బసవపురాణము 7

  •  నక్కనైనారు కథ

భూలోకమున రమణీయమైన ప్రాంతముగా పరిఢవిల్లిన చోళమండలమున నీలనక్కనాయనారనే శివభక్తుడుండేవాడు. అతడు, భక్తితో అత్యంత ప్రీతితో ఒకనాడు శివలింగపూజను చేయుచుండిరి. శివలింగముపైకి ఒకసాలెపురుగు ప్రాకటం వాళ్లు గమనించిరి. శివునికి ఆ విషకీటకంవల్ల ఎక్కడ పొక్కులు పాకుతాయోమని సాలెపురుగు పాకినచోట పొక్కకుండా విరుగుడుగా దానిపై ఆమె తుపుక్కున ఉమ్మేసినది.

అప్పుడు ఆ దుర్మార్గాన్ని చూసి నక్కనాయనారుకు చెప్పలేని ఆగ్రహం కలిగింది.

‘‘పాపాత్మురాలా! నీకు ఏం పోయేకాలం వచ్చింది? నీమతిమండ! ప్రాణనాథునిపై తుపుక్కున ఉమ్ముతావే నీవు? చూడు ఆ ఉమ్ముతుంపరులు చుట్టూ ఎలా పడ్డాయో...ఇట్లా చేస్తే నిన్ను మహాభక్తురాలనుకుంటారని కాబోలు. ఇట్లా చేస్తేగానీ నీభక్తి బట్టబయలు కాదుకాబోలు! నా యింటి నుంచి నీ ఇష్టం వచ్చిన చోటుకి ఊరేగు. ఇకనేమాత్రము నీ మొహం చూడను. నిన్ను నేనొల్లను’’ అని బలత్కారముగా భార్యను ఇంటినుంచి వెళగొట్టాడాయన.

మళ్లీ వచ్చి తాను శివార్చన చేయటానికికూర్చున్నాడు. అయితే అప్పుడొక వింతదృశ్యం ఆయనకు కంటపడినది. తాము అర్చించే ఆ శివలింగంమీద తన ఇల్లాలు ఉమ్మివేసిన చోట తప్ప తక్కిన భాగంలో పేలిపోయినట్లు దట్టముగా చిన్నచిన్న పొక్కులు పొక్కాయి. అది చూసి చాలా ఆశ్చర్యభీతుడయినాడు. నక్కనాయనారు వెంటనే తన ఇల్లాలు వెనుకనేపరుగులు తీసాడు. ఆమె పాదాలపై వ్రాలాడు. అత్యంత భక్తితో సాష్టాంగనమస్కారములను చేసాడు.

‘‘పాపాత్మురాలా పోవేపో..! అని నిన్ను కారుకూతలు కూసిన నా అపరాధాన్ని క్షమించు. నీవు మహాభక్తురాలవు. నీవు తుపుక్కున లింగంమీద సాలీడు పాకేచోట ఉమ్మావుకదా..! ఆ ఉమ్మివేసిన చోటు తప్ప తక్కిన శివలింగమంతట పేలినది. కనుక నీవు నా వెంట వచ్చి ఇంకోసారి నీ ఉమ్మి పేలినచోట పోసి శివుని యొక్క బాధను విరగడ చేయి, అని అమాయకంగా వేడుకున్నాడతను.

ఆమె వెంటనే అటపట్టిస్తూ శివలింగం ఉన్నచోటుకు వచ్చినది. శివలింగంపై ఉన్న ఆ పొక్కులన్నిటిని చూచినది. కట్టలు త్రెంచుకున్న దు:ఖం ఆమెను వశము చేసుకొన్నది. ఇన్ని పొక్కులు ఎలా అణగిపోతాయి అని బాధపడుతూ

‘‘ తన భర్త తనను చంపితే చంపాడు అని అక్కడే ఉండి సాలీడు విషం సోకకుండా అది పాకిన చోటల్లా థూ అని ఉమ్మివేయకుండానే నేను వచ్చితిని. అది పెద్ద అపరాధమని తలచుచున్నాను. ఇటువంటి తప్పుచేసినందుకుగాను శివునకు ఈ బాధ సంక్రమించినది. మొదట పాకినచోట నేను ఉమ్మివేసితిని. అక్కడ పొక్కులే లేవాయే. ఇతరత్రా ఎన్నో పొక్కులు పొక్కినవి. ఇవన్నీ ఇప్పుడెలా అణిగిపోతాయి. నాకారణము చేతనే పినాకపాణికి కష్టమొచ్చిపడినది. నాపట్ల శివుడు దయతప్పటం నేను ఓర్చుకోలేను. ఈ పగను నేను భరించలేను. ఇక నాకు గండకత్తెరే శరణ్యమంటూ’’ ఆ పరమభక్తురాలు తన తల తెగవేసుకోవటానికి సిద్ధమైనది.

ఆ సన్నివేశములో తన ముగ్ధభక్తురాలిని కటాక్షించదలచి పరమశివుడు వెంటనే సాక్షాత్కరించెను.

పార్వతీకాంతుడు సతీసమేతుడై రావటమును చూచిన ఆ దంపతులిద్దరూ మీకు అన్యాయము చేసితిమని ఏడ్వసాగిరి.

ఆ దంపతులిద్దరిని పార్వతీపరమేశ్వరులు ఓదార్చినారు. మీరుకోరిన వరములను ఇచ్చెదమని కోరుకోమని పలికారు.

అపుడు ఆ సతీపతులు మహాదేవునికి సాష్టాంగదండ ప్రమాణములు ఆచరించి ‘‘ ఓ మహాదేవా! నీవు ప్రత్యక్షమై మమ్ము అనుగ్రహించటం కన్నా ఎక్కువగా మేము కోరుకోగలిగిన వరములు ఏముండును? నీకన్న మేము ఆకాంక్షించే ప్రయోజనాలేవో ఉన్నాయని మేము భావించుటలేదు. కనుక మాకు ఇతరమైన ఏ కోరికలు లేవు. మీ పాదకమలసేవ నిరంతరముగా అనుగ్రహించగలరు. మీ యెడల నిత్యనిరంతర సంపూర్ణభక్తి నిలుచునట్లు కటాక్షించగలరు. అంతేచాలని విన్నవించుకొనిరి. అపుడు ఆ పరమశివుడు అనుపమ పరమానందమూర్తి ఆ దంపతులిరువురికి మోక్షముననుగ్రహించెను.

(సశేషం)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి