కబీరు దోహాలు 91-104

 91.దురిత హేతువగును దుర్దనాళి చెలిమి

    తోడు చేసి కొనగ తొలగ వలయు

    సంఘ మందు విలువ సన్నగిలు టెగాక

    కాంచు చుంద్రు జనులు ఖలుని యిట్లు


92.చినుకు ముత్యమగును చిప్పలో రాలిన

    పాము నోట పడిన ఫలితమేమి?

    ఇనుము నీట బడిన ఇట్టి మునిగిపోవు

    చెడ్డవారి చెలిమి చేటు తెచ్చు


93. ఒక్క పొద్దు 'పేర ఉపవాస మొనరించి

    మాపటేల గోవు మాంసము తిన

    దేవుడెటుల మెచ్చు జీవహింసకు నొచ్చు

    మతములన్ని హింస మాపవలయు


94. హరిని పొగడు నోరు అతని జన్మకె గాక

    వాని యూరునకను వన్నె దెచ్చు

    భక్తిలేని యెడల పామర జన్మని

    పలికె నా కబీరు భక్తవరుడు


95.శాశ్వతమ్ముకాని శారీరకంబగు

    బాంధవమును తలచు పామరుండు

    సృష్టి కార్యమందు సిద్ధహస్తుడెవడొ

    అంతమగును సృష్టి అతని యందె.


96. దుఃఖ హేతువగును దుష్ట సాంగత్యమ్ము

    తొలగు వాని నుండి దూరముననె

    సాధు జనులతోడి సహవాస మయ్యది

    నీడ బోలు దాని వీడరాదు


97. సాధు జనుల గూడి సహవాసమును జేయ

    వెనుక అడుగు లేక వెళ్ళవలయు

    ఫలిత మెంచనేల పరమాత్ముడుండగా

    కృషి యొనర్చు వాడె బుుషియనంగ


98.కుల మనంగ హరిని కొల్చునదె కులము

    భక్తిలేక కులము వ్యర్థమగును

    కుల మతములవేల? కుదురైన భక్తికి

    భక్తిలేని జన్మ పాడు జన్మ


99. చెట్టు నుండి రాలి చెట్టు కతుకబోదు

    పండి రాలినట్టి పండు మరల

    మరణ మొందు పిదప మనిషి ప్రాణ మిటులె

    పాత దేహమందు పాదుకొనదు.


100. పూజనీయులనగ పుడమి నిరువు రుండ్రు

    ముక్తి దాత జూపు మొదటి గురువు

    అరయ ముక్తి నొసగు హరియె రెండవవాడు

    వీరికన్న ఘనులు వేరు లేరు.


101.తిరుగు చుండ్రు జనులు దీపపు పురుగట్లు

    మాయ దీప మటుల మరులు గొలుప

    మార్గ మెరుక పరచి మాయను తొలగించు

    నట్టి గురునకన్న అధికుడెవరు?


102.ఎండ నీడలందు నెందు నున్నను గాని

    పండు వెన్నెలయిన పగలె అయిన

    దైవ మందు నాత్మ తాదాత్యమందక

    కలుగ బోదు సుఖము కలలనైన


103.తీపి మీద మోజు తీసుకు పోవంగ

    పాక మందు ఈగ పాదు కొనదె?

    మధుర మయిన సుఖము మాయ జాలమె సుమ్ము

    మునిగి పోదు రందు ముక్తిగనరు.


104. చూడలేదు వాని సూక్ష్మరూపుడనగ

    కాంచలేదు వాని ఘనుడనంగ

    అంత మాది లేని ఆతని వర్ణింప

    అన్యమొండు లేదు ఆత్మ తప్ప. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి