అమ్మమ్మ కథ

 

అమ్మమ్మ కథ

- ఎం. మధు,
తుళ్ళూరు(పోస్ట్, మండలం)
గుంటూరు జిల్లా -522237
సెల్ : 9010919678

ఆలోచనల జీవనాలోకనం లో మధు మమేకమైపోతున్న తరుణం, తాను చదువుకున్నపాఠశాల పరిసరాలల్లో ప్రశాంతమైన వాతావరణంలో మూడు పక్కల చెరువుల మధ్య ద్వీపకల్పాన్ని తలపిస్తున్న పరిసరాల మధ్య తాను చదువుకున్న పాఠాలు తమ పంతుళ్ళకు అప్పజెబుతున్న గుర్తులు నెమరవేసుకుంటున్నట్టే ఇంకా ఏవేవో జ్ఞాపకాలు తరముకు వచ్చాయి. తనను తాను తరికించి, పరికించి ప్రశ్నించుకుంటున్నట్టు అనుభూతి వెంటాడుతిం. కనిపించని మాటల తుంపర్లు పెదాల లోపలే నలిగిపోతున్నాయి. మెదడు జ్ఞపకాల నీడలను వెంటాడుతూ వెళుతుంది. దూరమైన స్పర్శేదో తాకుతున్న అనుభూతి అంతర్మధనం ఎలా ఆవిష్కరించాలో అర్ధంకాని స్థితి. మనసు ఊసులు వినేవారు లేని నిర్జన ప్రదేశంలో మనిషిలోని మరో రూపం ప్రత్యక్షమై తెలుగు సినిమాలో హీరో ద్విపాత్రాభినయం నాలో నిజమవుతున్నట్లు భ్రమిస్తున్న క్షణంలో నాతోనే నేను చెప్పుకుంటున్నాను ఇలా....

నా 40 ఏళ్ళ వయస్సు వరకు నాకు కనబడిన ప్రతి మనిషి.. కోర్కెల గుర్రాలపై స్వారీ చేస్తూ ఆశల అంతస్థులు నిర్మించుకుంటూ, బంధాల బరువులు పెంచుకుంటూ, డబ్బు పరవళ్ళలో కొట్టుకుపోతూ, స్వార్ధం, ఈర్ష్యల రొచ్చులో దొర్లుతూ, అవకాశవాదంతో, ఎదుటివారి బలహీనతలను సొమ్ముచేసుకుంటూ పేదరికం, కష్టాలు కన్నీళ్ళను కాసులుగా మార్చుకునే లోకం మాత్రమే నా కళ్ళకు కనబడేది. నా చుట్టూ వున్న సమాజం అలాంటిదని, నేను పెరుగుతున్న పరిసరాలు అలాంటివని, ఇవన్నీ నా జీవితానికి పట్టిన రుగ్మతలని అనుకునేవాడ్ని. వాటిని వీలైనంత వరకూ ఎదుర్కొంటూ, వాటిపై నాదైన పోరాటాన్ని చేసుకుంటూనే యవ్వనం దాటి వృద్ధాప్యానికి దగ్గరవుతున్న దశకు చేరుకున్నాను. కలల్లో కూడా మనుషులు మృగాలకంటే ప్రమా కారులు, సర్పాలకు మించి విషం కలవారని, రాక్షులు, దయ్యాలు, భూతాలు, దుర్మార్గులు, దుష్టులు, ఇలా ఇహపరలోకాలలో తెలిసిన విలన్ ల పేర్లను మనతో వుండే మనుషులకు ఆపాదించుకుంటూ బతుకు భారంగా సాగిస్తున్నాను. ఇంతలో చైనా దేశంలోని ఊహాన్ లో పుట్టిన వెంట్రుకలో వెయ్యోవంతు వుండే కరోనా అనే వైరస్ వేలాదిమంది చైనా ప్రజలతోపాటు ఇటలీకి చెందిన వారిని కూడా తుడిచి పెట్టేస్తుందని, గుట్టలుగుట్టలగా శవాలను పూడ్చిపెడుతున్న దృశ్యాలు టి.వీలలో చూస్తూ ప్రపంచ దేశాలన్నిటికి వ్యాపిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు ప్రజలు ఎండుటాకల్లా రాలిపోతున్నారని నా విలన్ లు నా ముందూ చర్చించుకుంటున్నారు. రాత్రులు నిద్రపట్టటంలేదని వెన్నులో వణుకుపుడుతుందని అంటున్న వారి మాటలు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు, రక్తం తాగే పులలు రక్తాన్ని చూసి భయపడుతున్నట్లు అనిపించింది. నిన్నా మొన్నటి వరకూ ఈ మనుషులను చూసి సాటి మనుషులు కరోనా వైరస్ భయం కంటే ఎన్నోరెట్లు ఎక్కువగా భయపడిన విషయం ఈ విలన్ లు గుర్తిస్తే కరోనా వైరస్ ఫోటో కట్టించి రోజూ పూజలు చేసుకోవచ్చు అనిపించింది. ఈ దుష్టులు, దుర్మార్గులు కూడా మనుషులుగా మారాలంటే ఆ కరోనా ఈ సమాజాన్ని కూడా పలుకరిస్తే బాగుండనిపించింది. అప్పటికైనా ప్రాణభయంతో మనుషుల్లో ఆవహించిన విలన్ లు మాయమై మనుషులు మాత్రమే వున్న సమాజం నేను చూడగలుగుతాననే ఆశ ఏదో ఓ మూల అనిపించింది.  కోరిక చాలా ప్రమాదకరమైందనీ, ఎంతైనా మనం మనుషులు కదా ఎప్పటికైనా అంతా పోయే వాళ్ళమే కదా ఈ మాత్రానికి ఇప్పుడే పోవాలని కోరుకోవటం ఎందుకులే అని మనసుకు సర్ధిచెప్పుకున్నాను.

జీవితంలో చాలా తక్కువ కోర్కెలున్న వ్యక్తిగా నన్ను నేను అనుకుంటూ వుంటాను. చాలా పరిమితమైన నాకోర్కెలు కూడా ఎప్పుడూ ఏది నెరవేరలేదు. నేను ఏ కోరుకున్నా దానికి వ్యతిరేకమైన ఫలితాలు సాధిస్తానని దేవుడు నాకు శాపం ఇచ్చాడని భావిస్తుంటాను. దీన్ని బట్టి నా 40 ఏళ్ళ కాలం ఎలా గడిచిందో అంచనా వేసుకోవచ్చు. ఇదిలా జరుగుతూ వుండగానే అదేంటో అనూహ్యంగా దేవుడు నామీద ప్రేమ ఎక్కువ చూపించేశాడు. ఖండాంతరాలు దాటించి కరోనా వైరస్ ను, నా దేశానికి, నా రాష్ట్రానికి, నా జిల్లాకు, నా ఊరుకు పంపించేశాడు. నాకోరిక తీర్చే ఉత్సాహంతో ఇప్పుడు నా ఇంట్లో, నాలోకి కూడా కరోనా పంపించేశాడా అనేంతగా నా ఆలోచనలు పరుగులు తీస్తున్నాయి. ఇప్పుడు నేనూ నా విలన్లతో రోజూ మిరిగానే చేస్తున్న సమాలోచనలు అస్పష్టంగా సాగుతున్నవేళ, ఎవరు మంచి వారో ఎవరు చెడ్డవారో, ఎవరు మనుషులో, ఎవరు విలన్లో అర్ధంకాని వేళ, మనిషిని మృత్యువు వేగంగా వెంటాడుతున్న వేళ, సంపన్నదేశాలు, పేదదేశానికి సంబంధం లేకుండా, పేద-ధనిక మనుషులు తేడాలేకుండా అందరూ ఆందోళన జడివానలో తడిసిముద్దవుతూ భయాల ఉరుములు, జీవితమనే మెరుపులు మోసుకుంటూ బ్రతుకు గొడుగు కిందకు చేరాలని తపించేవేళ, వారిలో నేనూ ఒకడిగా వడివడిగా అడుగులు వేస్తూ.. నేనూ నా భార్యా, నా పిల్లలు, నా తల్లిదండ్రులు, నా బంధువుల, నా పరిసరాలు, నాతోపాటు ఇంతకాలం ప్రయాణం చేసిన నా విలన్లు, నా జ్ఞాపకాల పునాది నా ఊరూ. తెలుగు రాష్ట్రాల విభజన వరదల్లో కొట్టుకు పోతున్న నా రాష్ట్రం, ‘‘జనగణమన అధినాయక జయహే’’ అంటూ వందనం చేస్తూ గర్వంగా నా మూడు రంగుల జండాను చూస్తే కనబడే నా దేశం నేడు మృత్వుపై యుద్ధానికి సిద్ధమౌతున్న వైనం చూస్తూ వుంటే చెమర్చిన నా కళ్ళు వైరస్ పై నా మనుషుల గెలుపును స్పష్టంగా చూడటం కోసం నా కనురెప్పలు టపిటపి మంటూ కొట్టుకుంటున్నాయి. తెలియకుండానే తడారిపోతున్న గొంతుక అర్ధాంతరంగా జీవితాలు ముగిసి పోవద్దంటూ గావుకేకలు వేస్తుంది. ఇది ఊహో, కల్పనో, భావుకతో, నిజాలో, అబద్ధాలో, భ్రమలో ఏదీ నిగ్గుతేలకముందే, ఏదో ఒకటి తెలుసుకోవాని తాపత్రయం పడుతున్న తరుణంలో ఓ కబురు

నా పెదనాన్న కూతురు అక్క, అనరోగ్యంతో చనిపోయిందని. ఫోన్ కబురు. తెనాలి మండలం సంగం జాగర్లమూడి గ్రామం వెళ్ళాలి. వెళ్ళే ఓపిక లేకపోయినా వెళ్లక తప్పని పరిస్థితి. అసలే అనారోగ్యంతో వున్న నా భార్యను వెంటేసుకొని కరోనా దెబ్బకు ఆగిపోయిన ఆర్టీసి బస్సుల స్థానంలో నా ద్విచక్రవాహనం పై సుమారు 150 కిలోమీటర్లు ప్రయాణానికి సిద్ధమయ్యాను. ఇద్దరి బాధలు మర్చిపోయేందుకు ఏవో మాట్లాడుకుంటూ ఎలాగోలా ఉదయం 10 గంటలకు సంగం జాగర్లమూడి చేరాము. అంత హడావిడిగా వెళితే అక్క శవం పక్కన నలుగురైదుగురు ఆడవాళ్ళ కన్నీళ్ళు ఇంకిపోయి బిక్కుబిక్కుమంటూ వున్న మా బావ ఆయనతోపాటు ఇద్దరు ఆయన స్నేహితులు వున్నారు. సాయంత్రం 5 గంటలకు అక్క మనవరాలు వస్తే గానీ అంతిమ త్ర అరంభమవదని అర్ధమయింది. నా భార్యను మా తర్వాత అక్కడకు వచ్చిన మా ఊరి బంధువులకు తోడుచేసి నేను అలా బయటకు వచ్చాను.

40 ఏళ్ళ క్రితం నేను పుట్టిన ప్రాధమిక ఆరోగ్యంకేంద్రం. దాని పక్కన వున్న రధశాల అరుగుమీద నా ఏడేళ్ళ వయస్సులో నవ్వుతూ నవ్వుతూ నా మేనమామ తాను కాల్చే బీడీ చురకలు లైట్ గా అంటించి నేను ఏడుస్తుంటే ఆయన నవ్వుకుంటూ నన్ను బుజ్జగిస్తున్న దృశ్యాలు కళ్ళముందు ప్రత్యక్షమయ్యా. నేను ఏడుస్తున్నానని సమాచారం అందుకున్న మా అమ్మమ్మ పరుగు పరుగున వచ్చి విషయం తెలుసుకుని మావయ్యని తిట్టి కొట్టినంత పనిచేసిన విషయం గుర్తొచ్చింది. అప్పుడే తొలిసారిగా నాకోసం ఒకరున్నారు. నన్ను కాపాడే అమ్మమ్మ వుందనిపించింది. నా ఏడుపు ఆపించటానికి అప్పటికప్పుడు తీపి జంతికలు పెట్టింది. బెల్లపు పాకంలో ముద్ద పప్పు, నెయ్యి వేసి ఇస్తే దాన్ని తింటున్నప్పుడు అమ్మ ప్రేమతోపాటు అమ్మమ్మ మనసు కలిపిన అమృత స్పర్శలో నా బాధ మరచిపోయిన గుర్తు. కడుపునిండా జంతికలు తినేస్తే వంటినిండా పడ్డ ఎంగిలిని తుడుస్తుంటే అమ్మ మీద ప్రేమ, నా చెల్లిళ్ళమీద ప్రేమ అంతా నాపైనే కుమ్మరిస్తున్నట్లు అమ్మమ్మ ప్రేమ సాంధ్రత , గాఢత నాకు అర్థమైన జ్ఞాపకం.

నాకు బాగా ఊహ తెలిసే సమయానికి నేను 6వ తరగతి చదువుతున్నాను. నాన్న అప్పులపాలై మా కుటుంబాన్ని వదిలి ఎటో వెళ్ళిపోయాడు. అప్పటికి నాన్న కట్టిన మట్టిగోడల ఇంట్లో ఆయనపై ఆధారపడ్డ కుటుంబం. ఆయన పెద్ద అక్క, బావ, వారి దత్త పుత్రికతోపాటు నాన్నమ్మ, తాతయ్య, అమ్మ, నేను నా ఇద్దరు చెల్లిళ్ళు. మొత్తం 10 మంది. అందరినీ వదిలి అమాయకురాలైన అమ్మ మీద అందరి భారం మోపి పిరికి పందలా నాన్నా పారిపోయాడని ఊరంతా అంటున్నా, అప్పులవాళ్ళు అమ్మను నానా విధాలు వేధిస్తున్నా పెద్ద చెల్లి, మేనత్త దత్త పుత్రికను తోడు చేసుకుని నలుగురు ముసలోళ్ళను, నలుగురు పిల్లలను అమ్మ సాకింది. కూలి డబ్బులు కుటుంబానికి సరిపడక కూడు సంపాదించ పోవటంతో మా అందరి కడుపు నింపి అమ్మ పస్తులు వున్న ఎన్నో రోజులు నాకు తుసు. ఆ రోజులలో కూడా అమ్మమ్మ బియ్యం మూట నెత్తిన పెట్టుకొని కూరగాయలు, అందరికి సెకండ్ హ్యాండ్ బట్టలు, పళ్ళు, స్వీటులు తీసుకొని మేము బడికి వెళుతున్న సమయంలో బస్సుదిగి మాకు ఎదురు వస్తూవుండేది. అమ్మమ్మ వచ్చిన రోజు క్షణంలా బడి గడిచిపోయేది. ఒక్క అడుగులో ఇంటికొచ్చేవాళ్ళం. అమ్మ వద్ద కొరవడిన ముద్దులు బాకీ కూడా తీరుస్తూ అమ్మమ్మ పిల్లలందరినీ ముద్దులతో ముంచెత్తేది. బిడ్డలు ఎదిగే సమయానికి అన్నమే లేకుండా పోయింది. ఈ పిల్లలను, నలుగురు ముసలోళ్ళను లా వడ్డిక్కిస్తావే తల్లీ అంటూ అమ్మను వాటేసుకుని ఇద్దరూ కన్నీరు మున్నీరుగా విలపించేవారు. వాళ్ళ బాధ నాకు అర్థ:కాకపోయినా చెల్లిళ్ళు ఏడవటం చూసి నేనూ ఏడ్చేవాడిని. వారి శోకం వడ్డు ఎక్కా అమ్మమ్మ ఇచ్చే బట్టలు వేసుకొని మురిసిపోతూ, అమ్మమ్మ పెట్టే స్వీటులు తింటూ చెప్పలేని ఆనందాన్ని పొందేవాళ్ళం. కొంతకాలానికి చిన్న చెల్లి అనారోగ్యంతో చనిపోయింది. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పూర్తిగా ఆరోగ్యం చెడగొట్టుకొని నాన్న ఇంటికి చేరాడు. మేము పెద్దవాళ్ళ మవుతున్నా మా జీవితాలలో ఎలాంటి అభివృద్ధిలేదు. ఆ రోజులలో అమ్మమ్మ మాట వింటేనే ఆనందం, అమ్మమ్మ దగ్గర గడపాల్సిందే. అందుకే పదోతరగతి పరీక్షలు రాసి వేసవి సెలవులకు జాగర్లమూడి వచ్చాను.

అక్కడ అమ్మకంటే ఇక్కడ అమ్మమ్మ కష్టాలు ఇంకా తీవ్రంగా వుండేవి. ఏ పని చేయని తాతయ్య ప్రతి చిన్న విషయానికి అమ్మమ్మను ఆ వయస్సులో కూడా అందరి ముందూ బాగా కొట్టేవాడు. అప్పటికే రెండు పెళ్ళిళ్ళు చేసుకున్న మావయ్య కూడా పనీ పాట లేకుండా అమ్మమ్మ మీదనే ఆధారపడి తన నలుగురు కుటుంబ సభ్యలను పోషించుకునేవాడు. ఇన్ని ధలు పడుతూ కూడా కూతురు కష్టాలు చూడలేక అమ్మకు సాయపడలని అమ్మమ్మ పడుతున్న తపన చూస్తే అమ్మమ్మ చాలా గొప్పగా కనబడేది. కష్టాలు కన్నీళ్ళు దిగమింగుతూ ఎవరు ఎంత బాధపెట్టినా తాను ఎవ్వరినీ బాధపెట్టకుండా చేతనైన పనులు చేసుకుంటూ అందరినీ కాపాడుకుంటూ ముందుకు వెళ్ళేది. అమ్మమ్మ నాలో తన కూతురు రూపాన్ని చూసుకుంటే నేను అమ్మమ్మలో నా ధైర్యాన్ని, ఆనందాన్ని వెతుక్కోవటం జరిగేది. చివరి రక్తపు బిందువు వరకూ కుటుంబానికి జీవితం అంకితం చేసి అంత త్యాగశీలిగా బతికిన అమ్మమ్మ జీవితం చరమాంకానికి చేరింది. గత్యంతరంలేని పరిస్థితిలో మామ చిన్న చిన్న పనులు చేస్తూ కాస్తోకూస్తో కుటుంబానికి సాయపడుతున్నాడు. సుమారు 5 దశాబ్దాలు బేవర్స్ గా బతికిన మనిషి కదా కూతుళ్ళు ఎదిగి వస్తున్నారనో తన తల్లి సంపాదించలేక పోతుందేనుకునో ఏదో తనకు చేతనైన పనులు చేసి నాలుగు డబ్బులు తెచ్చి కుటుంబానికి సాయపడుతున్నాడు. దీంతో తన బిడ్డ బంగారం అంటూ అమ్మమ్మ మురిసిపోతోంది. ఇన్నాళ్ళు భర్తవల్ల, బిడ్డ వల్ల ఎన్ని బాధలు పడినా కష్టపడుతున్న తన 50 ఏళ్ళ సుకుమార బిడ్డపై జాలి మమకారం పెంచుకుంది అమ్మమ్మ. ఇదిలా జరుగుతూ వుండగానే తాత అమ్మను చూడడానికి మా ఊరు వచ్చాడు. అమ్మతో కాసేపు మంచి చెడులు మాట్లాడుకున్నాడు. అమ్మ టీ గ్లాసు చేతకిస్తుండగా ఆ గ్లాసు అందుకోకుండానే గుండెపోటుతో తాత చనిపోయాడు. కారు డిక్కీలో తాతను జాగర్లమూడి చేర్చాము. మార్గం మధ్యలో కారు ఆపి అంతా టీ తాగుతుండగా ‘ బొమ్మను చేసి ప్రాణం పోసి’ అని టేప్ రికార్డులో ఘంటసాల పాట వస్తుండగా ఈ పాట మా నాన్నకు ఎంతో ఇష్టం. ఇలా నాన్నను డిక్కీలో అంటూ మామ పెద్దగా ఏడ్చేశాడు. ఆ వేదనలను కట్టడి చేసుకుంటూ జాగర్లమూడి చేరుకొని తెల్లవారు కార్యక్రమాలన్నీ పూర్తిచేసుకున్నాం.

తర్వాత ఎవరికి వారుగా కొంతకాలం బిజీ లైఫ్ లో వున్నాం. నేను డిగ్రీకి వచ్చాను. మామ కూతుళ్ళు ఇంటర్ చదువుతున్నారు. అమ్మమ్మ ఓ సంస్థలో ఆయాగా పని చేస్తూ మామకు చేదోడుగా వుంటుంది. షడన్ గా పనికి వెళ్ళిన మామ గుండెపోటుతో ఇంటికి చేరాడు. డాక్టర్ ల వద్దకు వెళ్ళాలి అనుకునేలోపే మామ చివరి శ్వాస వదిలాడు. పెళ్ళీడుకు ఎదిగిన ఇద్దరు మనుమరాళ్ళు, బైట ప్రపంచం తెలియని కోడలు, మగదిక్కులేని సంసారం, బిడ్డ మరణాన్నీ జీర్ణించుకోలేని అమ్మమ్మ కుటుంబం కుప్పకూలింది. మతిమరుపు, మనోవేదన వ్యాధులు అమ్మమ్మని ఆవహించాయి. శివయ్య అనే మామ పేరు తప్ప అమ్మమ్మ మన ప్రపంచంలో లేదు. అర్ధరాత్రి నిద్రలేచి మామను దహనం చేసిన స్మశానంలోకి వెళ్ళి పడుకోవటం, ఎటోకటు వెళ్ళిపోవటం వంటి ఇబ్బందులలో అమ్మమ్మను చూసుకోలేక మరదళ్ళు అత్త బాధలు పడుతూ వుండేవారు. ఫోన్ లో పరస్థితులు చెప్పి భోరున విలపించేవారు. లాభంలేదని నూ అమ్మమ్మను మా ఇంటికి తీసుకొచ్చాను. శివయ్యా అంటూ ఏటో వెళ్ళిపోయేది. ఆమెను వెతుక్కురావటం చాలా సమస్యగా వుండేది. లాభంలేదని పెద్దాసుపత్రికి వైద్యం చేయిద్దామని తీసుకెళ్ళాను. రిపోర్టులు వచ్చాక డాక్టరు ఇచ్చే మందులు వాడితే ఎలా వుండేదో కానీ అమ్మమ్మ రిపోర్టలు వచ్చే వరకు నన్ను హాస్పిటల్లో వుండనీయకపోవటంతో జాగర్లమూడిలో అమ్మమ్మను దించేశాను. మందులు తీసుకెల్దామనుకున్నాను. నేను తిరిగి వచ్చి డాక్టర్ను కలవటానికి నాలుగు రోజులు సమయం పట్టింది. ఈలోగా అమ్మమ్మ మంచంపట్టిందని మందులు తెచ్చినా ప్రయోజనంలేదని కబురు అందింది. 60 ఏళ్ళుగా కూతురు, కొడుకు కుటుంబాలను కాపాడటం కోసమే తన జీవితాన్ని త్యాగం చేసిన అమ్మమ్మ చివరకు కొడుకు జ్ఞాపకాలతోనే తుదిశ్వాస విడిచింది. బిడ్డలపై ప్రేమలు, బాధ్యతలు తుదిశ్వాస వరకు వీడవు అని అమ్మమ్మ జీవితం చెప్పింది. అమ్మమ్మ ప్రేమలో స్వచ్చత, త్యాగం తలచుకుంటూ అలాంటి మనుషులు మనసులను స్మరించుకుంటూ మృత్వు వడిలోకైనా ఆనందంగా జారిపోవచ్చనిపించిం. ఇది కదా ప్రేమంటే. ఇది కదా ఆప్యాతంటే, అనురాగాలంటే అనిపించింది. ఇవన్నీ వుండే ఒక జనరేషన్ ఓ దశాబ్దం క్రితమే కనుమరుగైందనిపిస్తుంది. మళ్ళీ అలాంటి అమ్మమ్మల కాలం వస్తే బాగుండనిపించింది. ఇంతలో పెదనాన్న కూతురు అక్క శవానికి అంతిమ యాత్రం ఆరంభమయింది, పుట్టింటి పసుపు కుంకుమలు నేను, నా బార్య, నా పెదనాన్న కొడుకు పెట్టటంలోమ ఆ ఊరితో వున్న ఆకరి బంధం కూడా దూరమవుతున్న బాధతో కన్నీళ్ళు ఆగలేదు. మరదళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని చెరోదారి వెళ్ళిపోయారు. అత్త కూడా కూతుళ్ళ దగ్గర వుంది. జాగర్లమూడి రావాలంటే నా అందమైన బాల్యం గుర్తు చేసుకోవాలంటే వారధిలాంటి అక్క ఇకలేదు. నా దేవత అమ్మమ్మ గుర్తులు, నా తొలి హీరో మామ గుర్తలు, నా కళ్ళముందు చనిపోయిన తాతగుర్తులు, నన్ను హీరోలా, రోల్ మోడల్ లా చూసుకున్న నా మరదళ్ళ గుర్తలు, నేను కనబడ్డా నన్ను గుర్తుపట్టలేనంతగా నా చిన్ననాటి స్నేహితులు అంతా ఇక అమ్మమ్మతోపాటే అంతమవుతున్నాయి అనే బాధ భరించలేకపోయాను.

నన్ను చూసిన ప్రపంచం నాకు విలన్లనిచ్చింది. నేను చూసిన ప్రపంచం నాకు వాత్సల్యాలను పంచింది. అమ్మమ్మ లాంటి అనురాగదేవతనిచ్చింది. డబ్బు, అధికారం, కులం తప్ప మానవత్వం కరువైన మనుషుల మధ్య బతకటం కంటే కరోనా కౌగిలి నయమనిపించింది. అక్క చావుతో అమ్మమ్మ అనురాగం ప్రేమ త్యాగాలు గుర్తుకు వచ్చాయి. జాగర్లమూడిలో నా చిన్న నాటి స్నేహితులు ఎవరైనా కనబడితో బాగుండనుకున్నాను. ఎవ్వరూ కనబడలేదు. ఆ ఊళ్ళో నా చిన్ననాటి గుర్తులు ఏమైతే వున్నాయో అక్కడే సినీ నటుడు నానీ పిల్ల జమిందార్ సినిమా షూటిగ్ జరుపుకోవటం యాదృచికం. అయినా జాగర్లమూడి ఊరు గుర్తుకు వచ్చినప్పుడల్లా యూట్యూబ్ లో సినిమా చూసుకుంటాను.  సినిమా చూసినపుడల్లా అమ్మమ్మ జ్ఞాపకాల అనుభూతులు గుర్తుకొస్తాయి. ఈ అనుభూతులు నన్ను మృత్యుభయం నుంచి బైటవేస్తుంది. తరగిపోతున్న బంధాలు బలోపేతానికి కరోనా వైరస్ కొత్తదారి చూపుతున్నట్లపించింది. అంతరించి పోతున్న అమ్మమ్మ అనురాగాన్ని గుర్తు చేసింది. ఎన్ని బాధలున్నా భయాల్లేని అమ్మమ్మ లాంటి స్వచ్చమైన రోజులు కావాలని మళ్ళీ జన్మంటూ వుంటే నా అమ్మమ్మ కాలంలో పుట్టాలని కోరుకుంటా.

7 కామెంట్‌లు:

  1. కథా రచయిత పెద్ద సైకోలా నాకు అనిపించాడు. అమ్మమ్మ గురించి కధని ఎంచుకున్న వ్యక్తి కరోనా తన ఊరికి రావాలని కోరుకోవటం సైకోతనానికి నిదర్శనంగా కనిపించింది. సమాజంలో అందరూ తనకి విలన్స్ గా కనిపించటం.. మరీ ముఖ్యంగా ఈ సెంటెన్స్ ‘‘స్వార్ధం, ఈర్ష్యల రొచ్చులో దొర్లుతూ, అవకాశవాదంతో, ఎదుటివారి బలహీనతలను సొమ్ముచేసుకుంటూ పేదరికం, కష్టాలు కన్నీళ్ళను కాసులుగా మార్చుకునే లోకం మాత్రమే నా కళ్ళకు కనబడేది. ’’ గమనిస్తే రచయిత ఆలోచనా ధోరణి ఎలా వుందో అర్ధమౌతోంది. ‘‘ డబ్బు, అధికారం, కులం తప్ప మానవత్వం కరువైన మనుషుల మధ్య బతకటం కంటే కరోనా కౌగిలి నయమనిపించింది.’’ అనేవాక్యం ద్వారా రచయిత ఎంత సైకో మనస్థత్వం కలిగిన వాడో అర్ధమౌతోంది. కరోనా సోకి ప్రపంచమే పీనుగుల దిబ్బగా మారుతుంటే కరోనా రావాలని కోరుకున్నాడంటే ఇలాంటి వారు కూడా రచయితలుగా కొనసాగటం రచనా లోకానికి బాధాకరం అని నాకు అనిపించింది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కథ మొత్తం చదివితే అమ్మమ్మ కధ వుందో తెలుస్తుందండీ. కాస్త కాస్త చదివేసి రచయితని దుర్భాషలాడటం పద్ధతికాదు. సంస్కారమూ కాదు.

      తొలగించండి
  2. మధుగారు రచన చాలా బాగుంది. ఇది కధలా లేదు. నిజ జీవితంలా అనిపించింది. మీ జీవితంలో జరిగిన సంఘటనలనే కధలా మలిచినట్లుంది. కధ చదువుతున్నంత సేపూ మీ అమ్మమ్మ, తాతయ్య, మావయ్య, అమ్మ ఇలా ప్రతి పాత్ర కళ్ళముందు కనిపించాయి. ఇలాంటి కధలు మరిన్ని రాయాలని కోరుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  3. బాణావత్ వసంతయామిని23 జులై, 2023 8:44 AMకి

    మధుగారూ రచన బాగుంది. అమ్మమ్మ కధ చదువుతుంటే నాకు మా అమ్మమ్మ గుర్తొచ్చింది. ఇది నిజజీవితమా..?

    రిప్లయితొలగించండి
  4. ఒక జీవిత కాలాన్ని ప్రతిబింబించిన ఎం.మధు గారి అమ్మమ్మ కథ మనసును కదిలించింది. వ్యక్తి ఆలోచనల్లో వయసు గడిచే కొద్దీ పరిపక్వత వస్తుంది. కనిపించే విలన్ల మధ్య రోజులు గడిపేస్తున్నా, మరచిపోయిన బంధాలు, వాత్సల్యాలు జ్ఞాపకాలుగా మనిషిని బతికించే ఔషధాలు!
    సాంకేతికత పెరిగి మనుషుల మధ్య అంతరాలు పెంచుతున్న క్రమంలో, నిజమే అమ్మమ్మల కాలం నాటి రోజులు అపురూపమైనవి. మంచి అనుభూతిని పంచిన కథ వ్రాసిన మధు గారికి ప్రత్యేక అభినందనలు.

    రిప్లయితొలగించండి