సకలేశ్వరమాది రాజయ్యకథ
అంచే అను నగరమున ఉద్భవించిన గొప్పభక్తులలో సకలేశ్వరమాదిరాజయ్యగారు. వీరు నివసించు గ్రామం చాలా పెద్దది. ప్రసిద్ధి చెందినది కూడా. ఈ నగరమును రాజధానిగా చేసుకొని రాజ్యపరిపాలనను సాగించుచుండెను. జంగమ లింగైక్య సద్భక్తికి మానసుడాయెను. వారు శివపూజ చేయు సమయమున అనేక వాద్య సహకారముతో భక్తి భావముతో వివిధ గీత వాయిద్య విశేషములను వాయించుచుండెడివాడు. ఇట్లు వాయించు వీణలలో ప్రసిద్ధమయినవి రావణహస్త్రం, బ్రహ్మవీణ, పినాకవీణ,రాతారంగవీణ ఇటువంటివి ప్రధానమైనవి. ఈ వీణావాదన సమయంలో ఏకాగ్రతతో తన్మయుడై సంగీతశాస్త్రమును శాస్త్రబద్ధముగా రమ్యముగా వాయించెడివాడు. ఈ వీణలో ఏ రాగమును ఆలాపనకు తగినట్లుగా వాయించవచ్చునో అట్లు వాయించుచు సంగీతమనే అమృతధారలచే శివలింగమును అభిషేకించెడివాడు. ఒకసారి వాయించిన దండెలను మార్చిమార్చి వాయించుటచే సంగీతస్వరమునకు ప్రతీసారీ నూతనోత్తేజమునుప్రాణమును పోయుచూ పరమేశ్వరుని మదిని మెప్పించి చుండెడివాడు. నిరంతరం భక్తి పారవశ్యముతో లింగార్చనా తత్పరుడై కాలమును గడిపెడివాడు. ఈ మహనీయుడు ఒకసారి పరమ శివభక్త శిఖామణి గాధను వినెను. మల్లరుసని ఒక మండలేశ్వరుడు పూర్వము రాజ్య సుఖకాంక్షలను వదిలి గిరికి చేరి నిశ్ఛిత సమాధిలో శ్రీశైల బిల్వవనాంతరస్థితుడై, పరమయోగీశ్వరుడై ఉన్నాడని మాదిరాజయ్యగారు వినిరి. మల్లరాసుని చూడవలెనని కోరికతో శ్రీశైలమునకు చేరుకొనెను. మాదిరాజయ్యగారు ఆ శ్రీశైల పర్వతమునకు వెళ్లుచూ మార్గమధ్యమునగల వివిధ ప్రదేశములను, భయంకరమృగములను, సాధుజంతువులను యిట్లు అనేక పుష్పములను,ఉద్యానవనములను చూచి మహదానందమును, దు:ఖమును, భయమును పొందుచూ శ్రీశైలంనకు చేరుకొనబోవుచున్న సమయమున తనకొరకై వస్తున్న మాదిరాజయ్యగారి పయనమును కనిపెట్టి ఆ మహనీయుని చిత్తశుధ్ధి ఎటువంటిదో పరీక్షించవలెనని నిర్ణయించిన గురుమూర్తి మల్లిఖార్జునుడు మార్గములో తన శరీరమును పెంచి భూమిని ఆకాశమును అంటినట్టి ఆకృతితో కనిపించెను. ఇది చూసిన మాదిరాజయ్యగారికి ఆశ్చర్యము కలిగెను. ఏమిటి ఈశరీరం అని విస్మయాక్రాంతమనస్కులైనారు. మాదిరాజయ్యగారు. అయ్యో! ముందుకు అడుగువేయుటకే అవకాశమే లేకపోయెనని బాధపడుచూ, ఈ రూపములో ఉన్న మహాతత్త్వమేమిటో అవగతం చేసుకొనుటకు శీర్షదేశంవైపు మాదిరాజయ్య పయనించెను. ఆయన ఉత్తమాంగం ఎక్కడున్నదో దర్శించాలని బయలుదేరెను. కానీ మూడు సంవత్సరముల కాలపరిమితిలో దర్శించలేకపోయెను. అప్పుడాయన మనసున ఇట్లు అనుకొనెను. ఎంత పొరపాటు చేసితిని. రశమహనీయునిపాదపద్మములపై పడి శరణువేడి అర్చించకపోవటం నా అపరాధం కాదా అనిభావించి, అక్కడనుండి అడుగుల దిక్కుకు పయనించెను. ఆ మహనీయుని పాదములు ఉనికి అంతుపట్టక ఎనిమిది సంవత్సరములు పరిక్రమించాడు. చివరకు భయబ్రాంతుడైనాడు. ఓ మహాప్రభూ! నన్ను అనుగ్రహించు. నేనెంతటివాడనో తెలుసుకొనుటకు నీవు పరీక్షించుచున్నావు. నీకు సాష్టాంగ నమస్కారములు చేయుచున్నాను అని ఆర్తితో అరువగా ఆ మహానుభావుడయిన మల్లిఖార్జునుడు ప్రసన్నవదనుడై తన సహజ ఆకృతిని దాల్చెను. ఓమహాభక్తా! నీ మనసుని పరీక్షించుటకొరకై ఇట్లు చేసితినే కానీ నీపై నాకెటువంటి దురుద్ధేశములేదు. అయినను ఇంత కష్టపడి నన్ను చూచుటకై వచ్చితివే నీవు. నిన్ను మెచ్చుకోవచ్చయ్యా! నన్ను చూచుటయందు నీకెంత కోరిక కలదయ్యా! అని, ఆఖరి వచనములలో మాదయ్యగారిని తన నివాసస్థానమునకు తీసుకొని వెళ్లెను.లింగార్చనం చేయించి! ప్రసాదమును మాదయ్యగారికి అనుగ్రహించును. అపుడు మాదయ్యగారికి ఎన్నో శైవతత్త్వములను గూర్చి చెప్పుచూÑ ఓ మహానుభావా! నీవింకా కొంతకాలం సంసారమనుసాగరంను ఏలవలసి ఉన్నది. అప్పుడు కానీ నీకీభ్రాంతి తొలగదు. మీ రాజ్యమునకు వెళ్ళిరండి అని మల్లిఖార్జునయ్యగారు పలుకగా మాదిరాజుగారు చాలా విచారించిరి.
ఓ ఆనందమూర్తీ! మిమ్ము దర్శించిన, మీ అనుగ్రహమును పొందిన తర్వాతకూడా మళ్లలేను. ఎట్లు సంసారపాశ బద్ధుణ్ణి కాగలను. నిరుపేదకు పెన్నిధి లభించిన మళ్లీగూటికి వెళ్లగలడా? నీ శ్రీ పాదకమలములు ఆశ్రయించిన తర్వాత కూడా మళ్లీప్రపంచాసక్తుడు కాగలనా? అనగా ఆ సద్గురోత్తముడైన మల్లిఖార్జునుడు సరే! నీవు దేనిని కోరుకొని నాదగ్గరకు వచ్చితివో! దానిని దాని తత్త్వమును నీకుపదేశించెదను రమ్మని పలికెను. మల్లిఖార్జునుడు మాదిరాజయ్యగారిలో దాగిన మాయావరణంను తొలగించదలచి, ఇట్లు తనతో తీసుకొని వెళుతూ ఒక తుమ్మచెట్టును చూపి దాని క్రింద కూర్చొని ధ్యానించమని జెప్పి ఆ ప్రాంతం నుండి మల్లిఖార్జునుడు వెళ్లిపోయెను. అక్కడే మాదిరాజయ్యగారు పరమభక్తితో ధ్యాననిమగ్నుడయ్యెను. అపుడు గురుదేవుడైన మల్లిఖార్జునుడు గొల్లవానిగా వేషం ధరించి, వంకరవేళ్లతోను, కరకుతీరిన పాదములతోను, వదులుగా ఉండే కొరచవాడలలోను, దొప్ప చెవులతోను, పీక్కుపోయిన డొక్కలతో, ఉబ్బిన నరములతోనూ, విధంగాకొన్ని చిన్న మేకపిల్లలను చంకలో ఇరికించుకొని ఆదరనింపులను అభినయిస్తూ కొన్ని మేకలను అటూఇటూ బెసకకుండా తోలుకుంటూ ఱొప్పుకుంటూ ఆ తుమ్మచెట్టువద్దకు వచ్చెను. తుమ్మి చెట్టును విదల్చగా ఆచెట్టుకు కాసిన కాయలు కొన్ని క్రిందపడినవి. అంతటితో అక్కడనుంచి పోకుండా మాదిరాజయ్యగారు కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్న ప్రదేశం ఉన్న చెట్టుకొమ్మను గొడ్డలితో నరికివేసెను. దాంతో మాదిరాజ్యగారికి గొప్పకోపం వచ్చినది. అపుడు ఆ వచ్చిన గొల్లవాడిని పరిపరి విధములుగా నిందించుచుండెను. అపుడు ఆ గొల్లవాడు పకపక నవ్వెను. ఆహా! ఎంత గొప్ప తపస్వివయ్యా! నీ అంత పరమ కోపిష్ఠిని నేనింతవరకూ ఎక్కడా చూడలేదు! ఈ విధంగా శరీరమున ప్రసరించే కోపముచే నీవు ఎటువంటి ఫలితమును పొందగలవు? నీవంటి తామస గుణము కలిగినవాడు జ్ఞానజ్యోతి వలె ఎట్లు ప్రకాశించెదవు. నీవు చేయు ధ్యానం ఒక ఫలితంను ఇచ్చునా! ఇటువంటి కోపిష్టితో తత్త్వ విచారం చేయగలడా. నాకు నీవేమీ బోధించుటకు ప్రయత్నించుచున్నావు. నీవు కూర్చోటానికి వేరే చట్టులేలేవా? ఓహో! ఇటువంటి శాంతమూర్తులను నేనెక్కడా చూడలేదు? నీవంటి నిర్జితేంద్రియులు, మౌనులు ఇకముందు పుట్టరు పుట్టబోరు. వరదనీటిలో కొట్టుకొనుపోవుచున్న ఎలుగుబంటిని చూసి గొంగడి అని భ్రాంతిపడి ఒక గొప్ప ఈతగాడు ప్రవాహంలోకి దానిని పట్టుకున్నాడట. అది వెంటనే వాడిని పట్టుకొంది. అది చూసి ఒడ్డునున్న వారివరో ఒరే విడిచిపెట్టరా అని పెద్దకేకలు వేసినారు. అప్పుడు ఆ ఈతగాడు నేను విడిచిపెట్టా గాని అది నన్ను విడిచిపెట్టలేదుగా అని మొత్తుకున్నట్లుగా ఉన్నది నీవాలకం. జ్ఞానసాధన కోసం సర్వసంగ పరిత్యాగం చేసిన తాపసి వేషం అయితే వేశావుగాని ఏమిలాభం? సన్యాసాశ్రమమును సులభమని భావింపుచున్నట్లుంది. గొల్లవాడు పరిపరి విధముల మాదిరాజయ్యగారిని మందలించెను. అపుడు మల్లిఖార్జునుడు తన నిజస్వరూపముతో ప్రత్యక్షమయ్యెను. ఆదివ్య స్వరూపమును చూడలేక మాదిరాజయ్య గారు కళ్లు మూసుకొనెను. అపుడు కంటినిండా నీళ్లుకమ్మినాయి. ఎంతో సిగ్గుని పొందినాడు. ఈ పరితాప భారమును పొందలేక రోదించెను. అయినా నాకు భక్తి ఎక్కడిది ముక్తి ఎక్కడిది? ఎంత ఎదిరించికొని ఉందామన్నా, ఈ సంసారమనే మాయ నన్ను వదులుటలేదు. గతి, మతి, అహంకారం, కర్మక్రియలు విజృంభించుచుండగా నేను, నాది అనుకోకుండా వర్తించగలగటం నేను చేస్తున్నాను అనే భావన నుంచి దూరంగా ఉండటం ఇటువంటి ఎన్నో విషయములలో పరిత్యాగబుద్ధి అలవడక ఉంటిని అని బాధపడుచుండగా మల్లిఖార్జునుడు నీకు ఇంకా ఏబది సంవత్సరములు గడిచిన తర్వాత నా దగ్గరకు రప్పించుకొంటానని పలికెను. అప్పుడు మల్లిఖార్జునుని సాష్టాంగముతో నమస్కరించెను మాదిరాజయ్యగారు. మల్లిఖార్జున సద్గురుదేవు మహత్త్యం వల్ల కళ్యాణకటకంలో చెన్న బసవేశ్వరుని సమక్షంలో మాదిరాజయ్యగారు ఉంటిరి. అప్పుడు బసవేశ్వరునికి మాదిరాజయ్యగారు ప్రత్యక్షమయిరి. మాదిరాజయ్యగారు వాత్సల్యంతో బసవుణ్ణి ఆదరించిరి. మాదిరాజయ్య గారి బసవుని పరమానంద భరితుని బసవుని పూజలు స్వీకరించిరి. మూడులోకములలో సకలేశ్వరమాదియ్య గారి నిర్మూలచరిత్ర ఎవ్వరైనా చెప్పినా, విన్నా, వ్రాసినా తిపాత్రుడై నా భక్తి ముక్తుడగును.సర్వశుభాలు పొందును.
ఇందు భక్తి అనునది తేలికగా అంటునది కాదు అని నిరూపించబడెను. సర్వ విషయములయందు ఓర్పును కల్గి సుఖదు:ఖములకు మనస్సు చలించక ఏ వ్యక్తి తన జీవితమును గడుపునో అటువంటి వ్యక్తిని భక్తి అను గుణము ఆశ్రయించును. ఎన్నో పరీక్షలచేత భక్తుని యొక్క మనసును మధించి పరమ రసామృతమగు భక్తి అను రసాయనము అతని నుంచి బయటకు వెదజల్లుటకు అవకాశముండును కానీ, తేలికగా అన్ని సుఖములలో రమిస్తూ భక్తి అను భావం మనసును బందించుటకు శక్యము కాదు. వివిధ ప్రదేశములు మనస్సును రంజింపజేయుచు భక్తి మార్గమును అనుకూలముగా పయనింపజేయును. అటువంటి ప్రాంతములలో ముఖ్యమైనది శ్రీశైలపరివాహక ప్రాంతం. దాని ప్రాశస్త్యం కూడా ఇందు సామాజిక సద్భావమును కలిగించుటకు తగినదిగా వర్ణింపబడినది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి