కవిపరిచయం
బసవపురాణం అయిన కవి పాాల్కురికి సోమనాధుడు. ఈతని గురించిన విశేషాలను ముందుగా తెలుసుకొని తర్వాతి భాగాలలో బసవపురాణాన్ని కొనసాగిద్దాం. బసవపురాణం ద్విపద కావ్యంగా రచించటం జరిగింది. నాకున్న తెలుగు భాషా పరిజ్ఞానంతో ముందుతరాలవారికి కూడా అర్ధమయ్యే విధంగా నాకున్న పాండిత్యంతో నేను అర్ధం చేసుకున్న విధంగా బసవపురాణాన్ని వచన రూపంలో అందించే చిరుప్రయత్నం చేస్తున్నాను. దీనికి మీరందరూ సహకరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.
బసవపురాణము తెలుగులో వెలసిన తొలి స్వతంత్రపురాణము. అనగా అనేక పురాణాలు సంస్కృతంలో వున్నవాటిని తెలుగులోకి అనువదించగా.. తెలుగులోనే నేరుగా రాసిన పురాణంగా బసవపురాణాన్ని చెబుతారు. దీనిని రచించిన కవి పాల్కురికి సోమనాధుడు. బసవ పురాణం చదివేముందు కవి యొక్క కాలాదులను తెలుసుకోవటం మనందరి విధి. అది కవిగారికి మనం ఇచ్చే గౌరవంగా భావిస్తున్నాను. అందుకే నేను కవిగురించి సేకరించిన అంశాలను మీముందు వుంచుతున్నాను.
గతంలో నేను ఈ కవిగురించి, ఈతని జీవన శైలిని గురించి ‘‘శ్రీ సోమనాధ చరితం’’ అనే నాటకాన్ని కూడా రాయటం జరిగింది. ఆ సందర్భంగా కవిగురించి నేను కొన్ని అంశాలను సేకరించాను. వాటిని మీతో పంచుకుంటున్నాను.
మీ
విద్యాధర్ మునిపల్లె
- పాల్కురికి సోమనాధుడు
పాల్కురికి సోమనాధుడు ఎనిమిది భాషలలో కవిత్వము చెప్పగల ప్రవీణుడు. వీరికి తత్త్వ విద్యాకలాప కవితాసారుడు అను కీర్తి కలదు. పాల్కురికి సోమనాథుని గూర్చి తెలుసుకొనుటకు గల ముఖ్య ఆధారములు. అతని
- బసవపురాణము ఇంకా ఇతర రచనలు
- పిడిపర్తి సోమనకృత పద్య బసవపురాణము
- తోంటద సిద్ధ లింగకవి కన్నడమున రచించిన పాల్కురికి సోమేశ్వర పురాణము.
- ఏకామ్రనాథుని ప్రతాపచరిత్రము.
పాల్కురికి సోమనాధుని కాలమును గూర్చి పండితలోకమున భిన్నాభిప్రాయములు ఉన్నవి. కొందరు కాకతి రుద్రదేవుని కాలమునకు సంబంధించిన వాడని చెప్పుచుండిరి.(క్రీ.శ.1158-1195) . కొందరు గణపతిదేవుని కాలమునకు సంబంధించినవాడని పలుకు చుండిరి (క్రీ.శ.1198-1262) . కాకతీయ చక్రవర్తులలో చివరివాడగు ప్రతాపరుద్రుని కాలము నకు చెందినవాడని కొందరు నిర్ణయించిరి. (క్రీ.శ 1296-1323) . తెలుగు వాక్యమున సంస్కృతమును జొప్పించుట, సంయుక్తాక్షరమున ఏకాదేశమునకు ప్రాసను గూర్చుట, పాతబడిన మాటలు వాడుట మొదలగునవి సోమనాథుని రచనలలో కానవచ్చుచున్నవి. అయితే ఇతని యొక్క రచనలలో ఉన్న అవలక్షణములను కొన్నింటిని నిర్వచనోత్తర రామాయణావతారికలో తిక్కన పరోక్షముగా అధిక్షేపించి యుండుటచే సోమనాథుడు తిక్కనకు పూర్వుడే గాని తరువాతి వాడై యుండుటకు వీలులేదు అని ఊహించవచ్చును. సుమారు పాల్కురికి సోమన యొక్క కాలము క్రీ.శ. 1160-1230 మధ్య కాలము అని అంగీకరించుటలో ఎటువంటి ప్రతిబంధకము ఉండదు.
విష్ణురామిదేవుడు స్త్రియాదేవియమ్మ అనువారు సోమనామాత్యుని అసలు తల్లిదండ్రులో లేక వారు పోషణ జనకులో తెలియదు. ఇతని నివాసస్థలము నేటి తెలంగాణలోని నల్లగొండ జిల్లా నందలి జనగామ తాలూకాలోని పాలకుర్తి అనుగ్రామము. సోమనాథునికి శివదీక్షను ప్రసాదించిన గురువులు గురులింగార్యుడు. విద్య నేర్పిన గురువులు కరస్తలి విశ్వనాథుడు, వేలిదేవి కుమనారాధ్యుని మనుమడు అనువారలు. బసవ పురాణమున పేర్కొనిన పాదముననుసరించి పరిశీలించిన కట్టకూరి పోతిదేవర కూడా గురువని తెలియుచున్నది.
‘‘ఖ్యాతిచెసద్భక్తి గల కట్టకూరి పోతిదేవుని పదాంబుజ షట్పదుండ!’’
పాల్కురికి సోమనాథుడు సంస్కృతాంధ్ర కర్ణాట భాషలలో పెక్కు గ్రంథములు రచించెను. ఆ రచనలన్నియు శైవ మత ప్రచారమునకు ఉద్దేశింపబడినవి. పిడపర్తి సోమనాథుడు అనుకవి పాల్కురికి సోమనాథుని రచన అయిన బసవ పురాణమును పద్య బసవపురాణముగ రచించెను. పిడపర్తి సోమనాథుడు పద్యబసవపురాణ పీఠికలో సోమనాథుని రచనలను సీసపద్యముగ మలచి చెప్పెను.
సీ॥ బసవపురాణంబు. పండితారాధ్యుల
చరితంబు, ననుభవ సారమును, జ
తుర్వేద సారసూక్తులు, సోమనాథ భా
ష్యంబును, రుద్రభాష్యంబు, పసవ
రగడ, గంగోత్పత్తి రగడ, శ్రీబసాఢ్య
రగడయు, సద్గురు రగడ, చెన్న
మల్లు సీసములు, నమస్కార గద్య వృ
షాధిప శతకంబు, నక్షరాంక
గీ॥ గద్యపద్యముల్, పంచప్రకార గద్య
యష్టకము, పంచకము నుదహరణ యుగము
నాదియగు కృతుల్ భక్తి హితార్థ బుదిఁ
చెప్పినవి భక్తి సభలలోఁ జెల్లుచుండు
ఈ విధముగ పాల్కురి సోమన యొక్క రచనలన్నియు తెలియజెప్పెను. ఇవిగాక మరికొన్ని రచనలు వున్నవని విమర్శకుల యొక్క ఆలోచన.
ఇతని రచన భక్తితత్త్వమునే ఆధారముగ చేసుకొని సాగినట్లుగ తెలియుచున్నది. భక్తి ప్రచార ఉద్యమములో వీరి పాత్ర ముదావహమైనది. వీరు శైవ మత సంప్రదాయములను వారి రచనలలో బంధించి శైవునిగా అతని గొప్పతనమును చాటుకొనెను. లక్షణ గ్రంథముల వలె వీరి యొక్క రచనలు కొనసాగినవని చెప్పుటలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
- బసవపురాణము పూర్వవిషయాలు
సోమనాథుని యొక్క రచనా సమయమునకు జైనమత ప్రచారము అధికముగా యున్నది. ఇటువంటి నాస్తికవాదుల నుంచి ప్రజలనుసంరక్షించుట కొరకై శైవభక్తిని ప్రచారము చేయుటకై బసవపురాణమను పేరుగల వీరశైవపురాణ గ్రంథమును సోమనాథుడు రచించెను. తెలుగున వెలసిన మొదటి పురాణ గ్రంథము బసవ పురాణము. ఆదిపురాణము, జినేంద్రపురాణము వంటి జైనుల మత గ్రంథములు పరోక్ష ప్రభావమున బసవ పురాణము తెలుగు వెలసినట్లుగ భావించవచ్చును. నాస్తిక వాదము బలపడి ప్రజలలో ప్రేమ స్వరూపమగు భక్తి భావన లోబడిన సమయమున నందీశ్వరుని అవతారముగ బసవేశ్వరుడు ఉద్భవించి వీరశైవ ధర్మములను ప్రచారము చేసి అవతారపురుషునిగ లోకమున ప్రఖ్యాతి పొందిన బసవేశ్వరుని యొక్క మాహాత్మ్యమును బసవపురాణము పేరుతో పురాణ గ్రంథమును సోమనాథుడు రచించెను. ఇందు ఏడు అశ్వాసములు కలవు. ఈ గ్రంథమున బసవేశ్వరుని యొక్క పూర్వ అవతారములను, అతని పుట్టుకను, వ్యవహారదక్షతను, జంగమ సేవ యొక్క గొప్పతనమును, లింగైక్యమును పొందిన పుణ్య చరిత్రలను, ప్రాసంగికముగ సుమారు డెబ్బదిఐదుమంది శివభక్తుల కథలు ఇందు ప్రశస్తముగా కూర్చబడినది. ఈ పురాణము శ్రీశైల మల్లిఖార్జున దేవాలయ మండల స్థలినందు భక్తుల గోష్ఠిలో దీనిని ప్రారంభించెను.
గొబ్బూరి సంగనామాత్యుడు శ్రోతగ కావ్యరచన సాగినది. ఈ పురాణము ద్విపద అను ఛందస్సున వ్రాయబడెను. ఇందలి కథాసంవిధానము కథాకథన పద్ధతిలో చేయబడెను. ముగ్థ సంగయ్య కథ, బెజ్జమహాదేవి కథ, గొడగూచికథ, కన్నప్పకథ, మాదిరాజయ్యకథ, మడివేలు మాచయ్యకథయు, మనోజ్ఞకళాఖండములుగ ఇందు రచించబడినవి. ఈ కథలన్నియు రసనిర్భరములుగ వుండినవి. ఈ పురాణములోని రచనా విధానమును పోతన మొదలగు కవులు కూడా అనుసరించినట్లుగ వారి రచన ద్వారా వెల్లడగుచున్నది. ఈ బసవ పురాణమును పిడిపర్తి సోమన, మహాదేవరాధ్యుడు, తుమ్మలపల్లి నాగభూషణకవి అనువారు పద్య ప్రబంధములుగ రచించిరి. కన్నడ దేశమున ఈ పురాణమును భీమకవి అను నతడు కవిషట్‌పద వృత్తములలోను రచించిరి. బసవ పురాణము నందు ఆనాటి శివభక్తులలో అగ్రగణ్యులైన భక్తుల యొక్క చరిత్రలను చెప్పబడెను.
సోమనాథుడు తన ఆరాధ్యదైవమయిన పరమశివుని స్తుతించుచు మంగళాచరణ పద్యమును రచించెను. అదే విధముగా శ్రీశైల మల్లికార్జునునకు స్థానమైన శ్రీశైలమును గూర్చి ఈ క్షేత్రమునకు తూర్పు భాగమున నున్న త్రిపురాంతకేశ్వరునకు నిలయమై, కుమారశైలముగ కీర్తింపబడుచున్న త్రిపురాంతక క్షేత్ర విశిష్టతను గూర్చి కూడా సందర్భానుసారముగ చెప్పెను. శివాచార సంపన్నులై వీరశైవమును ప్రచారము చేసిన జంగమరత్నం, లింగైక్యమూర్తి, ఇంద్రియ జయుడు, పండితారాధ్యులు మొదలగు వారికి పరమకృపా జనితుడు కరస్థలి సోమనాథయ్యగారు మొదలగు వారి కృపాకటాక్షములు తనకు కలుగవలెనని కోరుకొనుచు ఈ పురాణమును వ్రాసెను. రచనకు ముందు పదపదార్థ జ్ఞానము కలుగవలెనని పార్వతీపరమేశ్వరులకు నమస్కరించుచు మంగళాచరణ పద్యమును ఎట్లు అసదృశమైన బసవ పురాణాన్ని తమకంతో రచించాలని నాకెంతో కోరికగా వున్నది. కనుక ఆ కథా సూత్రమేమిటో నాకు అనుగ్రహించండి అని భక్తబృందమును ఉద్దేశించి విన్నవింపగ ఎంతగానో పొంగిపోయింది. వెంటనే భక్త బృందమంతా ఎంతో ప్రీతితో నాపై తమ కరుణాకటాక్ష వీక్షణములను ప్రసరింపజేసిరి. వారి అనుజ్ఞమేరకు కవితారచనకు పూనుకొనెనని తెల్పెను. అలా బసవపురాణమును రచించటం ప్రారంభించెను.
(సశేషం)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి