ధాంక్‌ యూ...అమ్మలూ! (తృతీయ బహుమతి పొందిన కథ)

ధాంక్‌ యూ...అమ్మలూ! 

బి.లక్ష్మీ గాయత్రి
విశాఖపట్నం
సెల్ : 6302555947

నా పేరు లక్ష్మి! నా వయస్సు తక్కువే గానినా అనుభవాలు మాత్రం తల పండిన వాళ్లకి కూడా ఉంటాయో ఉండవో..!!  మేం ఇద్దరు అక్కచెల్లెళ్లం. అక్కని మా మేనత్త కొడుక్కే ఇచ్చి చేశారు. దాన్ని బావకివ్వాలని చిన్నప్పటి నుంచీ అనుకున్నదే. నాకింక వరసైనవాళ్లు చుట్టాల్లో ఎవరూ లేరట. అంచేత లక్ష్మికి పై సంబంధం చూసుకోవాల్సిందే’ అనుకునేవారు. అక్కకి పెళ్లి కొడుకునంటే నిశ్చయించుకున్నారు గానిడబ్బు ఖర్చు గురించి మాత్రం అసలు ఆలోచించనే లేదు. తీరా ముహూర్తాలు పెట్టుకోబోయే వేళకి అసలు విషయాలన్నీ బైటికొచ్చాయి. 

           ‘‘లక్ష్మికి పెట్టుపోతలేమీ లేకుండానే పై సంబంధం అయిపోతుందేవిటి?! అక్కడికి నా కొడుకేనా తీసిపోయిందీ!”  అంటూ మా అత్త జబర్దస్తీగా కావలసినవన్నీ  దొరకబుచ్చుకుంది. ఏమైనా అనబోతే ‘‘నేనూ ఈ ఇంటి ఆడపిల్లనే. మా ఇద్దరికీ పెట్టాలి నువ్వు’’ అనేది నవ్వుతూనే. అన్నదమ్ముడికి స్తోమత ఉందా లేదా అన్న విషయం ఏనాడూ ఆలోచించలేదు. మా బావ తన నోటితో తను ఏదీ అడగడు - వద్దు అనడు! తల్లి అన్నీ వసూలు చేస్తూ ఉంటే నవ్వుతూ కూచుంటాడు!

            ‘‘నేరకపోయి మేనరికం చేశాం. పై సంబంధం చూసుకోవాల్సిందిఇంతకంటే తక్కువలో అయేది..’’ అని అమ్మనాన్న బాధపడటం నా చెవులారా విన్నాను. మొగుడుఅత్తగారి చేతుల్లో అక్క కుక్కిన పేనయింది! బాధపడటం తప్ప మరేమీ చెయ్యలేకపోయింది!  ఇదంతా చూసిన తర్వాత నాకు మంచీ మానవత్వం లేని ఇలాంటి ఆడవాళ్లు పదిమంది అల్లుళ్ల పెట్టు అనిపించింది. రేపు నా మొగుడుఅత్తగారు ఎలా ఉంటారో అని ఆలోచిస్తేపెళ్లంటేనే భయం పట్టుకుంది. కానీ చేసేదేముంది?!  ఎటూ చెప్పలేని స్థితిలో ఆ దేవుణ్ణే నమ్ముకున్నాను నేను.

                   దేవుడి దయ వల్ల  మా మేనత్త కంటే కాస్త మంచి అత్తగారే దొరికింది నాకు.  పెళ్లిమాటల్లోనే ‘‘మాకు కట్నం ఇవ్వండి చాలు. ఇంక వేరే లాంఛనాలు ఏమీ అవసరం లేదు’’ అని చెప్పిరెండు లక్షల కట్నం తీసుకున్నారు. నాన్న ఆనందంగానే అన్నీ ఇచ్చి పెళ్లి చేశారు. 

               నాకు మొదటి పురుడు పోశాక మా నాన్న రిటైర్‌ అయిపోయారు. ఏ కారణాల వల్లో గాని రిటైరయిన ఏడాది వరకూ పెన్షన్‌ చేతికి రాలేదు. ఆ సరికి నాకు రెండోసారి నెల తప్పింది. అక్కడికి వెళ్లి అమ్మకీ నాన్నకీ భారం కాకూడదని మనసులో గట్టిగా అనిపిస్తున్నాఎడపిల్లతో చేసుకోలేకఅమ్మ రమ్మన్నదే తడవు పుట్టింటికొచ్చేశాను.

                  అక్కడున్న ఏడు నెలల్లో నాన్న ఆర్ధిక స్థితిగతులుఇబ్బందులు బాగానే అర్ధమయాయి నాకు. అయినా ఏం చెయ్యగలనని?! డబ్బు దగ్గర మా ఆయన మహా గట్టి. అత్తవారింటికి ఇన్నిసార్లు వచ్చినా గాని ఏనాడూ పట్టుమని ఓ పావుకేజీ స్వీట్లు తెచ్చి ఇచ్చిన గుర్తు కూడా లేదు నాకు. రెండోసారి పురిటికి వెళుతున్న నా చేతుల్లో రూపాయి పెట్టకుండాకేరేజాట్‌గా పుట్టింటికి తోలేసిన ఘనుడు. ఈ రోజు మా నాన్నకి ఓ పదివేలు సర్దండీ’ అంటే ఇస్తాడా?! నేను కాస్త గట్టిగా అడిగితే ఇస్తారేమో గాని నేను ఏనాడూ దేనికీ గట్టిగా మాట్లాడను. ప్రతిదానికీ దేవుణ్ణి నమ్ముకునినిశ్శబ్దంగా ఊరుకోవడం నాకు అలవాటైపోయింది. మన సమాజంలో ఆడపిల్లకి కళ్లూ చెవులూ లేవు...కన్నవారి బాధలు కనిపించవువినిపించవు...చేతులు లేవు... కన్నవాళ్లు ఎంత బాధ పడుతున్నా తన చేత్తో తను స్వతంత్రించి ఏమీ చెయ్యలేదు... నేనేమీ మినహాయింపు కాదు...అనుకుంటానంతే. అందుకే రెండో పురుడు పోసుకున్న తర్వాత సాధ్యమైనంత వరకూ పుట్టింటికి వెళ్లడం తగ్గించాను. వాళ్లకి సాయం చెయ్యలేకపోతే పోనీకనీసం అదనపు ఖర్చు తగిలించకుండా ఉంటే చాలు అనుకున్నాను. ఏడాదికోసారి మా ఇంటికి రమ్మని పిలిచేదాన్ని. వాళ్లు మొహమాటంగానే వచ్చి ఓ వారం ఉండి వెళ్లిపోయేవారు. నేను ఏదైనా మంచి చీర దాచి ఉంచగలిగితే ఆ చీర అమ్మకి బొట్టు పెట్టి ఇచ్చి సాగనంపేదాన్ని.

             కాలం టీవీలో సీరియల్‌ లాంటిది. మనం చూస్తున్నామా లేదా దానికి అవసరం లేదు... దాని మానాన అది ముందుకు వెళ్లిపోతూనే ఉంటుంది. నాకూ ఇద్దరూ  ఆడపిల్లలే. పెద్దదానికి పథ్నాలుగు వెళ్లింది.  చిన్నది పదకొండేళ్ల పిల్ల. మా నాన్న రిటైర్‌ అయి పన్నెండేళ్లు దాటింది. మీద పడ్డ వయసు రోగాల రూపంలో బైటికొస్తోంది. అమ్మకి గాల్‌ బ్లాడర్‌ లో రాళ్లున్నాయని ఆపరేషన్‌ చేసి గాల్‌ బ్లాడర్‌ తీసేశారు. నేనే ఒక పదిరోజులు ఉండి చేశాను. మా అత్త కూడా మూలబడటంతో అక్క ఒక్క రోజు వచ్చి అమ్మని చూసి వెళ్లిపోయింది. డాక్టర్లుమందులుమధ్య మధ్యలో మా ఇద్దరికీ ఏదో రకంగా పెట్టుపోతలు... ఏదైతేనేం వస్తున్న పెన్షన్‌ చాలకదాచుకున్న కాస్త ముల్లే కరగదీస్తున్నారు నాన్న. ఇద్దరికీ ఓపికలు తగ్గిపోయాయి. దగ్గరుంచుకుని చూసేవాళ్లు లేరు. అలాగే రోజులు వెళ్లదీస్తున్నారు. షరా మామూలుగా నేను కళ్లు మూసుకుని దేవుణ్ణి ప్రార్ధిస్తున్నాను.

                  సరిగ్గా ఆ సమయంలో ఒక సంఘటన జరిగింది. మావారు ఆఫీసు పని మీద విజయవాడ కేంపు వెళ్లొచ్చారు. వచ్చిన మనిషి ఏదో డల్‌ గాపరధ్యానంగా ఉండటం గమనించాను.

         ‘‘అలా ఉన్నారేం... ఒంట్లో బావుందా’’ అని అడిగాను

          ఆయన నావైపు ఒక సుదీర్ఘమైన చూపు చూసి, ‘‘ఇలా కూచో... ‘‘ అని నన్ను తన పక్కన కూచోబెట్టుకుని,  చెప్పడం మొదలుపెట్టారు.

  ‘‘విజయవాడ వెళుతున్నప్పుడు రైల్లో నా పక్కనే ఒక నడివయసు దంపతులు కూర్చున్నారు. వాళ్లు గట్టిగా మాట్లాడుకోవడం వల్ల నాకు వాళ్ల మాటలన్నీ కించిత్తు పొల్లు పోకుండా స్పష్టంగా వినిపించాయి. వాళ్లకి ఒక్కడే కొడుకు. మంచి ఉద్యోగంలో ఉన్నాడుట. బావుంటాడుట. వాడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఏదో సంబంధం వచ్చింది. దాని గురించి మంచీ చెడ్డా మాట్లాడుకుంటున్నారు. అమ్మాయి బావుందిట. చక్కగా చదువుకుని ఉద్యోగం కూడా చేస్తోందిట. అయినా వీళ్లకి ఆ సంబంధం వద్దుట.  ఎందుకో తెలుసా?!’’

   నేను ప్రశ్నార్థకంగా చూశాను.

  ‘‘అమ్మాయి వాళ్లు ఇద్దరూ ఆడపిల్లలేనట. అవతలివాళ్లకి కొడుకులు లేరు. వీళ్లు చూసిన అమ్మాయి పెద్దపిల్ల. కొడుకులు లేని కారణంగా ఆ పిల్లని చేసుకుంటే అత్తవారి బాధ్యతలన్నీ తమ పిల్లాడి మీద పడిపోతాయని వీళ్ల భయం. మరదలికి సంబంధాలు చూడాలేమో...పెళ్లి ఖర్చు కూడా ఏమైనా భరించాలో ఏవిటో.. రేపు ముసిలి అత్తమావకి ఏం రోగాలొస్తాయో... ఏం చేయాల్సొస్తుందో.. డబ్బు కూడా పెట్టాలో ఏమో.. అంచేత అసలు ఆ సంబంధమే వద్దు అని తేల్చేసుకున్నారు!!’’

       నేను మాట్లాడలేదు! సంపాదించిన దాంట్లో మూడొంతులు కూతుళ్లకీ అల్లుళ్లకీ పెట్టి.. శారీరకంగాఆర్థికంగా వాడిపోయి... ఆదుకునే దిక్కు లేక.. నిస్సహాయ స్థితిలో ఉన్న మా అమ్మనాన్న కళ్లముందు మెదిలారు నాకు!!

    నా మౌనాన్ని మావారు మరో రకంగా అర్ధం చేసుకున్నారు.

  ‘‘నేనిదంతా చెబుతుంటే నీకు రేపటి మన భవిష్యత్తు కళ్లముందు కనిపిస్తోంది కదూ. మనకీ ఇద్దరూ ఆడపిల్లలే కదా. రేపు మన పిల్లల్ని చేసుకోవడానికి కూడా నలుగురూ ఇలాగే జంకుతారేమో!’’ అన్నారాయన.

   ‘‘మనది రేపటి సమస్య. నాకు కనిపిస్తున్నది ఈ క్షణం సమస్య’’ అన్నాను అప్రయత్నంగా

  ‘‘ఈ క్షణం సమస్య ఏమిటి?!’’ ఆశ్చర్యంగా అడిగారాయన

    అప్రయత్నంగానే నా నోటి నుంచి వాక్ప్రవాహం సాగిందిలా.. ‘‘మేమూ ఇద్దరం ఆడపిల్లలమే. మీరూమా బావా కాదనకుండా మమ్మల్ని చేసుకున్నారు. ఎందుకంటేకన్నవాళ్లు ఎంత దౌర్భాగ్యస్థితిలో ఉన్నా అత్తవారి అనుమతి లేకుండా ఆడపిల్ల ఏమీ చెయ్యలేదన్నది మీ భరోసా. వాస్తవంగా జరుగుతున్నది కూడా అదే. ఈ క్షణాన మా అమ్మకి ఓ కప్పు కాఫీ కలిపిచ్చే దిక్కు లేదు. మా నాన్నకి బజారు నుంచి మందులు తెచ్చిపెట్టే నాధుడు లేడు. అవసరమైతే రూపాయి ఇచ్చే దాత లేడు. చచ్చేకాలం వచ్చినా వాళ్ల పాట్లు వాళ్లు పడవలసిందే. నేనూ మా అక్కా బాధపడటం తప్ప ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాం. ఇక మన పిల్లల సంగతంటారా...దాని గురించి నేనేం చెప్పగలను?!’’ అనేసి వంటింట్లోకి వెళ్లిపోబోయాను.

     ‘‘షేమ్‌ ఆన్‌ యూ మమ్మీ..అండ్‌ డాడీ టూ’’ అంది అక్కడే ఉన్న నా పెద్దకూతురు. ‘‘తాతగారూ అమ్మమ్మా అంత హెల్ప్‌లెస్‌గా ఉన్నా నువ్వేమీ చెయ్యడం లేదంటే అది సిగ్గుపడవలసిన విషయం అమ్మా!” అని తండ్రి వైపు తిరిగింది..”డాడీఅమ్మ సంగతి అలా ఉంచి నీ సంగతి చెప్పు...ఇప్పుడు అమ్మా పెద్దమ్మా ఎలా ఉన్నారోరేపు నేనూ చెల్లీ కూడా అలాగే మిమ్మల్ని మీ ఖర్మకి వదిలేస్తే నువ్వు  ఆనందంగా బతకగలవా?! నాకు కొడుకు లేకపోతేనేమి...ఇద్దరు కూతుళ్లున్నారువాళ్లైనా మా బాధ్యత తీసుకోవచ్చు గదా..నేను సంపాదించిన ఈ ఆస్తి అంతటికీ వారసులు వాళ్లే గదా...నా డబ్బు తీసుకునే అల్లుడునా సంరక్షణా బాధ్యత కూడా తీసుకోవచ్చు గదా అని మనసులోనైనా అనుకోవా?! చెప్పు!!”

             నేను నాటిన  లేత మొక్క ఒక్కసారిగా మహావృక్షమైపోయినట్టూ నేను దాని నీడలో నిలబడినట్టూ అనిపించింది నాకు. నా పెద్ద కూతురు వయసుకు మించి ఆలోచిస్తుందని తెలుసు. దానికి వ్యాసరచనలోనూవక్తృత్వంలోనూ వస్తున్న బహుమతులన్నిటినీ నేనే భద్రంగా దాస్తున్నాను. అయినా సరేఒక్క నిమిషం సంభ్రమంగా చూస్తూ ఉండిపోయితర్వాత తేరుకునిచప్పున మావారి వైపు చూశాను.

             మావారు మాట్లాడలేదు. నిశ్శబ్దంగా తల వంచుకుని ఊరుకున్నారు.

    ‘‘తల్లిదండ్రులకి కొడుకు ఎలాంటి బిడ్డోకూతురు కూడా అలాంటి బిడ్డే. ఆడ`మగ పిల్లల మధ్య తేడాలు ఉండకూడదనే ప్రభుత్వం ఆడపిల్లలకు కూడా సమాన ఆస్తిహక్కు కల్పించింది. హక్కుదారైన కూతురుబాధ్యతలు మాత్రం తీసుకోకూడదా?! నిజానికి అత్తమామలకు కొడుకు లేడన్న విషయం తెలుసుకున్న అల్లుడుతనంతట తనే వారికి కొడుకవాలి. ఆ పని చెయ్యకుండా అత్తవారిస్తున్న కానుకల్నిఆస్తిలో వాటాని స్వీకరించడానికి సిద్ధపడటం...దటీజ్‌ షేమ్‌ ఆన్‌ యువర్‌ పార్ట్‌ డాడీ.’’ నిస్సంకోచంగా అంది నా కూతురు.     

                  మావారు అప్పటికీ తలెత్తలేదు.

     ‘‘నీకు రైల్లో కలిశారు చూడూ..అలాంటివాళ్లని ఏ కోడలూ సరిగ్గా చూడదు. వాళ్లు పెళ్లి చూపుల నుంచే కోడల్ని తమ ఇంటి నాలుగ్గోడల మధ్యా బంధించేద్దామని చూస్తారు.  కోడలు పుట్టింటి వారికి  ఎలాంటి సహాయమూ చెయ్యకూడదు. ఏం చేసినా అత్తారికే! అలాంటి నేరో మైండెడ్‌ పీపుల్‌ వల్లే కోడళ్లు రచ్చకెక్కాల్సి వస్తోంది...అత్తా ఒకింటి కోడలే అన్నట్టు...కోడలూ ఒకింటి కూతురే నాన్నా. యు షుడ్‌ నెవర్‌ ఫర్‌గెట్‌ దట్‌!’’

                 మర్నాడే మావారు నాకూ ఆయనకీ రైలు టిక్కెట్లు తీసుకొచ్చారు మా ఊరికి.             ‘‘ఎందుకండీ’’ అన్నాను ఆశ్చర్యంగాకాస్త భయంగా.

             ఆయన నవ్వారు. ‘‘రేపు నా అల్లుడు నాకు కొడుకవాలంటేఇప్పుడు నేను మీ అమ్మా నాన్నకీ కొడుకునవాలి. అది నా నైతిక బాధ్యత. నా కూతురు నాకు నేర్పిన పాఠం! నేనిప్పుడు నా బాధ్యత ఎగ్గొట్టొచ్చు...కాని రేపు ఏ క్షణమైనా నువ్వు నన్ను దోషిగా నిలబెడితేనా కూతుళ్లు సైతం నాకు వత్తాసు పలకరు...నాకు అండగా నిలబడరు.  అది నాకు బాగా అర్థమైంది! అందుకే...మీ అమ్మానాన్నని ఇక్కడికి తీసుకొచ్చేద్దామని, వాళ్ళకి నేనే కొడుకునవుదామని నిర్ణయించుకున్నాను.” అన్నారు.  

                   నేను ఆశ్చర్యానందాలతో తలమునకలైపోయాను. కళ్లలోంచి ఆనందగంగాసంతోషగోదావరీ పొంగుకొస్తుండగా లోపలికి నడిచాను..మనసులోనే ‘‘ధాంక్యూ అమ్మలూ’’ అనుకుంటూ!!   

                                 ***********************

 

9 కామెంట్‌లు:

  1. బాణావత్ వసంతయామిని18 జులై, 2023 6:33 PMకి

    తల్లిదండ్రులకి కొడుకు ఎలాంటి బిడ్డో, కూతురు కూడా అలాంటి బిడ్డే. ఆడ`మగ పిల్లల మధ్య తేడాలు ఉండకూడదనే ప్రభుత్వం ఆడపిల్లలకు కూడా సమాన ఆస్తిహక్కు కల్పించింది. హక్కుదారైన కూతురు, బాధ్యతలు మాత్రం తీసుకోకూడదా?! అన్న ఆలోచన చాలా బాగుంది. ఇలాంటి ఆలోచన ప్రతి ఒక్కళ్ళూ తీసుకుంటే తల్లిదండ్రుల ఆఖరిరోజులు ఆనందంగా పిల్లలవద్దే వెళ్ళిపోతాయి. వృద్ధాశ్రమాల మాటే వుండదు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  2. రచయిత్రిగారి ఆలోచనతో ఏకీభవిస్తున్నాను. కూతుళ్ళుకూడా తల్లిదండ్రుల్ని చూసుకోవాల్సిన బాధ్యత వుందని సందేశమివ్వటం బావుంది. అలా చూాడాలని గతకొన్ని సంత్సరాల క్రితం చట్టం కూడా వచ్చింది. వృద్ధులైన తల్లిదండ్రులు తమ పిల్లలు తమని చూడక పోతే కోర్టుని ఆశ్రయించ వచ్చు. తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసిన పిల్లలకి కోర్టు కఠినకారాగారశిక్షతోపాటు జరిమానా కూడా విధిస్తుంది.

    రిప్లయితొలగించండి
  3. పైడిపల్లి వంశీమోహన్18 జులై, 2023 7:16 PMకి

    వయసులో వున్న తల్లిదండ్రులు చేసిందే బిడ్డలు చూస్తారు. అదే బిడ్డలు పెరిగి పెద్దయ్యాక వారి తల్లిదండ్రులు ఏం చేశారో అదే తమ తల్లిదండ్రులకి వరంగా ఇస్తారు. అలాంటి గతి రేపటి తల్లిదండ్రులకు రాకుండా వుండాలంటే ఈ కధ చదివి వారివారి పద్ధతులు మార్చుకోవాలి. ఆస్తులు కోరుకునేవారు ఆదర్శంగా వుండటమూ ముఖ్యమన్న రచయిత్రిగారిని అభినందించకుండా వుండలేం.

    రిప్లయితొలగించండి
  4. kathaavastuvu pathade. ilanti kadhalu gatam lo kuda chalane vachai. nakuayethe kottadanam kanipinchaledu. gatam loo vachina kathalatho poliste ee kadha chala takkuva stayelo undi. writer emi anukovaddu.. kottha point try cheste baguntundi.

    రిప్లయితొలగించండి
  5. సంజన వాడపల్లి19 జులై, 2023 1:13 PMకి

    పైడిపల్లి వంశీమోహన్ గారూ.. మీరు చెప్పింది అక్షరాలా నిజం. అయితే ఇలాంటి స్టోరీ నా చిన్నతనంలో ఇంగ్లీషు 7వ క్లాసు నాండిటేల్ అనుకుంటా అందులో వచ్చింది. తల్లితండ్రులు వారి తల్లిదండ్రులకి ఏమిస్తారో వారి బిడ్డలు తమ తల్లిదండ్రులకి అదే ఇస్తారనే సందేశం. ఒక కోడలు ముసలిదైన తన అత్తగారు అన్నం తినేప్పుడు పింగాణీపాత్రలు కిందపడేసి పగలకొడుతుందని ఆమెకి చెక్కపాత్ర తయారు చేయిస్తుంది. అది చూసిన ఆమె (కోడలు)కొడుకు చిన్నపిల్లాడు వాడుకూడా చెక్కని చెక్కుతుంటాడు. అది దేనికి అని అడుగుతుంది తల్లి. రేపు నువ్వు ముసలిదానివయ్యాక నువ్వుకూడా నాన్నమ్మలాగే అన్నీ పడేసుకుంటావు కదా అందుకే నేను నీకోసం ఇప్పుడే తయారు చేస్తున్నా అని చెప్తాడు. అప్పుడు ఆ కోడలికి కళ్ళు తెరుచుకొని ఆరోజునుంచి అత్తగారికి తనే దగ్గరుండి అన్నం తినిపిస్తుంది. ఇక్కడ కథలో మెయిన్ థీమ్ ఒక్కటే. కాకపోతే పాత్రలు మారాయి. చెప్పేవాళ్ళు మారారు. అంతే తేడా. రచయిత్రిగారు కధని బాగా అల్లారు. ఒకాసారి చదవచ్చు. అంతే.

    రిప్లయితొలగించండి
  6. పైడిపల్లి వంశీమోహన్19 జులై, 2023 1:16 PMకి

    సంజన గారూ నమస్తే. మీకు ఏమనిపించిందో కామెంట్ అది రాసుకుంటే బాగుండేది. అది మీ వ్యక్తిగతం. నన్ను నోటీస్ చేస్తూ చెప్పటం ఎందుకు? కధ ఎలావుంది. దానిలో మంచి చెడ్డలేంటి అన్నదే ప్రస్తావిస్తే బాగుంటుంది. దానివల్ల ఉపయోగముంటుంది. మరోసారి నన్ను నోటీస్ చేస్తూ మెసేజ్ చెయ్యకండి.

    రిప్లయితొలగించండి
  7. Katha chala bagundandi. Pedapati Nageswara Rao

    రిప్లయితొలగించండి
  8. అత్తమామలకు మగ సంతానం లేకుంటే తర్వాత ఆస్తి అంతా తమదే అనుకునే అల్లుళ్ళు , వృద్ధాప్యంలో వారిని చూసుకునే భాధ్యతను కూడా స్వీకరిస్తే న్యాయమన్న విషయంతో వ్రాసిన కథలో భవిష్యత్ ను ఊహించి లక్ష్మి భర్త తీసుకున్న నిర్ణయం అలాంటి భర్తలందరికీ కనువిప్పు లాంటిది.
    రచయిత్రి గారు అభినందనీయురాలు.

    రిప్లయితొలగించండి
  9. చాలా మంచి కథకు బహుమతి అందుకున్నారు. అభినందనలు మేడం !

    రిప్లయితొలగించండి