3 వ అధ్యాయం
పురాణ ప్రారంభం - 3 వ రోజు
- మహాప్రళయం :
మహాప్రళయం నాలుగు అంశాలతో , నాలుగు వందల మానవ సంవత్సరాల పాటు నిరాఘాటంగా , నిరంతరాయంగా కొనసాగింది.
నాలుగంశాలు మహా ప్రళయంలో అనావృష్టి , ప్రళయాగ్ని , ప్రచండమారుతం , అతివృష్టి - అనే నాలుగు మహోపద్రవాలు ఒక దాని తరువాత ఒకటిగా స్వైరవిహారం చేశాయి. మొట్టమొదట అనావృష్టి - సకల లోకాలనూ అతలాకుతలం చేసింది. వర్షాభావంతో దుర్భిక్షం విలయ తాండవం చేసింది. ప్రాణాధారమైన జలం ఆవిరై పోయింది. సకల చరాచర ప్రాణులూ సర్వనాశనం అయిపోయాయి. 'అనావృష్టి' అనే ఆ ప్రళయ ప్రథమాంకం వంద మానవ సంవత్సరాల పాటు విస్తరిల్లింది.
ద్వితీయ ఉపద్రవమైన అగ్నినర్తనకు ప్రారంభ సూచకంగా చండభానుడి ప్రచండ తాపం లోకాలను శోషింపచేసింది. నీలలోహిత కిరణాలతో లోకాలను ప్రళయకాల ప్రభాకరుడు శోషింప చేస్తున్న సందర్భంలో సంహారకర్త అయిన రుద్రుడు తన ప్రళయ తాండవం ప్రారంభించాడు. ఆయన ఫాలనేత్రం నుండి ఆవిర్భవించిన కాలాగ్ని తన జ్వాలా జిహ్వలతో సమస్తాన్నీ దహించి వేసింది. వంద మానవ సంవత్సరాల పాటు సాగిన ఆ మహాదహన కార్యంలో సర్వస్వమూ భస్మమైపోయింది.
తదనంతరం ప్రళయ నాటక తృతీయాంకం ప్రారంభమైంది. మహా వేగవంతమూ , మహాశక్తి వంతమూ అయిన చండమారుతం తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తూ విజృంభించింది. వంద మానవ సంవత్సరాల పాటు వీచిన ఆ భయానక ప్రచండ ప్రళయ ప్రభంజనం భస్మరాసుల్ని క్షోభింపచేసి నీటిలో కరిగిపోయే స్థితికి చేర్చింది. విలయవాయు విన్యాసం తర్వాత ప్రళయ చతుర్థాంకంగా అతివృష్టి ప్రారంభమైంది. సంవర్తకం, భీమనాదం ,ద్రోణం , ఇంద్రం, బలాహకం , విద్యుత్ పతాకం , శోణం అనే యేడు ప్రళయకాల కాలమేఘాలు ఏనుగు తొండం పరిమాణం కలిగిన ధారలతో ఎడతెరిపిలేని వర్షం కురిపిస్తూ లోకాలను ముంచెత్తాయి. వంద మానవ సంవత్సరాల పాటు నిర్విరామంగా సాగిన భీకర వర్షపాతంతో సకల లోకాలూ యేకార్జవం అయిన ప్రళయ సాగరంలో మునిగి పోయాయి. ఎటుచూసినా ప్రళయ జలమే ! ఎటుచూసినా అంధకారమే ! విశాల విశ్వం గాఢాంధకారంలో మునిగిపోయింది. అదొక మహా శూన్యం...ఆ మహాశూన్యంలో శ్రీ మహావిష్ణువు పవ్వళించాడు. శేషతల్పం మీదకాదు; వటపత్రం మీద !క్షీర సాగరంలో కాదు ; ప్రళయ పయోధిలో !తన మహారూపంతో కాదు ; బాల ముకుంద రూపంతో !బాల ముకుంద రూపంలో ఆయన శూన్య నామక పరమాత్మ. ఆయన పవ్వళించిన వటపత్రం ప్రళయ సాగర తరంగాల మీద ఊయల లాగా ఊగుతోంది. ఆబాలముకుందుడు తామరలాంటి చక్కని చేత్తో , తామరలాంటి పాదాన్ని పట్టుకుని , తామరలాంటి ముఖంలో వుంచుకున్నాడు.
కరార విందేన పదార విందం ముఖారవిందే వినివేశయంతం...
వటపత్రం మీద హాయిగా శయనించిన ముకుందుడు కళ్ళు మూసుకున్నాడు.. ఆయనది నిద్ర కాదు - యోగ నిద్ర.
సకల జీవరాసుల ఆత్మల్ని తన ఉదరంలో పదిలంగా దాచుకుని , మహా ప్రళయ మహాసాగరంలో స్థితి కారకుడైన శ్రీ మహావిష్ణువు శైశవ రూపంలో శయనించాడు. తద్వారా జీవ విన్యాసంలో జన్మలెత్తి , అలసిపోయిన జీవులకు మహావిశ్రాంతి ప్రసాదించాడు. పునః సృష్టి సమయం ఆసన్నం కాగానే ఆయన తన యోగనిద్ర చాలించాడు.
ముద్దులు కారే బాల ముకుంద భవ్యరూపాన్ని వీడి - బ్రహ్మాండమైన విరాట్రూపం ధరించాడు. మహాప్రళయకాలగర్భంలో కలిసిపోయిన సృష్టికర్త బ్రహ్మను తన పుత్రుడిగా సంకల్పం ద్వారా ఆయన సృష్టించాడు.బ్రహ్మ కళ్ళు తెరిచి , తన ఎదురుగా మహోన్నతమైన విశ్వరూపంలో వున్న శ్రీ మహావిష్ణువును ఆశ్చర్యంతో చూశాడు.
ఆయన ఆశ్చర్యాన్ని అర్ధం చేసుకున్న విరాట్ పురుషుడు ఇలా అన్నాడు.
కుమారా ! నేను శ్రీ మహావిష్ణువును ! పరబ్రహ్మను ! నువు బ్రహ్మవు. విశ్వసృష్టి విన్యాసాన్ని సంకల్పించి , యీ విరాట్ పురుష రూపంలో ఆవిర్భవించాను. నా సంకల్ప సంభవుడుగా నిన్ను సృష్టించానుజనకా ! బ్రహ్మ అసంకల్పితంగా అంటూ , చేతులు జోడించాడు. నీవు సంబోధించినట్లుగానే , నేను నీ జనకుణ్ని నేను విశ్వకర్తను ! విశ్వభర్తను ! ఈ మహాసృష్టిలో నువ్వు ఆదిజుడవు.
ధన్యోస్మి జనకా ! నా కర్తవ్యం ఏమిటో సెలవీయండి.
నీది సృష్టికర్త పదవి ! ఈ విశ్వంలో - దేవ , దానవ , గరుడ , గంధర్వ , కిన్నర , కింపురుష , భేదర , భూచర , జలచరాది జీవరాసుల సృష్టి జరగాల్సి వుంది. ఆ సృష్టి రచన కోసమే నిన్ను సృష్టించాను!
బ్రహ్మ అర్ధం కానట్లు చూశాడు.
జనకా... సృష్టి... అంటే...విరాట్ పురుషుడు చెయ్యెత్తి వారించాడు. సృష్టి నాలుగు విధాలుగా వెల్లివిరుస్తుంది. సంకల్ప సృష్టి , సందర్శన సృష్టి , స్పర్శ సృష్టి , సంపర్క సృష్టి - అనేవి ఆ నాలుగు. నువ్వు చేయాల్సింది సంకల్ప సృష్టి. ఇతర జీవరాసులు మిగిలిన ప్రక్రియల ద్వారా తమ తమ సంతానాల రూపంలో ప్రాణులను ఉత్పత్తి చేస్తాయి.
జీవరాసులు ఉనికికీ , మనిషికి అవసరమైన లోకాలూ , పర్వతాలూ , అరణ్యాలూ , నదీనదాలూ , సముద్రాలూ , తదితర భౌతిక అవసరాలు నా సంకల్పం ద్వారా ఆవిర్భవిస్తాయి. నువ్వు నీ సంకల్పంతో మానస పుత్రుల్నీ , వారి పత్నుల్నీ సృష్టించు.
(సశేషం)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి