కృష్ణపక్షం 5

విద్యాధర్ మునిపల్లె

 

విశ్వనాధశాస్త్రి సాహిత్యాన్ని ఆసాంతం ఆకళింపు చేసుకున్న తులసి విరూపాక్షునితో కలిసి టాంగాలో విజయనగరం బయల్దేరింది.

బాగా రాత్రి సమయం..
పైగా అమావాస్య కావటంతో చీకటిగా వుంది.
అక్కడక్కడా చిన్నచిన్న గుడ్డి దీపాలు వెలుగుతున్నాయి.
ఇరువురూ విజయనగరం చేరుకున్నారు.
టాంగాని విశ్వేశ్వరపురాగ్రహారానికి కాసింత దూరంలో ఆపి విరూపాక్షుడు ముందు నడుస్తున్నాడు.
తులసి అతనిని అనుసరిస్తోంది.
కొంత దూరం వెళ్ళాక విరూపాక్షుడు ఆగిపోయాడు.
‘‘ తులసీ .. అదిగో కనిపిస్తోందే అదే విశ్వనాధశాస్త్రి ఇల్లు.’’
అంటూ చూపించాడు.
తులసి ఆదిక్కున చూసింది.
విరూపాక్షుడు ఆమెతో...
‘‘మందే పెడతావో.. మాయే చేస్తావో.. ముసలాడు నీవంటే పడి చచ్చిపోవాలి. గుర్తుందిగా ఆరు మాసాలతర్వాత వచ్చే కార్తీక అమావాస్యనాడు నేను వస్తాను. ఇదిగో ఇక్కడే నిన్ను కలుస్తాను. ఆసరికి నీకిచ్చిన కార్యం పూర్తి చేసుకోవాలి. నీచేతిలో ఓటమికోసం ఆరుమాసాలు నీ ఎడబాటులో ప్రతి క్షణం ఒక యుగంగా నీ జ్ఞాపకాలతో బ్రతుకుతూ... నీ విజయాగమనంకోసం నిరీక్షిస్తుంటాను.’’ అంటూ తులసిపై ప్రేమని నటించాడు విరూపాక్షుడు.
తులసి అతని చేతులు పట్టుకొని...
‘‘ నామీద నమ్మకముంచండి కవీంద్రా.. కార్యం ఎలా సానుకూలం చేసుకురావాలో నాకు తెలుసు. ఆరుమాసాలు నాకు చాలా ఎక్కువ. మూడు మాసాల్లో ముగిస్తాను.’’ అన్నది కొద్ది గర్వంతో..
‘‘ కుదరదు.. ఆరుమాసాలూ నువ్వు విశ్వనాధశాస్త్రితో వుండాల్సిందే.. అదే నియమం. ఈ ఆరుమాసాల గడువు గురించి నీకు అర్ధంకాదు. నాకు తెలుసు. కార్తీక అమావాస్యనాడే నిన్ను కలవటానికి వస్తాను. ’’ అంటూ ఆమెని గట్టిగా ఆలింగనం చేసుకొని పెదవులపై ముద్దాడాడు.
అలా ఎంతసేపు వారి పెదవులు కలిసిపోయాయో...
ఒకరి అధారామృతాన్ని మరొకరు పోటీపడి మరీ జుర్రుకున్నారు.
కాలం ఎంతసేపలా గడిచిందో తెలీలేదు.
విజయనగరం గంటస్థంబం తన ఉనికిని చాటుతూ సైరన్ వేయటంతో వీరిరువురూ స్పృహలోకి వచ్చారు.
విరూపాక్షుడు ఆమెని వదిలి చీకటిలోకి వెళ్ళిపోయాడు.
అదే సమయానికి జోరున వర్షం అందుకుంది.
తులసి ఆ వర్షంలో తడుస్తూ విశ్వనాధుని ఇంటిని సమీపించి తలుపు తట్టింది.
తలుపులు తెరుచుకోలేదు.
మళ్ళీ తలుపులు తట్టింది.
కాసేపటికి లోపలి నుండి ‘‘ వచ్చే.. వచ్చే.. ఇంత రాత్రిపూట ఎవరూ.?’’ అంటూ లాంతరు పట్టుకొని ముకుందుడు తలుపు తీశాడు.
తులసిని చూస్తూనే రెండడుగులు వెనక్కి వేశాడు.
ఆమాత్రం అవకాశం చాలు అన్నట్లుగా తులసి లోపలికి కుడికాలు పెట్టి రెండడుగులు వేసింది.
ఆమెని లోనికి తోస్తూ గాలి.. వర్షపు ఝల్లు సహకరించాయి.
‘‘ అయ్యా.. బాటసారిని.. వర్షంలో చిక్కుకుపోయాను. వర్షం తగ్గేవరకూ కాస్త తలదాచుకోనిస్తారా?’’ అన్నది దీనంగా.. వణికిపోతూ..
అదే సమయానికి విశ్వనాధశాస్త్రి బయటికి వచ్చాడు..
‘‘ ఎవరదీ..?’’ అంటూ..
‘‘ బావా.. ఎవరో బాటసారట.. వర్షం ఎక్కువగా పడుతోంది. కాస్త తలదాచుకోటానికి చోటివ్వమంటోంది..’’ అంటూ లాంతరు వెలుతురులో తులసి మొహాన్ని చూపించాడు ముకుందుడు.
విశ్వనాధశాస్త్రి కి ఆమె తడి బట్టల్లో దేవకన్యలా అనిపించింది.
చలికి వణికిపోతూ... బిత్తర చూపులు చూస్తున్న తులసిని చూసి విశ్వనాధుని మనసు కదిలిందీ.. కరిగింది..
‘‘ ముకుందా... మీ అక్కగారి వాడుక చీరెలు ఆమెకివ్వు.. తల తుడుచుకొని పొడిబట్టలు కట్టుకొని ఆ గదిలో తలదాచుకో..’’ అంటూ ఒక గదివైపు చూపించాడు.
ముకుందుడు మరేం మాట్లాడకుండా లాంతరు తీసుకొని లోనికి వెళుతుండగా...
‘‘ ఆ దీపం ఎక్కడికి .. ఇక్కడ చీకటిగా వుండదూ.. అదిగో అక్కడ మేజామీదున్న టార్చిలైటుని తీసుకెళ్ళు..’’ అన్నాడు.
ముకుందుడు మేజామీద లాంతరు పెట్టి టార్చి తీసుకొని లోనికి వెళ్ళాడు.
విశ్వనాధుడికి తన భార్యలోతప్ప పరాయి స్త్రీ లో అప్పటివరకూ అందాల్ని వెతికిందే లేదు. అదేవిటో వాతావరణం ప్రభావమో... ఎదురుగా వున్న ప్రకృతి ప్రభావమో తెలియని స్థితిలో తులసి అందాలను ఆ లాంతరు వెలుతురులో ఆసాంతం తడిసిన ఆమె దుస్తులపై నుండే గమనిస్తున్నాడు.
విశ్వనాధుని చూపులని క్రీగంట గమనిస్తూ.. అమాయకమైన చూపులతో చేష్టలతో తులసి అలాగే నిలబడి పోయింది.
విశ్వనాధుడు ఆమెతో...
‘‘ మీది ఏవూరు? ఎక్కడికి వెల్తూ ఇక్కడ చిక్కుకున్నావ్?’’ అన్నాడు.
‘‘ మాది రాజమహేంద్రవరం. నేనొక దేవదాసిని. ’’ అంటూ పరిచయం చేసుకుంది.
దేవదాసి అన్న పేరు వింటూనే ముకుందుడు
‘‘ ఎంత ధైర్యముంటే నిత్యాగ్నిహోత్రంతో నిత్యం పవిత్రతని సిద్ధింపచేసుకున్న ఇంట్లోకి అడుగుపెడతావ్.? వెళ్ళు ముందు ఇక్కడి నుండి..’’ అంటూ ఆవేశపడ్డాడు.
విశ్వనాధశాస్త్రి ముకుందుడి వంక చురుకుగా చూశాడు. ముకుందుడు..
‘‘ అదికాదు బావా..? ఒక దేవదాసి మనింట తలదాచుకున్నదని రేపు అగ్రహారంలో తెలిస్తే మనపరువేం కావాలి? పైగా మా అక్కగారి దుస్తులు ఈ పాపిష్ఠిదానికివ్వటమా?’’ అంటూ మరింతగా రెచ్చిపోయాడు.
విశ్వనాధ శాస్త్రి ఏదో మాట్లాడబోయేంతలో... తులసి విశ్వనాధశాస్త్రి తో..
‘‘ నన్ను క్షమించండి.. నాగురించి గొడవపడకండి. రాజమహేంద్రవరంలోని కోటిలింగాల క్షేత్రంలోని శ్రీ కోటిలింగేశ్వరుని నిత్యం నా నృత్యంతో అర్చిస్తూ.. ఆయనకి దాస్యం చేసుకునే దేవదాసిని. నాదలోలుడు... నాట్యవేదానుగ్రహుడైన ఆ ఈశ్వరుని పండితులు మంత్రాలతో అర్చిస్తారు. భక్తులు కైమోడ్పులతో అర్చిస్తారు. నేను నాట్యంతో అర్చిస్తాను. నవవిధ భక్తులలో నేను ఎంచుకున్నదారి దాస్యం. అలా దాస్యం చేయటం మీ దృష్టిలో నేరమైతే నన్ను మన్నించండి. ఈశ్వరుడిచ్చిన ఈదేహం, ఆయన సేవకై అర్పించిన జీవితం ఆయన సృష్ఠించిన ఈ ప్రకృతిలో వర్షం.. ఈ శరీరాన్ని కాసింత కాపాడుకోవాలనే చిన్న మాయలో పడి మీ ఇంటి తలుపు తట్టాను. వీరి మాటలతో నా అజ్ఞానాన్ని పటాపంచలు చేశాడు నా కోటిలింగేశ్వరుడు. నా అజ్ఞానాన్ని పారద్రోలిన మహానుభావా.. నికివే నా కైమోడ్పులు. సెలవు’’ అంటూ వెనుదిరిగింది.
విశ్వనాధుడు తీక్షణంగా ముకుందుని చూశాడు.
ముకుందుడు తల వంచుకున్నాడు.
ఆసరికే తులసి తలుపులు తీసింది.
జోరున గాలి, వాన రావటంతో తులసి లోపలికి విసిరేయబడినట్లుగా నేలపై పడిపోయింది.
తలుపులు గాలికి కొట్టుకుంటున్నాయి.
ముకుందుడు పరుగున వెళ్ళి వీధి తలుపులు వేశాడు.
తులసి స్పృహకోల్పోయినట్లుగా నేలపై పడిపోయి లేవలేదు.. చలికి వణికి పోతోంది.
విశ్వనాధుడు మెల్లిగా తులసిని తన రెండు చేతులతో పైకి లేపి తన గదిలోకి తీసుకెళ్ళాడు.
ముకుందుడు లాంతరు వెలుతురు చూపించాడు.
విశ్వనాధుడు పడుకునే మంచంమీద తులసిని పడుకోపెట్టాడు.
ముకుందుడు తెచ్చిన దుస్తులు తీసుకొని విశ్వనాధుడు తన గదిలోకి వెళ్ళి తలుపు వేశాడు.
ముకుందుడు గదిబయట పచార్లు చేస్తున్నాడు.
కాసేపటికి విశ్వనాధుని గది తలుపులు తెరుచుకున్నాయి.
‘‘ ముకుందా.. వేడివేడి సొంఠి పాలు సిద్ధం చేయి.. ఆమె చలిజ్వరంతో బాధపడుతోంది. దుస్తులు మార్చాను. ఇంటికి వచ్చిన అతిధి.. సేవచెయ్యటం తప్పులేదు.’’ అంటూ మరోమాట ముకుందుడికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తన గదిలోనికి వెళ్ళిపోయాడు.
తులసి పాదాలు రుద్దుతూ ఆమె శరీరంలో వేడిని పుట్టించే ప్రయత్నం చేస్తున్నాడు విశ్వనాధుడు.
కాసేపటికి స్పృహ వచ్చింది తులసికి...
ముకుందుడు తెచ్చిన పాలను ఆమెకి తాగించే ప్రయత్నం చేశాడు.
ఆమె మంచంలోంచి లేవలేక పోయింది.
విశ్వనాధుడు ఆమె తలవద్ద కూర్చొని మెల్లిగా ఆమెని లేపి తన గుండెలపై ఆమె తలనుంచి ముకుందుడు తెచ్చిన పాలను ఆమె నోటికి అందించాడు.
తులసి నీరసం నటిస్తూ మెల్లెగా పాలుతాగి ‘‘ ఈశ్వరా... పరమేశ్వరా...’’ అంటూ నీరసం నటిస్తూ నిట్టూర్చింది.
విశ్వనాధుడు ఆమెని తిరిగి మంచంమీద పడుకోపెట్టి గదిలోంచి బయటికి వచ్చేశాడు.
ముకుందుడు బావగారి చర్యలు నచ్చక ముభావంగా వుండిపోయాడు.
విశ్వనాధుడు తన పడకకుర్చీలో మేనువాల్చాడు.


(సశేషం)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి