తలరాత

తలరాత

జీ. స్రవంతి
ఊరు : ఔరంగాబాద్,
మండలం : హవేలీ ఘనపూర్,
జిల్లా : మెదక్,
సెల్ : 9397304268


            అనగనగా ఇందుపురం అనే గ్రామంలో విశ్వనాథ్ అనే ఒక జమీందారు ఉండేవాడు. తన తాతల కాలం నుండి వచ్చిన సంపాదనే గాక తాను కూడా చాలానే ఆస్తిని సంపాదించాడు. డబ్బు ఉందనే గర్వం తో ఉండేవాడు. 
            ఒకరోజు విశ్వనాథ్ తన పనివాడైన సీతయ్యని పిలుస్తాడు. బయట ఏంట్రా? గొడవ అయిన నాతో ఏంటి పని' అని అన్నాడు. అప్పుడు సీతయ్య 'అయ్యా! మీ తమ్ముడు గారు తన గుర్రపు బండి మీద వస్తుండగా దారిలో పిల్లల్ని గుద్దారయ్య. ఆ పిల్లల్లో ఒక పిల్లాడికి బాగా గాయాలయ్యాయి. వాన్నీ పక్కనే ఉన్న ఆసుత్రికి తరలించారు.' అని అన్నాడు.
             అప్పుడు విశ్వనాథ్ ఇప్పుడు ఆ పిల్లాడికి ఎలా ఉందంటా?' అని అడిగాడు. 'అయ్య! వాడికి కాలు విరిగిందంటనయ్యా! మీ తమ్ముడీ గారి మీద రాజు గారికి ఫిర్యాదు చేస్తాం అంటునారయ్య. అలా కాకముందే రాజుగారి కంటే ముందు మా అయ్యగారి దగ్గరకు వెళ్దామని తిసుకవచ్చానయ్య.' అని చెప్తాడు సీతయ్య.
            అప్పుడు విశ్వనాథ్ 'మంచి పని చేసావ్ ఆ పిల్లవాడి తండ్రిని ఒకడినే లోపలికి రమ్మను నేను మాట్లాడతాను. ఎంతో కొంత డబ్బు వాడి మొఖాన కొడతాను. ముందు వెళ్లి వాని పిలుచుకురా.' అనీ విశ్వనాథ్ అన్నాడు. అలా సీతయ్య బయటకు వచ్చి 'ఆగండాగండి మీరంతా ఓ పక్కకుండండి. ఆ పిల్లవాడి తండ్రి నువ్వేనా? ఏమయ్యా నిన్ను ఒకసారి మా అయ్యగారు పిలుస్తున్నారు లోపలికి రా నీతో మాట్లాడుతాడరట.' అని అనగానే. 'నేను లోపలికి రావడం దేనికయ్య ఆయన్నే బయటకు రమ్మనండి లేదా వాళ్ళ తమ్ముని మాకు అప్పగించండి మేం చూసుకుంటాం.' అని అన్నారు. 'అలా ఎందుకు ఆవేశపడుతారు? ఒకసారి మాట్లాడితే పోయేదేముంది. ఆయన ఏం చెప్తారో విని అది నీకు నచ్చక పోతే, ఆ తరువాత నీ ఇష్టం వచ్చింది చేస్కో కాదని ఎవరన్నారు?' అని సీతయ్య అలా ఆ పిల్లాడి తండ్రి ఐన రమేష్ ను తీసుకొని లోపలికెళ్తాడు. 
           అప్పుడు విశ్వనాథ్ 'నువ్వా! రమేష్ నేను ఇంకెవరో అనుకున్నాను. ఎలా ఉంది ఇప్పుడు మీ అబ్బాయికి?' అని అన్నాడు. అప్పుడు రమేష్ 'ఎలా ఉండటం ఏంటయ్యా? కాలు విరిగింది. అయ్యా ! ఈసారి మీ తమ్ముడిని వదిలేదే లేదు. రాజు గారి దగ్గర ఫిర్యాదు చేయాల్సిందే.' అని అన్నాడు. అప్పుడు విశ్వనాథ్ “నేను నా సొంత డబ్బులతో నీ కొడుకు కాలు బాగు చేయిస్తాను పైగా నీకు 1000 వరహాలు కూడా ఇస్తాను.” అని ఆశ చూపించాడు. అప్పుడు రమేష్ “ ఇప్పుడు కాలు విరిగిందని వెల కట్టారు. రేపు ప్రాణాలకు కూడా వెల కడతారా?” అని అన్నాడు. అప్పుడు విశ్వనాథ్ బలవంతంగా ఒప్పించి డబ్బిచ్చి అక్కడ్నుంచి పంపిస్తాడు. 
          తరవాత విశ్వనాథ్ నవ్వుతూ 'చూసావా? సీతయ్య. ఎవ్వరైనా డబ్బులకు దాసోహం అవ్వాల్సిందే! ఏమంటావ్ ?' అని అన్నాడు. అప్పుడు సీతయ్య 'అయ్యా అన్నీ డబ్బులతో కొనుక్కోవచ్చనేది మీ బ్రమ. కొన్ని డబ్బులతో కొనలేనివి కూడా ఉంటాయి.' అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంతలో విశ్వనాథ్ భార్యా విమల అక్కడికి 'వచ్చి ఏవండీ! నాలుగు రోజుల్లో మా చెల్లి పెళ్లి రాబోతుంది. ఒకసారి నగల దుకాణనికి వెళ్లి మంచి హారం తీసుకురండి.' అని అన్నది. 'సరే నా మిత్రుడు పట్నంలో ఉన్నాడు వాడి దగ్గర నా హోదా స్థాయిలో మంచి హరం తీసుకు వస్తాను.' అని విశ్వనాథ్ అంటాడు. 
          అలా విశ్వనాథ్ సీతయ్య ను వెంట తీసుకోని పట్నం బయలుదేరుతారు. సీతయ్య విశ్వనాథ్ తో 'అయ్యా! ఇక్కడ సదానందుడూ అనే ఒక ఋషి ఉన్నాడంటండీ హిమాలయాలలో తప్పసు చేసి వచ్చాడంట ఆయన ఈ ఒక్క రోజు మాత్రమే ఉంటాడంటా రేపు మళ్ళీ హిమాలయాలకు తిరిగి వెళ్ళిపోతాడంటా ఒకసారి వారు ఉంటున్న ఆశ్రమానికి వెళ్ళివద్దమా?' అని అన్నాడు. అప్పుడు విశ్వనాథ్ 'అలాగే దాందేముంది వెళ్దాం పదా' అని అని అలా ఇద్దరు కలసి ఆ ఋషి ఉంటున్న ఆశ్రమానికి వెళ్ళారు.
           గురువుగారికి నమస్కారాలు అనీ ఇద్దరు కలసి అంటారు. అప్పుడు ఋషి 'ఏదైనా సమస్యల్లో ఉన్నారా?' అని అడిగాడు. అప్పుడు విశ్వనాథ్ 'మాకు సమస్యలేముంటాయ్ మీ ఆశ్రమం చాలా చిన్నదిగా ఉంది. కావాలంటే చెప్పండి ఈ పూరి గుడిసె పడగొట్టి పెద్ద భవనం నిర్మిస్తే మీరు మీ శిష్యులు సుఖంగా ఉండవచ్చు.' అని అన్నాడు. అప్పుడు ఋషి 'మాకు కావాల్సింది ఆ దేవుడే చూసుకుంటాడు.' అని అన్నాడు ఆ ఋషి. 
             అంతలో అక్కడికి ఒక శిష్యుడు వచ్చి 'అయ్యా! ఈ గ్రామ పెద్ద కుమారుడు చనిపోయాడంటా మన ప్రయాణం ఈ రెండు రోజులు వాయిదా వేయాల్సి ఉంటుదేమో అప్పుడు ఋషి ఆరోగ్యం బాగా క్షీణించిందేమో అతని ఆయువు ఈరోజుతో చెల్లినది. జననమరణాలకూ ఎవ్వరూ బాధ్యులు కారు ఆయువు తీరిన తర్వాత ఎవ్వరైన వెళ్లాల్సిందే. మన ప్రయాణం రేపు యదవిధంగానే ఉంటుంది.' అని అన్నాడు. 
           అప్పుడు విశ్వనాథ్ 'ఆరోగ్యం క్షణించిందంటున్నారు. సరైన వైద్యునికి చూయించారు గ్రామ పెద్ద అంటున్నారు. కుమారుని కోసం ఆ మాత్రం డబ్బు ఖర్చు పెట్టీ వైద్యం చేయించలేకపోయాడెంటి?' అని అన్నాడు. అప్పుడు ఋషి 'ఎంత డబ్బు ఖర్చు పెట్టిన చావురోజు వచ్చే సమయానికి ఎవరు తప్పించుకోలేరు కర్మ ప్రకారం అన్ని అలా జరగాల్సిందే.' అని అన్నాడు. అప్పుడు విశ్వనాథ్ 'కర్మ లేదు గిర్మ లేదు సరైన వైద్యం ఉంటే తప్పకుండా బ్రతికేవాడేమో లేకపోతే చిన్న వయసులోనే చావు రావడం ఏంటి?' అని అన్నాడు. అప్పుడు ఋషి 'అలా తప్పుగా మాట్లాడకండి చావు ఎవ్వరికైనా రావడం సహజం చావుకి డబ్బుకి ఎటువంటి సంబంధం లేదు.' అని అన్నాడు.
           అప్పుడు విశ్వనాథ్ 'అయితే నా చావు ఏ రోజు వస్తుందో మీరు చెప్పగలరా?' అని అడిగాడు. అప్పుడు ఋషి 'ఇప్పుడు ఈ వాదన అనవసరం నాయన మీరు ఈ అశ్రమాన్ని చూడటానికి వచ్చిన అతిధి.' అని అన్నాడు. అప్పుడు విశ్వనాథ్ 'ఐతే మీరు హిమాలయాల నుండి వచ్చినట్లు లేరు ఇక్కడ ప్రజలను నమ్మించడానికి వచినట్లునన్నారు.' అని ఎగతాళి చేసాడు.
        అప్పుడు ఋషి 'సరే నాయినా నువ్వు ఏమైనా అనుకో' అనీ ఋషి అంటాడు. అప్పుడు విశ్వనాథ్ 'మీరు నేను ఎంత అడిగినా చెప్పటం లేదు అంటే మీకు ఏ విషయం తెలవదన్నమాట ఊరికే గడ్డం పెంచుకొని ఉన్నారంతే.' అని అన్నాడు. అప్పుడు ఋషి 'చావు గురించి తెలిసిన రోజు నుండి మనిషి ప్రశాంతంగా జీవించలేడు. అందుకే నీకు తెలియకుండా ఉండటమే మంచిది.' అని అన్నాడు.
          అప్పుడు విశ్వనాథ్ 'ఇవన్నీ కాదులేగాని మీరు నా మరణం ఎప్పుడు వస్తుందో చెప్పండి.' ఒత్తిడి చేసాడు. అప్పుడు ఋషి 'సరే నువ్వు ఇంతగా అడుగుతున్నావ్ కాబట్టి చెప్పక తప్పట్లేదు. నేటి నుండి మూడు నెలల తరువాత సరిగ్గా ఇదే రోజు నువ్వు మరణిస్తావు.' అని అసలు విషయం చెప్పాడు. దానికి విశ్వనాథ్ నవ్వుతూ 'నేను ఇంత ఆరోగ్యంగా ఉన్నాను మూడు నెలల్లో ఎలా చస్తాను? మీరు చెప్పింది నేను నమ్మను.' అని అలా కాసేపు వాదించి విశ్వనాథ్ అక్కడ్నుంచి ఇంటికి వెళతాడు.
       జరిగిందంతా తన భార్య విమలకు చెప్తాడు. అప్పుడు విమల 'ఏమిటండీ మీరు చెప్తున్నది? మూడు నెలల్లో చనిపోవడం ఏంటి? పైగా అంత పెద్ద ఋషి చెప్పాడంటున్నారు. నాకెందుకో భయంగా ఉందండి. పదండి వెళ్లి దీనికి పరిష్కారం ఉందేమోనని అడుగుదాము.' అని భయం భయంగా అన్నది. అప్పుడు విశ్వనాథ్ 'ఇంకా ఆ ఋషి నీ కలవడానికి కుదరదులే ఆయన రేపు ఉదయమే వెళ్తామన్నారు. అయినా వాటన్నిటిమీదా నాకు నమ్మకం లేదు. అయినా ఇంత చిన్న వయసులోనే ఎలా చనిపోతాను. అప్పుడు విమల “ మిరింకేం మాట్లాడకండి” రేపు ఉదయమే మన జ్యోతిష్కులు వారి దగ్గరకి వెళ్దాం ఆయన దీనికి పరిష్కారం ఉందేమోనని తెలుసుకుందాం. అయినా వెళ్లిన పని చేసుకొని రాకుండా మీరెందుకండి ఆశ్రమానికి వెళ్ళారు?' అని అడిగింది. అప్పుడు విశ్వనాథ్ 'నేనెక్కడ వెళ్ళాను ఆ సీతయ్య ఋషి దగ్గరకు వెళ్లితే అంతా మంచే జరుగుతుందని చెప్తే వెళ్ళాను.' అని అన్నాడు.
           మరుసటి రోజు ఉదయం అక్కడ ఒక జ్యోతిష్కుడు దగ్గరకు ఇద్దరు వెళ్ళారు జరిగింది అంతా జ్యోతిష్కుడికి చెప్పారు. విమల ఇలా అంటుంది 'స్వామి మీరే మాకు ఏదైనా పరిష్కారం చూపించాలి.' అని అన్నది. అప్పుడు జ్యోతిష్కుడు 'అంతటి పెద్ద తపస్సు చేసిన ఋషి చెప్పిన తరువాత ఇంకా అసత్యం ఎలా అవుతుంది? తప్పకుండా ఆ ఋషి చెప్పింది జరుగుతుంది అప్పుడు విశ్వనాథ్ ఏమిటండీ మీరంటున్నది? అంటే నేను విన్నది నిజమేనంటారా? నాకు చావు తప్పదంటారా? అని ప్రశ్నించాడు. అప్పుడు జ్యోతిష్కుడు 'మీ జాతకం చూసిన తరవాత నాకు కూడా ఆయన చెప్పింది జరుగుతుందనిపిస్తుంది ఈ మూడు నెలల్లో ఎన్ని పుణ్యకార్యాలు చేయదలుచుకుంటే అన్ని చేయండి అదే మికే మంచిది.' అని చెప్పాడు. అప్పుడు విశ్వనాథ్ 'స్వామి అలా అనకండి దీనికి పరిష్కారం తప్పకుండా ఉండే ఉంటుంది. మీరే ఏదైనా చెప్పండి. మీకు ఎంత డబ్బు కావాలంటే అంతా ఇస్తాను. మీరు మాత్రం ఏదైనా దారి చూపించవలసిందే' అని అలా చాలా సేపు బ్రతిమిలాడారు..తరవాత జ్యోతిష్కుడు “మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి నాకు ఒక పరిష్కారం తడుతుంది. మీ చావుని ఎవరైనా తనంతటతాను స్వీకరిస్తే ఈ గండం నుంచి మీరు బయట పడవచ్చు గుర్తు పెట్టుకోండి తాను ఇష్టపడి స్వీకరించాలి.” అని అన్నాడు. అప్పుడు విశ్వనాథ్ “అంటే ఎవరైనా ఒప్పుకొని నా చావును తాను స్వీకరిస్తే నేను బ్రతుకుతానన్నమాట అంతేనా స్వామీ.' అని ఆత్రంగా అడిగాడు. 'అవునండీ.' అని చెప్పి పంపాడు ఆ జ్యోతిష్యుడు.
           అలా... జ్యోతిష్కుడు చెప్పింది విని అక్కడ్నుంచి ఇంటికొస్తారు. తరవాత విశ్వనాథ్ ఇక వెంటనే తన చావును స్వీకరించే వారు ఎవరైనా ఉన్నారేమో తెలుసుకోవాల్సిందే అని అనుకొని తన పనివాడైన సీతయ్య ను పిలుస్తాడు సీతయ్యకు వెంటనే ఈ విషయం 'మన దగ్గరిలో ఉన్న వారికి చెప్పి వాళ్ళను ఇక్కడికి తీసుకురా ఎంత డబ్బైన పరవాలేదు వారికి నేను వెంటనే ఇచేస్తా' అనీ అన్నాడు.అప్పుడు సీతయ్య అయ్యా! ప్రాణం ఏమైనా వస్తువా? దాని మీకు ఇవ్వడానికి మీరు ఎంత డబ్బు చెల్లించినా నాకు తెలిసి ఎవ్వరూ తమ ప్రాణాలను మీకోసం వదలడానికి ఒప్పుకోరు. ఎవరికైనా చావు పలానా రోజు వస్తుందని తెలుస్తే ఎవ్వరు ప్రశాంతంగా ఉండలేరు.' అని అన్నాడు. అప్పుడు విశ్వనాథ్ 'ఏదో ఒకటి చేయరా మనకు మూడు నెలలు మాత్రమే సమయం ఉంది. ఊర్లో చాలా మంది పేదవారు ఉన్నారు కదా! వాళ్ళను అడిగి చూడు ఎవరో ఒకరు తప్పకుండా ఒప్పుకుంటారు.' అని అన్నాడు. 'సరేనయ్య నా ప్రయత్నం నేను చేస్తాను.' అని సీతయ్య వెళ్ళిపోయాడు.
            ఆ విధంగా సీతయ్య ఊర్లో ఉన్న పేదలకి ఈ విషయం చెప్పి ఒప్పిద్దామని వెళతాడు. అలా వెళుతుండగా 'చూడండి సీతయ్య గారు! మా దగ్గర డబ్బు లేకపోయినా పరవాలేదు గాని నేను లేకుండా నా కుటుంబం ఎలా గడుస్తుంది చెప్పండి? అయినా ఆ విశ్వనాథ్ గురించి ప్రాణాలు ఇవ్వటానికి ఎవ్వరు ఒప్పుకుంటారు? ఇప్పటి వరకు అతను మారలేదు. తన డబ్బుతో ఎదుటి వారి ప్రాణాలు కొనడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే అతను ఎటువంటి వాడో అర్థమవుతుంది.' అని అన్నారు. అప్పుడు సీతయ్య 'నువ్వనేది నిజమే ఎవరైనా ప్రాణాలు పోగొట్టుకోడానికి ఎందుకు సిద్ధపడతారు? అయినా నేను ఆయన దగ్గర పని చేస్తున్నాను. కాబట్టి నాకు తప్పదు ఈ విషయం ఎవరికైనా చెప్పి ఎవరైనా ఒప్పుకుంటే నాకు వచ్చి చెప్పు వారికి ఎంత డబ్బైన ఇవ్వడానికి విశ్వనాథ్ గారు సిద్దంగా ఉన్నారు.' అని అన్నాడు. 
         అలా ఒక వ్యక్తి ద్వారా సీనయ్య అనే పేద వ్యక్తి గురించి తెలుస్తుంది. 'ఏమయ్యా! నాకు పెద్ద మొత్తంలో డబ్బందితే నేను విశ్వనాథ్ గారు చెప్పినదానికి ఒప్పుకుంటాను.' అని సీనయ్య అన్నాడు. 'అదేంటి సీనయ్యా! నువ్వు నీ ప్రాణాలిస్తే మరీ నీ భార్యపిల్లలని ఎవరు చూసుకుంటారు? నీ వయసు కూడా తక్కువే నువ్వు ఈ విషయం మతుండే మాట్లాడుతున్నావా?' అని అడిగాడు. అప్పుడు సీనయ్య 'అవును ఇందులో ఎవరి ఒత్తిడి లేదు. నేను చనిపోయినా నా భార్యా పిల్లలు ఆ డబ్బుతో సుఖంగా ఉంటారు. నేను బ్రతికుండగా ఎప్పటికీ అంత డబ్బు సంపాదించలేను, నేను పోయిన తరువాతైనా నా ఇంట్లో వారు ఈ పేదరికం నుండి విముక్తి పొందుతారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను.' అని అంటాడు సీనయ్య. నేను మరణాన్ని స్వీకరించడానికి వచ్చాను కాకపోతే నాకు లక్ష వరహాలు కావాలి.' అని అన్నాడు. అప్పుడు విశ్వనాథ్ 'తప్పకుండా నీకు లక్ష వరహాలు ఇస్తాను. ఇదిగో నువ్వడిగినా లక్ష వరహాలు' అని ఇస్తాడు. అప్పుడు సీనయ్య 'నాదొక్క చిన్న కోరిక ఈ విషయం మా ఇంట్లో వాళ్ళకు తెలియకూడదు. నేను చనిపోతానని తెలిస్తే వారు తట్టుకోలేరు.' అని ప్రాధేయపడతాడు. అప్పుడు విశ్వనాథ్ 'నేను మీ ఇంట్లో వారికి చెప్పనులే! నేను మాటిస్తున్నాను.' అని అంటాడు.
            అలా సీనయ్యా డబ్బు తీసుకొని వెళ్ళిపోతాడు. అతడు వెళ్లిన తరవాత విశ్వనాథ్ నవ్వుతూ 'చూసావా సీతయ్య! డబ్బుతో ప్రాణాలను కొనలేవు అన్నావు. చూడు కేవలం లక్ష వరహాలకే తన ప్రాణాలను ఇవ్వడానికి సిద్ధపడ్డాడు డబ్బుంటే కొనలేనిది ఏమీ ఉండదు.' అని అన్నాడు. అప్పుడు సీతయ్య 'అయ్యా! వారి పేదరికం వల్ల ఆ సీనయ్యా ఒప్పుకున్నాడు. తను లేకపోయిన తన ఇంట్లో వారు బాగుండాలని అలా చేస్తున్నాడు. ఏదైనా ఎదుటి వారి ప్రాణాలను కూడా కొనచ్చని ఇప్పుడే తెలిసింది.' అని అన్నాడు. అప్పుడు విశ్వనాథ్ 'ఈ మూడు నెలల తరువాత నేను ఆ ఋషి దగ్గరకు వెళ్ళి నేను మరణాన్ని జయించానని చెప్తాను. అలా... విశ్వనాథ్ చాలా సంతోషంగా జీవించసాగాడు. మూడు నెలలు గడిచిపోతాయి. అలా వుండగా ఒక రోజు పట్నం నుండి తిరిగి వస్తుండగా సీనయ్య ఎదురౌతాడు 'అదేంటి? సీనయ్య ఇంకా బ్రతకే ఉన్నాడు! ఇంకా మూడు నెలలు గడవలేదా? అంటే ఆ ఋషి, ఇంకా జ్యోతిష్కుడు నాకు అబద్దం చెప్పి నన్ను మోసం చేసారా? ఏది ఏమైనా ఆ సీనయ్యాను పిలిచి అడుగుతే అంతా తెలిసిపోతుంది.' అని విశ్వనాథ్ తన మనసులో అనుకుంటాడు. 
            'ఇదిగో సీనయ్యా! ఇట్రా ఏం చేస్తున్నావ్ ఇక్కడా?' అని అడుగుతాడు. అప్పుడు సీనయ్యా 'అయ్యా! ఇవాలే ఆకరి రోజు కదయ్యా కొన్ని విలువైన వస్తువులు నా పిల్లలకు భార్యకు తీసుకొని వెళుతున్నాను ఇక రేపట్నుండి ఉండను కదండీ! వాళ్ళని ఈ రోజు పూర్తిగా సంతోషంగా చూడాలనుకుంటున్నాను.' అని అంటాడు. అప్పుడు విశ్వనాథ్ 'ఏంటి ఈ రోజే ఆకరి రోజా ఐతే మూడు నెలలు గడవలేదన్నమాట. సరే! నేను ఊరిలోకి వేల్తున్నాను నాతో పాటు రా నిన్ను కుడా తీసుకెళతాను.' అని అన్నాడు. అలా సీనయ్యా బండెక్కి విశ్వనాథ్ తో 'అయ్యా! మీరిచ్చిన డబ్బుతో ఇంట్లో వాళ్లకు కావలసిన సదుపాయాలు కల్పించాను ఇక నేను చనిపోయిన వారు ఎటువంటి లోటు లేకుండా జీవిస్తారు ఇక నేను చనిపోతానన్నా భయం కూడా లేదయ్య!' అని అన్నాడు. అప్పుడు విశ్వనాథ్ 'నీ లాంటి ధైర్యవంతున్ని నేను ఇంత వరకు చూడలేదు సీనయ్య! మరనిస్తానని తెలిసి కూడా ఇంత ధైర్యంగా ఉన్నావ్?' అని అన్నాడు.
            అలా కొంత దూరం వెళ్లిన తరవాత దారిలో ఉరుములు,మెరుపులతో కూడిన పెద్ద వర్షం పడుతుంది. 'ఇదేంటి! ఇప్పుడే మేఘాలు కమ్ముకొని ఇంత పెద్ద వర్షం పడుతుంది. పైగా పెద్ద పిడుగులు పడుతున్నాయ్. కొంపదీసి వీడు చనిపోయే సమయం వచ్చినట్లుంది. వీడితో పాటు ఉంటే నాక్కూడా మరణం తప్పదు వీడిని వెంటనే దించేయాలి' అని విశ్వనాథ్ మనసులో అనుకొని 'చూడు సీనయ్యా! నాకు వేరే పని ఉంది నువ్విక్కడ దిగి ఊరిలోకి వెళ్ళిపో. నేను తరవాత వస్తాను.' అని సీనయ్యను దించేస్తాడు. 'సరేనయ్య! జాగ్రత్తగా వెళ్ళండి, వర్షం బాగా పడుతుంది.' అని అనుకుంటూ సీనయ్యా బండి దిగుతాడు. 
           అలా సీనయ్యను దారి మధ్యలో దింపేసి విశ్వనాథ్ అక్కడి నుండి ముందుకు వెళతాడు అలా కొంత దూరం వెళ్లిన తరవాత పెద్ద పిడుగు బండి మీద పడుతుంది. ఆ బండిలో ఉన్న విశ్వనాథ్ మరణిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న సీతయ్య జ్యోతిష్యం చెప్పిన పంతులుని కలవడానికి వెళతాడు. 'ఏవండీ! పంతులు గారు! మీరు చెప్పినట్టు మా అయ్యగారు కొంత డబ్బిచ్చి తన మరణాన్ని సీనయ్యా అనే వ్యక్తికి ఇచ్చేశాడు కానీ ఆ సీనయ్య బ్రతికే ఉన్నాడు కానీ మా అయ్యగారు చనిపోయారు. మీరు మా అయ్యగారిని మోసం చేసారు.' అని అంటాడు. అప్పుడు జోతిష్కుడు 'నేను ఆ రోజు ఎంతగానో చెప్పాను చివరి రోజు వస్తే ఎవ్వరైనా మరణించాల్సినదే దాని నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు. నేను ఎంత చెప్పినా వినిపించుకోలేదు. చివరికి ఏం చెప్పాలో తెలియక ఎంత డబ్బు ఇస్తే మాత్రం మరణాన్ని ఎవరు స్వీకరిస్తారు అని అలా చేప్పాను. సీనయ్య పేదరికం వల్ల ఆ మరణాన్ని స్వీకరించడానికి ఒప్పుకున్నాడు. అయినా ఆయన తలరాతలో ఆయన ఆయుష్షు అంతే ఉంది డబ్బిచ్చి వస్తువులను మార్చవచ్చు గాని తలరాతను ఎవ్వరు మార్చలేరు.' అనే జీవిత సత్యాన్ని చెప్పాడు ఆ జ్యోతిష్కుడు.

5 కామెంట్‌లు:

  1. చందమామ కధ ను గుర్తు చేసింది. బావుంది.

    రిప్లయితొలగించండి
  2. ఇది పాత నీతి కథ. కొత్త దనం నాకు కనిపించలేదు. అన్యధా భావించద్దు.

    రిప్లయితొలగించండి
  3. యామినీ కృష్ణమూర్తి15 జులై, 2023 6:19 PMకి

    కధ, కధనం చాలా బాగా వుంది.డబ్బిచ్చి వస్తువులను మార్చవచ్చు గాని తలరాతను ఎవ్వరు మార్చలేరు. అనే జీవిత సత్యాన్ని ఆ జ్యోతిష్కుడు పాత్రద్వారా రచయిత చాలా బాగా చెప్పారు. ఈ విషయంలో రచయిత సఫలీకృతులయ్యారు. దాదాపుగా చాలా మంది సమాజంలో జీవనాన్ని కొనసాగించటానికి పరుగులు తీస్తున్నారని అనుకుంటారు కానీ డబ్బుకోసం పరుగులు తీస్తున్నారని మాత్రం ఒప్పుకోరు. నిజానికి జీవనంకోసం పరుగులుతీసేవారైతే పక్షుల్లా, జంతువుల్లా ఆకలైనప్పుడు మాత్రమే జీవనానికి పరుగులు తియ్యాలి. కానీ మనిషి రేపటికోసం మాత్రమే కాదు తరతరాలు సుఖపడటానికి కావాల్సిన డబ్బులకోసం పరుగులు తీస్తున్నాడనే లోతైన విషయాన్ని నర్మగర్భంగా రచయిత వివరించటం జరిగింది. ఇటువంటి కధను రచించిన రచయితకు ధన్యవాదాలు. మరిన్ని సమాజహితాన్ని బోధించే కధలు మీ నుంచి రావాలని ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  4. చావును స్వీకరించే వారి కోసం అన్వేషించిన విశ్వనాథ్ కు, విధి మాత్రం ఎవరి చావు వాళ్ళే చావాలి ’ అని నిర్దేశించినట్లు అనిపించింది. అయితే తాను చనిపోయే లోపు సీనయ్య కుటుంబానికి తెలియకుండానే మేలు చేయటం విశేషం. కథ బాగుంది. రచయిత్రి గారు అభినందనీయులు.

    రిప్లయితొలగించండి