పసి హృదయం

పసి హృదయం

... ఈతకోట సుబ్బారావు
సెల్ : 9440529785
      

మార్నింగ్ వాక్ నుండి ఇంటికి వచ్చిన శంకర్ కు రోజు కనపడే దృశ్యమే కనబడింది. ఇంటి గుమ్మం వద్ద  రోహిణీ శీను నుండి పూలు కొంటూవుంది. ఒక్క క్షణం "ఫో.. ఇక్కడినుంచి", అని శీనూ ని  తరమాలనిపించింది. "పూలు కొనద్దు", అని రోహిణి కు చెప్పాలనిపించింది. అయితే .."ఎందుకు కొనకూడద"ని రోహిణి ప్రశ్నిస్తే, తానేం సమాధానం చెప్పాలి? విసుగుని మనసులోనే అనుచుకొని..   మౌనంగా  వాళ్లను దాటుకుని, ఇంట్లోకి వెళ్లి పోయాడు శంకర్.

 శీను నుండి పూలు కొనటం రోహిణి కు నిత్యకృత్యమే.. శంకర్ కూడా రోజూ శీను ని పలకరిస్తాడు.  శీను ఆ అపార్ట్మెంట్లో, రోజు ఉదయాన్నే ప్రతి ఇంటికి వెళ్లి పూలు అమ్ముతాడు. శంకర్, రోహిణి  ఇద్దరూ సహృదయులు అవడంతో.. శీను వద్ద పూలు కొనడమే కాక, చాలా సార్లు టిఫిన్ కూడా పెడుతుంటారు. ఇద్దరు శీ నూ తో చనువుగా కూడా ఉంటారు. రోహిణి కు దైవ భక్తి ఎక్కువ. అందుకని పూజ కోసం కొంచెం ఎక్కువగానే పూలు కొంటుంది. మామూలుగా అయితే జుట్టును క్లిప్ పెట్టి వదిలేస్తుంది,ఆమె. అయితే రోజూ పూలు కొనడంతో.. జుట్టు ముడి వేసి, పూలు    ముడవటం  మొదలు పెట్టింది.  మొదటి సారి తన జడను నాలుగు అల్లికలు ఆల్లి పూలు పెట్టినప్పుడు..శంకర్ కళ్లు మెరవడం ..ఆమెకు ఒక మంచి జ్ఞాపకం. అయితే రోజు శీను తో సరదాగా మాట్లాడే శంకర్, రెండు మూడు రోజుల నుండి ముభావంగా వెళ్లిపోవడం, ఆమెను ఆలోచనలో పడేసింది. ''విషయమేంట"ని నేరుగా శంకర్ ను అడగలేక పోతోంది. శంకర్ రోహిణి తో చాలా సరదాగా ఉంటాడు. అయితే ఎప్పుడన్నా అతను ముభావంగా ఉండిపోతే, రోహిణి తరచి అడగదు. కొంచెం సమయం ఇస్తే అతడే విషయం చెప్పటం.. లేక నార్మల్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా కొద్దిగా టైం ఇచ్చి చూద్దాం.. అని అనుకుంది రోహిణి.

 పూలు తీసుకుని శీను ని పంపి లోపలికి వచ్చింది రోహిణి. కాఫీ కప్పుతో వచ్చిన ఆమెతో శంకర్ "పూలు పెట్టుకోవడం నీకు అలవాటు లేని పని... శీను దగ్గర పూలు కొనొద్దు. నీకు పూజకు పూలు, నేనే తెస్తాను" అన్నాడు. తగ్గుస్వరంతో చెప్పినా, ఖచ్చితంగా చెప్పడంతో.. రోహిణి బాధపడింది.' పూలు పెట్టుకుంటే మెచ్చుకోలుగా చూసిన మనిషేనా ఇలా అంటున్నాడు!? నేనే మైనా అతిగా అలంకరించుకుంటున్నానా? అంటూ తర్జనభర్జన పడింది.

" ఏమైంది శంకర్?" అంటూ ప్రశ్నించింది. "ఏమీ లేదు... నువ్వు  శీను దగ్గర పూలు కొనద్దు. నేను తెస్తాను." తెగేసి చెప్పాడు శంకర్. కారణం చెప్పకుండా మొండిగా మాట్లాడుతున్న శంకర్ ప్రవర్తనతో మరింతగా బాధపడింది  రోహిణి. "కారణం చెప్పమంటూ"... నిలదీసింది." కారణాలు అవసరం లేదు.. కొనద్దు.. అంతే" అంటూ సీరియస్ గా బాత్రూంలోకి వెళ్లి పోయాడు శంకర్.

ఆఫీస్ కు బయల్దేరిన శంకర్ ను.. శీను ఆలోచనలు వదలడం లేదు. నాలుగు రోజుల క్రిందట జరిగిన సంఘటన అతడి ఆలోచన లకు కారణం అయ్యింది. ఆ రోజు, దగ్గరి బంధువు ఒకతను చనిపోవడంతో, శవ యాత్ర లో పాల్గొన్నాడు శంకర్. స్మశాన వాటికకు చేరుకుని, ఓ పక్కగా నిల్చుని, జరిగే తంతును చూస్తున్నాడు. అంతలో అతడి చూపు, ఒక కూలిన గోడ ఎక్కి కూర్చున్న ముగ్గురు యువకుల పై పడింది. అందులో శీను కూడా ఉండడంతో... 'ఇతడికి ఇక్కడ ఏంపని' అనుకున్నాడు శంకర్. పార్థివదేహాన్ని దించి, పూలదండలు నేల మీద పెట్టగానే.. ఆ ముగ్గురు అబ్బాయిలు గబగబా వచ్చారు. ఆ పూల దండలు తీసుకొని, అక్కడి నుంచి అంతే వేగంగా వెళ్లిపోయారు. శంకర్ కు ఏమీ అర్థం కాలేదు. రెండో ఆలోచన లేకుండా వాళ్ళు వెళ్ళిన వైపు వెళ్ళాడు.

 అక్కడ ఒక బండ మీద కూర్చుని ముగ్గురూ.. మాలల దారాలు విప్పుతున్నారు. పూలను జాగ్రత్తగా విడదీసి, తమతో తెచ్చుకున్న బుట్టలో పెడుతున్నారు. శంకర్ కాసేపు అక్కడే నిల్చున్నాడు. తన భార్య పెట్టుకునే పూలు.. తమ ఇంట్లో దేవుడికి అలంకరించే పూలు ఎక్కడి నుంచి వస్తున్నాయో.. అతనికి అర్ధం అవ్వగానే.. మనసంతా చేదుగా అయిపోయింది. ఇంకో విషయం లో అతడికి తీవ్రమైన మనోవేదన కలిగింది. అది.. ఆ అబ్బాయిల గురించి. ముగ్గురూ పని చేయగల శక్తి, తెలివి ఉన్నవాళ్లు. చేతుల్లో చేవ ఉన్నవాళ్లు. అలాంటి వాళ్ళు, ఇలా మోసం చేస్తూ డబ్బు సంపాదించడం, రాబోయే తరానికి వీళ్లూ ప్రతినిధులే.. అని అనుకున్నప్పుడు, శంకర్ కు ఆ ముగ్గురి చెంపలు ఎడాపెడా వాయించాలనిపించింది. అయితే వాళ్లు తన మాట వినరు. 'నీకెందుకు' అన్నా అనవచ్చు. వస్తున్న బాధను, ఆవేశాన్ని అణుచుకుని, అక్కడి నుంచి వెళ్లిపోయాడు శంకర్. ఆ తర్వాత రోజూ శీను ను చూస్తున్నప్పుడు, అతడిలో అంతే వేదన కలుగుతోంది. ఆ పూలను చూసినప్పుడు 'మోసపోయామన్న'  బాధ ఎక్కువవుతోంది.

 ఆఫీస్ కు వెళుతున్న శంకర్ మనసులో ఇదే విషయం తిరుగుతూ ఉంది. తన భార్యకు దైవభక్తి చాలా ఎక్కువ. అలాంటి ఆమెకు ,"నువ్వు, ఇన్నాళ్లు పూజ చేసిన పూలు మలినమైనవి. శీను నిన్ను మోసం చేశాడు, ఇకమీదట శీను దగ్గర కొనొద్దు." అని ఎలా చెప్పాలి. లేదా శీను ని 'అపార్ట్మెంట్ దగ్గరకు రావద్దు' అని బెదిరించవచ్చు. ఇంకోచోట అమ్ముకుంటాడు... అంతే. లేదు.. శీను  ఈ నీచమైన పని వదిలేయాలి." ఆలోచిస్తున్న  శంకర్ కు, ఒక మార్గం తట్టింది. వెంటనే బైకును రోడ్డు పక్కకు ఆపాడు. ఆఫీసుకు ఫోన్ చేసి ఆ పూటకు సెలవు అడిగాడు. బండి వేరే రోడ్డు లోకి తిప్పి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు. ఆ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తన స్నేహితుడు... శివ. విషయం టూకీగా చెప్పి, అతడిని తన బైక్ ఎక్కించుకొని, శీను ఉండే ఇళ్ళ వైపు దారి తీసాడు శంకర్. ఒకరిద్దరిని శీను గురించి అడుగుతూన్నంతలో.. ఒక మర్రిచెట్టు కింద, రచ్చబండ పై కూర్చున్న శీను, అతడి ఇద్దరు స్నేహితులు కనిపించారు వారికి. యూనిఫాం లో ఉన్న శివ తో పాటు ఆ రచ్చ వైపుకు వెళ్ళాడు శంకర్. శీను, అతగాడి స్నేహితులు, మరో ఇద్దరు వయసుమళ్ళిన వ్యక్తులతో పులిజూదం ఆడుతూ కనిపించారు. శంకర్ ను చూడగానే శీను చటుక్కున లేచి నిల్చున్నాడు. యూనిఫాం లో ఉన్న శివ ని చూడగానే శీను ఫ్రెండ్స్ తప్పించి, మిగతా వాళ్ళు తప్పకున్నారు.  ఈ హఠాత్ పరిణామానికి, ఆ ముగ్గురు.. శివ వంక బిత్తర చూపులు చూడసాగారు.

" శీను... నువ్వు ఉండేది ఇక్కడే నా?.. వేరే పని మీద ఇటుగా వచ్చాం. నువ్వు కనపడ్డావ్" అంటూ పలకరించాడు, శంకర్. నెమ్మదైన పలకరింపుతో.. గొంతులోకి వచ్చిన గుండె, నెమ్మదిగా స్వస్థానంలో స్థిరపడ సాగింది... ముగ్గురికీ. అయితే వాళ్లు స్థిమితపడటం రవికి నచ్చినట్లు లేదు.

" ఏంటి... పులిజూదమా?... ఎంత సంపాదిస్తారేంటి?"  మామూలుగా అడిగినా, శివ గొంతులో కర్కశం వినబడుతూనే ఉంది.

" జీవితంలో ఇది కడాట"... అనుకున్నారు ముగ్గురూ."

 లేదు ..లేదు సార్ ...ఏదో.. పొద్దుపోక... డబ్బులు  పెట్టి ఆడం సార్" గబగబా.. నత్తి నత్తిగా మాట్లాడాడు శీను. ముగ్గురి చొక్కాలు చెమటతో తడిసిపోయాయి. "ఎక్కడ మీ అమ్మానాన్న" శీను ని అడిగాడు శంకర్.

" పనికి వెళ్ళిండారు అన్నా" చెప్పాడు శీను." మీ డ్యూటీ అయిపోయిందా?" అర్థవంతంగా అడిగాడు శంకర్. తలదించుకున్నాడు శీను." వీళ్ల ముగ్గురి కీ స్మశానంలో డ్యూటీ... శివా.. నీకు చెప్పాను కదా?"  నేలలో గుంత ఎక్కడైనా ఉంటే  దూరిపోదాం అన్నట్టున్నారు ముగ్గురు. ముగ్గురికి కాళ్లలో సన్నగా ఒణుకు మొదలయ్యింది." ఈ విషయం అన్నకు ఎలా తెలుసు?" ముగ్గురి మనసులో ఇదే ప్రశ్న.

" ఎంత వస్తుంది శీను?" అడిగాడు శంకర్, చాలా క్యాజువల్ గా.

"ఐదు వందల దాకా వస్తుందన్న "  తలొంచుకునే చెప్పాడు శీను. తల ఎత్తి సమాధానం చెప్పడానికి, తల సహకరించడంలేదతనికి.

"ఒకరోజు కా?"ఆశ్చర్యం నటించాడు శంకర్.

"లేదన్నా... వారానికి"

"పర్వాలేదు... ఖర్చులకు సరిపోతాయి" నేలమీద పడ్డ సిగరెట్టు పీకలను చూస్తూ అన్నాడు శివ.

" లేదు సార్ ... అవి ఎవరివో.... మేం తాగ సార్" కోరస్ పాడారు ముగ్గురూ.

" శీను ఎప్పుడైనా బిర్యాని తినాలంటే... నీకు వచ్చే డబ్బులు సరిపోతాయా" "సరిపోతాయి అన్నా.. లేకుంటే అమ్మ ఇస్తుంది". ఎందుకు ఇలా అడుగుతున్నాడు అనుకుంటూ సమాధానం చెప్పాడు శీను.

 "అంతేలే... కన్నాక తప్పుతుందా.... అయినా,  నువ్వు కూడా మీ అమ్మకు బిర్యాని తెచ్చి పెట్టుంటావు కదా....  కనీసం ఆమె ఆరోగ్యం బాగోలేక పోతే హాస్పిటల్ కి తీసుకెళ్ళి ఉంటావు లే..."

 'ఆరోగ్యం బాగాలేదు... ఆస్పత్రికి తీసుకెళ్లామని' అమ్మ తన చేయిబట్టి బతిమాలితే.. విసిరి కొట్టి, బయటకు బలాదూర్ తిరగడానికి వెళ్ళిన సీను.. శీను  కళ్ళ ముందు కనబడింది. 

"అది సరే కానీ శీను... నీకు ఎంత వయస్సు?"

 "పదహారో..పదిహేడో ఉంటాయన్న" "ఇంకేం ...మూడు నాలుగు ఏళ్లకు నీకు పెళ్ళవుతుంది. నీ భార్యకు అయితే పూలు దండిగానే ఇస్తావనుకో... నీ వృత్తే అది కదా! పుట్టబోయే పిల్లలకి చాక్లెట్ కొనాలంటే ...మీ అమ్మే డబ్బు ఇవ్వాలి ఏమో శీను" రచ్చబండ ను ఆసరాగా చేసుకుని, తలవంచుకుని నిల్చొని ఉన్నాడు శీను. శంకర్  చుట్టుపక్కల పరికించాడు. 

"శీను... ఎదురింటికి తాళం వేసుందీ?"

" ఆ మొగుడు పెళ్ళాలు, పనికి వెళ్తారన్న" దూరంగా మరో ఇల్లు చూపిస్తూ అడిగాడు శంకర్..."మరి ఆ ఇంటి వాళ్ళు?"

"ఆడు చెక్క పనికి వెళ్తాడన్న..." 

 పెద్దగా నవ్వాడు శంకర్.

" అయితే పనిలేనిది.. నువ్వు, నీ స్నేహితులే అన్నమాట... సారీ.. సారీ మీరూ పని చేస్తారు కదా మర్చిపోయాను. అవునూ.. మీ అమ్మా నాన్న నిన్ను పోషిస్తున్నారు.. నీకు వచ్చే భార్య.. ఆ తర్వాత బిడ్డను కూడా పోషిస్తారు అనుకుందాం.. వాళ్ళు ఛస్తే ఎలాగ శీను!? ఏం పర్వాలేదు.. చుట్టుపక్కల వాళ్ళు దయదలచి ఒకటో రెండో దండలు వేస్తారు. అవి అమ్ముకోవచ్చు." 

కాళ్లల్లో నిస్సత్తువ భరించలేక, అక్కడే కూలబడ్డాడు శీను. అతడి స్నేహితులు ఇద్దరూ పక్క చూపులు చూస్తున్నారు. అంతవరకు తమాషా చూస్తున్న శివ గద్దిస్తూ అడిగాడు" శవాల మీద పూలు అమ్ముతార్రా...అపార్ట్మెంట్ వాళ్లకు చెప్తే ఏమవుతుంది తెలుసా?"

 శివ కాళ్లు పట్టుకున్నాడు శీను." వద్దు సర్

... వద్దు సార్.. చంపేస్తారు. నేనింక ఇలాంటి  పనులు చేయను సార్. ఏదైనా పని చూసుకుంటా సార్" బతిమిలాడు శీను. మిగతా ఇద్దరి వైపు తర్జని చూపిస్తూ బెదిరించాడు శివ," రేపు ఉదయాన్నే స్టేషన్ కి రండి.. మీ మోహాలు అక్కడ అందరికీ చూపిస్తా. ఇకమీదట ఏవైనా వెధవ వేషాలు వేస్తే.. ఇక భూమ్మీద తిరగరు."

 శీను ని చూస్తే జాలేసింది  శంకర్ కు. ఈ మాత్రం డోసు చాలనిపించిందతనికి. శీను భుజం మీద చేయి వేసి పైకి లేవదీసాడు. "శీను ఒంట్లో శక్తి ఉన్నవాడివి.. ఇలాంటి నీచమైన పనులు ఎందుకు చేస్తున్నావు? కష్టపడి పని చేయి ..సంపాదించు.. నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. నీకు ఏ పని కావాలంటే, అది నువ్వు నేర్చుకునే లాగా చూస్తా. అమ్మానాన్నలను బాధ పెట్టకు" అంటూ అనునయంగా మాట్లాడసాగాడు శంకర్.

"లేదన్నా.. ఇంక ఎప్పుడూ ఇలాంటి తప్పుడు పనులు చేయను. నాకు కొంచెం కరెంట్ పని తెలుసు. నేర్చుకుంటా" అన్నాడు శీను.. కళ్ళనుండి నీరు కారుతుండగా.

"మంచిది శీను...నాకు ఒక ఎలక్ట్రీషియన్ తెలుసు. అతడి దగ్గర నిన్ను పనికి కుదిరిస్తాను" అన్నాడు శంకర్.

" మీరింక వెధవ పనులు చేయాలన్నా చేయలేరు. తోలుతీస్తా ఒకడొకడికి"  బెదిరింపుగా అన్నాడు శివ. చేతులు కట్టుకుని ముగ్గురూ బుద్ధిగా తలలూపారు. శరీరం మీద ఇంకా దెబ్బ పడనందుకు  ఒక పక్క ఆశ్చర్యంగానూ, మరో పక్క సంతోషంగానూ ఉంది వాళ్లకు.


తన ప్రయత్నం ఫలిస్తుందన్న నమ్మకం కలగడంతో, తేలిక పడ్డ హృదయంతో, శివతో సహా అక్కడి నుంచి బయలుదేరాడు శంకర్.

8 కామెంట్‌లు:

  1. మీ కథ చదవగానే ఒళ్ళుగగుర్పొడిచింది. ఇలా కూడా జరుగుతాయా అని. విషయం తెలిసినా సంయమనం పాటించి వాళ్ళకి తగురీతిన శంకర్ బుద్ది చెప్పడం బాగుంది. అద్భుతమైన కథ అందించిన మీకు ధన్యవాదాలు sir

    రిప్లయితొలగించండి
  2. శవం మీద పూలన్నీ కూడా ఇలా చేసి అమ్ముతారు ఏమో అన్న కొత్త ఆలోచన వస్తుంది ఇప్పుడే బావుంది కధ

    రిప్లయితొలగించండి
  3. మనం దేవుడికి పెడుతున్న పువ్వులు అవి కావు కదా అనిపించిందండి చదువుతుంటే, నిజమే ఇలా జరిగే ఛాన్స్ ఉంది అనిపిస్తోంది. ఆలోచింపచేసింది సర్ మీ రచన.. కొట్టి, తిట్టి కాకుండా వాళ్ళకు చెప్పిన విధానం కూడా బావుంది. చాలా బావుంది సర్.

    రిప్లయితొలగించండి
  4. ఎన్నో అద్భుతమైన కథలను అందించిన శ్రీ ఈతకోట సుబ్బారావు గారి కలం నుండి జాలువారిన మరో అద్భుతమైన కథ.
    ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగిస్తూ
    సమస్య కు చక్కటి పరిష్కారం చూపించారు 👌👌👌
    వారి కలం నుండి మరెన్నో సందేశాత్మక కథలు వెలువరించాలని కోరుకుంటున్నాం.

    రిప్లయితొలగించండి
  5. కథ, కథనం బావుంది.
    ఇటు భార్య మనస్సు గాయపడకుండా, ఆమె మనోభావాలు పరిరక్షిస్తూ, పసి పిల్లలు తమతప్పు తెలుసుకునేలా కథ నడిపించారు.
    అభినందనలు సుబ్బారావు గారు 👏🏻👏🏻💐🙏🏻
    T. T. Nageswara Rao, USA.

    రిప్లయితొలగించండి
  6. ఈతకోట సుబ్బారావు
    గారు రాసిన కధ చాలా బాగుంది .ముఖ్యంగా కధనం ,శైలి చాలా బాగున్నాయి.ముగింపు చాలా బాగుంది.ఇటువంటి కధలు సుబ్బారావు గారి ప్రత్యేకత.అతని కలం నుంచి మరిన్ని కధలు రవాలనీ ఆశిస్తూ
    గన్నవరపు నరసింహ మూర్తి,విశాఖపట్నం

    రిప్లయితొలగించండి
  7. కథలో సమస్యకు పరిష్కారం చక్కగా చూపించారు సార్

    రిప్లయితొలగించండి
  8. శవాల మీద పేలాలు ఏరుకుని తినే బాపతు’ అనేది విన్నాం కానీ కథలో శవాల మీది పూలదండలను మరల పూలుగా మార్చి అమ్ముకోవడం కొత్త విషయం. జరగకూడదని ఏం లేదు !? అయితే కథలో అలా చేస్తున్న పసి వారిని శంకర్ సంస్కరించిన తీరు మాత్రం అద్భుతం.
    రచయిత గారికి అభినందనలు.

    రిప్లయితొలగించండి