బసవపురాణం 2

బసవేశ్వరుని బాల్యచేష్టలు

ప్రజలు శివుని మరచి చీకటిలో వున్నారని అపహసించినట్లు బసవన్న నవ్వుతుండే వాడు. శివప్రసాదము స్వీకరించినట్లు తల్లిపాలు గుడిచేవాడు. తను వచ్చిన పనికి తడవయ్యెనని వులుకుచుండేవాడు. శివుని గూర్చి పాడుచూ ఆనంద భాష్పాలు రాల్చేవాడు. మరుగుపడ్డ శివభక్తి మరల తలెత్తేట్లు తాను తల ఎత్తేవాడు. తాను ద్వితీయ శంభుడను భావనతో నేలమీద దోగియాడును. వీరమాహేశ్వరాచారము కలగలిసి పోలికలా నిలుచును. ఆటపాటలన్నీ రీతుల శివార్చనను చేసేవాడు. సర్వజ్ఞుడైన వృషభమూర్తిగ సకలవిద్యలు అతనికి సహజముగా అలవడ్డాయి.

బసవేశ్వరుని ఉనయమనము – తండ్రితో వాదము

బసవనకు ఎనిమిదవ యేడు రాగానే తండ్రి అతనికి ఉపనయమనము చేయాలనుకున్నాడు. అప్పుడు బసవన్న తండ్రితో ‘‘ ఈశ్వరుని గొలిచు నీవు జడుడవై ఇటువంటి పనికి పూనుకుంటున్నావు. పరమాత్ముడగు శివుని గురునిగా భావించిన నరులకు మానవుడైన గురువెట్లు గురువౌతాడు. గురుకృపచే జన్మించినవానికి కర్మబంధము దుష్కర్మము, కర్మపాశములు తెగవ్రేయుటకు జనించిన నేను కర్మంబులకు చేయు త్రాళ్లను కట్టుకొనను. వడుగు కర్మబంధము – దానికి మంత్రము గాయత్రి. ప్రతిదినము కర్మము చేయుట ముక్తిదాయకము కాదు. ఉపనయన గురూపదేశము నర గురువు సంబంధమైనది. శివుడు ఒక్కడే గురువు. అతనికి మించిన గురువేలేడు. అతడే గురువు, అతడే దైవము, నిరంతరం అతన్ని స్మరించి ధ్యానం చేయవలెను. అన్యదేవతా స్మరణమున నిరువది యెనిమిది కోట్ల నరకములు కలుగునని వేదములు తెలుపుతున్నాయి. సహజముగా లింగస్వరూపుడైన శివుని గూర్చిన భక్తి కులసతి వంటిది. బ్రాహ్మణకర్మ మార్గ ప్రసక్తి వెలియాలు వంటిది. ఇలవేల్పువైన ఈశ్వరుడుండ పలువేలుపుల గొల్చుట పాడిగాదు. బ్రాహ్మణభక్తి కేవలము కర్మమార్గము. వీర మాహేశ్వరాచారమగు శివభక్తియే సకలార్ధ మానవాభ్యుదయ సాధనము. నాకు శివుడే తండ్రి, పార్వతియే తల్లి. ఆ దివ్యాదిమ దంపతుల సుతుడనైన నాకు మానవులు తల్లిదండ్రులు కాలేదు. ఉపనయనము నంగీకరింపను’’ అని వాదించాడు.

తండ్రి ఎంతో చెప్పిచూశాడు. బసవడు వినలేదు. ఇక చేసేదిలేక బసవని తండ్రి అతన్ని అడుగుట మానేశాడు. చివరికి బసవడు తల్లిదండ్రులను విడిచి పణిహారి ఇంటికి తన సహోదరి నాగమాంబతో చేరుకున్నాడు. బసవడు వడుగు నాటికి మేనమామ బలదేవదండ నాయకుడు వచ్చాడు. గానీ వడుగు కాకపోవుటచే తిరిగి వెళ్ళిపోయాడు. అతనికి గంగాబ అనే కూతురున్నది. ఆమెను ‘‘శివభక్తునికి గాక భవునకీయ’’నని బాస చేసెను.

మేనల్లుడు బసవన మొక్కవోని భక్తుడగుట చూచి తన కూతురు బలదేవుడు బసవనకిచ్చి వైభవోపేతముగా ‘వేదోక్తశివధర్మపద్ధతిలో’ వివాహము జరిపించాడు.

అయితే పెళ్ళికి ఎలాంటి తంతూలేదు. మంగళవాయిద్యాలు లేవు. వేదమంత్రాలు లేవు. విప్రులు లేరు – అగ్నిహోత్రము-మంగళసూత్రధారణ లేదు. వధూవరులు చూచుకొనుటయే లగ్నము. పెండ్లియగుటయే మూహూర్తము. భక్తుల దీవెనయే బలము.

ఇలాంటి పెళ్ళి ఎక్కడా చూడలేదని జనులు ఆశ్చర్యపోయారు. గుసగుస లాడుకున్నారు. నోర్లు నొక్కకున్నారు.

బసవేశ్వరుడు కప్పడి సంగమేశ్వరమున కేగుట

‘‘కప్పడి సంగమేశ్వరుమున మా గురుదేవుడున్నాడు. అతనిని సేవింపవలెను. ’’ అని బవసవేశ్వరుడు తన భార్యతో, సోదరితో బలదేవుడంపగా వెళ్ళారు.

సంగమేశ్వరమున దేవుడు కూడలి సంగమేశ్వరుడని ఆరాధిస్తారు. ఆ క్షేత్రమున నరశివభక్తులు చిరంజీవులు. స్త్రీలు పరమ పతివ్రతలు. పలుకులన్నీ శివతత్త్వ భక్తి ప్రతిపాదకములు. అక్కడ సర్వము శివమయము. అచ్చట ఆలయమున బసవేశ్వరుడు చిరకాలు శివుని అర్చించాడు.

కూడలి సంగమేశ్వరుడు ప్రత్యక్షమై లోకంలో శివభక్తిని ప్రబోధించి వ్యప్తిచేయమని బసవనికి ఈ విధంగా ఉపదేశించాడు.

1.     భక్తి పథమునందు దప్ప వేరే మార్గములో నడవద్దు.

2.     శివుని భక్తుల దుశ్చరితములైనను దోషంగా భావించద్దు.

3.     శత్రువులైనా లింగ సహింతులైనవారికి మిత్రులుగా చూడు.

4.     పట్టిన వ్రతము ప్రాణాంతకమైనా విడవద్దు.

5.     శివభక్తులు తిట్టిన, కొట్టినా,కాలిచే మెట్టిన శరణువేడు.

6.     పరస్త్రీలను ఎప్పుడూ కన్నెత్తి చూడద్దు.

7.     శివప్రసాదం తప్ప తక్కినది హేయమని భావించు.

8.     శివభక్తిని చెడనాడు ఖలులను సంహరించు.

9.     వేదశాస్త్రోదితమైన శివభక్తని శాశ్వతంగా జగత్తులో ప్రతిష్ఠించు.

10.సత్యమునే ఎప్పుడూ పలుకు.

11.ఎవ్వరికీ ఎటువంటి హింసా చేయకు

12.సకల మానవులను సౌభ్రాతృత్వముతో శివస్వరూపులగా భావించు.

అని బసవేశ్వరునికి ఉపదేశించాడు సంగమేశ్వరుడు. వీటిని అనుసరించిన బసవేశ్వరుడు వీరశైవ మతాచారనిష్ఠితుడయ్యాడు.

ప్రథమాశ్వాసం సమాప్తం. (సశేషం)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి