శివలీలలు 18

 గుణనిధి కధ


తెలిసికానీ, తెలియక కానీ శివారాధన చేసినట్లైతే ఆ భక్తులను ఈశ్వరుడు చల్లగా చూస్తాడు అనటానికి ఉదాహరణే గుణనిధి కధ. 

పూర్వం కాంపిల్యనగరంలో యజ్ఞదత్తుడు అనే బ్రాహ్మణుడుండేవాడు. ఆయన వేదవేదాంగవిదుడు, శాస్త్రవేత్త, పరమనిష్టాగరిష్టుడు. రాజాదరణతోపాటు ప్రజల మన్ననలు కూడా పొందాడు. సదాచారసంపన్నుడని పేరు తెచ్చుకున్నాడు. అతని భార్య సోమిదమ్మ. భర్తకు తగిన భార్య. వీరి కుమారుడే గుణనిధి.

ఒకడే కుమారుడు కావటంతో అతన్ని అల్లారు ముద్దుగా పెంచారు. పిల్లవాడికి ఏడవ ఏడు రాగానే ఉపనయన సంస్కారాలు చేశారు. విద్యాభ్యాసానికి పంపారు. కానీ అతను చదువుసంధ్యలు మాని సోమరిగా చెడు స్నేహాలకు అలవాటు పడ్డాడు. ఈ విషయం తెలిసినా ఒక్కగానొక్క కొడుకు కావటంతో తల్లి గారాబం చేసేది. దండిచేది మాత్రం కాదు. రాజుగారి కొలువు, పండితుల చర్యలతో తండ్రికి కాలం సరిపోయేది కాదు. కుమారుణ్ణి గురించి పట్టించుకునేవాడు కాదు తండ్రి. గుణనిధి క్రమంగా పెరిగి పెద్దవాడయ్యాడు. అతనితోపాటే అతని చెడు లక్షనాలు కూడా పెరిగిపోయాయి. దుర్జన సాంగత్యం, మద్యపానం, జ్యూదం వంటి వ్యసనాలు అలవడ్డాయి. రాత్రి, పగలు లేదు. ఎప్పుడో ఇంటికి వచ్చి అన్నంతిని పోయేవాడు. ఒకవేళ ఎప్పుడైనా తం్రడి కుమారుణ్ణి గురించి అడిగితే ‘వేదాధ్యయనంలో తీరిక లేకుండా వున్నాడని ’ తల్లి అబద్ధం చెప్పేది.

కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు కంటతడి పెట్టుకునేది తల్లి. చెడు తిరుగుళ్ళు మాని చదువుకోమని చెప్పేది. అతడు వినేవాడు కాదు. కానీ పుత్రప్రేమతో అతడు అడిగినంత డబ్బులు ఇచ్చిపంపేది. ఈ రకంగా తల్లికి తెలిసి కొంత, తెలియకుండా కొంత తీసుకెళ్ళి జూదమాడేవాడు గుణనిధి.

ఈ రకంగా కొంతకాలం గడిచింది. ఒకనాడు గుణనిధి తల్లిని డబ్బిమ్మని అడిగాడు. అతడు అడిగినంత ఇవ్వలేకపోయింది. ఆ కారణంగా తల్లికి తెలియకుండా లోపల పెట్టెలో పెట్టిన వజ్రపుటుంగరాన్ని తీసుకుపోయాడు గుణనిధి.

గుణనిధి ఆ ఉంగరాన్ని జూదంలో ఓడిపోయాడు. గెలిచినవాడు ఆ ఉంగరాన్ని తీసుకుని రాజవీధిలో పోతుండగా యజ్ఞదత్తుడు చూశాడు. తన ఉంగరం ఇతడి చేతికి ఎలా వచ్చింది? వెంటనే అతన్ని నిలువరించి‘‘ఈ ఉంగరం నీకెక్కడిది? ఎవరిచ్చారు? నిజం చెప్పకపోతే రాజాస్థానానికి తీసుకుపోతాను’’ అన్నాడు. ఆ మాటలకు భయపడ్డ జూదరి నిజం చెప్పేశాడు. అతడి మాటలు వినగా స్థాణువులా చలన రహితుడైపోయాడు యజ్ఞదత్తుడు. అతనికివ్వవలసిన బాకీ చెల్లించి ఆ ఉంగరాన్ని తీసుకుని ఇంటికి వచ్చాడు. (సశేషం)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి