బసవపురాణం 3

ద్వితీయాశ్వాసము

ఆకాలంలో కల్యాణ కటకాన్ని బిజ్జలుడనే రాజు పరిపాలిస్తుండేవాడు. తన మంత్రి బలదేవదండనాయకుడు బసవేశ్వరునికి తన కూతురునివ్వటం, అతను ప్రమధ లోకమునకు వెళ్ళటం బిజ్జలుడు విని తన ఆప్తులను సంగమమునకి పంపి బసవేశ్వరుని కల్యాణ కటకానికి ఆహ్వానించాడు. 

  • బసవేశ్వరుడు – భాండాగారాధ్యక్ష పదవి

బిజ్జలుడు బసవేశ్వరునికి మంత్రి, ధనభాండాగారాధికార పదవులనిచ్చి, రాజ్యభారమంతా కూడా బసవేశ్వరునిపై నిలిపి తాను సుఖంగా, ప్రశాంతంగా రాజ్యమేలుతున్నాడు. బసవేశ్వరుడు శివానుగ్రహంగల శివభక్తితో వర్ధిల్లుతూ తనకి అవకాశం కల్పించినందుకు పరమేశ్వరునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ అత్యంత శ్రధ్ధానియమాలతో ఈ క్రింది విధంగా తన ప్రతిజ్ఞలను ప్రకటించాడు.

1. శివరాత్రి నిత్యంబుచేయుట

2. శివభక్తులందరూ కూడా శివునిగా భావించుట.

3. భక్తుల దోషములను విస్మరించుట.

4. భక్తుల కులమెత్తకుండుట.

5. భక్తులేది కోరినా దానిని యిచ్చుట.

6. ఇతరుల నెనడూ వంచింపకుండుట.

7. పరసతిపై దృష్టిబరపకుండుట.

8. పరమతవాదులను జయించుట

9. లింగాంగులను దక్క తక్కిన వారిని వీక్షఇంపుకుండుట.

10. కామక్రోధాదులైన ఆరింటిని జయించుట.

11. ఇంద్రియ నిగ్రహము కలిగి వుండుట.

12. వేదోక్తమైన శివభక్తిని వెలయించుట.

బసవేశ్వరుడు ధీరంపు గట్ట. గంభీరంబు దిట్ట. సత్యంబుకలను, ప్రసాదంబుకొలను, దాంతత కలిమి. నిత్యత్వంబు బలిమి. శాంతత నెలవు. ఈశ్వరుకట్టినలుపు. వేదాంతముల పాటి, విద్యలమేటి, వినయంబు తేట, వివేకంబు కోట, అనురక్తి యిల్లు, ఉదాత్తత పెల్లు, తత్త్వమ్ము తాగ – మహత్వంబు చేగ, సత్త్వంబు వెన్ను ఆస్థానంబు చెన్నునై అలరారెను.

  • బసవేశ్వరుని  శివాచార నిరతి

బసవేశ్వరుడిని చూడటానికి శివభక్తులు విశషంగా వస్తుండేవారు. అందరును లింగము ధరించేవారు. విభూతి రుద్రాక్షలను విధిగా దేహానికి ధరించేవారు. వారేకాకుండా శాస్త్రవేదులు సంగీత విద్వాంసులుకూడా శివభక్తులు వచ్చేవారు. వారు రాగానే, వారి అడుగులకు మ్రొక్కి పాదములను కడిగి పాదోదకము ప్రాశించి, శివానందలీలావారధి తేలియాడేవాడు. భక్తుల యిండ్లకు కావళ్ళతో కావలసిన పదార్ధాలు పంపిస్తుండేవాడు. వస్త్ర భూషణాదులతో వారిని సత్కరించేవాడు. శీలవంతులకు మిండజంగమములకు కోరినవెల్లను సమకూర్చేవాడు. ఇలా నిత్యనిరతిశయ శివాచార పరత్వమున బసవడు భాసిల్లేవాడు. 

బసవేశ్వరుని సోదరి నాగమాంబ కుమారుడు చెన్నబసవన్న మేనమామ బసవేశ్వరుని తన గురువుగా భావించి అతన్నే కొలిచేవాడు. ఇతడు సంసారనిస్సంగి, వనులాత్మ యోగి. శ్రీగురవేనమో అని బసవని గురువును స్తుతించాడు. బసవేశ్వరుని శివభక్తి వ్యాపనకు తోడ్పడ్డాడు.

  • అల్లమప్రభువుతో బసవేశ్వరుడు

అతిలోక శివయోగ నిష్ఠాగరిష్ఠుడు, అత్యంత శివతత్త్వ పారగుడు, అనుపమాన వైరాగ్యవర్తనుడు, అసమశివానంద పరవశభూతుడైన అల్లమ ప్రభువు బసవేశ్వరుని చూచుటకు వచ్చాడు. బసవేశ్వరుడు అతన్ని స్వర్ణ సింహాసనంపై కూర్చోపెట్టి శరణు చేసి, పాదములు గడికి పాదోదకము ప్రాశించి అతనికి ప్రసాదము అర్పించాడు. 

బసవేశ్వరుడు ఒక లక్ష తొంభైఆరువేలమందికి సరిపోయే ప్రసాదాన్ని అతనికి విందుచేశాడు. ఆ ప్రసాదము అంతా ఒక్క మెతుకైనా విడువకుండా అల్లమ ప్రభువు ఆరగించాడు. బసవేశ్వరుడు అల్లమ ప్రభువు యొక్క భక్తికి ఆశ్చర్యపడ్డాడు. ప్రభువు బసవనికి అక్షయలింగ సంపదలిచ్చి, తత్వవిద్యను ప్రసాదించాడు. 

ఒకనాడు కైలాసంలో పార్వతి ప్రమధులకు విందు చేసింది. కోటానుకోట్లమంది వచ్చారు. శివప్రసాదము వారందరికీ వడ్డింపబోగా ఒక్క ప్రమధుడే ఆ విందు ఆహారం అంతా తినేశాడు. పార్వతి అందరు ప్రమధులు ఆరగింప విందుపెట్టలేకపోయింది. ఇది ప్రమధగణ శివభక్తి మహత్మ్యము. అల్లమ ప్రభువు అట్టివాడని బసవేశ్వరుడు అతనిని ప్రతిభక్తితో ప్రస్తుతించాడు. సంతోషించిన అల్లమప్రభువు బసవేశ్వరునికి శివభక్తి ప్రబోధము నిరంతరాయంగా సాగి నిఖిల జగత్తులో వ్యాప్తమయ్యేలా వరాన్నిచ్చాడు. 

(సశేషం)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి