16.మంచి రోజులన్ని మరుగున పడిపోయె
వగచి లాభమేమి వయసు చెల్ల
పంట ధాన్యమంత పక్షులెత్తుక పోవ
రైతు బాధపడెడు రీతిగాను
17.నిముస నిముసమునకు నిలకడ లే నట్టి
ప్రేమ నిజము గాదు పిచ్చి గాని
హృదయ మందు ప్రేమ యింకి పో కుండిన
పేమ యనుచు దాని పిలువనగును.
18.కంటి పాపలందు కల్పించి శయ్యను
రెప్పల తెరలోన కప్పి యుంచి
లోచనముల గదిని లోక్ష రక్షకు నేను
బంది చేసి నాను భక్తి పొరల
19.చిత్త శుద్ధి కలిగి చెలిమి చేయవలయు
ఇతర విషయములది ఎట్టులున్న
తనువు మనసు వాక్కు దానికై అర్పించు
విజ్ఞులెపుడు చెలిమి విడువ బోరు.
20. ప్రేమ మొలవ బోదు పెరటి మొక్కల వోలె
సంతలోన దొరకు సరకుకాదు
పేద ధనిక వర్ణ బేధమ్ము లెంచక
పడయు ప్రేమ శిరము పణము గాగ
21.దైవ సేవ వలన ధనధాన్యములు గూడు
గురువు సేవ వలన వరలు ముక్తి
హరుని పూజకన్న గురుని సేవయె గొప్ప
మెప్పు పొందగలుగు మేలు గలుగు
22.నిన్ను తలచ నట్టి నిముస మొక్కటి లేదు
కనికరించ నీవు కాంచ రావు
ఆత్మయందు పొంగు అనురాగమే భక్తి
అట్టి ఆత్మ నీకె అంకితమ్ము
23. నీరు చేర పడవ నీట మున్గు నటుల
సంపదెక్కువయిన కొంపమునుగు
హాని యనుచు రెండు హస్తాలతో
పార ద్రోల వలయు ప్రాజ్ఞులెపుడు
24.ఇష్టుడైన వాడు ఏ దేశమందున్న
కమ్మ వ్రాసి వాని రమ్మనందు
తనువు మనసు కనులు తానెయై నిండిన
వాని కెటుల చేర్తు? వార్త నేను
25 అగ్ని వేడినైన అనుభవించగ వచ్చు
కాచు కొనగ వచ్చు కత్తివేటు
ఒక్క రీతి ప్రేమ ఒలికింప జూచుట
కష్ట తరము సృష్టి కర్తకైన
26.సజ్జనాళి మైత్రి సకృత్తుగా అబ్బు
వీడరాదు దాని విజ్ఞులెపుడు
ముఖము నం దదృష్టపు మణి కలిగి యున్న
మంచి మైత్రి చెడిన, మరల కుదురు.
27.మనసు నిలుప లేక మాల త్రిప్పగనేల?
మాధవ చరణాల మనసు నిలిపి
ఆత్మ మాల చేయు మత్యంత భక్తితో
భక్తి కలుగు పూజ ముక్తి నొసగు
28.తొంగి చూచు చుండె తొగసూడు తూర్పున
ఉదర పోషణార్థ ముర్విమీద
ప్రాణి కోటి దిశల పరుగులిడుటె గాని
తిండిని సమకూర్చు దేవుడొకడె.
29. చేప సంతసమున జీవించు నీటిలో
రూక లందె మమత లోభికెపుడు
తల్లి పిల్లకున్న తగులాట మట్టుల
భజనయందె ప్రేమ భక్తులకును
30.కండ సార వంటి కబురు లాడును గాని
చేతలందు విసము చిందు చుండు
కబురు లమలు జరిపి కార్యమందుంచిన
విషము సుధగ మారి విజయ మొదవు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి