రుద్రపశుపతి కధ
అమ్యలా అనేఊరిలో ‘‘రుద్రపశుపతి’’ అనే భక్తుడు ఉండేవాడు. ఆయన గొప్ప శివభక్తుడు. ఒకరోజు ఆయన ఓ దేవాలయమున జరుగుచున్న పురాణ ప్రవచనమును వినుటకై వెళ్లెను. అక్కడ ప్రవచనకారుడు సముద్రమధన ఘట్టమును గూర్చిచెప్పుచూ ఆ మహాసముద్రము నుంచి విషము పుట్టెనని ఆ విషకారణముచే సర్వలోకములు దేవదైత్యాది గణములు భీతిల్లినవని చెప్పుచూ అంతట పరమేశ్వరుడు ఆ విషయమును ఆరగించెనని ప్రవచనకారుడు తెలియజెప్పెను. శ్రద్ధతో పురాణ ప్రవచనమును వినుచున్న ‘‘రుద్రపశుపతి’’ ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆ కాలకోట విషమును నిజముగా ఆరగించెనాలేదాఅనివడివడిగా ఉపన్యాసకుని వద్దకు వెళ్లి అడిగెను. అప్పుడు అనుమానమేమిటయ్యా ‘‘హరుడు’’ విషమును ఆరగించెను. ఇందులో సందేహమువలదు అని చెప్పెను. అప్పుడు ‘‘రుద్రపశుపతి’’ ఓ మహానుభావా! ఆ తర్వాత ఆ మహేశ్వరునికి ఏమియూకాలేదుకదా! అని సందేహముగా ప్రశ్నించెను. అంతట ఆ ఉపన్యాసకుడు ఆ తర్వాత ఈశ్వరుని సంగతి నాకు తెలియదని పల్కెను. ఆ మాటను వినీవినగానే పిడుగులుపడినట్లై వీపువిరిగినట్టె హా! నేను సర్వనాశనమైతిని అని నేలపైబడి పొర్లుతూ ఓ విశ్వేశా! నిన్ను అందరూ కలిసి వెర్రివాణ్ణి చేశారయ్యా...ఎవరైనా చూస్తూచూస్తూ విషం తాగుతారా! విషం త్రాగిన వాళ్ళు బ్రతుకుతారా? ఇటువంటి కబురు వినుటకు తగినదేనా? ఏమిచేసేది నాకు నీవే దిక్కని ఇప్పటిదాకా గట్టిగ నమ్ముకొంటిని. నిన్నుగాక ఇంక ఎవరిని ఎరుగనైన ఎరుగనే! ముక్కంటీ! నాకిక దిక్కెవరయ్యా! అని పలుకుతూ ఓ దూర్జటి! నీవు మ్రింగిన విషమును ఉమ్మిపారేయ్ అంది గొంతులోకి పోవునేమో! పోకమునుపే ఉమ్మివేయి. కోటిదండములు నీకర్పించెదను. అయ్యయ్యో! ఎంతపని జరిగింది?ఏమమ్మా! ఓపార్వతీదేవీ! అర్థాంగివనిపించుకుంటూ కూడాఇటువంటి పరిస్థితులలో ‘‘పరమేశ్వరుని’’ వదలి ఏ పెత్తనాలకు పోయితివి?ఎక్కడికి ఊరేగితివే తల్లీ? నీకు తెలియదమ్మా విషం లోపలికిపోతే ఏమవుతుందో! ఓప్రమధగణాల్లారా! పరమాత్ముల్లారా! ఆ ముక్కంటి కాస్తా కన్నుమూస్తే మనమాయనను దక్కించుకోగలమా? శతరుద్రులారా! ఆ మహేశుని కాపాడరయ్యా...! ఓ వీరభద్రయ్యా! శివునివిడిచి ఎచటికి వెళ్లితివి? ప్రాణపతి విషమును ఆరగించెను. ఆ మహాదేవుని రక్షించరండయ్యా! అని మనసునున్న బాధను తాళలేక పరిపరి విధముల ప్రార్థించెను. ఇంతలో మళ్లీ మనసున ఆపలేని బాధపెల్లుబిగి అవునులే! తల్లిలేని సంతానమునుఎవరు చూస్తారు? ఎవరు పట్టించుకుంటారు? తల్లేఉంటే విషం తాగనిస్తుందా? ఈసారి ఈ మరణదండం నుంచి బయటబడినా ఇంకా మన్నకు చావన్నమాటే లేదు. అని ఇక ఏమాటలునేను వినలేను. శివుడులేని జీవితాన్ని నేననుభవింపలేను. ఇప్పుడే నా ప్రాణమును తీసుకొందును అని పలుకుచూ, దగ్గరనే ఉన్న పుష్కరిణిలోనికి గుభీలున దూకెను. వెంటనే పార్వతీ సమేతుడైన ఆమహాదేవుడు ప్రత్యక్షమై నీటిలోకి జారిపోవుచున్న రుద్రపశుపతిని పట్టుకొని నీ భక్తికి మెచ్చితిని. నీ అభీష్టమేమిటో తెల్పిన వరము నేనివ్వగలనని బుజ్జగించినాడు. రుద్రపశుపతి సంభ్రమముతో పరమేశ్వరుని పాదములపైవ్రాలి నాకే వరములూ వద్దు. నీవు విషము మ్రింగుటచే నీవేమైపోవుదవో అని గుండెలదురుచున్నవి. హడలిచచ్చుచుంటిని. వెంటనే కాలకూటవిషాన్ని వెడలకక్కవయ్యా. అప్పుడుకానీ నీదయ నాపై ఉన్నట్లు. నీవిచ్చువరములన్నీ నాకు దక్కినట్లేనని భావిస్తాను అన్నాడు. అప్పుడు పరమేశ్వరుడు ఏదోలోకములో అలాంటి వార్తపుట్టిందేగాని ఆ విషమును మ్రింగుటకు కాని, ఉమ్మివేయుటకు గాని ఏమంత పెద్దదని ఏదో నలుసంత.నాకంఠమునందుండిపోయింది. అయినా కాలకూటంనన్నేం చేస్తుంది. నా విషయమున ఆ విషము కాలకూటమూకాదు. మరేది ఎటువంటి బాధను కల్గించునది కాదు అనిపలికిన మాటను వినిన రుద్రపశుపతి పకపక నవ్వి ఓ చంద్రశేఖరా! నేను నమ్మలేను. నీవు నిమ్మకు నీరెత్తినట్లుగా ఏమీ జరగనట్లు స్థిమితముగా ఉన్నావు! నీకు చీమైనాకుట్టినట్లేదు. ఇప్పటివరకు కంఠమునందుందని చెప్పుచున్నావు. ఆ కొద్దిలో రవ్వంత మాత్రము కడుపులోనికి జారి ప్రవేశిస్తే అప్పుడు నాగతేమిటి? అప్పుడు నేను ఎటువంటి దుర్వార్తని వినవలసి వచ్చునో! అది వినుటకు కానీ, మనసున తలచుటకు కానీ నాకు శక్తిలేదు. అందుచే నేను ముందుగా మరణించుటకు సిద్ధపడుచున్నాను. నా మాటవిను. నేను చచ్చుట నీకిష్టములేదని తెలిపినను నేను వినను. నీవు నాకిపుడే మాటివ్వగలవు. త్రాగిన విషము వెళ్లగక్కు. అంతే గానీ నీనోటివెంట వచ్చు ఇంకొకమాటను నేవినను. అని మొండిగా పట్టుబట్టినాడు రుద్రపశుపతి. అప్పుడు పార్వతి ఈ పరమేశ్వరుడు ఆ విషమును ఉమ్మకపోయినచో నిష్కారణముగా ఈ ముగ్ధుడు ప్రాణములు విడుచునేమోనని కలవరపాటు పడెను. ఆ విషమును ఉమ్మినచో సర్వలోకములు కాల్చివేస్తుందని నారదాది ముఖ్యదేవతలు వణుకుచుండిరి. అప్పుడు మహేశుడు రుద్రపశుపతిని మహదాదరముతో కౌగలించుకొనెను. ఓమహాభక్తా! ప్రమధులమీద ఒట్టు.నీ పాదములమీద ఒట్టు. ఈవిషమునన్నేమి చేయదు నమ్ము. నీమాట వమ్ముకాదు నిజం. కాదుకూడదు నీకు నమ్మకం కుదరటంలేదంటావా! నాకుడి తొడకెక్కి శితి కంఠంవైపే రెప్పలార్పకుండా చూస్తూఉండమని వాత్సల్యంతో తన తొడపై ఆ ముగ్ధభక్తుణ్ణి ఎక్కించుకొన్నాడు పరమశివుడు. అప్పుడు రుద్రపశుపతి హాలాహలం గొంతునుంచి జారుతున్నట్లు కనపడగానే పొడుచుకొని చచ్చెదనని తన కరవాలమును రొమ్ములపై ఆనించుకొని శివుని కంఠంవైపే అనిమిషుడై చూస్తూ పశుపతి తొడలమీద రుద్రపశుపతి ఇప్పటికీ అలాగే ఉన్నాడు.
ఇందు పరమేశ్వరుని యెడల రుద్రపశుపతికున్న భక్తిపారవశ్యము తెలియుచున్నది. మలినము లేని స్వార్థప్రయోజనము లేని ఇతర కారణములతో సంబంధములేని భక్తి రుద్రపశుపతియందు కానవచ్చుచున్నది. విషమును హస్తస్పర్శచేయుటకు కూడా ఎవరూ ఇష్టపడరు. అటువంటిది సమస్త విశ్వమును హరించునట్టి కాలకూట విషమును శివుడు మ్రింగి సమస్తలోకములను రక్షించెను అని వినిన వెంటనే రుద్రపశుపతి మనసునకాలకూట విషమును త్రాగి దేవాదిదేవుడైన పరమేశ్వరుడే మరణించునేమోనని పల్కుటచే రుద్రపశుపతి యొక్క లోతైన భక్తితత్త్వం మనకు తెలియవచ్చుచున్నది. లోకమున పిల్లలుచేసే పనులలో ఇది మంచి, ఇది చెడు అని వివేచన చేసి తెలియజెప్పు తల్లి లేకపోవుటచే మహేశ్వరుని అందరూ వారి స్వార్థప్రయోజనములకు ఉపయోగించుకొంటిరి అని తల్లి మహేశ్వరుని యొక్క పరిస్థితిని తను అనుభవించి పలుకుటచే ముగ్ధభక్తిత్వములోని ఆంతరంగిక భావమును అనుభవించిన మహా తాపసి వోలె ఇందు రుద్రపశుపతి కానవచ్చుచుండెను. భర్తయొక్క పరిస్థితిని కానక పొఱిగింటికి పోయేనేమో నని పార్వతిని అనుటలో భర్తను రక్షించుటయందు భార్యకుగల బాధ్యతను తల్లిలేకపోవుటచే పరమేశ్వరునికి విషము త్రాగవద్దని చెప్పేవారు లేకపోయిరి అని రుద్రపశుపతి చెప్పుటలో పిల్లవానికి మంచిచెడులను చెప్పుబాధ్యత కేవలము తల్లిపైనే ఉన్నదని తెలియజెప్పుటలోనూ సమాజమునకు ఉపయుక్తమగు అంశములు ఇందు ప్రస్తుతించెననుటలో ఎటువంటి సందేహములేదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి