మారని సమాజం

                                                            మారని సమాజం
-              భాగవతుల రమాదేవి

‘‘ ఏవండీ! మా తమ్మడు వైజాగులో ఇల్లు కట్టుకుంటున్నాడట. మరో ఆరేడు నెలల్లో పూర్తి అయిపోతుందిట. మీతో కూడా చెప్పమని చెప్పాడు. ముందుగానే మీకు చెప్తున్నాను. ఆఫీసు, పన్లు అంటూ గృహప్రవేశానికి రావటానికి వంకలు పెట్టకండి.’’

అంటూ భార్య సుమ ఒక హెచ్చరిక చేస్తూ మరీ వార్తనందించింది. మూడునెలల ముందునుండే రిజర్వేషను కోసం రోజుకి రెండుసార్లు నాకు జ్ఞాపకం చేసేది. పునాదులు తవ్విన దగ్గరనుండి తమ్ముడి ఇంటి గృహప్రవేశం ముచ్చటకి నా బుర్రతినే భార్యారత్నంగారి హడావుడికి ఏం చెయ్యాలో తోచక సంవత్సరం ముందునుండే రిజర్వేషన్లు చేయించుకునేందుకు పెర్మిషను ఇచ్చివుంటే నాలాంటి అభాగ్యులు ప్రశాంతంగా బతకవచ్చు కదా అని అనుకునేవాడ్ని.

మొత్తానికి మా బావమరిది గృహప్రవేశం నెలల్లోంచి వారాలకి, వారాల్లోంచి రోజుల్లోకి వచ్చేసరికి మా ఆవిడ హడావుడి మరీ ఎక్కువైపోయింది. నలురన్నదమ్ముల మధ్య నా భార్య ఒక్కతే అక్క చెల్లెలు కావటం వలన వాళ్ళకి ఈవిడ అంటే ఎంత గారాబమో ఈవిడకి అన్నదమ్ములంటే అంత ఆపేక్ష. నేను ఒకడ్నే బావమరిదిని కావటం వలన వాళ్ళు నలుగురు కలిసి నాకు చాలా గౌరవమర్యాదలిస్తూ వున్నా నాకుమాత్రం అప్పుడప్పుడు అది అతిగా కూడా వుందనిపిస్తుంది.

ఆవిడ కోరిక ప్రకారం మూడు నెలల ముందుగానే రిజర్వేషను చేయించుకున్నాం కాబట్టి ప్రయాణం సుఖంగా చేసి వైజాగు చేరుకున్నాం. రాజుని చూసిన కంటితో మొగుణ్ణి చూస్తే ఏదో చెయ్యాలని బుద్ధి పుట్టినట్టు, మా ఆవిడకి మాత్రం విశాలంగా కట్టుకున్న తమ్ముడి ఇంటిని చూసి మూడు బెడ్ రూముల మాప్లాటు కంటికి కన్పించలేదు. అప్పుడు వున్న జాగాలో ఇల్లు కడతానంటే, మనిద్దరం ఉద్యోగాలు చేస్తున్నవాళ్ళం, బయటికి పోతే ఎవడేనా దూరి ఇల్లు గుల్ల చేసి పోతాడని భయపెట్టింది. ఊరు మధ్యలో ఒక ఫ్లాటు కొనుక్కొని డబ్బుపడేస్తే ఇంటి మెయిన్టైనన్సు కూడా మనం చూసుకోనఖ్ఖర్లేదని నాకు సలహా ఇచ్చి ప్లాటు కొనిపించుకొని ఈ రోజు తమ్ముడింట్లో ప్లేటు ఫిరాయించి మాట్లాడుతుంటే కోపం వచ్చినా, ఏదో తమ్ముడింటికి వచ్చి మూడు రోజులుండే ఆవిడతో గొడవెందుకు(వాదన) అని ఊరుకున్నాను.

వేసవికాలం అందులో విశాఖపట్నం చెమటతో, జిడ్డుతో విసుగ్గా వుంది.  మా ఆవిడ చేసిన పని లేకపోయినా బంధుమిత్రుల్ని పలకరించుకుంటూ బిజీగా తిరుగుతుంది. హోమం చేస్తున్న పొగంతా మామీదే వున్నట్టనిపించి పక్క గదిలో ఫేను క్రింద కూర్చుందామని లేవబోయేను. తను ఎక్కడున్నా నా మీద ఒక కన్నుంచే మా ఆవిడ వెంటనే నా దగ్గరికి వచ్చి

‘‘అటు ఎక్కడికి?’’ అని నిలదీసింది.

‘‘ ఇక్కడ వేడిగా వుంది సుమ. పక్క గదిలో కూలరు దగ్గర కూర్చుందామని వెల్తున్నాను’’. మెల్లగి గొణిగేను నేను.

‘‘ అదేంటి, ఇంటికి అల్లుడిగా దగ్గరుండి అన్నీ చేయించాలి గానీ దూరం చుట్టంలా ఏమీ పట్టనట్టు ఏదో మూల కూర్చోటమేంటి? ఎవరైనా చూస్తే మా అన్నలు మిమ్మల్ని పట్టించుకకుండా మర్యాద చెయ్యనట్లే. అయినా నాకు తెలీక అడుగుతాను, పదిరోజుల క్రితమేగా ఇంతకన్నా అన్యాయమైన ఊర్లో మీ అక్క కూతురు పెళ్ళైనప్పుడు ఫేనుకింద కూడా కూర్చోటానికి టైములేక పనులన్నీ చేసింది. చక్కగా కుర్చీ ముందు వేసుకొని అల్లుడు హోదాలో కూర్చోండి.’’ సలహా ఇస్తున్నట్లుగా ఆర్డరు వేసింది మా ఆవిడ.

అసలు తను మామూలుగా మాట్లాడినా నాకు సాధిస్తున్నట్లే అనిపిస్తుంది. అది బహుశా ఆవిడ మాట్లాడటంలో గొప్పతనమేమో. అల్లుడు హోదా అంటే హాయిగా కూలరు కింద కూర్చోని, చల్లగా కూలు డ్రింక్సు తాగుతూ కూర్చోవాలిగానీ, ఇలా కళ్ళుమండుతూ పొగ మధ్యలో కూర్చోటమేంటో నాకర్ధంకాలేదు.

ఏది ఏమైనా మా అక్క కూతురు పెళ్ళిలో బాగా పనిచేసినా, ప్రస్తుతం నన్ను మాత్రం దర్జాగా కూర్చోమని చెప్పినందుకు సంతోషించి అక్కడే కొంచెం దూరంలో కూర్చుంటానని చెప్పి ఆవిడ్ని ఒప్పించి కాస్త దూరంలో కూర్చొని అక్కడ హడావుడినంతా చూస్తూ కూర్చున్నాను. ఎవరెవరో నాకు తెలిసినవారు, తెలియనివారు కూడా నన్ను పలకరించి వెల్తున్నారు. పెళ్ళిళ్ళకి ఓపిక పడి ప్రయాణాలు చేసి రావటం తప్పని పని కానీ, ఇలా గృహప్రవేశాలకి కూడా ఎండల్లో పడి వచ్చే జనాలు ఇంతమంది ఉంటారా అన్పించింది. ఇలా ఆలోచిస్తూ కూర్చున్న నాకు ఆ హాలులో అందరికన్నా ఒకమ్మాయి మాత్రం ఎక్కువ హడావుడిగా తిరుగుతూ.. అందర్నీ పలకరిస్తూ తిరుగుతుండటం గమనించేను. రెండు సంవత్సరాల క్రితం మా బావమరిది పెళ్ళిలో ఆమెను చూసినట్లు గుర్తుకురాలేదు. విచిత్రం ఏమిటంటే ఆ అమ్మాయి పని కల్పించుకొని చేస్తున్నట్లుగా అనిపించింది. పనివాళ్ళు కూల్ డ్రింక్సు అందిస్తున్నా వాళ్ళ దగ్గర తీసుకొని తనే స్వయంగా అందరికీ అందిస్తున్నాది. ఆవిడ గురించి ఆలోచిస్తున్న నాకు వెనుక నుంచి ‘‘ చూశావా. ఆ రాధ ఎంత దర్జాగా తిరుగుతున్నాదో, భర్త, పిల్లలుకూడా వచ్చినట్లున్నారు. తను అందరితో కలిసి, మెలసి వున్నానని తన ఉనికిని చెప్పటానికోసమే అంత హడావుడిగా తిరుగుతున్నాది.’’ అని వేరే ఆయనతో చెప్తున్న ఆయన్ని ఎవరో పిలవటంతో అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయేడు.

వాళ్ళ మాటల ప్రకారం ఆ అమ్మాయి పేరు రాధ అని గ్రహించేను. కానీ భర్త, పిల్లలు ఇంత మంది చుట్టాలున్నప్పుడు ఆవిడ దర్జాగా తిరగటంలో తప్పేమిటో అర్థంకాలేదు నాకు. ఇంతలో ‘‘కూల్ డ్రింకు తీసుకోండి అన్నయ్యగారూ!’’ అంటూ వరసుపెట్టి పిలుస్తూ ఆమె నాదగ్గరికి వచ్చేసరికి ఎక్కడ నుండి వచ్చిందో తెలీదుగానీ నా భార్య హడావిడిగా వచ్చి

‘‘ ఏవండీ, అర్జంటుగా రండి, వాళ్ళకి బట్టలు పెట్టాలి’’ అంటూ తొందర చేసింది.

‘‘హల్లో సుమా ! బాగున్నావా, నేను గుర్తుకున్నానా, ‘రాధ’ని’’ అంటూ తనని తాను పరిచయం చేసుకుంది.

‘‘అయ్యో ! మర్చిపోలేదండీ’’ అంటూ మళ్ళీ మాటలు పొడిగించక అర్జంటుగా వెళ్ళాలని చెప్తూ నన్ను కూడా తొందర పెట్టింది సుమ.

నాకు మాత్రం అప్పుడు ఒకటి అర్ధం అయింది. ఆ రాధ అంటే మా ఆవిడకి ఇష్టంలేదని. ఎందుకంటే అక్కడికి వచ్చిన ప్రతి వారిని నా దగ్గరికి తీసుకుని వచ్చి వాళ్ళని పరిచయం చేస్తూ ఏకబిగిన వాళ్ళ గురించి చెప్తున్న ఆవిడ, రాధ గురించి చెప్పటంలేదంటే ‘ఏదో విషయం వుందని’ మాత్రం అర్థం అయింది.  భోజనాలు చేస్తున్నప్పుడు రాధ పిల్లల్ని భర్తని కూడా చూశాను. చాలా డీసెంటుగా వున్నారు. ఎవరో ఆమె భర్తని మీరు ‘‘ఇక్కడుంటున్నారా అక్కడుంటున్నారా’’ అని అడుగుతుంటే

‘‘లేదండీ.. అక్కడే వుంటున్నాను. పిల్లల చదువులు ఆ పల్లెటూరులో లేవుకదా! అందుకే నాలుగు రోజులుండి వాళ్ళకి కావాల్సినవన్నీ చూసి వెళ్తున్నాను.’’ అని చెప్తుంటే బహుశా వ్యాపారమో, వ్యవసాయమో చేస్తూ పల్లెటూరులో ఉంటున్నాడేమో అని నేను ఊహించుకున్నాను.

అయినా పనిలేక నేను వాళ్ళ విషయంలో ఇంత ఆలోచిస్తున్నానేమోనన్పించింది. ఫంక్షను అయిన మర్నాడు బయల్దేరి తిరిగి హైదరాబాదు వచ్చేశాము. మర్నాడు ఆదివారం కాబట్టి ఇద్దరం తీరుబాటుగా కాఫీలు తాగుతున్నప్పుడు రాధ గురించి సుమని అడిగేను.

‘‘ అబ్బా, ఇంకా ఆ అమ్మాయి గుర్తువుందా అడిగింది సుమ. మీ తమ్మడింటికి వచ్చిన అమ్మాయి మన చుట్టమై వుండొచ్చు కదా! నాకు గుర్తకు రాక అడుగుతున్నాను’’ అన్నాను నేను.

‘‘ ఆ ఎత్తేస్తే ఏడు చెక్కలయ్యేంత దగ్గర చుట్టరికం. మా మరదలుకి ఏదో చుట్టరికం వుంది. అదీకాక ఇప్పుడు కొత్తగా కట్టిన ఇంటి పక్కనే ఈమె ఉంటోంది. ఇల్లు కడుతున్నప్పుడు మా మరదలు, తమ్ముడు వెళ్ళినప్పుడల్లా కాఫీలు, టిఫిన్లు ఇస్తూ వాళ్ళని పలకరిస్తూ వుండేదిట. అటువంటప్పుడు ఆమెను పిలవకుండా ఎలా వుండగలరు? పిలవగానే పరిగెత్తుకుంటూ ఫంక్షనుకి వచ్చేసింది.’’ నా భార్య మాటల్లో వ్యగ్యం బాగా విన్పించింది నాకు.

‘‘ అసలు సంగతి చెప్తావినండి. ఈమె భర్త ఈవిడకన్నా ముందు ఇంకొక అమ్మాయిని చేసుకున్నాడు. తర్వాత ఈమెను చేసుకున్నాడు’’ అంటూ ఆగిపోయింది సుమ.

‘‘ అయితే అందులో తప్పేముంది. వాళ్ళకిష్టమైంది వాళ్ళు పెళ్ళిచేసుకున్నారు. దానికి మీరంతా ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారో నాకు తెలీటంలేదు’’ అని నేను అన్నదానికి

‘‘ నేను చెప్పేది పూర్తిగా వినండి. రాధ చేసుకున్నది మన కులంవాడినికాదు. మనకులం కాని వాణ్ణి అందులో రెండోభార్యగా ఈవిడ ఎందుకు ఒప్పుకుందో తెలీదు. చదువుకోని ఉద్యోగం చేస్తున్న ఆవిడకి మన వాళ్ళెవరూ దొరకరా ఏమిటి? అనవసరంగా విషయం తెలియక ఆవిడ్ని మీరు సపోర్టు చేస్తున్నారు.’’ విసుగ్గా అంది సుమ.

‘‘ నాకంతా అర్థమై మాట్లాడుతున్నాను సుమా ! కాలం మారింది. ఇంకా ఈ కులాలు, గోత్రాలు అన్న పట్టింపులేంటి? పెళ్ళి చేసుకున్న ఈవిడ ఇష్టపడింది. పెళ్ళాడిన ఆయన కూడా ఇష్టపడ్డాడు. వాళ్ళిద్దరి పెళ్ళికి ముందామె అంగీకరించింది. పిల్లల్ని కూడా కని హాయిగా కాపురం వాళ్ళు చేసుకుంటుంటే మద్యలో మీ అందరి బాధ ఏమిటో నాకు అర్ధంకావటం లేదు. నాకైతే వాళ్ళు చేసిన దాంట్లో తప్పేమీ కన్పడ్డం లేదు.’’ నేను నమ్మిన సిద్ధాంతాన్ని వివరంగా చెప్పాను.

‘‘ మీ వరస చూస్తుంటే రేప్పొద్దున్న మన అబ్బాయి విషయంలో కూడా ఇలాగే ఇది తప్పుకాదు . అది తప్పుకాదు అని సపోర్టు చేస్తారేమోనని అనుమానంగా వుంది. నాకు మాత్రం అది ఇష్టంలేదు.’’

భవిష్యత్తుని ముందుగానే ఊహించుకోని మరీ ఇప్పుడు గొడవ పెడుతున్న మా ఆవిడతో ‘‘ఎప్పుడో జరగబోయే దానికి ఇప్పుడు ఎందుకు మనిద్దరి మధ్య వాదన. ఏది జరగాలని వుంటే అదే జరుగుతుంది. ప్రస్తుతనికి పడుకో’’ అని నచ్చచెప్పి ఆవిణ్ణి శాంతింపచేసేను.

మరో పదినిమిషాల్లో మా ఆవిడ నిద్రపోయినా నాకు మాత్రం నిద్రపట్టలేదు. ఈ సమాజంలో ప్రతీ ఒక్కరికీ స్వతంత్రంగా జీవించే హక్కువున్నా ఆ హక్కుని ఉపయోగించుకోనివ్వరేమో నన్పించింది. కారణం సమాజం మారిందని అందరూ అంటున్నా అందులో వున్న మనుషుల తత్వం మాత్రం మారకపోవటమే. మేము ఎంత బిజీగా జీవితం గడుపుతున్నా చాలా మందికి పక్కవారి విషయంలో తలదూర్చకపోతే రోజు గడవు. ఇంత చదువుకోని, ఉద్యోగం చేస్తున్న మా ఆవిడ్నే ఒప్పించలేక పోతున్నా. ఎవరు ఒప్పుకున్నా లేకపోయినా, వాళ్ళు చెయ్యని తప్పుల్ని ఎత్తి చూపుతున్నా ఎవర్నీ లెక్క చెయ్యకుండా మందిలో దర్జాగా తిరుగుతూ పిల్లల్తో, భర్తతో సుఖంగా జీవితం గడుపుతున్న రాధని మనస్సులోనే అభినందించాను. నేను కూడా నిద్రలోకి జారుకున్నాను.

---------

x

4 కామెంట్‌లు:

  1. ఒక పరిధి దాటి ఆలోచించకుండా సంకుచితంగా ఉండే వారి ప్రవర్తన ఎలా ఉంటుందో బాగా రాసేరు రమాదేవి గారు. శైలి కూడా చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  2. Suma Bhartha laga alochinchevaru nootiki okkare. Marali samajam!

    రిప్లయితొలగించండి
  3. రాధ విషయంలో సుమ ఆలోచన ధోరణి సమాజాన్ని ప్రతిబింబించినా నిజానికి రాధ ,ఆమె భర్త, పిల్లలు హ్యాపీగా వున్న క్రమంలో ఎవరి సర్టిఫికేట్ వారికి అవసరం లేదు. రాధ ఆనందం ఆమె కలుపుగోలుతనంలో కూడా ఉందనేది కొంత వాస్తవం. సుమ భర్తలాగ అందరూ ఆలోచిస్తే సమాజం మారినట్లే. నిజానికి ఎవరి స్వేచ్ఛ వారి ముక్కు ప్రారంభం అయ్యే చోట ఎండ్ అయ్యే క్రమంలో మిగతా ఎవరికి ప్రోబ్లం లేకపోయినా సుమ లాంటి వారికెందరికో వచ్చే ప్రోబ్లం ఏమిటో ?!
    రచయిత్రి గారికి అభినందనలు!

    రిప్లయితొలగించండి