పెళ్లి కానుక

పెళ్లి కానుక

రచన: అమరశ్రీ

రేజేటి వెంకటరమణమూర్తి,
పాతటెక్కలి, శ్రీకాకుళం జిల్లా
ఆంధ్రప్రదేశ్‌, 9440220577

మాధవ్‌ ఫోన్‌ రింగ్‌ అయింది. ‘‘ నువ్వు అర్జెంట్‌ గా సమతా హాస్పటల్‌ కి రా మాధవ్‌,” ఫోనులో చెప్పింది రాధ. 

ఏమయింది, ఎందుకా కంగారు?” అనుమానంగా అడిగాడు మాధవ్‌. “తొందరగారా చెప్తాను" చెప్పేసి ఫోన్‌ పెట్టేసింది. ఫోన్‌ జేబులోపెట్టి బైక్‌ వెనక్కు తిప్పి హాస్పిటల్‌ వైపు బయలుదేరాడు.

మాధవ్‌. ఓ ప్రైవేట్‌ పీ.జీ కళాశాలలో కంప్యూటర్‌ ఆపరేటర్‌ గా పని చేస్తున్నాడు. అదే కాలేజీలో పీ.జీ. చదువుతున్న రాధ తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు ప్రేమలో పడ్డారు. రాధకు వెనుకా ముందూ ఎవరూలేరు. ఓ అనాధ. లేడీస్‌ హాస్టల్‌ లో ఉండి చదువుకుంటోంది. వారి ప్రేమవిషయం ఆరోజు ఎలాగైనా ఇంట్లోవాళ్ళకు చెప్పి పెళ్ళికి ఒప్పించాలని కాలేజీనుండి ఇంటికి బయలుదేరి వెల్తున్న మాధవ్‌ సెల్‌ రింగ్‌ అయింది. ఇప్పుడే రాధను కలసి వచ్చేను ఇంతలో ఏమైయుంటుందబ్బా అని ఆలోచిస్తూ హాస్పిటల్‌ కి చేరాడు మాధవ్‌.

హాస్పిటల్‌ లోనికి వెళ్ళీ వెళ్ళగానే రాధ పరుగెత్తుకుంటూ వచ్చి మాధవ్‌ ను గట్టిగా పట్టుకుని ఏడ్చింది. 

‘‘ ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావ్‌ చేప్పు?” ఓదారుస్తూ అడిగాడు మాధవ్‌. 

‘‘ ఏమిచెప్పమంటావు! ఎలాచెప్పాలో తెలియడం లేదు.” అంది. 

‘‘ ఫరవాలేదు ఏమైందో చెప్పురాప్లీజ్‌’’ అడిగాడు మాధవ్‌.  

‘‘మన తొందర పాటువల్ల నేను తల్లిని కాబోతున్నాను" బాంబులాంటి వార్త చెప్పింది. ఒక్కసారిగా భూమి కంపించినట్లెంది మాధవ్‌ కి. మౌనంగా వెళ్ళి ఓ మూలనున్న బెంచ్‌ పై కూర్చున్నారు ఇద్దరు. కొద్ది సేపటికి 

‘‘ ఇప్పుడేం చేద్దాం?” అడిగాడు. 

“నువ్వే చెప్పు."అంది రాధ. 

‘‘ ఈ విషయం తెలిస్తే మీ వార్డెనమ్మ హాస్టల్‌ కి రానిస్తుందా?” అనుమానంగా అడిగాడు మాధవ్‌. 

"కొద్దిరోజులు ఎవరికీ తెలియకుండా మేనేజ్‌ చేస్తాం. కానీ తరువాత?” అడిగింది రాధ.

‘‘బయట ఎక్కడైనా వేరే రూం చూద్దాం. అందులో వుందువు గాని.” అన్నాడు మాధవ్‌.

హాస్పిటల్‌ నుండి బయటకొచ్చి బైక్‌ స్టార్ట్‌ చేసాడు. రాధను తీసుకోని హాస్టల్‌ దగ్గర దింపి మౌనంగా ఇంటికి వెళ్ళాడు.

‘‘అనుకున్నాట్టుగా ఓ రూం తీసుకుని రాధను ఉంచాడు. 

రాధకు తొమ్మిదోనెల వచ్చింది. తనకు బాగా తెలిసిన ఓ హాస్పిటల్‌ లో చేర్పించాడు. ఆపరేషన్‌ చేసి బిడ్డను తీసారు. రాధకు స్పృహ వచ్చింది. బిడ్డకోసం చూస్తున్న రాధకు మంచం పక్కనే దిగులుగా కూర్చున్న మాధవ్‌ కనిపించాడు. 

“ ఏమైంది మాధవ్‌ ?” అడిగింది రాధ. 

“సారీ రాధాబాబు పుట్టాడు కానీ వాడిని చూసుకొనే అదృష్టం మనకు లేకుండా చేసాడు ఆ దేవుడు.” అంటూ ఏడ్చాడు. 

రాధకు పరిస్తితి అర్ధం అయింది. చాలా బాధ పడింది. 

“ఏం చేస్తాం మనకా అదృష్టం లేదనుకుందాం.” బాధగా అంది రాధ.

రాధను హాస్పిటల్‌ నుండి డిశ్చార్జ్ చేసాక రూం కి తీసుకొని వచ్చాడు. రాధను చూసుకునేందుకు ఒక ఆయాను ఏర్పాటు చేసాడు. కొద్దిరోజులు గడిచాక రాధ ఆరోగ్యం సాధరణ పరిస్థితికి వచ్చింది. ఓ రోజు తన ప్రేమ విషయం ఇంట్లోవాళ్ళకు చెప్పేశాడు మాధవ్‌. పెళ్ళికి ఒప్పించాడు. రాధను తీసుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళకు పరిచయం చేసాడు. పెళ్ళికి ముహూర్తాలుకూడా పెట్టేసారు. ఓరోజు పెళ్ళి బట్టలు తీసుకొని రాధతో కలసి వస్తున్న మాధవ్‌ బైక్‌ ను ఎదురుగా వచ్చిన గోపాల్‌ కారు బలంగా డాష్ ఇచ్చింది. రక్తపు మడుగులో పడిపోయిన మాధవ్‌,రాధలను .. గోపాల్‌ హాస్పిటల్లో చేర్చించేడు.

దురదృష్ట వశాత్తు మాధవ్‌ చనిపోయాడు. రాధ ప్రమాదం నుండి బయట పడింది. మాధవ్‌ పేరెంట్స్‌ కూడా వచ్చారు. రాధకు, మాధవ్‌ పోయిన బాధ కంటే వాళ్ళ పేరెంట్స్‌ తన ముఖం పై ‘‘ ఇది కాలు పెట్టింది మా వాడ్ని తినేసింది” అన్న మాటలకు తనుకూడా చనిపోతే బాగుణ్జనిపించింది. రాధను ఒంటరిగా ఒదిలేసి మాధవ్‌ డెడ్‌ బాడీని తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళ పేరెంట్స్‌. రాధ మళ్ళి అనాధగా మిగిలిపోయింది. తన భవిష్యత్‌ ఏమిటని ఆలోచిస్తుండగా “ఎక్సూజ్‌ మీ ’’ అన్న గోపాల్‌ మాటలు వినిపించాయి. 

వస్తున్న దుఃఖాన్ని ఆపుకొని ‘‘ఇప్పుడిప్పుడే చిగుర్లు తొడుగుతున్న నాజీవితాన్ని, మోడు వారేటట్లు చేసారు. నేను మీకు ఏం అన్యాయం చేసాను” అంటూ బోరున ఏడ్చింది రాధ. 

‘‘నన్ను క్షమించండి. నేను కావాలని చేయలేదు. అనుకోకుండా జరిగింది. మీ గురించి అంతా విన్నాను. మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటాను. నావల్ల మీకు జరిగిన అన్యాయానికి నేనే మీకు న్యాయం చేయాలని అనుకుంటున్నాను. ఆలోచించి చెప్పండి. తొందరేమీ లేదు” అన్నాడు గోపాల్‌.

“పుట్టుకతోనే కన్నవారిని కోల్పోయాను. కన్న బిడ్డను పోగొట్టుకున్నాను. ప్రేమించి, పెళ్ళి చేసుకోవాలనుకున్న వ్యక్తిని దూరం చేసుకున్నాను. విధి ఆడిన నాటకం లో ఇప్పుడు మనసు చంపుకొని ఏకాకిగా బ్రతకడం కంటే గోపాల్‌ తో పెళ్ళికి ఒప్పుకోవడమే మంచిదని అనిపిస్తో౦ది.” అనుకుంది రాధ. 

గోపాల్‌ గురించి ఎంక్వయిర్‌ చేసింది. చాలమంచివాడు అని తెలిసింది. బ్యాంకులో జాబ్‌. అమ్మా, నాన్న ఉన్నా వాళ్ళు ఆ పల్లెటూరిలోనే ఉంటారు. రాధ గోపాల్‌ తో పెళ్ళికి ఒప్పుకుంది.

రాధగోపాల్‌ ల పెళ్ళి జరిగింది. ఇద్దరు టౌన్‌ లో ఓ అపార్ట్‌ మెంట్‌ లో అద్దెకు ఉంటున్నారు.

అప్పుడే మూడేళ్ళు గడిచి పోయాయి. రాధను గోపాల్‌ బాగా చూసుకోవడం వల్ల రాధ క్రమేణా మాధవ్‌ ను మర్చిపోతున్నది. ఎప్పుడైనా మాధవ్‌ గుర్తుకొస్తే తన బీరువాలో చీరల అడుగున దాచుకున్న, మాధవ్‌ రాసిన ప్రేమలేఖలలో ఏదో ఒకటి తీసి చదువుకొని తనివితీరా ఏడ్చేస్తుంది. ఓ రోజు గోపాల్‌ ఆఫీస్‌ నుండి ఏదో దిగులుగా వచ్చాడు. బ్యాగ్‌ పక్కన పెట్టి సోఫాలో కూర్చున్నాడు. ఎప్పుడు తనని అలాచూడని రాధ దగ్గరగావెళ్ళి ప్రక్కన కూర్చొని "ఏమయిందండీ, తలనొప్పిగా ఉందా? కాఫీ తేనా? ఏదైనా ప్రోబ్లమా, చెప్పండి!” అంటు అడిగింది. 

"అయాం సోర్‌ రాధా, నన్ను క్షమించు. నేనునీకు అన్యాయం చేస్తున్నాను. ఎక్స్‌ ట్రీ మ్లీ సారీ” అంటూ చిన్న పిల్లాడిలా రాధ ఒడిలో తలపెట్టి ఏడ్చేసాడు. 

“ ఏమైందండీ. ఎప్పుడూ లేనిదే , ఎందుకిలా మాట్లాడుతున్నారు , ప్లీజ్‌ ఊరుకొండి,ఏమైందో చెప్పండి’’ తల నిమురుతూ ఊరడించింది. 

‘‘ కళ్ళు తుడుచుకొంటూ లేచి కూర్చొని ఏ స్త్రీ అయినా మాతృత్వాన్ని కోరుకుంటుందికదా. నేను నీకు జీవితాన్నయితే ఇవ్వగలిగాను కానీ, మాతృత్వాన్ని ఇవ్వలేకపోతున్నాను, మన్నించు రాధా.” దుఃఖాన్ని ఆపుకొంటూ అన్నాడు గోపాల్‌.

“ మీరేమ్మాట్లాడుతున్నారో నాకర్ధం కావడం లేదు.” అంది రాధ. 

“మన పెళ్ళయి ఇన్నేళ్ళయినా మనకు పిల్లలు ఎందుకు కలుగడం లేదా అని, నా ప్రెండ్‌ ఒక డాక్టర్‌ ఉంటే, వాడిదగ్గరకువెళ్ళి టెస్ట్‌ చేయించుకున్నాను. ఈరోజే ఆ రిపోర్ట్‌ వచ్చింది. ఆ లోపం నాలోనే ఉందని తేలింది. అందుకే నన్ను క్షమించు రాధా క్షమించు.” అంటూ చేతులు పట్టాడు. 

"అవేం మాటలండీ, నాకు మీరూ, మీకు నేనూ పిల్లలం కాదా. మనకు పిల్లలు లేనంత మాత్రాన అంత బాధపడతారెందుకు! అంతగా కావాలనిపిస్తే ఏ అనాధాశ్రమం నుండయినా ఒకబాబుని తెచ్చుకొని పెంచుకుందాం.. సరేనా! ముందు ఆ కళ్ళు తుడుచుకోండి. చిన్న పిల్లాడిలా ఏడుస్తున్న మీరుండగా నాకు పిల్లలు లేరని ఎవరన్నారు?” అంటు దగ్గరకు తీసుకొని గట్టిగా వాటేసుకుంది.

‘‘ అయాం వెర్‌ లక్కీ రాధా. వెర్‌ వెర్‌ లక్కీ. నీలాంటి మంచిమనిషిని నాకు ఇల్లాలుగా ఇచ్చిన ఆదేవుడికి ఎంతగానో బుణపడిఉంటాను.” గట్టిగా వాటేసుకున్నాడు. 

“సరే, లేవండి ముందు. బాత్‌ రూంకి వెళ్ళి ఆ ముఖం కడుక్కొని రండి. కాఫీ తాగుదురుగాని.” అంది.

ఓ రోజు గోపాల్‌ రాధతో, ‘‘ఈ రోజు మనం ఒక ముఖ్యమైన పనిమీద బయటకు వెల్తున్నాం. ఎక్కడికి, ఎందుకు ఏమిటని అడక్కుండా రెడీ అవు.” అని అర్జర్‌ వేసాడు గోపాల్‌. 

“చిత్తం మహానుభావా" అంటూ బయలుదేరి గోపాల్‌ వెనుకగా వచ్చి కారు ఎక్కింది. గోపాల్‌ కారును తిన్నగా తీసుకుపోయి ఓ అనాధ ఆశ్రమం ముందు ఆపాడు. కారు దిగి, రాధ భుజంపై చెయివేస్తూ “లోనికిపదా’’ అన్నాడు.

అప్పుడర్జమైంది రాధకు అక్కడకెందుకొచ్చిందీ. 

లోనికి వెళ్ళేసరికి మేనేజర్‌ గోపాల్ని “రండి సార్‌, మీకోసమే చూస్తున్నాను" అన్నాడు. 

రాధకేమీ అర్థం కావడం లేదు. మేనేజర్‌ ఎవరినో పిలివి “నిన్న సార్‌ చూసిన ఆ అబ్బాయిని తీసుకురండి" అన్నాడు. 

ఓ నాలుగేళ్ళ అబ్బాయిని తీసుకొని వచ్చారు. " ఈ అబ్బాయి. వివరాలైతే పూర్తిగా లేవు. ఎందుకంటే నాలుగు నెలల్లో వచ్చి ఈ అబ్బాయిని తీసుకుపోతానని చెప్పి, ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళి, నాలుగేళ్ళయినా అతను రాలేదు. హుః , ఇటువంటి కేసులు మాకు మామూలే లెండి’’ అన్నారు ఆ పెద్దాయన. 

పిల్లాడిని చూడగానే రాధ మనస్సు కలుక్కుమంది. 

“మాధవ్‌ ద్వారా తనకు పుట్టిన పిల్లాడు బతికుంటే, ఆ పిల్లడిలోనే నా మాధవ్‌ ను చూసుకొని బ్రతికేసుండే దాన్ని. ఈ పెళ్ళీ ఉండేది కాదు, ఈ దత్తతా ఉండేదికాదు కదా" ఆలోచిస్తున్న రాధకు 

“అబ్బాయి నచ్చాడా?” అని గోపాల్‌ అడగ్గా

 ‘‘అం నచ్చాడు ’’ అని యధాలాపంగా చెప్పేసింది. 

ఫార్మాల్టీస్‌ ముగించుకొని అబ్బాయి ని తీసుకొని ఇంటికి వచ్చేసారు.

'అనాధాశ్రమం లో రాధ మనసులో ఏర్పడిన తుఫాను ఇంకా చల్లారలేదు. గతం పదేపదే గుర్తుకొస్తోంది. మాధవ్‌ తో గడిపిన రోజులు ఎంత మర్చిపోదామన్నా మరపు రావడం లేదు. ఇంటికొచ్చాక బాబుకి 'లక్కీ' అని పేరు పెట్టుకున్నారు. ఆరోజు రాత్రి గొపాల్‌ కీ రాధకు మధ్యలో బాబును వేసుకొని పడుకున్నా, రాధకు నిద్ర పట్టలేదు. గోపాల్‌ ఏవేవో చెప్తున్నాఅవి ఏవీ వినిపించుటలేదు రాధకు. ఎలాగో రాత్రి గడిచింది.

ఉదయాన్నే గోపాల్‌ బ్యాంక్‌ కు బయలుదేరాడు. 
రాధ మౌనంగానే తన పని ఏదో చేస్తోంది  గానీ, మనసు మనసులా లేదు.
గోపాల్‌ బ్యాంక్‌ కు వెళ్ళబోతూ, “ఆ. రాధా, లక్కీ ఇంకా నిద్ర లేవలేదా? నేను సాయంత్రం వచ్చాక మార్కెట్‌ కి వెళ్ళి వాడికి కావలసిన డ్రస్సులు బిస్కెట్స్‌ అన్నీ తెద్దాం. ఓ.కే.నా బై” అంటూ వెళ్ళిపోయాడు. 
వీధి తలుపు వేసి గదిలోనికి వచ్చి ఏడుపు అందుకుంది. 
"చాలా రోజుల తర్వాత మాధవ్‌, ఎందుకు ఇంతలా గుర్తుకొచ్చి ఏడిపిస్తున్నావు?” అని ఏడ్చి.ఏడ్చి, మాధవ్‌ రాసిన లెటర్స్‌ తిసింది. ఆ లెటర్స్‌ మద్యలో ఉన్న ఒక లెటర్‌ తీసి చూసింది. ఆ లెటర్‌ ఇంకా అతికించే ఉంది. ఆశ్చర్యంగా చూసి ఓపెన్‌ చేద్దామని చూసింది. ఆ లెటర్‌ పైన 
“ఈ లెటర్‌ మన పెళ్ళి అయిన తర్వాత నేను నీ పక్కనే ఉన్నప్పుడు. ఓపెంచేసి చదవాలి. ఈ లోగా చదివావో నామీద ఒట్టే ’’ అని రాసివుంది. 
“ఇప్పుడు భౌతికంగా మీరు నాపక్కన లేకపోయినా, నామనస్సునిండా ఉన్నారుకదా. ఓపెన్‌ చేస్తా” అనుకుంటు ఓపెన్చేసి చదివింది.

‘‘ మై స్వీట్‌ రాధా డాలీ,
ముందుగా నువ్వు నన్ను క్షమించు. నేను నీదగ్గర ఒక నిజాన్ని దాచి నిన్ను మోసం చేసాను... ఏమిటా అని అనుకుంటున్నావా? మన బిడ్డ బ్రతికే ఉన్నాడు. పిల్లాడితో పాటు నిన్ను తీసుకొని మా ఇంట్లో వాళ్లకి పరిచయం చేస్తే బాగుండదని బాబు చనిపోయాడని అబద్దం చెప్పాను. నాకు తెలిసిన ఓ అనాధాక్రమం లో పెట్టాను. ఇప్పుడు మన ఇద్దరం కలసి వెళ్ళి మన బిడ్డను తెచ్చుకుందాం. వాడు అచ్చం నీలానే ఉంటాడు. నాపోలిక కూడా వచ్చింది. ఏమిటో తెలుసా! నాలాగే వాడి ఎడం కాలి పిక్కమీద అర్ధరూపాయంత పుట్టుమచ్చ ఉంది. ఇప్పుడే వెళ్ళి మన బాబుని తెచ్చుకుందాం. ఇదే నేను నీకు ఇచ్చే పెళ్ళికానుక.

ప్రేమతో నీ...స్వీట్‌ హార్ట్‌”

ఇది కలా,నిజమో తెలియని అయోమయ స్తితి. కళ్ళునిండా నీళ్ళు. మనసుని ఎవరో పిండేసినట్టుంది రాధకు. అప్పుడె మంచం పైనుండి బాబు నిద్ర లేచి ఏడ్చాడు. వెంటనె లెటర్స్‌ బీరువాలో పెట్టి, బాబు దగ్గరకు వెళ్ళి, బాబుపైనున్న దుప్పటి పక్కకు తీసింది _ బోరిగిలా పడుకోనున్న బాబు ఎడంకాలిపై నున్న అర్ధరూపాయంత పుట్టుమచ్చ చూసింది రాధ. తన కళ్ళను తనే నమ్మలేక పోయింది... బాబును అమాంతం లేపి, గట్టిగా వాటేసుకొనీ, ముద్దుల్లో ముంచేసింది. 
“వచ్చేసావా నాన్నా, నేను నీ అమ్మను రా, అమ్మను. నీ కన్న తల్లినిరా. నిజంగా నువ్వు నా లక్కీవేరా, లక్కివే... థాంక్‌ గాడ్‌... థాంక్యూ వెరీ మచ్‌.”

రాధ ఆనందనికి అవధుల్లేవు. లక్కీ తన స్వంత కొడుకే అన్న విషయం గోపాల్‌ కి ఎప్పటికీ తేలియకుండా లక్కీని పెంచుకుంటున్నది రాధ. విధి చాలా విచిత్రమైనది కదా!

శుభం


7 కామెంట్‌లు:

  1. రాధిక ముళ్ళపూడి15 జులై, 2023 11:12 AMకి

    కధ బాగుంది. కధనం బాగుంది. రచయిత మరిన్ని మంచి రచనలు చేయాలని ఆకాంక్షిస్తూ.. రాధిక ముళ్ళపూడి, బెంగుళూర్.

    రిప్లయితొలగించండి
  2. చాలా బాగుంది నాటిక గా వ్రాయగలిగితే ఇంకా బాగుంటుంది

    రిప్లయితొలగించండి
  3. బాణావత్ వసంతయామిని15 జులై, 2023 6:32 PMకి

    ముందుగా రచయిత ఎంచుకున్న కథ, నడిపించిన కథనం, కధనంలో వున్న ట్విస్ట్ చాలా బాగుంది. అయితే కధలో కధానాయి పాత్రను స్వార్ధపరురాలిగా చూపించటం జరిగింది. ఇలా ఎందుకన్నాను అంటే మొదటిగా కధానాయికను ప్రేమించిన మాధవ్ తన ప్రేమలోని నిజాయితీని చాటుకున్నాడు. తన భార్యకి పెళ్ళికానుకగా పెళ్ళికి ముందే పుట్టిన బిడ్డని ఇవ్వాలను కున్నాడు. కానీ విధి వశాత్తూ మరణించాడు. ఈమె కూడా మాధవ్ ని ప్రేమించింది. అక్కడి వరకూ కథ బాగనే వుంది. అయితే గోపాల్ ఆమె జీవితంలోకి ప్రవేశించటంతో విధికి తలవంచి అతన్ని వివాహం చేసుకుంది.. ఇది కూడా తప్పుకాదు. ఎంతో నిజాయితీగా తన భార్యవద్ద తనకు పిల్లలు పుట్టరని ఒప్పుకొని ఏడ్చేసిన గోపాల్ కి పెళ్ళికి ముందే తనకు బిడ్డ పుట్టాడన్న విషయాన్ని చెప్పకుండా దాచిపెట్టింది. ఇంకో విషయం చివరిగా అనాధాశ్రమం నుంచి తెచ్చుకున్న బిడ్డ తన సొంత బిడ్డ అని తెలిశాక కూడా ఆ విషయాన్ని తనను ఎంతో ప్రేమించే గోపాల్ కి చెప్పకుండా దాచిపెట్టటం కధానాయిక పాత్రని దిగజార్చేసిందనిపించింది. ఒక రకంగా చెప్పాలంటే గోపాల్ ని రాధ మోసం చేసిందనే చెప్పాలి. మరో విషయం కూడా ఇక్కడ నేను ప్రస్తావించాల్సి వస్తోంది.. గోపాల్ తో కాపురం చేస్తూ చనిపోయిన తన ప్రియుడిని మనసులో పెట్టుకొన్న రాధ కాపురం చేస్తున్నట్లా లేక మానసిక వ్యభిచారం చేస్తున్నట్లా... పురుష పాత్రలను ఎంతో గొప్పగా మలిచిన రచయిత స్త్రీ పాత్రను ఎందుకు అంత చులకనగా చూశారు. దీనికి రచయిత ఏం సమాధానం చెప్తారు?

    రిప్లయితొలగించండి
  4. వలపుతో మొదలైన కధని ఒక నదిలో మలుపుల వలె అబ్బాయిని కలిపి ముగించిన తీరు చాలా బాగుంది. వచన రచనలలో... మీకు మీరే సాటి మీకు లేరవరు పోటీ

    రిప్లయితొలగించండి
  5. కథలో చాలా మలుపులు వున్నాయి. పెళ్లికి ముందే పిల్లడ్ని కనటం, అతణ్ణి పోగొట్టుకోవడం, మాధవ్ యాక్సిడెంట్లో చనిపోవటం, యాక్సిడెంట్ చేసిన గోపాలే రాధను పెళ్లి చేసుకోవటం, అతడికేమో పిల్లలు పుట్టే అవకాశం లేక పోవటం – అన్నీ మలుపులే!!!!
    అయితే ఆఖరి ట్విస్ట్ , చనిపోయిన మాధవ్ చనిపోక ముందు రాధ కోసం దాచిన పెళ్లి కానుక అతడు ఇవ్వకుండానే రాధను చేరటం ……
    ఇన్ని మలుపులతో వుండి కథనం సాఫీగా సాగటం విశేషం. రచయిత అమరశ్రీ గారు అభినందనీయులు.

    రిప్లయితొలగించండి