61.పరుల దోషమెంచి పకపక నవ్వుట
పాడి కాదు ఎంత వారికైన
తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు
తప్పులేని వాడు ధరణి లేడు
62. పరితపించు మనసు పరమాత్మ దరిచేర
దేవునెదుట నిలిచి తెలియలేదు
చిత్తమందు స్వామి చిత్తరువును నిల్ప
చేరు వగును వాని చేరు దారి
63.మండుచున్న నిప్పు మాధుర్యమేమిడు?
ఉష్ట్ర పక్షి తినుట కుత్సహించు
ప్రేమలోని ఘనత ప్రేమించు వారలు
తెలిసి నంత ఒరలు తెలియ గలరె?
64.వెండ్రు కలవి ఏమి పెద్ద పాపము చేసె
మరల మరల వాని మట్టగింత్రు
మనసు నిలుప గలుగు మార్గమ్ము కనలేరు
విషయ వాసనలను విడువలేరు.
65.మూల వేల్పు నెరిగి పూజింపవలెవాని
కొలది జనుల నెల్ల కొలువ నేల?
పాదు నింపి నపుడు ఫలము నొసగు చెట్లు
పైన నీరు చల్ల ఫలము కలదె?
66.జన్మభూమి విడచి చనుగాక నెటకైన
చావు తప్పునొక్కా? స్థలము మార్చ
పేదవాడె యయిన పెద్ద ధనికుడైన
కర్వ జీవియె కద ! గర్వమేల?
67.పరమ చపలు గూడి పనిదొంగ యొక్కడు
తీర్ధ యాత్ర కరుగ తీరుబడిగ
పుణ్య మటుల యుంచి పుట్ల పాపము మోసె
బుద్ధి ననుసరించి పుణ్యమబ్బు
68.ఆట పాటలందు ఆనందపడుచుండ
దైవ మేల యొసగు దర్శనమ్ము?
విధవ లెక్కడుంద్రు విభుడు సులభుడైన
స్వామి చేరు దారి సాధనొకటె.!
69.నిమ్న జాతి వాని నిందించ బోకుము
ఎదురు తిరుగునెపుడొ ఈర్ష్య చేత
కంటిలోన చేరి కలవర పెట్టదా?
గాలి కెగసి వచ్చి గడ్డి పరక
70.దుర్జనాళి పలుకు దుడుకు మాటల కోర్చు
సహన శక్తి యుండు సజ్జనులకె
ధరణి దున్ను చున్న ధాన్యమ్ము నొసగదా?
వసుధ జనుల కొరకు వ్యధల నోర్చి
71.అల్ప జీవి చీమ అల చక్కెరను మోయ
మత్త గజము మోయు చెత్తనెపుడు
ఆదరించు దైవ మణుకువ గలవాని
అహము శోభ గూర్చదనుట నిజము
72.హంస, బకము లుండు అవాస మొకటయ్యు
అంచ ముత్యమేని ఆరగించ
కొంగ చేప లేరి కోర్కెతో భుజియించు
పుట్టు వనుసరించి బుద్ధులుందు
73.నిప్పు రాయిలోన నిప్పు దాగిన రీతి
నువ్వు గింజలోని నూనె రీతి
అంత రాత్మయందె ఆసీనుడై యుండు
మూర్తి గాంచ లేరు మూఢ జనులు
74.ప్రేమ వర్షమందు వికసించు కలువలు
ఆరి పోక వెలుగు ఆత్మ జ్యోతి
అనవరతము పొంగు ఆనంద మెచటనో
ఆది దేవు డచట అధివసించు
75.రాతి బొమ్మలందు రాజిల్లు దైవమ్ము
భక్తులయిన వారి బాధపెట్టు
మేలి భక్తుల మది మెత్తని మన్నైన
మనసులోన ప్రతిమ మలచవచ్చు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి