శివలీలలు 3

 రాజకుమారి ముందుకు సాగిపోయింది. దూరంగా చివరన కూర్చున్నాడు శ్రీహరి. వరమాల ఆయన కంఠసీమన అలంకరించింది రాకుమారి. ఆమెని తీసుకొని గరుడ వాహనం మీద వైెకుంఠానికి వెళ్ళిపోయాడు విష్ణుమూర్తి. ఆ విషయం ఎవరూ పట్టించుకోకుండా స్వయంవరానికి వచ్చిన రాకుమారులు,రాజులు అందరూ తననే వింతగా చూస్తూ పరిహాసంగా నవ్వుతుండటంతో ఏం జరిగిందో అర్ధంకాలేదు నారదునికి. ఇక వుండబట్టలేక అసలేం జరిగిందో తెలుసుకోవాలనే కుతూహలంతో.. వారిని అడిగాడు నారదుడు..

అప్పుడారాజులు.. ‘‘ ఏమ్యా.. నువ్వెవరో పిచ్చివాడిలా వున్నావే. వంటి మీద వున్న వస్త్రాలు, ఆభరణాలు చూస్తే శ్రీనాధునిలావున్నాకు. కానీ నీ ముఖం ఒకసారి చూసుకో.. కోతిలాగా వున్నది. అట్టి నిన్ను రాకుమారి ఏరకంగా వరిస్తుందనుకున్నావు? ’’ అంటూ నారదుని ఎగతాళి చేశారు.

నారదునికి విషయం అర్ధమైంది. శ్రీహరి తన రూపాన్నిమ్మంటే కోతిరూపాన్నిచ్చి తనను మోసం చేశాడు. సభల తనకు తీరని పరాభవాన్ని కల్పించాడు. తలవంపులయింది నారదునికి.. దీనికి కారణమైన విష్ణువుని అస్సలు క్షమించరాదు అనుకుంటూ, కోపంతో ఊగిపోతూ హుటాహుటిన వైకుంఠం చేరాడు. అక్కడ శ్రీమహావిష్ణువుని చూసి, నారాయణా! నువ్వెంత మోసగాడవు. దేశ దేశాల నుంచి వచ్చిన రాజుల మధ్య నన్ను ఘోరంగా అవమానించావు. దీనికి ప్రతిఫలం నువ్వు అనుభవింపకుండా వుండలేవు. ‘‘ భార్యకోసం నేను ఏవిధంగా తల్లడిల్లిపోయానో అలాగే నీవు కూడా నీ భార్యకోసం నానా కష్టాలు పడతావు. నాకు కోతి ముఖం ప్రసాదించావు కనుక ఆ కోతిమూకలే నీకు కష్టకాలంలో సాయంగా నిలుస్తాయి. ఇదే నా శాపం’’ అన్నాడు.

ఆ మాటలు విన్న శ్రీ మహావిష్ణువు ‘‘ నారదా ! శాంతించు.. శివమాయ నిన్ను ఆవహించింది. హరి రూపము కావాలని కదా నువ్వు అడిగింది. హరి అంటే కోతి అని అర్థం నీకు తెలియదా? జ్ఞాన వైరాగ్యాలు కోల్పోయి ఈ రకంగా కోరటం నీకు తగినదా చెప్పు. ఒక్కసారి నువ్వు ఆలోచించు. నిన్ను నేను మోసగించానా? నువ్వు మాత్రం నన్ను అకారణంగా శపించావు. సరే నీ శాపం నిష్ఫలం కాదులే. అయితే త్రేతాయుగంలో శ్రీరామ చంద్రునిగా దశరధుని ఇంట పుట్టి, నీశాపమును అనుభవిస్తాను. నువ్వు నన్ను శపించినా, నేను మాత్రం నీకు వరమిస్తున్నాను. కలహప్రియుడ వైనప్పటికీ ముల్లోకములందూ నీవు గౌరవింపబడతావు.’’ అన్నాడు శ్రీహరి.

మాయను జయించానని విర్రవీగిన నారదునికి గర్వభంగం అవ్వటంతో శ్రీహరి మాటలకు అతని హృదయం ద్రవించింది. కళ్ళు చెమర్చాయి. వెంటనే శ్రీమన్నారాయణుని పాదాలపై పడి ‘‘ హే నారాయణా... నన్ను క్షమించు. నా తప్పులను మన్నించు. సదా నీ అనుగ్రహానికి పాత్రుడయ్యేలా నన్ను కటాక్షించు స్వామీ’’ అంటూ వేడుకున్నాడు.

ఆ తర్వాత విష్ణుమూర్తి ఆశీస్సులందుకొని తీర్ధయాత్ర చెయ్యటానికి బయల్దేరాడు నారదుడు. (సశేషం)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి