కృష్ణపక్షం 4

విద్యాధర్ మునిపల్లె


 విరూపాక్షుని విషపు నవ్వుని పలకరింపుతో కూడిన చిరునవ్వుగా భావించింది. తన మీద కవి కురిపించే ఆప్యాయత అని అనుకొని చిరునవ్వుతో విరూపాక్షుని పక్కకి వచ్చి నిలబడింది తులసి.

విరూపాక్షుడు కళ్ళతోనే తన కాలివద్ద వున్న విశ్వనాధుని సాహిత్యాన్ని తీయమని సైగ చేశాడు.

తులసి అర్ధం చేసుకొని ముందుకు వంగింది.

అంతే విరూపాక్షునికి ఆమె యదద్వయం కనువిందు చేసింది.

తులసి కూడా ఆ విషయాన్ని గమనించి గమనించనట్లుగా అమాయకత్వం నటిస్తూ పుస్తకాలను వంగే తీస్తోంది..

విరూపాక్షుడు తులసిని ఉద్దేశిస్తూ...
‘‘ ప్రతి రోజూ చూస్తూనే వున్నా కొత్తగా అనిపించేలా వున్న ఆ స్థలాన్ని ఎంత చూసినా తనివి తీరదే..’’ అన్నాడు.
దానికి తులసి అమాయకంగా..
‘‘ సరసులు.. పైగా కవీంద్రులు మీకే తెలియాలి.. నాకేం తెలుసు. ’’ అని గోముగా అంది.
దానికి విరూపాక్షుడు ‘‘ సానులు సామాన్యులు కారు. అసామాన్యులను కూడా మీకు మాన్యులుగా మార్చేసుకోగలరు.. కేవలం వీటిని చూపే’’ అంటూ సుతిమెత్తగా వాటిని తాకాడు.
దాంతో తులసి తన్మయత్వంగా తన చేతిలోని పుస్తకాలను అమాంతం నేలపై విడిచేసింది.
‘‘ మరోసారి ప్రయత్నించు’’ అన్నాడు విరూపాక్షుడు కొంటెగా..
‘‘ ప్రయత్నిద్దామనే వుంది. కానీ అలసటగా వుంది.’’ అన్నది తులసి సుతారంగా తన మేని విరుస్తూ..
‘‘ కుసుమకోమలికి అలసటా.. మరి నాకేమో తనవి తీరలేదే...’’ అంటూ ఆమెను వెనుక నుంచి ఆలింగనం చేసుకున్నాడు.
‘‘ మీ కవులతో వచ్చిన చిక్కే ఇది..మీకు తనివితీరదు.. తపన చల్లారదూ.. మరి మా సంగతీ ఆలోచించాలిగా..’’ అంటూ విరూపాక్షుని నుంచి కొంచెం దూరంగా జరిగింది.
‘‘ ప్రకతి మాయంటే అదే.. అందాలతో కవ్విస్తూ.. ఆనందిద్దామనుకునే సరికి అందీ అందకుండా అటు ఆనందానికీ, ఇటు విరహ వేదనకీ మధ్య ఊగిసలాడిస్తుంది. దేవుడు మీ ఆడవాళ్ళలో ఏంపెట్టాడో కానీ దాచిన దాన్ని దోచుకునే దాకా మగాడికి మనసుతీరదు. ’’ అంటూ మరోసారి ఆమెని వెనుక నుండి హత్తుకొని ఆమె ఎడమ భుజంమీదుగా తన తలని వుంచి తన చెక్కిళ్ళతో ఆమె చెక్కిళ్ళు నిమిరాడు.
అతని వెచ్చటి శ్వాస ఆమె మెడపై తాకుతోంది.
ఆ వెచ్చని హాయి మెడమీదుగా ఆమె యెదమీదకి... అక్కడి నుండి నాభివరకూ పాకింది.
అయినా కవిని కవ్వించాలని నిర్ణయించుకుంది.
అమాయకంగా మొహం పెట్టి.. కవి వైపు తిరిగింది. అతని కౌగిళ్ళలోకి ఒదిగి పోతూ.. తలపైకెత్తి..
‘‘ ఎప్పుడో దోచుకున్నారుగా.. అయినా దోచుకోటానికి మీకు తెలియనిది నా దగ్గర ఇంకా నాదగ్గరేముందేంటి?’’ అన్నది కళ్ళతోనే కవ్విస్తూ..
ఆ కవ్వింతకు విరూపాక్షుని వెన్నులో అలజడి మొదలైంది. ఆ అలజడి అతనిలోని మగాడిని నిద్రలేపింది.
ఇరువురి యదసంపదలూ ఏకం చేస్తూ కనీసం గాలికైనా చొరబడే వీలేలేనంతగా ఆమె నడుముని పట్టుకొని మరింతగా దగ్గరకు లాక్కుంటూ ..
‘‘ ఇందుకే.. ఇందుకే తులసీ నువ్వంటే నాకు ఇదీ.. నిన్ను వదిలి పోవాలంటే నాకు మా చెడ్డ అదీ.. ’’ అన్నాడు.
‘‘ వదిలి పోయేవారైతే మోజు తీరగానే వెళ్ళిపోయేవారే.. ఇంకా వున్నారంటే దాని అర్ధం?’’
‘‘ తులసీ .. నాకు ఎప్పటికీ నువ్వు కావాలి. అందుకే నీతో నేనొక పందెం కాయాలనుకుంటున్నాను. గెలిచావో సింహాచలంలోని నా మూడంతస్తుల మేడ నీ సొంతం. ఓడావో... ఆజన్మాంతం నువ్వు నాదానివే.. ఏమంటావ్?’’ అన్నాడు ఆమె గడ్డం పట్టుకొని.
తులసి అతని నుండి విడిపోతూ... బుంగమూతి పెట్టుకుని..
‘‘ ఏమో కవీంద్రా.. మీరంటే కవులు, పండితులు. ఎలాంటి పరీక్షనైనా నెగ్గగలరు. మరి నేనో.. సానిసాహిత్యం తప్ప మరేదీ తెలియనిదానిని.. మీతో పందెం నెగ్గటమంటే ఎంతటి పండితులకైనా మరుజన్మకావాలసిందే.. నన్ను వదిలెయ్యకూడదూ..’’ అన్నది.
విరూపాక్షుడు చిరునవ్వు నవ్వుతూ...
‘‘ ఆ మాత్రం నాకు తెలియదూ.. నీకు తెలిసిన విద్యతోనే పందెం అనుకో.. ఎటొచ్చీ నీమీద ప్రేమతో నేను ఓడిపోతానేమో అని భయంగా కూడావుంది’’ అన్నాడు.
తులసి ఆశ్చర్యపోతూ...
‘‘ నాకు తెలిసిన విద్యా..? కవీంద్రా నాకు తెలిసిన విద్య శృంగార సాగరతరంగాలలో ఓలలాడిస్తూ.. సరసులని సుఖపెట్టటం.. వారిచ్చిన దానితో జీవించటం. ఈ విషయమై పరీక్షంటారా నేను సిద్ధమే..’’ అన్నది
‘‘ నాకు కావలసిందీ అదే.. భార్యా వియోగంతో విరాగిగా వున్న వాడిని సరాగిగా మార్చగలగాలి. కవనం చెప్పగలిగే వాడినోటి వెంట కవనం వెలువడకూడదు. నిత్యం నీ నామస్మరణ చేస్తూ.. నీతోడే అతని లోకంగా వుండాలి. సమయం చూసుకొని నేను చెప్పినప్పుడు నువ్వు అక్కడి నుండి మాయమవ్వాలి. ఇదంతా కేవలం ఆరుమాసాల్లో అయిపోవాలి. నువ్వాపని చెయ్యగలిగితే నేను చెప్పినట్లు సింహాచలంలోని నా మూడంతస్తుల మేడ నీ సొత్తు. ’’ అన్నాడు నవ్వుతూ..
అంతే తులసి మొహంలో ఆనందం. ఆమె కళ్ళు వెయ్యి దివిటీల్లా వెలిగి పోయాయి.
‘‘ నిజంగానా కవీంద్రా... ఆ మూడంతస్తుల మేడా నా కిచ్చేస్తారా? ’’ అన్నది..
‘‘ మీ సానులకు ఉన్న ఆస్తులు చాలవనట్లు కొత్త ఆస్తుల కోసం వెంపర్లాడతారు. ’’ అన్నాడు ఆమె అందాలను ఉద్దేశిస్తూ..
‘‘ ఎన్ని ఆస్తులుండీ ఏం ఉపయోగం కవీంద్రా... తేనె ఉన్నంతవరకే తుమ్మెదలు పూలచుట్టూ తిరుగుతాయి. అది అయిపోయి వడలిపోయాక ఏ తుమ్మెద మాత్రం ఈ పువ్వు వంక చూస్తుంది చెప్పండి? చూసినా కేవలం చూపులవరకే తప్ప చేతలేముంటాయి.? అప్పుడు జీవించాలంటే ఇప్పటి నుండే కూడబెట్టు కోవాలిగా.. అది మా వృత్తీ.. ’’ అన్నది.
‘‘ సరే.. సరే.. నువ్వు పందేనికి సిద్ధమైనట్లేగా..?’’ అన్నాడు విరూపాక్షుడు తన భృకుటి ముడేస్తూ..
‘‘ నేను సిద్ధమే.. ఇంతకీ ఎవరా విరాగి..? ’’ అన్నది తులసి.
‘‘ అదిగో .. ఆ గ్రంధాలను రాసినవాడే. విజయనగరంలోని విశ్వేశ్వరాగ్రహారంలో వుంటాడు. అతనికో బావమరిది కూడా వున్నాడు. బ్రహ్మచారి. శతమర్కటం. బావగారిమీద ఈగకూడా వాలనీడు. అలాంటిది నువ్వు అతనిదగ్గరికి ఎలా చేరతావో.. పందెం ఎలా గెలుస్తావో.. అంతా నీ పనితనం మీద ఆధారపడి వుంటుంది. మరో ముఖ్యమైన విషయం.. అక్కడ నీకు ఎటువంటి ప్రమాదం జరిగినా నాకు ఎటువంటి సంబంధమూలేదు. అక్కడ నా పేరు కూడా బయటకి రావటానికి వీల్లేదు. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఆలోచించుకొని మరీ పందేనికి సిద్ధమవ్వు. ’’ అన్నాడు విరూపాక్షుడు.
‘‘ ఏమండీ కవివర్యా.. నేనంటే ఏమనుకుంటున్నారో.. రామప్పంతులు, గిరీశం లాంటి ఘటికులని కూడా ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించిన మధురవాణి మా అక్క అన్న విషయం మర్చిపోతున్నారు. అలాంటి అక్కదగ్గర నేర్చిన సానిపనితనాన్నీ, సమర్ధతనీ శంఖిస్తున్నారు. ఈ తులసి అంటే ఏంటో మీకింకా అర్ధమైనట్లులేదు. పందేనికి నేను సిద్ధంగా వున్నాను. ఇనుప కచ్చడాల్ కట్టిన మునులు సైతం మా పైట చెంగు రెపరెపలకి దాసోహమనవలసిందే. పురాణకాలం నుండి కలికాలం వరకూ మేం నిరూపించుకుంటునే వున్నాం.. ’’ అన్నది తులసి గర్వంగా..
దానికి విరూపాక్షుడు ఆమెని మరింతగా రెచ్చగొడుతూ..
‘‘ వారంతా నిరూపించుకున్నారు.. నీ సంగతే నేనింకా చూడలేదుగా.. ’’ అన్నాడు.
‘‘చూపిస్తాను. ఆ విశ్వనాధుని కవితావివశునిగా చేస్తాను. నా కోసం పరితపించిపోయే మతిభ్రష్టుని చేస్తాను. అప్పుడే నేను మీకు కనిపిస్తాను. మూడంతస్తుల మేడ పత్రాలు నా పేర సిద్ధం చేసకోండి..’’ అన్నది ఆవేశంగా..
‘‘ సరే.. సిద్ధం చేస్తాను. కానీ నా ఓటమికి.. నీ గెలుపుకీ నా వంతుగా ఒక చిన్న సాయం చేస్తాను. అదీ నీమీద నాకున్న ప్రేమతో.. ఆ పుస్తకాలు తీసుకో.. ’’ అన్నాడు.
తులసి నేలపై పడిన పుస్తకాలను తీసుకుంది.
విరూపాక్షుడు ఆమె వద్దకు వచ్చి..
‘‘ ఇప్పుడు నువ్వు చదివి ఆకళింపు చేసుకోవాల్సిన సాహిత్యం ఇది. విశ్వనాధుని అంతరంగం.. అతని ఆలోచనా ధోరణి అంతా కూడా ఈ గ్రంధాల్లో వుంది. నీకో ముఖ్యమైన విషయం చెబుతున్నాను.. విశ్వనాధుడు పేరుకి తగినట్లే భోళా శంకరుడు. మనసులో ఏదీ దాచుకోడు. అతని బావమరిది ముకుందుడు దూకడు స్వభావం కలిగిన వ్యక్తి. క్షణాల్లోనే కోప్పడతాడు.. విశ్వనాధునికీ నీకూ మధ్య వున్న అడ్డుగోడ అతనే. విశ్వనాధుని మాట ఎలాంటిదైనా ముకుందుడు జవదాటడు. నువ్వు ముకుందుడిని దాటి విశ్వనాధుని చేరగలిగావా.. ఈ పందెంలో గెలుపు నీదే.. ఓటమి నాదే.. ఏదేమైనా తులసీ నీ చేతిలో ఓటమి కూడా చాలా బాగుంటుంది. ఎవ్వరి చేతిలోనూ ఓటమి చూడని విరూపాక్షుడు ఈ తులసి చేతిలో ఓడిపోవాలని ఎదురు చూస్తున్నాడు. ’’ అన్నాడు.
తులసి వయ్యారంగా పుస్తకాలను తీసుకొని ‘‘ మరి నాకిక సెలవా కవీంద్రా’’ అంటూ తన గదిలోకి వెళుతూ... వెనక్కి తిరిగి గర్వంగా విరూపాక్షను చూసి ఓ నవ్వు విసిరి వెళ్ళిపోయింది.
విరూపాక్షుడు ఆమె వెళ్ళేంతవరకూ నవ్వుని తన మొహంమీద పులుముకొని .. ఆమె వెళ్ళగానే...
‘‘ అవును.. నేను కవి ఇంద్రుడినే.. తన ఇంద్రపదవికి అడ్డువచ్చేవారిని అడ్డంతప్పించేందుకు అప్సరసలనంపి తపస్సుని భగ్నం చేసే ఆ ఇంద్రుడిదారే.. ఈ కవీంద్రుడి దారి. భార్యావియోగంతో విరాగిగా మారి వైరాగ్యపు కవితలు చెప్పే ఆ విశ్వనాధుని సాహితీవిరాగిని చేసిన నాస్థానము భద్రము. చరిత్ర ఎప్పుడూ గెలిచినవారినే గుర్తిస్తుంది. వారికే తన పుటలలో స్థానమిస్తుంది. ఇక్కడ గెలుపు ముఖ్యం.. ఎలా అన్నది కాదు. కాచుకో విశ్వనాధా.. ఈ విరూపాక్ష కవీంద్ర విరచిత చక్రబంధం నుండి నువ్వు తప్పించుకోలేవు. నీమీద ప్రయోగిస్తున్న ఈ సమ్మోహనాస్త్రాన్ని ఎలా తట్టుకుని నిలబడతావో.. నేనూ చూస్తాను. ’’ అనుకుంటూ ఆనందంగా తులసి ఇంటిలోని పడక కుర్చీలో వాలాడు.


(సశేషం)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి