కొండంత అండ
- రచన నెమలికంటి
పక్షులు కిలకిలరావాలు చేసుకుంటూ దట్టంగా పెరిగిన చెట్లలో ఏర్పరచుకొన్న గూళ్ళలోకి చేరుతున్నాయి. వాటికి ఎలా తెలుసో ఇది మన గూడే అని . పగలు ఎక్కడ తిరిగాయో.. తమ తీపి కబుర్లు, చేదు అనుభవాలు పంచుకొంటూ ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నాయి. వాతావరణ కాలుష్యానికి దూరంగా..
అసలా మాటకు వస్తే ప్రకృతి ఒడిలో త్వరగా నిదరోయేది, మేల్కొనేది పల్లె ప్రజలే.. అలాంటి పల్లెలు మొదలు పట్టణాల వరకూ ఉలిక్కి పడేలా చేసేసి, మంచీ, చెడుల విచక్షణ తెలిసిన వాడే వాటికి తిలోదకాలు ఒదిలి, నేనూ, నా, అనేలా యాంత్రిక జీవనానికి తెరతీసింది మనిషే.. నా..గ..రి క మానవుడు.
ఉన్నవాటిని ఎలా పొదుపుగా వాడుకోవాలో ఎదుటి వారితో ఆచి,తూచి ఎలా మాట్లాడాలో, యావత్ ప్రపంచానికే తెలియజేస్తూనే, మానవ జీవన స్రవంతికే విఘాతం కల్పిస్తూ తన వికృత రూపాన్ని ప్రపంచానికి చూపించి ఆధిపత్య పోరులో వున్నదీ మనిషే.. ఆధునిక మానవుడు.
********
సాంబిరెడ్డి హోటల్‌లో టి.వి. వార్తలు అయిపోయాక ఇంటిదారిపట్టిన కొండయ్య మనసులో ఏదో తెలియని కలవరం. ఎప్పటికి అయ్యేను విలయానికి అంతం. ఎప్పటికి చెరిగేది మనిషి, మనిషికి మధ్య అంటరాని గీత.
కొండయ్య ఇల్లు దగ్గర అవుతున్న కొద్దీ కారుమబ్బలు, చిమ్మ చీకట్లు అలుముకొంటుంది ఆకాశం. ఇంటి బైట నుంచోని కొండయ్య భార్య, నిర్మలమ్మ ‘‘జాగ్రత్తరా.. మీ నాన్న వచ్చేదాకా ఆగమంటే ఆగవు. ఒకటే ఖంగారు.’’ అంటూ తన కొడుకు విఠల్ కి జాగ్రత్తలు చెబుతోంది.
గోతాల కట్టను నెత్తిన పెట్టుకుని వెళుతున్న విఠల్ ‘‘ అమ్మా ! నాన్న వస్తే అన్నం పెట్టి కల్లం దెగ్గరికి పంపు. పట్టాలు తీసుకెళుతున్నాగా వాన పడిద్దేమో, ఇయ్యి కప్పుతా.. వుంటా.. వాన పెద్దదయితే నాన్నని ఇంటి దగ్గరే వుండమని చెప్పు.’’ అని వెల్తుండగా కొండయ్యే ఎదురొచ్చాడు...
‘‘నేనేడ ఉండాలో నాకు తెలుసులే రా.. వానలేదు నీ మోహం లేదు. ఆ గోతాలు ఆడపెట్టి,చేతులుకడుక్కురా.. తిందాం.. ముగ్గురికి అన్నంపెట్టవే..’’ అంటూ కాళ్ళు చేతులు కటుక్కొని లోపలికి వెళ్ళాడు కొండయ్య. విఠల్ కూడా తండ్రిని అనుసరించి గోతాలు వసారాలో ఓ మూలన పెట్టేశాడు. భోజనం చేశాక కొండయ్య ఆరుబైట మంచంపై పడుకున్నాడు.
కొండయ్య ఆలోచనలు ఒక్కసారిగా వెనక్కు వెళ్ళాయి. తన కోడలు తనతో గొడవపడి కొడుకుని తీసుకొని వెళ్ళి నాటి సంగతి. అలానే భూషయ్య మావ కోడలుతో పడుతున్న ఇక్కట్లు తలచుకుంటే మనసు కలిచేస్తుంది. భూషయ్య,కొండయ్యకు దూరపు బంధువు. ఒకప్పుడు భూషయ్య వాళ్ళ ఊళ్ళో 10 ఎకరాల ఆసామి. రాంబాబు ఒకే ఒక్క కొడుకు అవ్వటంతో అతి గారాబంగా పెంచాడు. యుక్త వయసు వచ్చాక పెళ్ళి చేశాడు. రాంబాబు పెళ్లాం చేతిలో కీలుబొమ్మ. తన కొడుకు మాట కాదనలేక పొలాన్ని, ఇంటిని, రాశాడు భూషయ్య. ఆస్తులు అమ్మి టౌన్లో ఫైనాన్స్ వ్యాపారం మొదలు పెట్టాడు రాంబాబు. తన కొడుకుని కార్పొరేట్ కాలేజీలో చేర్పించి, విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. అలా ఆలోచిస్తూనే మెల్లెగా నిద్రలోకి జారుకున్నాడు కొండయ్య..
********
నిర్మలమ్మ బైట నుంచి హడావుడిగా లోపలికి రావటం కొండయ్యకు విషయం అర్థంకాలేదు.
‘‘ ఏమైందే ! దేనికంత హడావుడి’’
పంచాయితీ ఆఫీస్ వాళ్ళు పంచిన మాస్క్ ఒకటి కట్టుకొని, రెండో మాస్క్ కొండయ్యకు ఇస్తూ ‘‘ ఇదో మావా పేరయ్య శెట్టి’’ గారింటికి డాక్టరు గారొచ్చెళ్ళారంట.
‘‘ముసలోడు కదే ఆరోగ్యం బాలేదేమోలే’’
‘‘యహ అది కాదు ఈ మధ్య అదేదో అంటురోగం జనాల మీద ఇరుసుకు పడుతుందన్నారు సూడు అదొచ్చిందట.’’
‘‘నీకెవరు సెప్పారంట’’
‘‘ఆళ్ళ చిల్లరకొట్టుకాడ అనుకొంటుంటే విన్నా’’
‘‘ ఓసి నీ దుంపతెగ అంత భయపడి చావాల్సిన అవసరమేం లేదు. మందులు వాడుతూ ధైర్యంగా ఉంటే, మంచి ఆహారం తీసుకొంటే దానంతట అదే పోయిద్దంట. ముసలోళ్ళైతే ఇంకొంచెం జాగ్రత్తగా వుండాలని రోజూ టీ.వీల్లో సెపుతున్నారు.’’
తేలికగా తీసుకొని భార్యకు ధైర్యాన్ని నూరి పోశాడే కానీ, నగరాన్ని, పట్టణాల్ని వణికించిన మహమ్మారి పల్లెలకూ పాకిందన్న వార్తని జీర్ణించుకోలేక పోయాడు కొండయ్య. అసలీ మాయదారి రోగానికి కూడా తట్టుకు నిలబడేది పల్లెలే అనేది కొండయ్య విశ్వాసం.
ఇక పేరయ్యశెట్టి విషయానికొస్తే ఆ వూర్లో పేరుకు మాత్రమే చిల్లర కొట్టు. అతను చెయ్యని వ్యాపారం అంటూ లేదు. ఫ్యాన్సీ సామాన్లు నుంచి పార, పలుగు, సిమెంటు, పెయింట్ చివరికి ఆస్తులు తనకాపెట్టుకోటం దాకా అన్నీ చేస్తాడు. డబ్బుకు కొదవేలేదు. పేరయ్య శెట్టి వయసులోనూ ఎనిమిది పదులు దాటినవాడే. ప్రస్తుతానికి ఇంట్లో ఓ మారుమూల గదిలో వుంటాడు అని తెలిసింది. అక్కడ వుంచి పేరయ్యశెట్టి కొడుకు అతనికి వైద్యం చేయిస్తున్నాడని విన్నాడు..రోగానికి ధనిక, పేద అనే వ్యత్యాసాలు వుండవు.. ఎవరైనా ఒక్కటే అనుకున్నాడు కొండయ్య..
తన ప్రక్కపొలం సుబ్బయ్య గారి చేలో నూర్పిడి పన్లు చూడ్డానికి విఠల్ ని తీసుకెళ్ళాడు కొండయ్య. చీకటి పడే సరికి బస్తాలకు ఎత్తి, కాటా పెట్టి లెక్కలు రాసుకుని ఇంటికి బయలుదేరుతుండగా సుబ్బయ్య కొండయ్య చేతులు పట్టుకొని ‘‘పెద్దయ్యా ! నువ్వు విఠల్ గాడొచ్చి ఓ చెయ్యివేశారు, కాబట్టి పని తొందరగా అయింది’’ అన్నాడు..
‘‘బాబాయా మజాకా’’ అని వంత పలికాడు అక్కడే వున్న ఒక రైతుకూలీ..
‘‘సాల్ సాల్లేరా మీ దుంపలుతెగ’’ అంటూ ఇంటిదారి పట్టాడు కొండయ్య. వెనకాల విఠల్.
విఠల్ మనసులో ఏదో బాధ. దించేసుకోవాలనుకుంటున్నాడు. ‘‘ నాన్న నిన్నేదన్నా తెలిసి తెలియక తప్పుగా అని వుంటే క్షమించు’’ అన్నాడు.. తలవంచుకొని..
‘‘దేనికరా ! ఏదో తప్పు చేసిన వాడిలాగా..లేదులేరా ’’ అంటూ విఠల్ భుజం తట్టాడు కొండయ్య..
‘‘ అదికాదు నాన్నా.. వాళ్ళందరు నిన్ను ఎందుకు అంతలా గౌరవిస్తున్నారో తెలిశాక పది మంది కోసం జీవించటంలో మనం ఏం పొందుతామో అర్థం అయింది నాన్నా.. మీరేం మాట్లాడినా, ఏం చేసినా అది రైటే. ’’
కొడుకు భుజాన చెయ్యివేసుకొని నడక వేగాన్ని పెంచాడు కొండయ్య. ఎందరికో కొండంత అండలా వుండే సాధారణ రైతు కొండయ్య. తెల్లారి కల్లాల్లో నూర్పిడికి కూలీలను రమ్మని చెప్పటానికి కొడుకు విఠల్ ని పంపాడు.
కొడుకు పుట్టిన రోజు చాలా సంవత్సరాలకు తమ మధ్య చేసుకుంటున్నందుకు ఆనందపడుతుంది నిర్మలమ్మ. తన కొడుక్కి ఎంతో ఇష్టమైన బెల్లపన్నం చేసే పనిలో పడిరది. కొడుక్కి వేన్నీళ్ళుపెట్టే పనిలో పొయ్యి వెలిగిస్తుంటాడు కొండయ్య.
అదే సమయానికి పల్లెతనం ఉట్టిపడేలా వున్న భూషయ్య అక్కడికి వచ్చాడు. వస్తూనే కొండయ్యను చూసి ఆనందంతో పరవశించిపోయాడు. కొండయ్య కూడా వచ్చిన భూషయ్యని చూసి ‘‘ ఏం మావా ఇదేనా రావటం ’’ అంటూ ఆప్యాయంగా పలకరించి దగ్గరికి తీసుకోబోతాడు. భూషయ్య అతనికి దూరంగా జరుగుతూ ‘‘ నిన్ను చూడకుండా బండెక్కుతానేమో అనుకున్నారా...’’
‘‘ఏందిమావా ఆమాటలు ! బాగా నీరసంగా ఉన్నావ్! ఏం తినకుండా బయలుదేరావేంది’’ అన్నాడు కొండయ్య..
ఇంతలో కొడుక్కి వేణ్ణీళ్ళు తోడదామని బయటికి వచ్చిన నిర్మలమ్మ భూషయ్యని చూస్తూ కుశలప్రశ్నలు వేసింది. ఐదునిమిషాలు ఓపిక పడితే బెల్లపన్నం పెడతానని చెప్పింది. ఆకలితో వున్న భూషయ్య నిర్మలమ్మను చూసి ‘‘కూతురు లేని లోటేంటో తెలిసొచ్చిందని’’ బాధపడుతున్న ఓదారుస్తూ..
‘‘ పిల్లల్ని కని, పెంచి, పెద్ద సెయ్యటం మటుకే మన బాధ్యత. తిరిగి ఆళ్ళు అదే ప్రేమను మనకు ఇస్తారనుకోటం భ్రమే అయిద్ది బాబాయ్.. ’’ అంటూ సర్ధిచెప్పింది..
భూషయ్య పట్ల కొడుకు రాంబాబు, కోడలు తీరును తెలుసుకున్నాక కొండయ్య, నిర్మలమ్మలు బాధపడ్డారు. మావ ఆరోగ్యం నయంచేసి ‘‘కుక్క కాటుకుచెప్పుదెబ్బ’’ అన్నట్లు రాంబాబుకు కనువిప్పు కలిగించేలా చేయాలని నిశ్చయించుకుంటారు కొండయ్య దంపతులు.
కరోనా సోకిన తన తండ్రి భూషయ్య చెప్పకుండా ఇల్లు వదిలి ఎక్కడకి వెళ్ళాడో రాంబాబు ఎంత ఆలోచించినా అర్థంకాలేదు. ఈ విషయమే రాంబాబు తన భార్యతో ప్రస్తావించగా మాటల సందర్భంలో కొండయ్య పేరును సూచిస్తుంది అతని భార్య.
తన శ్రేయోభిలాషుల మాట నిమిత్తం ముందు జాగ్రత్త చర్యగా ఒక అరఎకరం పొలాన్ని తన కిందే వుంచుకొంటాడు భూషయ్య. ఈ ఆలోచన చేయటంలో రాంబాబుని బాగా అర్థం చేసుకున్న వ్యక్తి కొండయ్య ప్రధముడు. కొండయ్య పేరు వినగానే తనగురించి పూర్తిగా ఎరిగిన వాడు, తన తండ్రి అక్కడికి చేరుకుంటే తన బొచ్చెలో రాయిపడ్డట్టే అని రాంబాబు బాధపడ్డాడు. రాంబాబు భార్య అతని అరెకరం ఎలా రాయించుకోవాలో.. అక్కడ ఎలా ప్రవర్తించాలో చెప్తుంది. ఆ అరెకరం తమదైతే ఇక తన మామ భూషయ్యతో పనిలేదని.. అతనెలా ఛస్తే ఏం అంటూ భర్తకి నూరిపోసింది.
పెళ్ళాం ప్రేరేపించగా రాంబాబు దారి పొడుగుతా కొండయ్య ఇంటి దగ్గర ఎలా ప్రవర్తించాలి? తన తండ్రితో ఆస్తి ఎలా రాయించుకోవాలని రకరకాలుగా ఆలోచనలు చేసుకుంటూ అంతా తనకు అనుకూలంగా జరగాలని దేవుళ్ళని మొక్కుకుంటూ... తన భార్య తెలివి తేటలకు మురిసిపోతూ కొండయ్య ఇంటికి చేరుకున్నాడు. వచ్చీరాగానే తన తండ్రికి వున్న కరోనాని దృష్టిలో పెట్టుకొని మొహానికి మాస్క్ పెట్టుకొని దూరంగా వుంటూనే తన తండ్రి మీద ప్రేమను ఒలకబోస్తాడు రాంబాబు.
రాంబాబు గురించి పూర్తిగా తెలిసిన కొండయ్య ముందు అతని ఆటలు సాగలేదు. అయినా రాంబాబు కూడా తన ప్రయత్నాన్ని విరమించుకోలేదు. ఇక ఆఖరి అస్త్రంగా కొండయ్యను రెచ్చగొట్టేలా ‘‘ ఆస్తికోసం తన తండ్రిని దగ్గరపెట్టుకున్నాడనీ.. నువ్వేంపెద్దమనిషివయ్యా..’’ అంటూ అతని వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా అనేకమైన పరుష పదజాలాలు వాడాడు రాంబాబు..
తనకు ‘‘కొండంత అండగా’’ వుంటూ తనరోగాన్ని నయం చేసి,తనకు పునర్జన్మ నిచ్చిన ఆ దంపతుల్ని తన ముందే, తన కొడుకు రాంబాబు అనే మాటలు వింటూ తట్టుకోలేక పోతాడు భూషయ్య. తనకు ప్రాణం పోసిన ఆ దంపతులని ఇక మాటలు అనిపించటం ఇష్టంలేక ‘‘కష్టమైనా.. నష్టమైనా తన కొడుకుతో వెళ్ళిపోవటం వుత్తమం’’ అని భావించాడు భూషయ్య.. అయితే తనకి అరెకరం ఇస్తే తప్ప రావద్దని రాంబాబు కండిషన్ పెట్టాడు.
‘‘ఆ అరెకరం భూమి ఎవరికి దక్కాలన్నది తన చేతుల్లో లేదని, అది కొండయ్య చేతిలో వుందని’’ భూషయ్య చెప్పాడు.
అప్పుడు కొండయ్య రాంబాబుతో ‘‘ నీ తండ్రికి నువ్వు ఆఖరిరోజుల్లో ‘‘కొండంత అండగా’’ వుండి జాగ్రత్తగా చూసుకున్నావన్న నమ్మకం నాకు కలిగితే ఆయన తదనంతరం ఆ భూమి నీకు వస్తుందనీ, లేకపోతే ఎవరికి దక్కాలో వాళ్ళకి దక్కుతుందని చెప్పి భూషయ్యని అతని కొడుకు రాంబాబుకిచ్చి పంపిస్తాడు.’’
పొలం దక్కటం కోసం రాంబాబు భూషయ్యని తీసుకొని ఇంటిదారి పట్టకతప్పలేదు.
శుభం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి