ఆనాటి వర్షమే మళ్ళీ పడింది

 

                                        ఆనాటి వర్షమే మళ్ళీ పడింది

డాక్టర్ ఐజక్ గుండె
సెల్ : 9866752159

   కుండపోతగా వర్షం పడుతోంది. తాను వేసిన వరిపంట నీటిలో మునిగి పోతుందేమోనని భయంతో, త్వరగా వెళ్లి గట్లు తెగ్గొట్టాలనే అతృతతో వెళుతున్నాడు రైతు వెంకట్రావు. తనకు ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా ఆగిపోయాడు. అతనికెదురుగా తన ఇంటిపక్కనుండే నరేష్, భార్య, మూడేళ్ళ కూతురు శవాలై పడివున్నారు. వెంటనే ఊళ్లోకి పరిగెత్తి చుట్టు పక్కల వాళ్ళని పిలుచుకొచ్చాడు. దూర, దగ్గరి ప్రాంతాలనుండి బంధువులు స్నేహితులు వచ్చారు. కర్మకాండలు ముగిసాయి. నరేష్ కుటుంబంతో సహా ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో అక్కడెవరికీ స్పష్టంగా తెలియదు. అక్కడ చర్చ మొదలయ్యింది. కొంతమంది బాగా చదువుకున్నా ఉద్యోగం రాలేదని, మరికొందరు కుటుంబ కలహాలవల్ల అని గుసగుసగా చెప్పుకోసాగారు. అక్కడేఉన్న సునీల్ వారిమాటలువిని. అందరిని ఒక్కపిలుపుతో తనవైపు తిప్పుకుని, తానూ,నరేష్ చిన్నప్పటినుండి ప్రాణ స్నేహితులమని కలిసి చదువుకుని, కలిసి పెరిగామని, అసలేం జరిగిందో చెప్తానని చెప్పడం ప్రారంభించాడు. అందరూ అతనివైపు తిరిగి ఆసక్తిగా  వినడం  ప్రారంభించారు.

                       *                       *                       *

    యూనివర్సిటీ క్యాంపస్. ఇంజనీరింగ్ చదివే విద్యార్థుల క్లాస్ రూమ్. పాఠం చెప్పడం పూర్తిచేసిన ప్రొఫెసర్. డియర్ స్టూడెంట్స్ రోజుతో సిలబస్ పూర్తిఅయింది. ఇక పరీక్షలు రాసి డిగ్రీ పట్టాలు తీసుకోవడమే ఇక మిగిలింది.  బెల్ కొట్టడానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఈలోగా చదుపూర్తయ్యిన తర్వాత ఎవరెవరు ఏమవ్వాలనుకొంటున్నారో చెప్పండి అన్నాడు. అందరికంటే ముందు నరేష్ లేచి, సార్ నేను వ్యవసాయం చేద్దామనుకుంటున్నాను . వ్యవసాయం చేసి నలుగురికీ భోజనం పెడదామనుకుంటున్నాను అన్నాడు. ప్రొఫెసర్ తో సహా అందరూ అతని వైపు ఆశ్చర్యంగా చూశారు. మరికొందరు ఒకరిముఖాలు ఒకరు చూసుకుని వెకిలిగా నవ్వుకున్నారు.   తర్వాత మిగతావారు లేచి కొంతమంది తాము విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదువుదామని , మరికొంతమంది ఎస్ , పి ఎస్ లాంటి ఉద్యోగాలు సాధిస్తామని చెప్పారు. చివరిగా విజయ్ లేచి తానూ సెల్ ఫోన్ తయారుచేసే కంపెనీ స్థాపించి, అందరికీ అందుబాటు ధరల్లో  వాటిని అమ్మి వ్యాపారం చెయ్యాలనుకుంటున్నానని చెప్పాడు. ఈలోగా బెల్ మోగడంతో అందరూ క్లాస్ లో  నుండి బయటికి వెళ్లిపోయారు.

అందరూ పరీక్షలు రాశారు. ఫలితాల్లో నరేష్ కే అందరికన్నా ఎక్కువ మార్కులొచ్చాయి. నరేష్ తో పాటు అందరూ సర్టిఫికెట్స్ తీసుకుని తమ ప్రయత్నాలు చెయ్యడం మొదలుపెట్టారు. ముందుగా నరేష్ తన తండ్రి ద్వారా వచ్చిన పది ఎకరాల పొలాన్ని ఏడాదినుండి ప్రారంభించాడు. మిగతా వాళ్లు తమ తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. మొదటి ఏడాది వ్యవసాయంలో, చదువుకున్న నూతన ఇంజినీరింగ్ పద్ధతుల్ని ఉపయోగించి  మంచి దిగుబడి పొందాడు నరేష్. వచ్చిన దిగుబడితో కొన్ని గేదెల్ని కొని చిన్న డైరీ ఫామ్ కూడా ప్రారంభించి పాడి రైతుగా కూడా మారాడు. వచ్చిన ఫలసాయాన్ని అక్కడున్న పేదలకు కూడా   పంచి సహాయం చెయ్యడంతో మంచి వ్యక్త్తిగా పేరుసంపాదించాడు నరేష్ . అందరూ అతన్ని నరేష్ గారని గౌరవించడం మొదలుపెట్టారు. మూడేళ్లు గడిచాయి. వ్యవసాయం బాగుచేస్తూడటంతో నరేష్ కి అతని తల్లి తండ్రులు పెళ్లి చేసారు. మిగతా వారుకూడా తమతమ ప్రయత్నాల్లో కొంత పురోగతిని సాధించారు . విజయ్ కూడా సెల్ ఫోన్ కంపెనీలో చేరాడు వ్యాపారంలో కొంత అనుభవం సంపాదించడానికి.

   తర్వాత వరుసగా రొండు సంవత్సరాలు  వర్షాలు సరిగా పడక పోవడంతో కరువు పరిస్థితులేర్పడ్డాయి. పశువులకు కూడా తీవ్ర పశుగ్రాసం కొరత ఏర్పడింది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ఖర్చుల కోసం తెచ్చిన అప్పులు తీర్చడానికి డైరీ ఫామ్ ని అమ్మేశాడు నరేష్. చేతిలో పెట్టుబడి లేకపోవడంతో బ్యాంక్ నుండి వ్యవసాయ రుణం తీసుకున్నాడు. ఏడాది వరిపంట వేసాడు నరేష్. ఎంతో శ్రద్ధతో సాగు చేస్తూ కన్నబిడ్డలా పంటను జాగ్రత్తగా చూసుకున్నాడు. మరో నెల రోజుల్లో కోత కోస్తారనగా తుఫాను వచ్చింది. తుఫాను వర్షంలో తడుస్తూనే పంటను కాపాడుకునే ప్రయత్నం చేసాడు నరేష్, అయినా లాభం లేక పోయింది. పంట మొత్తం నేలకొరిగింది. వడ్ల గింజలన్నీ నేలరాలిపోయాయి. ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసి కొంతఆలస్యంగా చెల్లించింది. వచ్చిన డబ్బు బ్యాంక్ అప్పు తీర్చడానికే సరిపోయింది. అదీ ఆలస్యంగా కట్టడంతో బ్యాంక్ మేనేజర్ కోప్పడ్డాడు.   

మరుసటేడాది మళ్ళీ కొత్త అప్పు కోసం బ్యాంక్ మేనేజర్ ని కలవడానికి వెళ్ళాడు నరేష్. అదే సమయంలో విజయ్ కూడా తన సెల్ ఫోన్ కంపెనీని స్థాపించడానికి అప్పు కోసం బ్యాంక్ కి వచ్చాడు  ముందుగా నరేష్ వెళ్లి కలిసాడు. అంతకుముందు తీసుకున్న అప్పు సకాలంలో చెల్లించలేదని అసహనం, చిరాకు వ్యక్తం చేసాడు మేనేజర్. అసలు అప్పు ఎందుకివ్వాలో చెప్పమన్నాడు. సార్ నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని, ఐనా వ్యవసాయం చేసి అందరికీ భోజనం పెట్టాలి, పేదల ఆకలి తీర్చాలన్న ఆశయంతో నేను వ్యవసాయం చేస్తున్నాను , కానీ అనుకోని అవాంతరాలు, ఇబ్బందుల వల్ల నేను మీ దగ్గర తీసుకున్న అప్పు ఆలస్యంగా కట్ట వలసి వచ్చింది. అంతేకాని నేను ఎవ్వరినీ ఎప్పడూ మోసం చేసిన వాణ్ణి కాదు, దయచేసి నా పరిస్థితి అర్ధం చేసుకుని అప్పివ్వండని అభ్యర్ధించాడు. నరేష్ మాటల్ని పెడచెవిన పెట్టిన మేనేజర్ అప్పు ఇచ్చేది లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పేసాడు. చేసేదేం లేక బయటికి వచ్చాడు నరేష్.       

       తర్వాత కలిసిన విజయ్ తాను సెల్ ఫోన్స్ కంపెనీ స్థాపించబోతున్నానని  ప్రస్తుత కాలంలో సెల్ ఫోన్ మనిషి అవయవాల్లో ఒకటిగా మారిపోయిందని దానితో అరచేతిలో ప్రపంచాన్ని చూడొచ్చని, ఇంకా దాని ద్వారా కలిగే లాభాల్ని వివరించి, ప్రస్తుత కాలంలో మనుషులు తినకపోయినా దాన్ని చూస్తూ గడిపేస్తారని , నేటి కాలంలో ప్రతిమనిషికీ ఇది ఎంతో ముఖ్యమని వివరంగా చెప్పడంతో, సంతృప్తి చెందిన మేనేజర్ అతనికి అప్పు మంజూరు చేసాడు. 

     హాయ్ నరేష్ ఎలా ఉన్నావు? ఏంచేస్తున్నావ్? అడిగింది శృతి రోడ్ మీద నడుస్తూ వెళుతున్న నరేష్ ని. శృతి, నరేష్ క్లాస్ మేట్. .. బానే ఉన్నాను, భార్య, కూతురు కుటుంబంతో సంతోషం గానే ఉన్నాను అన్నాడు. అతని మనసులోని భాదని కళ్ళల్లోకి చూసి  కనిపెట్టిన శృతి, ఇంకా ఎందుకు వ్యవసాయం చేస్తూ కష్టాలు పడటం, మా ఆయన ఫ్యాక్టరీలో నీక్కూడా ఉద్యోగం ఇప్పిస్తాను చక్కగా ఉద్యోగం చేసుకో అంది. నేను ఇష్టపడే నలుగురి భోజనం కోసం కష్టపడుతున్నాను. ఎవరైనా ఐదు వేళ్ళు లోపలికి వెళ్ళాక ఇది రైతు పండించిన oటో అని నన్ను తలుచుకుంటే జీవితం ధన్యమైనట్టే. నమ్మిన దానికోసం ఇష్టపడి పనిచెయ్యడం ఎప్పుడూ కష్టంకాదు. మనం నమ్మినదే  మనకు ఎదో ఒక దారి చూపుతుందనేది నా నమ్మకం . లక్ష్యాన్ని చేరలేనప్పుడు ఇక బ్రతుకు అర్ధంలేదు అన్నాడు. నరేష్ కి తనపై  తనకున్న నమ్మకాన్ని ఆత్మవిశ్వాసాన్ని చూసిన శృతి  ఏడాది పెట్టుబడి పెట్టి సాయం చేసింది. ఏడాది పర్వాలేదనిపించింది వ్యవసాయం, వచ్చిన రాబడి శృతి దగ్గర తీసుకున్న అప్పు తీర్చడానికే సరిపోయింది.

    మరుసటి ఏడాది వడ్డీ వ్యాపారుల దగ్గర పొలం తాకట్టు పెట్టి సాగు చేసాడు నరేష్ . ఏడాది నుండేఎల్ నినో (వేడి వాతావరణాన్ని, వర్షాభావ పరిస్థితుల్ని కలిగించే వాతావరణ మార్పు) ప్రభావం మొదలైయింది. సాధారణ వర్షపాతం కంటే పదిశాతం తక్కువగా నమోదవడంతో , బోర్లతో వ్యవసాయం చెయ్యవలసిన పరిస్థితి ఏర్పడింది. మళ్ళీ వడ్డీకి డబ్బులు తీసుకుని బోర్లు వేసాడు, వేళా పాళా లేని కరెంటు కోతలు పంటను ఎండబెట్టాయి. తనపంటను కాపాడుకోడానికి వ్యవసాయ అధికారులచుట్టూ, కరెంటు ఆఫీసుల చుట్టూ తిరిగాడు. అతని మొర ఆలకించిన అధికారులు రోజుకు ఆరుగంటలే విద్యుత్ సరఫరా చేసారు. దాంతోనే పంటను కాపాడే ప్రయత్నం చేసినా బోర్లు ఎండి పోవడంతో సగం పంట కూడా దక్కలేదు. వడ్డీ వ్యాపారులు మాత్రం అసలు, వడ్డీల లెక్కలు చూపించి తన పొలాన్నంతా జప్తుచేసేసుకున్నారు.

 నరేష్ చివరికి వ్యవసాయ కూలీగా మారాడు. రోజు వారి వ్యవసాయ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అప్పటివరకు నరేష్ గారని గౌరవించిన అందరూ నర్సిగాడని పిలవడం మొదలుపెట్టారు. వర్షాలు లేకపోవడంతో పూర్తిగా కరువు పరిస్థితులేర్పడ్డాయి వ్యవసాయం మరింత సంక్షోభంలో పడింది. నరేష్ కి కూలిపనులు కూడా  దొరకడం కష్టమై, బ్రతకడమే కష్టమైపోయింది.

    సెల్ ఫోన్ అమ్మకాలు బాగుండటంతో విజయ్ తీసుకున్న అప్పు పూర్తిగా చెల్లించేసి తన వ్యాపారం మరింత వృద్ధి చేసేందుకు మరికొన్నికోట్ల రూపాయలు మళ్ళీ అప్పు తీసుకున్నాడు. కొన్నినెలల తర్వాత తీసుకున్న కోట్ల రూపాయలతో పాటు తనవ్యాపారాన్ని కూడా అమ్మేసి అప్పుల్ని ఎగ్గొట్టి, కుటుంబంతో సహా అమెరికా పారిపోయాడు విజయ్.

   అదే రోజు సాయంత్రం బతికే దారిలేక, కుటుంబాన్ని పస్తులుంచలేక, ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితుల్లో, వడ్డీ వ్యాపారులు జప్తుచేసుకున్న తన పొలం దగ్గరే పురుగుల మందు తాగి భార్య, మూడేళ్ళ కూతురుతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు నరేష్. అప్పటినుండి మొదలైన వర్షమే మెల్ల మెల్లగా కుండపోత వర్షంగా మారింది. వర్షం ఆనాడు తుఫానులో తన వరిపంటను కాపాడుకోవడం కోసం నరేష్ తడిసిన వర్షమే అని , ఆనాటి వర్షమే మళ్ళీ పడిందని ఆనాడు పంటను నాశనం చెయ్యడానికి సారి రైతు చనిపోయినందుకు నివాళిగా అని చెప్పి సునీల్ చెప్పడం ముగించాడు.  

                                                  *                                     *                            *

 

1 కామెంట్‌:

  1. ఒక ఆదర్శవంతమైన రైతు కావాల్సిన నరేష్ ఆత్మహత్య చేసుకోవటం అదీ భార్యాపిల్లలతో సహా, మహా విషాదం. దేశంలోని రైతుల పరిస్థితిని ప్రతిబింబించిన ఆనాటి వర్షమే మళ్ళీ పడింది’ అనేది ఈ మధ్య పంట నాశనమైన పొలాల్లో వినిపిస్తున్న మాట. విజయ్ లాంటి వాళ్ళు బ్యాంక్ లోన్లు ఎగ్గొట్టి విదేశాలకు వెళ్లి సుఖంగా వుంటే ఆత్మాభిమానం తో రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. కర్ణుడి చావుకి ఎన్నో కారణాలు వున్నట్లు రైతు కుటుంబం ఆత్మహత్య వెనుక ఒక రైతు భారతమే ఉంటుంది. అన్నదాతను ప్రభుత్వాలు ఆదుకోవాలి. రచయిత గార్కి అభినందనలు.

    రిప్లయితొలగించండి