వసంతగీతం
- బాణావత్ వసంత యామిని
ప్రతిరోజూ నిద్రలేస్తూనే నాకు వినిపించే మా శ్రీవారి సుప్రభాతం నాకు ఈ రోజు వినిపించలేదు. ప్రతిరోజూ ఆయన చిలిపి మాటలతో ప్రతిధ్వనించే మా ఇంట్లో మా పెళ్ళయిన కొత్తల్లో తెచ్చుకున్న ఫ్యాను చేస్తున్న రొద తప్ప మరేదీ వినిపించ టంలేదు. మాకు పెళ్ళయ్యి యాభైసంవ త్సరాలు. నాకు పద్దెనిమి దేళ్ళప్పుడు మా ఆయన్ని చూపించి ఈయనే నీ మొగుడు అని పెళ్ళిచేశారు మా వాళ్ళు. అప్పుడు మా ఆయనకి ఇరవై సంవత్సరాలు. మమ్మల్ని చూసిన వారంతా కూడా ఈడూ జోడూ బాగుందన్నారు. పెళ్ళి చేసుకున్న పదహారో రోజు మా ఆయనకి బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. అప్పుడు అందరూ కోడలు అడుగు పెట్టిన వేళావిశేషం అని నన్ను పొగడ్తలతో ముంచెత్తారు. మా శ్రీవారు కూడా నన్ను మెచ్చు కున్నారు.
ఆ తర్వాత సంవత్సరం తిరిగే లోగా పెద్దోడు రఘు, కూతురు బిందు పుట్టారు.
వాళ్ళ చదువులు, పెళ్ళిళ్ళు అలా చూస్తుండగానే కాలం గడిచి పోయింది..
పిల్లలు అమెరికాలో స్థిర పడ్డారు. సంవత్సరంలో ఒకసారి వచ్చేవారు.
ఆ తర్వాత రెండు మూడేళ్ళ కొకసారి.. వాళ్ళ పిల్లలూ పెద్దవాళ్ళై పెళ్ళికెదిగారు.
మను షులు కనిపించే ఫోన్లు వచ్చాక రావటమే మానుకున్నారు.
చూడాలనిపిస్తే వాళ్ళే ఫోన్ చేస్తారు. ఒక్కోసారి అదీలేదు.
అయినా నాకంటూ తోడు ఆయనొక్కరే.
ఈ కట్టె పుట్టి ఇప్పటికి అరవై ఎనిమిదేళ్ళు.
జీవితం ఎంతుందో తెలీదు..
వున్న జీవితాన్ని నాకు నచ్చినట్లు అనుభవించాలన్న కోరిక మాత్రం మిగిలిపోయింది.
కలెక్టరు చదవాలని కలలు కన్నాను. ఇంగ్లీషులో మాట్లా డాలని కోరిక. ప్రతిరోజూ భర్తతో పొద్దున నుంచి నేను చేసినవీ, చూసినవీ అన్నీ కూడా పంచు కోవాలని ఆరాటం. జీవన గమ నంలో అవేవీ సాధ్య పడ లేదు. తీరని కోరికలుగానే మిగిలిపో యాయి. నారింజ మిఠాయి అంటే నాకు ప్రాణం. మా శ్రీవారు నాకు నారింజ మిఠాయి కొని పెడితే తినాలని నాకు ఎప్పటి నుండో వున్న కోరిక.. కోరిక చిన్నదే.. చిత్రమైనదే.. కానీ కోరిక కోరికేకదా...!
విషయం చెప్పద్దూ.. మా వారు రిటైరైనప్పటి నుండి ఆయన ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఉద్యోగానికి వెళ్ళినన్ని రోజులూ టిప్పుటాప్పుగా రెడీ అయ్యి వెళ్ళేవాళ్ళు. బ్యాంకు ఆఫీసరన్నాక ఆమాత్రం వుండాలి కదా అని అనుకునేదాన్ని.. కానీ రిటైరైంతర్వాత ఆయన పద్ధతి పూర్తి గా మారిపోయింది. మా మనవడు వేసుకునే జీన్సుపాంట్లు, టీ షర్టులు వేసుకొని పదిహేడు సంవత్సరాల బాలాకుమారుడిలా తిరగటం మొదలు పెట్టారు. నెరిసిన జుట్టుకి రంగులు వేసుకోవటం, ముడతలు పడిన చర్మాన్ని ముడతలు లేకుండా చేసు కోటానికి ఏవేవో క్రీములు రాసు కుంటూ తిరుగుతున్నారు. కారణ మైతే ముందు నాకు అంతు పట్టలేదు. మరో చిత్రమైన విషయం ఏంటంటే మనవళ్ళూ, మనవరాళ్ళూ తాత య్య అంటే ఒప్పుకోరు. పేరు పెట్టి వసంత్(వసంతరావు పేరుని ఫ్యాషన్ గా) అని పిలవమనే వారు. వాళ్ళు ఆయన్ని పేరుపెట్టి పిలిచినా నన్నుమాత్రం నాన్నమ్మ అనే పిలిచేవారు.
ఈమధ్య జిమ్ కి వెళ్ళి సిక్స్ ప్యాకంట అదేంటో నా పిండాకుడు.. అది రావాలని కసరత్తులు చేస్తున్నా రు. డెబ్భై సంవత్సరాల వయసొ చ్చాక కుర్రోడిలా కనిపించాలన్న ఈ కుతూహలమేం టో నాకైతే అప్పుడు అర్థంకాలేదు.. కానీ గమనించగా.. గమనించగా ఆయనని నేను ఒక శృంగార పురుషుడని గుర్తించటానికి చేస్తున్న ప్రయ త్నా లనీ, ఆయనకి నా తో కాకుండా వేరే ఆడవాళ్ళతో.. ము ఖ్యంగా వయ సులో వున్న పడచు పిల్లల తో శృంగార సంబంధమైన పరిచ యాలు వున్నా యని, నేను అనుకో వటంకోసం ఆయన రకరకాల చేష్టలు చేసేవారు. నన్ను ఉడికించటానికి ప్రయత్నిం చేవారు. మీరే చెప్పండి.. ఒక మగాడు ఎంతటి మగాడో భార్యకి కాకుండా ఎవరికి తెలుస్తుంది. అందుకే ఆయన చేసే విన్యాసాలన్నీ కూడా నేను నవ్వుతూ అనుభ విస్తూ, ఆనందిస్తూ వున్నాను. నేనేదో ఉడుక్కోవాలని ఆయన వేసే పిచ్చి వేషాలు రోజు రోజుకీ మితిమీరి పోతున్నాయని నాకు అనిపించింది. అయినా భర్తకదా పోనీలెమ్మని ఊరుకున్నాను.
తాగి ఇంటికి రావటంలేదు, నన్ను కొట్టటం లేదు.. సిగరెట్టు లాంటి చెడు అలవాటు లేదు.. ఉన్నది ఒక్కటే అలవాటు.. అది కూడా తాను కుర్రోడు అని అనిపించు కోవాలని ఒప్పుకుంటే పోలా.. అని నాకు నేను సరిపెట్టుకున్నాను. నిన్న రాత్రి నాకూ ఆయనకీ మధ్య జరిగిన చిన్న సంఘటనతో ఈ రోజు ఈ ఇల్లు మూగబోయింది. ఆయన తనకున్న సంబంధాలు అన్నీ నా ముందు ఏకరువుపెట్టటం నాకు మామూలే.. కానీ నిన్న మాత్రం ఆయన నన్ను పదేపదే '' పెళ్ళికి ముందు నువ్వు ఎవరినైనా ప్రేమించావా..? నీకు ఎవరితోనైనా సంబంధముందా'' అని అడగటం మొదలు పెట్టారు.
నాకు అర్థమైంది ఈయనకి పట్టిన పిచ్చి పరాకాష్టకు చేరుకుంది అని.. నన్ను ఆయన ఈ ప్రశ్నలతో వేధించటం ఎక్కువైంది. వయసు లోవున్న పెళ్ళాన్ని అనుమానించ టంలో అర్థముంది.. (వయసు ఏదైనా జీవితాన్ని పంచుకున్న పెళ్ళాన్ని అనుమానించటం తప్పే..) డెబ్బైకి దగ్గరలో వున్న నాకు ఈ వయసులో ఇదేం తద్దినం అనిపిం చింది. అందుకే నేను తెగించి '' నాకు పెళ్ళికి ముందు మా బావ గారితోనే సంబంధం వుంది. భర్తని మెప్పించేం దుకు ఏమేం కావాలో చాలా విష యాలు ఆయన నాకు నేర్పించారు'' అని చెప్పాను. అంతే.. నిన్న రాత్రి నుంచి ఈరోజు ఇదిగో ఇప్పటి దాకా ఆయన నుంచి ఉలుకూ లేదు.. పలుకూలేదు..
అదిగో వరండాలో కుర్చీలో కూర్చున్నారు.. అదేంటో.. జీన్సు ప్యాంటు, టీషర్టు లేదు.. తెల్లలుంగీ, లాల్చీ వేసుకొని పెద్దమని షిలా వున్నారు. ఇదండీ.. ఆయన ఈ వయసులో వుండాల్సిన తీరు.
*******
ఇప్పటిదాకా కధ గీత మాట ల్లో విన్నాం కదా.. ఇక నుంచి వసంత యామిని అంటే నా మాటల్లో విందాం.. సారీ చదువు కుందాం.. మళ్ళీ సారీ.. పెదవులతో చదువుతూ.. మన సుతో విందాం...
ఆమెపేరు గీత. ఆమె భర్తపేరు వసంతరావు..
గీత కాఫీ తీసుకెళ్ళి వసంతరావు చేతికి ఇవ్వబోయింది.
అతను తీసుకోకుండా టీపాయ్ చూపించాడు.
టీపాయ్ మీద కాఫీ పెట్టింది. వసంతరావు కనీసం ఆమె వంక కన్నెత్తైనా చూడలేదు.
ఇంతలో వీధి తలుపు తీసిన చప్పుడు వినిపించింది.
దంపతులిద్దరూ కూడా తలెత్తి అటు చూశారు.
గీత మొహంలో ఆనందం.
వసంతరావు మొహంలో విషాదం..
వచ్చింది గీత బావగారు మాధవ రావు. ఆయన వారి ఊర్లో పెద్ద రైతు... వుందిలేండి ఓ పాతికెకరాలు. గీత తల్లి దండ్రులు చనిపోయింతర్వాత ఆమె మాధవరావు ఇంట్లోనే పెరిగింది. మాధవరావు, మహాలక్ష్మి దంపతులే గీతని ఇంటర్ వరకూ చదివించారు.. వసంతరావు పెళ్ళి చూపులు కూడా ఆమె ఇంట్లోనే జరిగాయి. పెళ్ళికూడా మాధవరావే దగ్గరుండి అన్ని ఖర్చులు పెట్టుకొని చేయించాడు. వసంతరావు మదిలో గతం తాలూకు ఆలోచనల సుడులు తిరుగుతున్నాయి.
గీత ఆనందంగా తన బావగారికి ఎదురెళ్ళి ఆయన చేతిలో సూట్ కేసుని తీసు కొని లోపలికి తీసుకొచ్చింది.
వారి రువురి అన్యోన్యతనూ చూసిన వసంతరావు అసంకల్పితంగా లేచి నిలబడ్డాడు..
గీత అప్పటి దాకా వసంతరావు కూర్చున్న కుర్చీని తన బావగారికి వేసి అందులో కూర్చోపెట్టింది.
వసంతరావు ఏం మాట్లాడకుండా అలాగే నిల్చున్నాడు.
మాధవరావు కుర్చీలో కూర్చొని వసంతరావుని పలకరించాడు.
ఇబ్బంది పడుతూనే వసంతరావు బాగున్నాను అంటూ సమాధానం ఇచ్చి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు.
***********
రాత్రి పదిగంటలు అవుతోంది..
గీత-మాధవరావులు ఇకఇకలూ.. పకపకలు.
వసంతరావు మనసు అగ్ని గుండంలా మారిపోయింది. తల బాదుకున్నాడు.
సవితిపోరు ఎలా వుంటుందో కానీ ఈ పబితి పోరు తట్టుకోలేక పోతున్నాడు.
రాత్రి ఒంటిగంట అయింది.
అప్పటి వరకూ వినిపించిన ఇకఇకలూ, పకపకలూ ఆగిపోయాయి.
వసంతరావు తన భార్య గీత వస్తుందేమో అని ఎదురు చూస్తున్నాడు.
అరగంట తర్వాత వసంతరావు గదిలోకి వచ్చింది గీత.
వసంతరావు నిద్రనటిస్తున్నాడు.
గీత వచ్చి భర్తని పిలిచింది.. అతను పలకలేదు. నిద్రపోతున్నాడని అనుకుంది. కానీ వసంతరావు తనలో తనే మౌనంగా ఏడుస్తున్నాడు. అప్పటి దాకా తన భార్య పతివ్రత అని అనుకున్నాడు. కానీ తన భార్యకి వేరే వాడితో సంబంధం వుందని తెలిసి తట్టుకోలేక పోతున్నాడు.. ఇన్నాళ్ళూ ఎంతో ప్రేమగా, సౌమ్యంగా వుండే తన భార్యలో ఇలాంటి చీకటి కోణం వుందని తెలిసినప్పటి నుంచీ కూడా అతను తట్టుకోలేక పోతున్నాడు.. ఎలాగైనా తన భార్యని చంపెయ్యాలని అనుకున్నాడు. నిద్రపోతున్న తన భార్య మొహంమీద దిండు వేసి నొక్కెయ్యాలని భావించాడు. ప్రయత్నం మొదలు పెట్టాడు.. ఆమె నిద్రపోయిందాకా వేచివున్నాడు. ఆమె గురక వినిపిస్తోంది. మెల్లిగా దిండుతీసి ఆమె మొహానికి దగ్గరగా పెట్టాడు. కానీ అంతలోనే అతనికి కోర్టు ఉరిశిక్షవేసినట్లు, తను చచ్చిపోయినట్లు ఊహించుకొని తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. రాత్రంతా నిద్రలేదు.. అలాగే కూర్చున్నాడు.
ఇంతలో పెద్దపెద్దగా రామనామం వినిపిస్తోంది ఇంట్లో.. ఏంటా అని వచ్చి చూసేసరికి మాధవరావు నిద్రలేచి రామభజన చేస్తున్నాడు. వసంతరావుకి చాలా చికాకుగా వుంది. ఆ చికాకుని కనిపించనీకుండా వచ్చి మాధవరావుని పలకరించాడు. మాధవరావు పట్టించుకోకుండా భజన చేస్తున్నాడు.. అప్పుడు వసంతరావుకి గుర్తొచ్చింది మాధవరావుకి చెవుడుందనీ, కళ్ళజోడు పెట్టుకుంటే తప్ప కనిపించదనీ..
వసంతరావు మెదడులో రకరకాల ఆలోచనలు.. ఈ పబితి పోరు వదిలించుకో వాలంటే వీడిని ఎలాగైనా ఇంట్లోంచి పంపించెయ్యాలని.. కానీ తన భార్య అండ వుండగా అది సాధ్యంకాదని మిన్నకుండి పోయాడు.
********
గీత మాటలద్వారా మాధవరావు పదిరోజులు వుందామనుకుంటున్నాడనీ.. పండక్కి గీతని తనతో వాళ్ళఊరు తీసుకెళ్ళాలను కుంటున్నాడనీ... రెండు నెలలుంచుకొని పంపిస్తాననీ చెప్పటానికి వచ్చినట్లుగా... తెలిసింది.
అసలే మూలుగుతున్న నక్కమీద తాటికాయ పడ్డట్లు భావించాడు వసంతరావు..
ఆరోజు నుంచి వసంతరావు మనసు మనసులో లేదు..
తిండి తినటంలేదు. నిద్రపోవటంలేదు.. మొహం పీక్కుపోయింది. పరధ్యానంలో గడుపుతున్నాడు.
మాధవరావు కూడా వసంతరావులో వచ్చిన మార్పుని గమనించాడు.
డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళారు.
తిండి తినకపోవటం వల్ల వచ్చిన నీరసమనీ, ఏవేవో మందులు రాసిచ్చారు. కానీ ఉపయోగంలేదు.. రోజురోజుకీ నీరసంగా అయిపోతున్నాడు వసంతరావు.. ఇక అతనికి ఆఖరి రోజులు వచ్చేశాయని అనుకుంది గీత.
భర్త అలా అయిపోటానికి కారణం తనే అన్న విషయం ఆమెకి గుర్తురాలేదు.
చూస్తుండగానే పదిరోజులు అయిపోయాయి..
మాధవరావు తన ఊరికి బయల్దేరదామను కున్నాడు.
అదే సమయంలో గీత తన భర్త గురించి బావతో చెప్పి నాలుగు రోజులుండి వెళ్ళమంది.
మాధవరావు సరే అన్నాడు..
వెళ్ళే వాడిని ఆపినందుకు భార్యమీద కోపం వచ్చింది వసంతరావుకి.
కానీ ఏమీ చేసే ఓపికకానీ, అరిచే ఓపిక కానీ లేదు అతనికి.
ఒకరోజు వసంతరావుతో గీత ఈ మార్పుకి కారణమేంటని అడిగింది.
వసంతరావు చెప్పలేదు.
అడగ్గా అడగ్గా... వసంతరావు గీత ఒడిలో తలపెట్టి తన మనసులోని బాధని చెప్పేశాడు.
‘‘ వసంతా.. నిజంగా నాజీవితంలో నీతో తప్ప నాకు ఏ ఆడదానితోనూ సంబంధంలేదు. కేవలం నిన్నుఉడికించాలనే నేనలా చెప్పేవాడిని. ఉడుక్కుంటే నువ్వు చాలా అందంగా వుంటావు. అందుకే అలా.. కానీ నీకు వేరే మగాడితో సంబంధం వుందని తెలిసిన దగ్గర నుంచి నా మనసు మనసులో లేదు..’’ అంటూ భోరున ఏడ్చేశాడు.
దానికి గీత చిరునవ్వుతో..
‘‘ నాకు కూడా ఎవ్వరితోనూ సంబంధంలేదు. మా నాన్నగారు చనిపోయాక మా అక్కా బావలే నాకు తల్లీ, తండ్రీ అయ్యారు. వాళ్ళే నా మంచి చెడులు చూశారు. ఎవరితో ఎలా మెలగాలో అన్నీ మా బావగారు నేర్పించారు. వాళ్ళే దగ్గరుండి నాపెళ్ళిచేసి నన్ను మీకు కన్యాదానం చేశారు. అలాంటి వ్యక్తితో నాకు అక్రమసంబంధం వుందని ఎలా అనుకున్నారు?’’ అన్నది.. తలమీద మొట్టికాయ వేస్తూ..
అంతే అప్పటి వరకూ నీరసంగా వున్న వసంతరావులో ఎక్కడలేని చైతన్యం వచ్చింది.
ఆ వృద్ధుడి జీవితంలో తిరిగి వసంతం పూసిన ఆనందం..
నిజమే మగాడికి ఎంతమంది ఆడవాళ్ళతోనైనా సంబంధం వుందని.. తనని ఒక శృంగార పురుషుడనీ చెప్పుకోటానికి ఉబలాట పడతాడు. అదే సొంత భార్యకి ఎవరితోనైనా సంబంధం వుంటే తట్టుకోలేడు.. పైకి చెప్పుకోలేడు.. మగాడికో మనసూ, ఆడవాళ్ళకో మనసూ వుండదు.. బాధ, వేదన అందరికీ ఒకేలా వుంటాయి. అని మనసులో అనుకున్నాడు. తను చేసిన చేష్టలకి తన భార్య ఎన్నిసార్లు ఎన్నిరకాలుగా వేదన పడివుంటుందో వసంతరావు అర్థం చేసుకున్నాడు. వెంటనే గీత కాళ్ళు పట్టుకుని క్షమించమన్నాడు.. గీత వసంతరావు నుదురు ప్రేమగా ముద్దాడింది. ఆ వృద్ధుడి జీవితంలో తిరిగి వసంతం వికసించింది.. ప్రకృతి వసంతగీతం ఆలపించింది.
శుభం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి