరూ కలిసి యిచ్చిన బహుమతి అని చెప్పుకోవాలి. అలాంటి
నీచుణ్ణని తెలిస్తే నా శ్రీమతి అసహ్యించుకుంటుంది. నా పిల్లలు నన్ను హీనంగా
చూస్తారు. అది నేను భరించలేను. అందుకే నేను ఏమీ చెప్పలేకపోయాను.
పది రోజులు హాస్పిటల్లో మంచమ్మీదే ఉన్నాను. నన్ను
పరామర్శించటానికి ఆఫీసు నుండి ఒక్కరు రాలేదు. నేను చచ్చిపోతే, నన్ను మోసుకుపోవడానికి కనీసం నలుగురు మనుషులైనా
వస్తారా అని భయంకరంగా ఆలోచించాను. నాలో పశ్చాత్తాపం మొదలయింది.
రాజధానిలో ఫంక్షను ఏర్పాటుచేశారు. క్రిష్ట నా ప్రక్కనే
ఉన్నాడు. కన్నుల పండుగలా ఉందని, గొప్ప గొప్ప వాళ్ళంతా వచ్చారని, నన్ను పెద్దవాళ్ళ మధ్య గౌరవంగా కూర్చోబెట్టారని. క్రిష్ణ ఎంతో సంబరపడి పోయాడు.
అవార్డు తీసుకోవటానికి నన్ను డయాన్ మీదికి
పిలిచారు.
ఈ వేడుకని చూడాలని ఎన్నికలలు కన్నానో...చూడ్డానికి
నాకిప్పుడు కళ్ళు... ఆ కళ్ళు లేవండీ... అంతా చీకటి... కటిక చీకటి. నన్ను ఒకేసారే
చంపకుండా, చచ్చే వరకు చీకటిలో కుళ్ళికుళ్ళి చావమని నా కళ్లు
పీకేశారు. నా అధికారంలో ఏళ్ళ తరబడి అన్యాయం చేయబడ్డ
అనేకానేక మంది అభాగ్యులు నాలాంటి దుర్మార్లుడికి తగిన
శిక్ష విధించారు.
గుడ్డిలోకం ఎంత బాధాకరమో తెలుసాండీ? చదవ లేను. వ్రాయలేను. చూడలేను. చెప్పలేను. నిద్రలో, మెలకువలో
కనిపించేదీ చీకటి మాత్రమే. ఆ చీకటిని చూళ్ళేక తల బాదుకున్నాను. మతి
పోగొట్టుకున్నాను. గొల్లున ఏడ్చాను. నా కళ్ళతో బాటు నాలో పేరుకున్న అహంకారం, స్వార్ధం, ద్వేషం, అవినీతి, అన్నీ అంతరించిపోయాయి.
క్రిష్ణ సాయంతో డయాన్. మీదికి వెళ్ళి అవార్డు అందుకున్నాను.
మిన్నుముట్టే కరతాళధ్వనులు నాకు వినిపించాయి తప్ప ఎలాంటి అవార్డు యిచ్చారు, ఎవరి చేతుల మీదుగా తీసుకున్నానో - ఆ అపూర్వమైన దృశ్యాలు
ఏవిటో నేను చూడలేకపోయాను.
గుడ్డివాడికి విదేశ పర్యటన దేనికని రద్దు చేశారు. నాసేవలు
మా సంస్థకి ఉపయోగపడవని నా చేత ఉద్యోగం మాన్పించారు. అంచెలంచెలుగా కిందికి... మరీ
కిందికి జారిపోయాను.
అదండీ నా కథ! నా మీద సానుభూతి చూపించమని మిమ్మల్ని
అడగను. ఆ అర్హత కూడా నాకు లేదు. అయితే మిమ్మల్ని ఒక్క విషయం గురించి హెచ్చరిస్తున్నాను.
నా లాంటి నీచులు ప్రతీ రంగంలో ప్రతీ ఆఫీసులో ప్రతి ఊళ్ళో ఉంటారు. వాళ్ళను
రాక్షసులుగా పెరగనివ్వకండి. వాళ్ళను పట్టించుకోలేకపోతే మీ జీవితాలను నాశనం
చేస్తారు. మీ ఆడవాళ్ళకి దిక్కు లేకుండా
చేస్తారు. మీ అప్పచెల్లెళ్ళను పాడు చెస్తారు. మీ పిల్లలు భవిష్యత్తును తుడిచి
వేస్తారు. రాక్షసుల సంఖ్య పెరిగితే దైవత్వం నశించి పోతుంది. నీతి, నిజాయితీ, త్యాగం, ప్రేమా అనే పదాలు అంతరించిపోతాయి.
నాలాగ ప్రవర్తించే ఏ అధికారైనా ఏదోరోజున ఏదో విప్లవానికి
లొంగి పోవడం నిజం. ఏదో ఒక దురవస్థకి గురికావడం తధ్యం. అధికారం చేతిలో ఉందని, మీ చేతికింద పనిచేసే మనిషిని హీనంగా చూడకండి. అందరిలో
మీరూ ఒక్కరిగా వ్యవహరిస్తే మిమ్మల్ని నెత్తిన పెట్టుకుని పూజిస్తారు. మీకు బంగారు
బాటను చూపిస్తారు.
అందుకే, మా విష్ణుకి అప్పుడప్పుడు నా కథను మరెవరి కథగానో
వినిపించి హెచ్చరిస్తుంటాను. నా కొడుకు నా మార్గంలో నడవ కూడదని నా వ్యధ. నా కొడుకే
కాదు, ఏ వ్యక్తీ నన్ను అనుసరించకూడదని వెలుగు వాకిట్లోకి
నడవాలని నా ప్రార్ధన.
ఓకే. సార్! మాఇంట్లో సందడిగా ఉంది. అంటే -విష్ణూ, క్రిష్ణా మనవళ్ళు ఇల్లు చేరినట్లున్నారు. ఉంటాను.
ఓపిగ్గా నా కథ వ్యధ విన్న మీకు నా ధన్యవాదాలు.
గుడ్‌నైట్ రీడర్స్.
నా కామెంట్ అయితే స్టోరీ చాలా బావుంది. కధనంలో కొంత వినూత్నత. పాఠకునికి కధ చెప్తూ మధ్యమధ్యలో వచ్చిపోయే పాత్రలగురించి చెప్పటం.. అవి కధకి సంబంధంలేనివి కావటం.. కథకునితో సంబంధమున్న పాత్రలవ్వటం వాటిని కూడా కథతోపాటు పాఠకునికి చెప్పటం చాలా బాగుంది. టోటల్ గా కథ, కథనం, చెప్పదలచుకున్న అంశం చాలా బావుంది. ఈ కధని మన బ్లాగ్ లో పెట్టటానికి అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు..
రిప్లయితొలగించండి