నవగ్రహాల పురాణం 5

 5 వ అధ్యాయం

పురాణ ప్రారంభం - 5 వరోజు

ఆ మహత్కార్యం నవగ్రహాల జననం ! బ్రహ్మ చిరునవ్వుతో అన్నాడు. 

అంతరిక్షంలోని తేజో మండలాలలో నెలకొనే నవగ్రహాలు మీ పరంపరలో - మీ పుత్రులుగా , పౌత్రులుగా సశరీరంగా , తేజోరూపాలతో జన్మిస్తారు ! సకల ప్రాణుల మీదా , ముఖ్యంగా భూలోక వాసులుగా వర్థిల్లే మానవుల మీద ఆ నవగ్రహాల ప్రభావం వుంటుంది. సూక్ష్మపరిధిలో ఆలోచనలను, స్థూల పరిధిలో ఆచరణలను నిర్దేశిస్తూ ఆ గ్రహదేవతలు నరుల జీవితాలను శాసిస్తారు. మానవుల సుఖాలకూ , కష్టాలకూ , ఆనందాలకూ , ఆవేదనలకూ గ్రహ ప్రభావాలే కారణమవుతాయి. ఆ గ్రహ దైవతలను ఆరాధించి ప్రసన్నం చేసుకోవడం ద్వారా నరులు సుఖశాంతులు పొందగలుగుతారు. మానవుల ఆరాధనలకు అవకాశం కలిగించాలన్న శ్రీహరి సంకల్పమే నవగ్రహాల తేజోరూపాల నిర్మాణానికి కారణం. 

మానసపుత్రులు చిరునవ్వు నవ్వుతూ చూస్తున్నారు.

మీ జీవన సాధనకూ , జీవరాసుల సృష్టికీ అనువైన ప్రాకృతిక సౌకర్యాలన్నీ జగన్నియామకుని సంకల్పంతో సర్వసిద్ధంగా వున్నాయి . తగిన ప్రదేశాలలో ఆశ్రమాలు ఏర్పాటుచేసుకుని విష్ణు సేవాభావనతో సత్ సంతానాన్ని ఉత్పత్తి చేయండి. 

మానసపుత్రులు సవినయంగా తలలు వంచారు. మెల్లగా తలెత్తి ఒకర్నొకరు చూసుకున్నారు. ఇప్పుడు మేం ఏంచేయాలి ?

"సోదర మానస పుత్రుల ఆలోచనలను పసిగట్టిన వసిష్ఠుడు అడిగాడు. అనువైన ప్రదేశాలలో నివాసాలు ఏర్పాటు చేసుకుని, యీ జగత్తుకే జనకుడైన శ్రీహరిని ధ్యానిస్తూ అదే ప్రధాన విధిగా గడుపుతూ వుండండి. ప్రస్తుతానికి ధ్యానమే మీ కర్తవ్యం. మీలో తలెత్తే సందేహాలకు సమాధానాలూ , తదనంతర కర్తవ్యాలూ , అన్నీ మీకు ధ్యానంలోనే లభిస్తాయి. నా సృజన ఫలంగా సకాలంలో మీకు సతులు లభిస్తారు. సతులకు పతులుగా సహజీవనం సాగిస్తూ సంతానాన్ని ఉత్పత్తి చేయండి అన్నాడు బ్రహ్మ. 

ఆజ్ఞ !అన్నారు మానసపుత్రులు.

వెళ్ళండి ! విజయోస్తు !బ్రహ్మ చెయ్యెత్తి దీవించాడు.

సనకాది మానస పుత్రులలాగా తన ఆజ్ఞను తిరస్కరించకుండా వెళ్తున్న యువ మానస పుత్రుల్ని తృప్తికరంగా చూస్తూ బ్రహ్మ చిరునవ్వు నవ్వుకున్నాడు. శ్రీ మహావిష్ణువు మాటలు ఆయన హృదయంలో ప్రతిధ్వనించాయి.

బ్రహ్మ అరమోడ్పు కళ్ళతో ధ్యానంలోకి జారుకున్నాడు. ఆయన సర్వస్వంలోనూ ఓంకారం ప్రతి ధ్వనిస్తోంది. ధ్యాననిష్ఠలో వున్న బ్రహ్మ కుడిచేతి బొటన వ్రేలి నుండి ఒక పురుషుడు - పాతికేళ్ళ వయసువాడు ఆవిర్భవించాడు. 

ఎర్రని వస్త్రాలు ధరించిన అతను బ్రహ్మవైపే చూస్తూ నిలుచున్నాడు. బ్రహ్మ ఎడమచేతి బొటనవ్రేలి నుండి ఒక స్త్రీ ఆవిర్భవించింది. నిండు యవ్వనంలో వున్న ఆ వనిత తెల్లటి చీర ధరించి వుంది. పురుషుడి సమీపంలో నిలుచున్న ఆమె కూడా బ్రహ్మ వైపే చూస్తోంది.

బ్రహ్మ తన ధ్యానం చాలించి , కళ్ళు తెరిచి ఆ ఇద్దర్నీ చిరునవ్వుతో చూశాడు. తనెవరో వాళ్ళకు వివరించాడు. పురుషుడిని చూస్తూ ఇలా అన్నాడు బ్రహ్మ. కుమారా ! నువ్వు నా మానస పుత్రుడివి. ప్రజాపతుల శ్రేణిలో నిన్ను సృష్టించాను. నీ పేరు దక్ష ప్రజాపతి...

ధన్యోస్మి , జనకా !దక్షుడు నమస్కరిస్తూ అన్నాడు.

బ్రహ్మ చూపులు యువతివైపు తిరిగాయి. కల్యాణీ ! నీ నామధేయం ప్రసూతి. 

దక్షపత్నిగా నిన్ను సృష్టించాను. 

ఆజ్ఞ  అంది ప్రసూతి దక్షుడికి దగ్గరగా జరుగుతూ. 

దక్షా! ప్రసూతి పాణిగ్రహణం చేయి ! బ్రహ్మ దక్ష ప్రజాపతిని ఆదేశించాడు.

దక్షుడు ప్రసూతి చేతిని పట్టుకున్నాడు.ఇద్దరూ సతీపతులుగా జీవిస్తూ , దాంపత్య ఫలంగా ఇబ్బడి ముబ్బడిగా సంతానాన్ని సృష్టి చేయండి ; మీ అవతార లక్ష్యాన్ని నెరవేర్చండి ! బ్రహ్మ ఆజ్ఞాపించాడు.

దక్షుడూ ప్రసూతీ శిరస్సులు వంచి నమస్కరించారు. 

బహు సంతాన ప్రాప్తిరస్తు ! బ్రహ్మ చెయ్యెత్తి దీవించాడు.

వెనుదిరిగి జంటగా వెళ్తున్న దక్ష దంపతులను క్షణంపాటు చిరునవ్వుతో చూసి , బ్రహ్మ మళ్ళీ ధ్యాన యోగంలో మునిగి పోయాడు. ఆయన చేతులు రెండూ వొడిలో వున్నాయి. ఆయన పెదవుల్ని చీల్చుకుంటూ వెలువడుతున్న ప్రణవం దశదిశలూ వ్యాపిస్తూ ఏదో దివ్యరాగంలా ధ్వనిస్తోంది.బ్రహ్మదేవుడి వొడిలో ఒక బాలుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ కళ్ళుతెరిచి , తన వొడిలో పడుకున్న పసివాడిని చిరునవ్వుతో ఆప్యాయంగా చూస్తూ వుండి పోయాడు. 

బాలకుని చిన్నారి పెదవులు తామర రేకుల్లా విచ్చుకున్నాయి.నారాయణ ! అన్నాడు బాలుడు చిన్నారి నవ్వుతో.

బ్రహ్మ పసివాణ్ని రెండు చేతుల్తో ఎత్తి తన ముందు నిలబెట్టాడు.

బాలుడు చిరునవ్వుతో ఆయననే చూస్తున్నాడు.కుమారా ! నీ పేరు నారదుడు  బ్రహ్మ మందహాసం చేశాడు.నారాయణ ! బాలనారదుడు ప్రణామం చేస్తూ అన్నాడు. బ్రహ్మ తదేక దీక్షతో - నారదకుమారుణ్ణి చూస్తూ వుండి పోయాడు. చూస్తుండగానే నారదుడు పాతికేళ్ళ వ్యక్తిగా ఎదిగి పోయాడు.

నువ్వు నా మానస పుత్రుడివి”* అన్నాడు బ్రహ్మ.

నమో నమః ! నారదుడుచేతులు జోడించాడు.

చిరంజివ ! చిరంజీవ ! బ్రహ్మ ఆశీర్వదిస్తూ అన్నాడు...

సశేషం...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి