కబీరు దోహాలు 1-15

 1. సాధు జనుల జ్ఞాన బోధనలే గాని

    కులము నెంచ నేమి ఫలము గలదు

    వాడి చూచి కొనుట పాడియౌ కత్తిని

    ఒరను చూచి కొనుట ఒప్పుకాదు


2. సాటి వారి కింత సాయమ్ము చేయక

    ఆస్తులున్న ఫలము నాస్తి సుమ్ము

    కాయలందరాని ఖర్జూర తరు వది

    నీడ నైన నీదు నిష్ఫలమ్ము

3. తావళమ్ము పట్టి ధ్యానమ్ము గావించు
    మాల ద్రిప్పు చుండు మంత్ర మనును
    మనసు సంచరించు మార్గమ్ము వేరైన
    ముక్తి పొందుటెట్లు? భక్తి లేక

4. గురువు దైవ మొకట కూడి వచ్చిరయేని
    కోరి మ్రొక్కదేను గురుని దొలుత
    హరుని గాంచు తెరవు గురువగా చూపించు
    గురువు పూజ్యుడందు పరవశించి

5.  బాధలందె నరుడు భగవంతు దలచును
    సుంత తలచ బోడు సుఖము కలుగ
    సౌఖ్యమందు గూడ స్వామిని సేవించు
    భక్త వరులకెటుల బాధ కలుగు?

6. నన్ను నమ్ముకొన్న నావారికని, నాకు
    ఆశ్రయమ్ము గోరు ఆర్హులకును
    చాలినంత తిండి సమకూర్చుమో స్వామి !
    చిక్కు బడుదునేమో? ఎక్కువయిన

7. దైవరక్ష కలుగ దరిరావు కష్టాలు
    కొట్టలేరు ఎవరు తిట్టలేరు
    వసుధ జనులు నెల్ల వైరమ్ము బూనిన
    వంత గూర్చులేరు సుంతయైన

8. నాల్గు భుజములున్న నారాయణుని గొల్చు
    పారవశ్యమంది భక్త జనము
    నే ననంత భుజుని నెమ్మది ప్రార్థింతు
    వేడ్మతో ననియె కబీరుదాసు.

9. మృగ మదమ్ము తావి మృగము తెలియ లేక
    గడ్డి వెదకు రీతి - గ్రుడ్డినైతి
    ఆత్మ యందె నీవు ఆసీనుడై యుండ
    వెదకి వెదకి నేను వెఱ్ఱినైతి

10.యత్నము ఫలియింప రత్నమ్ము బోలిన
    దైవ నామ మహిమ దాచు కొనుము
    విలువ, నాణ్యతలను వివరింప లేనట్టి
    ముల్లె విప్పచూడ మోజు పడకు

 11.మూగవాడు బెల్లము తినుటయే గాని
    తెలుపలేడు రుచిని తెలిసి యుండి
    ఆత్మ పొందు జ్ఞాన మనుభూతిలో నుండు
    మలచ వలను పడదు మాటలందు

12. తాలు తబక చెరిగి మేలి విత్తనముల
    చేట యొక్క దరికి చేర్చు చుండు
    మేలు, కీడు నరసి మేళల్టేయ బూనెడు
    సాధు జనుల కిదియె సామ్యమగును

13.క్రోధ, లోభ, కామ గుణ సమూహము శగ
    భక్తి మార్గ గతిని బడయ లేడు
    జాతి, మత, కులాల జాడ్యంబు వీడిన
    భక్తి పరు డనంగ బరగు నరుడు

14 వేడ్క తెలియు మిదియె ప్రేమ గృహంబని
    పిన్ని వంటి బంధు విల్లు కాదు
    శిరము నర్పణంబు చేయ గల్గిన నాడె
    అడుగు పెట్టునందు నాదరమున

15.పేమ లేని జీవి పీనుగుతో సాటి
    గాలి పీల్చు వదలు గాలి తిత్తి
    మమత లేని నాడు మరు భూమి దేహంబు
    మసల వలయు మనిషి మమత కలిగి.

1 కామెంట్‌: