అరుంధతీ జననం
బ్రహ్మదేవునికి అనేకమంది మానసప్తుత్రులు ఉన్నారు. వారి తరువాత “సంధ్య' అనే పుత్రిక కూడా జన్మించింది. ఈమె అతిలోక సౌందర్యరాశి. బ్రహ్మ మానసపుత్రులైన నవబ్రహ్మలు కూడా ఆమె సౌందర్యాన్ని చూసి పరవశించిపోతున్నారు. అది చూసిన శివుడు కోపగించి సంధ్యాదేవిని కైలాస పర్వతము మీద తపస్సు చేయమని చెప్పాడు. ఆ తరువాత గౌతమాది మహర్షులు ధర్మశాస్త్రాలను వ్రాశారు.
సంధ్యాదేవి మీద మోహముతో బ్రహ్మకు వీర్యస్కలనము జరిగింది. అగ్నిష్వాత్రులు 64 వేలమంది, బర్హిషదులు 84 వేలమంది ఉద్భవించారు. వీరందరు పిత్రుగణాలు అలాగే సంధ్యాదేవిని తలచుకున్న నవబ్రహ్మలకు పుట్టినవారు కూడా పిత్రు గణాలలో కలిసిపోయారు. సంధ్యాదేవి 'పిత్రుమాత' అయింది.
కొంతకాలానికి బ్రహ్మ వశిష్టుని పిలిచి, 'సంధ్యాదేవి కైలాన పర్వతము పైన తపస్సు చేస్తున్నది. నీవామెకి శివపంచాక్షరిని ఉపదేశించవలసినది అన్నాడు. తండ్రి ఆజ్ఞను పాటించాడు వశిష్టుడు. కఠోర నియమాలతో పంచాక్షరీ మంత్రాన్ని జపించింది సంధ్యాదేవి.
శివుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడామె “దేవదేవా! నా ఈ శరీరము. అగ్నిప్రవేశం చేసి, నేను పునర్జన్మ ఎత్తాలి. నన్ను వ్యామోహముతో చూసినవారు నపుంసకులు కావాలి. పతి వ్రతలలో నేను శ్రేష్టురాలను కావాలి" అని అడిగింది. దానికి శంకరుడు చంద్రభాగానదీ తీరమున 'మెదాతిథి' అనే బుష్ యజ్ఞం చేస్తున్నాడు. ఎవరి కంటా పడకుండా నువ్వు ఆ యజ్జకుండములో ప్రవేశంచు. యజ్ఞకుండములో ప్రవేశించే సమయంలో నువ్వు ఎవరిని భర్తగా కోరకుంటే అతడే నీ భర్త అవుతాడు, నీ కోరికలన్నీ తీరుతాయి" అన్నాడు.
సంధ్యాదేవి శంకరుడు చెప్పినట్టుగానే యజ్ఞకుండములో ప్రవేశిస్తూ వశిష్టుని భర్తగా ధ్యానించింది. ఆ సమయములో సూర్యుడు ఆమె శరీరాన్ని రెండు బాగాలుగా చేశాడు. అందులో పైభాగము దేవతలకిష్టమైన ప్రాతఃసంధ్య, క్రింది భాగము పిత్రు దేవతలకిష్టమైన సాయంసంధ్య. అగ్నిలో ఆమె భస్మమైన తరువాత, ఆమె ఆత్మకు అగ్నిదేవుడు ఒక రూపం కల్పించాడు. ఆమే అరుంధతి, మేధాతిధి మహర్షి అరుంధతిని పెంచి పెద్ద చేసి వశిష్టుడికిచ్చి వివాహం చేశాడు.
ఆవిధంగా ఈశ్వర కటాక్షంతో సంధ్యాదేవి అరుంధతిగా జన్మించి పతివ్రతా శిరోమణి అయింది. శివుడు తలచుకుంటే ఎవ్వరినైనా ఎలాగైనా కటాక్షించగలడు అనటానికి నిదర్శనమే అరుంధతీమాత జననం. అలాగే శివకటాక్షం కోసం అరుంధతీమాత అవలంభించిన విధానం ప్రతి ఒక్కరికీ ఆదర్శం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి