సరైన శిక్ష
**************
దొండపాటి. నాగజ్యోతి
9492164193
"ఆ..ఆ.." ధడ్!
గుద్దేశాడు వెధవ!
పక్కనున్న సందులోంచి దూసుకొచ్చిన లూనా గుద్దేసి కింద పడబోతున్న నా బైక్ ని అతి కష్టం మీద ఆపుకొని ,విసురుగా స్టాండ్ వేసి...కింద పడిపోయిన అతని వద్దకు నోటి నిండా బూతులు నింపుకొని వెళ్లి చొక్కా పట్టుకు లేపాను.
"ముసలాడా!నీ కెంత పొగరు! చుట్టుపక్కల ఊళ్ళకి పెద్దని!ఆ మాత్రం చూపు కనబడడం లేదా!ఈ వయస్సులో ఆ స్పీడ్ ఎన్టీరా!"
కాలర్ పట్టుకు పైకి లేపిన నన్ను తన వయస్సులో సగం ఉన్నా..."రా" అన్నాను అని కాబోలు కోపంగా చూడబోయి అంతలోనే తమాయించుకున్నాడు.
"తప్పయి పోయింది బాబు!మా ఇంటి దానికి బాలేదని కబురందితే నీలాంటి మారాజు దగ్గర ఈ బండి ,కాస్త పైకం అప్పు తీసుకొని ఊరికి పోతున్నాను.నాకు,నా ఇంటి దానికి ఒకరికి ఒకరం తప్ప ఎవరూ లేరు బాబు! మన్నించి పోనీయండి బాబు!" చేతులు జోడించి అడిగాడు.
చుట్టూ ఓ సారి చూసాను.అందరూ ఆసక్తిగా ,అదొరకమైన ఆత్రుత తో చూస్తున్నారు.
ఇప్పుడీ ముసలాడిని వదిలానంటే నా బండికి ఎదురొస్తానికి భయపడే ఊరోళ్ళంతా నన్ను గుద్దుకు వెళ్లిపోయినా వెళ్ళిపోతారు. జనాలకు లోకువ అస్సలు ఇవ్వకూడదు.మా లాంటి వారంటే భయం మనస్సులో మెదులుతుంటేనే...చేతులు రెండూ వాటంతట అవే నమస్తే పెడతాయి.
"నా అంతటి వాడి బండిని గుద్దడమే కాకుండా...కన్నీటి కబుర్లు చెబుతావా ముసలోడా! పగిలిన లైట్ కి నీ బాబు డబ్బులిస్తాడా! తీయ్!బయటికి ఎంతుందో! మరోసారి ఇలాంటి తప్పు చేయకుండా"! అంటూ...
"బాబ్బాబు...అది మా ఇంటి దాని వైద్యం కోసం..." అంటూ బతిమాలుతున్నా వినకుండా పై జేబులో చెయ్ పెట్టి చేతికి వచ్చినంతా తీసుకొని జేబులో పెట్టుకుంటూ చుట్టూ చూసాను.గబ గబా అప్పుడే పనులు గుర్తొచ్చినట్టు జనాలంతా తలోపక్కకీ వెళ్లి పోయారు.గర్వంగా నవ్వుకుంటూ....
ముసలాడి లూనాని ఒక పక్కకి తన్ని బండెక్కాను.
ముసలాడి ఏడుపు వీధి చివరి వరకూ వినిపిస్తూనే ఉంది.
ఈ రోజు ఇదిగో ఇలాంటి వాడి వల్లే జరిగిన ప్రమాదం గూర్చే తీర్పు చెప్పడానికి మా పక్క గ్రామం భీంపల్లి వెళుతున్నాను!
చాలా చిత్రమైన ప్రమాదం అది.చూసినోళ్లు నమ్మాలే గాని చెప్పినోన్ని నమ్మరు.ఖర్మ కాలిపోవడం అంటే ఏంటో నేను ఈ ప్రమాదంలో చూసాను.దీనికి కారణం అయినోన్ని మాములుగా శిక్షించకూడదు అని నిర్ణయించుకొని మహా కోపంగా బయలు దేరితే మధ్యలో ఈ ముసలోడు!ఈళ్ళని క్షమించ కూడదు!
ఈ చుట్టూ పక్కల ఊళ్లకు నా మాటంటే మాటే!
బండి పొగతో పాటు నా ఆలోచనలు కూడా సుడి తిరుగుతూ నేను తీర్పు తీర్చబోయే ప్రమాదం జరిగిన వైనాన్ని గుర్తుకు తెచ్చాయి!
తాగి తలకు పోసుకొని వీధులంట తిరిగే దుర్గా గాడు... ఎవడినో డబ్బులడుగుతూ వాడు బండి మీద వెళుతుంటే వాడెనక పరిగెత్తి పోతూ...అప్పుడే బడి నుండి ఇంటికి వెళుతున్న ఏడేళ్ల వాసు మీద బొక్క బోర్లా పడ్డాడు.పడడం పడడం మాములుగా పడలేదు.సిమెంటు రోడ్డు మీద... వాడి మోకాలు కింద పడ్డ వాసు తొడ ఎముక రెండు ముక్కలయ్యి...బయటికి పొడుచుకు వచ్చేసింది!
గుండెలవిసేలా పిల్లాడెట్టిన కేక విన్నాక గాని దుర్గా గాడి మత్తు దిగలేదు. ఆడికి ఊరంతా తలంటు పోయబోతే ...
వాసు తల్లి అడ్డుకొని...
"ముందు నా బిడ్డని రక్షించండయ్యా"!అని రోదించడంతో...పిల్లాడిని అందరూ కలిసి హాస్పిటల్ కి చేర్చడం...ఆపరేషన్ చేసి రాడ్లు వేయడం జరిగింది.
ఊరు ఊరంతా దిమ్మెరపోయింది ఈ సంఘటన తో.దుర్గా గాడి కుటుంబాన్ని మానసికంగా వెలేసి.... తల్లిదండ్రులు ఫిర్యాదు చేయకపోయినా....గ్రామస్థులే మా పెద్దల దృష్టికి తీసుకువచ్చి పంచాయితీ పెట్టారు.
ఈ రోజు కుర్రాడు ఆసుపత్రి నుండి ఇంటికి వస్తున్నాడు.మధ్యలో ఓసారి హాస్పిటల్ కి పోయి చూసి వచ్చాను..పిల్లాడి తల్లి గ్రామస్థులు పంచాయితీ పెట్టించినట్టు తెలిసి
"మేమూ పంచాయితీ పెట్టాలనే అనుకుంటున్నాము అండీ. తమరు దయతలచి పిల్లాడు ఇంటికి వచ్చేదాకా ఆగి ఆడికి శిక్ష ఏసేప్పుడు మేమూ ఉండేలా అవకాశం ఇవ్వండి అయ్యా." అని బతిమాలుకుంది. నాకూ కొత్త రకం హింసాత్మక తీర్పు ఇవ్వడానికి ఆలోచించుకొనే టైం ఉంటుందని సరే అన్నాను.
లేదంటే ఆ దుర్గ గాడి పని అప్పుడే ఐపోయేది!
ఆలోచనల్లోనే ఊరి గుడి వద్దకు చేరాను.నా బండికి దారిస్తూ అందరూ లేచి నిలబడి సలాం చేశారు.అందరి వంక చూసి చేయుపుతూ...మిగతా పెద్దలు కూర్చున్న చోటుకి వెళ్లి నా కుర్చీలో నేను కూర్చున్నాక అందరూ కూర్చున్నారు.!
నాకీ మర్యాదలంటే తగని మక్కువ.అన్నింటి కంటే నా తోటి మనిషి తప్పు చేసి నా ముందు నిలుచుంటే... శిక్షించే అధికారం ఏ చదువూ లేకున్నా దక్కడం మహా రంజుగా ఉంటుంది నాకు.చిన్నప్పటి నుండి ఈ స్థాయికి ఎదగాలని ఎన్నో సిగపట్లు పట్టి.... తెంపరితనం చూపి.... ఆఖరికి సాధించాను.నేను వేసే శిక్షలతో విల విలలాడే వాళ్లని చూస్తే పసందుగా ఉండేది.తోటి పెద్దలు
"తప్పు చేసినోడికి ఆడి తప్పు తెలుసుకొని దిద్దుకునేలా ఉండాలి శిక్ష అంటే.నువ్వు విధించినట్టు కఠినంగా కాదు" అని ఎంత అభ్యంతర పెట్టినా...
"ఆడు మోయలేని శిక్ష వేసినప్పుడే... చెయ్యగూడని తప్పేంటో ఆడికి తెలిసి వస్తుంది"! అని నా మాటే నెగ్గున్చుకొనే సత్తా ఉంది.
"నీలో నీ తాత హింసా గుణం పిల్లల్ని పెడుతూ పోతోందిరా...అంత మంచిది కాదు" తరచూ అంటుంది అమ్మ నాటు తుపాకీతో గూడ బాతుల్ని వేటాడే మా తాతని తలచుకుంటూ! అయినా అవేం పట్టించుకోను! వేటాడడంలో...అదీ మనుషుల్ని వేటాడడంలో ఉన్న మజా అమ్మకేం తెలుసు. ?!
పెద్దరికంతో తీర్పు ఇచ్చి ఒక మనిషి జీవితాన్ని శాసించడంలో ఉన్న కిక్కు వంటింట్లో మగ్గే అమ్మకేం తెలుసు..?!హుమ్...ఆ మాటకొస్తే ఏ ఆడ మనిషికైనా ఏం తెలుసు?!అమ్మ కాబట్టి!
నా భార్యైతే నోరు తెరిచిందా....
నా శిక్ష చాలా కఠినం గా ఉంటుంది.
అమ్మ అలా అన్న ప్రతిసారీ
వేటలో మా తాతకు వారసున్నని మీసం మెలేస్తుంటాను.!
ఈ రోజు ఈ దుర్గి గాడు నా చేతుల్లో చచ్చాడే!
"పంచాయితీ మొదలు పెట్టండి!" అన్నాను హుందాగా.
మోకాళ్ళ మీద కూర్చొని బెదురు చూపులు చూస్తున్న దుర్గా గాడి వంక చూస్తూ!
వాదనలు అన్నీ ఏక పక్షంగా ఉన్నాయి వాసు గాడి బంధువుల వైపు నుండి.దుర్గా గాడి వైపు ఆడి పెళ్ళాం బిడ్డలు తప్ప ఎవరూ నిలబడ లేదు!
"నేరం తేటతెల్లంగా ఉంది!దారెంట పోయే చిన్నోడి మీద వొళ్ళు తెలీకుండా తాగి పడ్డ ఈ దుర్గి గాడు ఆళ్ళకి కాళ్ళ ఆపరేషన్ కి లక్ష జరిమానా చెల్లించి.... కాలు బాగయ్యే దాకా ఆడి పెళ్ళాం బిడ్డలు పిల్లాడికి చాకిరీ చేసేలాగా తీర్పు ఇస్తున్నాను.ఇలాంటి తాగుబోతు ఎదవలకి బుద్ధి రావాలంటే ఇలాంటి శిక్షే ఉండాలి.ఇతర పెద్దలు కూడా నాతో ఏకీభవిస్తారు అనుకుంటున్నాను."! అని నేను మాటలు ముగించగానే ఘొల్లుమంటూ దుర్గా గాడి భార్య
"అయ్యా!మోయలేని భారమయ్యా! కనికరించండి"!అని పిల్లలతో సహా కాళ్ళ మీద పడింది.
ఇలాంటి సమయాల్లో కనికరం నా కంట్లోకి కూడా రాదు.
"నా తీర్పు కాదనే పెద్దలేవరైనా ఉంటే చెప్పు.మారుస్తాను"!అంటూ ఇతర పెద్దల వంక చూసాను.నా మాటను కాదనే ధైర్యం వీళ్ళకి ఉందా అన్నట్టు చూస్తూ...!
ఆశగా చూసిన దుర్గా గాడి పెళ్ళానికి అందరూ మౌనంగా ఉండడం చూసి మరోసారి ఘోల్లుమంది!
ఆ ఏడ్పుని చీల్చుకుంటూ....
"నా కభ్యంతరం ఉంది అయ్యా"!అని వాసు గాడి అమ్మ గొంతు వినిపించింది.
క్రూరంగా చూసాను ఆమె వైపు.పైట భుజాల చుట్టూ చుట్టుకుంటూ...తలొంచుకొని రెండడుగులు ముందుకొచ్చి నిలబడి...
"నా కభ్యంతరం ఉంది అయ్యా!"మెల్లగా అన్నా ఆ గొంతులో ఏదో స్థిరత్వం.
"నీకు అనుకూలం గా తీర్పు ఇచ్చాక నీకు అభ్యంతరం ఏంటి"! నా గొంతులో తీవ్రత.
"అదే అభ్యంతరం అయ్యా! మీకు ఎదురు చెప్పే అంత దాన్ని కాదు కాని...నష్టపోయిన ఒక బిడ్డ తల్లిగా అడుగుతున్నా అయ్యా! నా కా మాత్రం హక్కు ఉన్నదని నమ్మకంతో అడుగుతున్నా అయ్యా!
మీ తీర్పు గొప్పదే కాదనను.కానీ నాకు కావాల్సిన శిక్ష అది కాదు..."!
ఆమె ఇంకా ఏదో చెప్పబోతుంటే...
"ఆడి కాలు కూడా ఇరిసేయ మంటావా చెప్పు.ఇరిసేద్దాం!" అన్నాను కచ్చగా!
"అయ్యో అది కూడా కాదు అయ్యా"!
"మరింకేంటి! నీ మాటలకు అర్ధం."! కటువుగా అన్నాను.
" మీరు శాంతంగా ఇంటానంటే చెబుతాను అయ్యా!
ఓ సారి ఆ దుర్గి గాడి పెళ్ళాం వంక చూడండి.దానికీ,నాకూ ఒకేసారి మనువయ్యి ఈ ఊరు కోడళ్లుగా వచ్చాము.ఆ రోజు నుండీ అది ఏనాడూ సుఖ పడిన వైనం లేదు.తాగుబోతోడి పెళ్ళాంగా ఇలువా లేదు.ఇంటెడు సంసారాన్ని,ఊరోళ్ల ఈసడింపులనీ ఒక్కత్తే మోస్తూ ఎప్పుడూ ఏడుపుతోనే దాని కాపరం. పిల్లలకి గంజి నీళ్లు పోయాడానికి అదెంత కష్ట పడుతుందో ఈ కళ్ళతో చూసాను.మగోడు తిరం లేక పోతే ఏ ఆడదాని బతుకైనా ఇంతే!
ఇప్పటికే చిరిగిన చీరలో దాని జీవితాన్ని దాసుకుని బతుకుతుంది.దాన్ని కూడా చించి దాని మెడకు ఉరేయ్యలేను.నా కంటే పేదదాన్ని దోచుకొని నేను దొంగనవ్వలేను.ఆ కూడు నాకు,నా కుటుంబానికి ఇమడదు. అయితే ఈ పంచాయితీ సాచ్చిగా నేను ఆడికి వెయ్యాలనుకుంటున్న శిక్ష మాత్రం ఉంది
అది....అది ...ఆడు ఇంకెప్పుడూ తాగకూడదు.దాని బతుకుని ఇలా రోడ్డుకి ఈడ్చకూడదు.కాదు కూడదూ నాకు తాగుడే ముఖ్యం అనుకుంటే మీరేసిన శిక్షే అనుభవించమనండి.
పది మంది మధ్యా ఆడి ఒప్పందం చేసుకుంటే మాట తప్పడని ఈ పంచాయితీ దాకా దీన్ని రానిచ్చాను.
విరిగిన నా కొడుకు కాలెలాగూ ఇరిగింది.ఆడ్ని నేను బాగు చేసుకుంటాను.నాకు చేయాలనుకున్న సాయమేదో దుర్గి గాడి కుటుంబానికి చేసి ఆళ్ళని నిలబెట్టండి.ఆడు తాగుడు మానేసి దాన్ని నిలబెట్టుకుంటే సరి. లేదంటే ఊరంతా,మీరంతా ఏదంటే అది.నా కొడుకు ఇరిగిన కాలు అతుక్కునే లోపు ఆడి కుటుంబం లేచి నిలబడి నలుగురితో నడవాలి అదే మా కుటుంబం అంతా కోరుకునేది.పెద్దల మాటకు ఎదురు చెప్పి ఉంటే మన్నించాలి"!
మాటలు ముగించిన వాసుగాడి తల్లిని
వాటేసుకొని దుర్గ గాడి పెళ్ళాం కన్నీటితో అభిషేకం చేసేస్తోంది. దుర్గి గాడు వాసుగాడి కుటుంబానికి ,గ్రామస్థులకు పొర్లు దండాలు పెడుతున్నాడు.తప్పొప్పుకొని చెంపలు వేసుకుంటున్నాడు.
మొట్ట మొదటిసారిగా నా మాటను తోసిరాజని
వాసుగాడి తల్లి ఇచ్చిన తీర్పుకి నా అభిప్రాయం తో సంబంధం లేకుండా...నా అనుమతి అవసరం లేనట్టు
గ్రామస్తులంతా కొడుతున్న చప్పట్లు...నా వీపు మీద చర్నకొలల్లా తగులుతుంటే....
"నా కన్నా పేదాడిని దోచుకుని నేను దొంగనవ్వలేను " అన్న వాసుగాడి తల్లి మాటలు వచ్చేముందు ముసలాడిని దోచుకున్న నన్ను "దొంగా"అంటుంటే...
"మనిషంటే...పెద్దరికం అంటే ఏంటో తెలిసిందా"! అంటూ
అమ్మ ఆకాశమంత పరుచుకొని ప్రశ్నిస్తున్నట్టు అనిపించి
"సిగ్గు" వేసిన శిక్షకు తల పైకెత్తలేక పోయాను!
మా ప్రియమైన రచయిత్రి నాగజ్యోతి నీ కథలు చాలా బాగుంటాయి. ఎంతో అద్భుతమైన శైలి 💐👌👌👌
రిప్లయితొలగించండికథ అద్బుతం అండి. చాల బాగా వ్రాసారు
రిప్లయితొలగించండినాగజ్యోతి గారు రాసిన సరైన శిక్ష కథ చాలా హృద్యంగా ఉంది ఆమె రాసిన ఈ కథ మానవత్వాన్ని ప్రతిబింబించింది. ఇదొక మంచి సామాజిక అంశంగా నేను పరిగణిస్తున్నాను వాస్తవానికి మనుషుల్లో మానవత్వం ఇంకా చచ్చిపోలేదని తన కొడుకు కాలు కు ఆయన గాయాన్ని కూడా లెక్కచేయకుండా ఒక తాగుబోతు వ్యసనాన్ని దూరం చేసే ఆమె శిక్షాస్మృతికి నా జోహార్లు కథను ఎంతవరకు చెప్పాలో ఆ పరిధి దాటకుండా కథనం ముందుకు నడిపించిన నాగజ్యోతి గారికి నా అభినందనలు.. ముఖ్యంగా కథలో ఉన్న కంటెంట్ ఎవరికి అర్థం కాదు ముగింపు వరకూ... మనిసి అహంకారం తలదించుకునేలా చేసిన ఈ కథ మానవీయతకు అద్దం పడుతుందని నేను చెప్పగలను రచయిత్రికి నా ధన్యవాదాలు పొత్తూరి సీతారామరాజు.. కవి రచయిత
రిప్లయితొలగించండిహృదయపూర్వక ధన్యవాదాలు శ్రీ సీతారామ రాజు గారు
తొలగించండిJyo chaalaa baagundi raaa👌🏻👌🏻👌🏻👌🏻👌🏻--చైతన్య
రిప్లయితొలగించండిచాలా బాగుంది "సరైన శిక్ష" కథ
రిప్లయితొలగించండిచాలా బాగా రాశారు అభినందనలు నాగజ్యోతి గారు 👏👏👏👏🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐---లక్ష్మీ మైధిలి
దొండపాటి నాగజ్యోతి కి నా మనఃపూర్వక అభినందనలు మరియు శుభాశీస్సులు... 💐💐💐💐💐💐💐💐---ఖాసీం బీ,రచయిత్రి
రిప్లయితొలగించండిమీ కథ చదివేనండి. చాల బాగా వ్రాసారు. ఇలాగే మంచి కథలు వ్రాస్తూ ఉండండి.
రిప్లయితొలగించండిరవి కావూరు
Thankyou very much Ravi garu
రిప్లయితొలగించండిExcellent jyo.chala baaga rasavu.munduga uhinchaleni mugimpu.suprrr👏👏👏👏---తేజేశ్వరి,శ్రీకాకుళం
రిప్లయితొలగించండిచక్కని సందేశాత్మక కథ. చాలా ఆలోచింప చేసే కథ---రాజ రాజేశ్వరి శాఖా, కాకినాడ
రిప్లయితొలగించండిExcellent story jyothi . Chala bagundhi 👌👌. Srujana
రిప్లయితొలగించండిథాంక్యు సృజన
తొలగించండిమా ప్రియమైన రచయిత్రి నాగజ్యోతి శుభాబినందనలు. చాలా మంచి సందేశాత్మక కథ. 💐💐💐💐💐
రిప్లయితొలగించండిశ్రీవిద్య
థాంక్యు శ్రీవిద్య
తొలగించండిJyothi nee story chaala baagundhi. Congratulations and All the best in future
రిప్లయితొలగించండిథాంక్యు ఫ్రెండ్
తొలగించండి👌🏻👌🏻 story chaala bagundi Jyoti
రిప్లయితొలగించండిథాంక్యు ఫ్రెండ్
రిప్లయితొలగించండిపేదవాణ్ని దోచుకొని దొంగ అయిన పెద్ద మనిషి ఆలోచనలలో క్రూరత్వాన్ని కథ మొదట్లోనే చెప్పారు రచయిత్రి.
రిప్లయితొలగించండితను నష్ట పోయినా, తనకు అనుకూలంగా తీర్పు వచ్చినా సాటి ఆడమనిషి కష్టాన్ని తలచుకొని వారి కుటుంబం మేలుకోసం సరైన శిక్షను అర్ధించి వాసు తల్లి మానవత్వాన్ని తెలియజేసింది. మంచి కథను అందించిన నాగజ్యోతి గారు అభినందనీయులు.
కథ ను ఆసాంతం చదివి అమూల్యమైన స్పందన తెలిపిన శేఖర్ రెడ్డి సర్ మీకు హృదయపూర్వక ధన్యవాదాలు
తొలగించండి