46.మంచివారు నడుచు మార్గమ్ము నందున
ముళ్ళు పరచుచుంద్రు మూర్ఖజనులు
మూర్ఖులేగు త్రోవ పూలు జల్లు నతని
ముళ్ళ మార్గమంత పూలమయమె
47. కష్ట ఫలము తోడ కడుపునింపు కొనుము
స్వాదు జలము త్రాగి సంతసించు
ప్రాకులాడ తగదు పరుల సొమ్ము కొరకు
దుష్ట యోచనెపుడు దుర్భరమ్ము
48. పాటుపడిన సొమ్ము పాలతో సమమౌను
యాచనమున వచ్చు నదియె నీరు
రాక్షసార్జనమ్ము రక్తమనె కబీరు
కష్టఫలము మనకు తుష్టి నొసగు
49. చిక్కులేల తొలుగు చింతిల్లి నంతట
చింత వలన కొత్త చింతెగాని
బాధలన్ని తీర్చ భగవంతు డొక డుండె
చేతు నతని స్మరణ చింత వీడి
50. రేపు చేయు పనుల చేపట్టుమీనాడె
మేటి కాలమిపుడె నేటి పనికి
సృష్టి కూలు ప్రళయ నష్టంబు వాటిల్ల
ఎల్లి చేయదగిన దెపుడు చేతు?
51.చెట్టు ఆకు రాల చివురు తొడుగు రీతి
మరల మరల రాదు మనుజ జన్మ
మంచి పనుల చేత మహనీయులగు వారు
మనుజ జన్మ గాంత్రు మరల మరల
52.జప తపములు లేవు సత్యనిష్టను మించి
కల్ల మాటె పాప కారణంబు
సత్య నిష్టతోడ సంచరించు నెపుడు
దైవమతని యందు దాగియుండు
53.వర్ష బుతువు నందు వడిగ చెరువు నిండి
మండు టెండలందు ఎండిపోవు
బాధలందు పొరలు భక్తి భావమటులె
భాద్రపదపు వాన పగిది యుండు
54. కమల నాభు డతని గమనింపలేదని
అహము చేత భృగువు హరిని తన్న
పాద సేవ చేసె మాధవుండతనికి
క్షమయె భూషణంబు ఘనతకెపుడు
55. మధుర భాషణంబు మనసు కూరట గూర్చు
చంద నమ్ము వోలె చల్ల బరచు
అహము లేని మాట ఆప్త్తుల దరిజేర్చు
పలుక వలయు నట్టి పలుకు లెపుడు
56. పరుల బాధ నెరుగ పరమ పూజ్యుడనిరి
మాధ వార్చన మగు మనుజసేవ
మనుజ సేవ కన్న మరిలేదు పుణ్యమ్ము
మానవత్వమెరిగి మసల వలయు
57. తిండి వెదకు దారి తిరిపె మొక్కటె కాదు
ఉంఛ వృత్తిపైన వాంఛ ఏల?
యాచనమ్ము కన్న అంత మొందుట మేలు
చచ్చి బ్రతుకనేల? చచ్చు బ్రతుకు
58. కోర్మెలేని వాడె గుణవంతుడిలలోన
కోర్కె నదుపు చేసి కొనిన వాడె
రాజరాజు వోలె రాజిల్లు నవనిలో
కోర్మె లెపుడు జనుల క్రుంగదీయు
59. అహము ధనము విద్య యౌవనమ్ములె కాదు
శక్తి యుక్తులయిన శాశ్వతములె?
వెదుక పుణ్యమొకటె వెంట వచ్చు ఫలము
భక్తి యొకటి యొసగు పరమ పదము
60. దేహపుష్టియున్న దేవుని సేవించు
బుద్ధి బలము ఉన్న బోధ సలుపు
ధనము ఎక్కువున్న దానము చేయుము
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి