బసవపురాణము
ప్రధమాశ్వాసము
అన్ని శుభాలకు ఆలవాలమైన కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఆనందంగా అనేకమైన విషయాలపై ముచ్చటించుకుంటున్నారు. అదే సమయంలో దేవర్షి అయిన నారదుడు అక్కడికి వచ్చాడు. అది చూసిన పరమేశ్వరుడు నారదునితో వచ్చిన కార్యం వివరించమన్నాడు.
దానికి నారదుడు వినమ్రతతో.. ‘‘ దేవా లోకంలో శివభక్తి ఏమాత్రమూలేదు. కొందరు ప్రజలు ఆనందంలో శివుని మరచిపోయారు. మరికొందరు భక్తియుక్తులైనా కూడా ఇతరుల బోధనలవల్ల వేరే దైవాన్ని అర్చిస్తున్నారు. అన్యదేవతా భక్తి కన్న శివభక్తి మిన్న అని నిరూపించుచూ లింగజంగమప్రసాదస్థల సంపన్నులై జగజ్జనులు వెలియునట్లు చేసి నీవే భూమిపై అవతరించి శివభక్తని శాశ్వతంగా నిలిచేట్లు చేయి మహానుభావా’’ అని కోరాడు.
నారదుడు అలా చెప్పగానే పరమేశ్వరుడు చిరునవ్వుతో..
‘‘ నారదా .. నాకూ నందీశ్వరునకూ భేదములేదు. కనుక నేను నందీశ్వరుడనై శైవభక్తిని వ్యాపింపచేసెదను’’ అని పరమేశ్వరుడు చెప్పాడు.
దానికి నారదుడు ‘‘ నందీశ్వరునికీ మీకూ భేదము లేదనిరి. ఆ నందీశ్వరుని వృత్తాంతమును తెలియజెప్పండి స్వామీ’’ అని శివుని వేడుకున్నాడు నారదుడు.
పరమేశ్వరుడు చిద్విలాసముతో నందీశ్వరుని ఆవిర్భావమును వివరించెను.
- నందీశ్వరుని ఆవిర్భావము
శ్రీగిరి నైరుతి దిక్కున శిలాదుడు భక్తుడు వుండేవాడు. కందమూలాలు, గాలి, సూర్య చంద్ర కిరణాలనే ఆహారంగా తీసుకొనుచూ మూడుకోట్ల సంవత్సరాలు గాఢమైన తపస్సుని చేశాడు. అతని భక్తికి సంతుష్టుడైన శివుడు ప్రత్యక్షమై వరము కోరుకొమ్మనగా.. శిలాదుడు
‘‘ ప్రభో పరమేశ్వరా..! నీ వంటి వానిని పుత్రునిగా పొందాలని కోరిక కలిగినది. అనుగ్రహింపుము’’ అని వేడుకున్నాడు.
దానికి పరమేశ్వరుడు ‘‘ నాకు వాహనమై ఎప్పటికీ నావద్ద వుండే వృషభమే నందీశ్వరుడను పేర నీకు జన్మించును’’ అని వరాన్నిచ్చాడు.
‘‘భక్తి యందణుమాత్రమైన తక్కువ గలిగిన సుతునైనను తల ద్రుంచవైతునని’’ శివునికి తన నిర్ణయమును చెప్పాడు శిలాదు. శివుడు సమ్మతించి అంతర్థానమయ్యాడు.
- నందీశ్వరుడు – ప్రమథగణపదవి
నందీశ్వరుడు పుట్టినతోడనే శివుడు నందీశ్వరునితో ఏదైనా వరము కోరుకోమన్నాడు. నాకే పదవియు అక్కర్లేదు.. నీ పదముల భక్తిని ప్రసాదించు అని వేడుకున్నాడు నందీశ్వరుడు. శివుడు నందీశ్వరుని వాహనముగా చేసుకున్నాడు. ప్రమధేంద్రపదవికి నందిని పట్టము కట్టాడు. నందీశ్వరుని పుణ్యతపంతో శ్రీగిరి (శ్రీశైలం) నైరుతి భాగంలో నందిమండపం అని పేరు గాంచింది.
అని పరమేశ్వరుడు నారదునికి నందీశ్వరుని ఆవిర్భావ రహస్యాన్ని వివరించాడు. నారదుని కోరిక మేరకు నందీశ్వరునితో..
భూలోకంలో భక్తిహితార్ధం పరమార్థంగా శివభక్తిని పెంపొందించేందుకు శివుడు నందీశ్వరుని చూసి ‘‘ ఓ నందీశ్వరా! వింటివి కదా నారదుని కోరిక. నీవు నరలోకంలో బశవేశ్వరునివై పుట్టి శివతత్త్వమును ప్రబోధించు’’ అని ఆజ్ఞాపించాడు.
శివుని ఆజ్ఞకు బద్ధుడైన నందీశ్వరుడు బసవేశ్వరునిగా జన్మించుటకు బయల్దేరాడు.
- బసవేశ్వరుని జననం
శ్రీశైలానికి పశ్చిమదిశన కన్నడదేశంలో హింగుళేశ్వరభాగవాటి అనే నగరం వుంది. అందు మండెగ మాదిరాజ అనే బ్రాహ్మణోత్తముడుండేవాడు. అతని భార్య పరమసాధ్వి మాదాంబ. భార్యాభర్తలిద్దరూ కూడా నిత్యం శివాచార సంపన్నులై వున్నారు. అయితే వారికి సంతతి సౌఖ్యములేదన్న బాధ పట్టి పీడించుచుండెను. సంతానం కోసం మాదాంబ ఎన్నో నోములు, పూజలు చేసింది. కానీ ఫలితం కనిపంచలేదు. చివరికి ఆమె కార్యసిద్ధికోసం నందికేశర నోము నోచింది.
మాదాంబ అత్యంత శ్రద్ధతో అచ్చటున్న శివాలయానికి చేరి నందిని సోమవారంతో మొదలు పెట్టి తొమ్మిది దినములు పూజించింది. పదవనాడు నందికి స్నానం చేయించి, చందనకుసుమాలు సమర్పించి మెత్తని వస్త్రం మెడనిండా కప్పి, ఉత్తమమైన ఆభరణాలు, అంచెలు, గంటలు కూర్చింది. కొమ్ములకు పసిడి తొడుగులు తొడిగింది. ఫాలతలమున పట్టముగట్టి అక్షతధూప దీపాదులతో పూజలు చేసి పులగము, పంచభక్ష్యాలు నివేదించింది.. ‘‘ నీవంటి పుత్రుడిని ప్రసాదించు నందీశ్వరా’’ అని ప్రార్థించి తన ఇంటికి వెళ్ళిపోయింది. మాదాంబ మాదిరాజు దంపతులిద్దరూ కూడా ఆరోజు అన్యోన్యతతో ఒకటయ్యారు.
నెలరోజులలో మాదాంబ గర్భముదాల్చింది. తొమ్మిది నెలలు నిండినా కూడా మాదాంబకు పురుడు రాలేదు. రెండవ తొమ్మిది నెలలు గడిచాయి అయినా పురుడు రాలేదు. మూడవ తొమ్మిది నెలలు గడిచాయి. అయినా పురుడు రాలేదు. ఆమె అలాగే తన గర్భాన్ని మోస్తోంది. ఇలా మూడు సంవత్సరాలు గర్భభారము వహించి బాధతో నందీశ్వరునికి అత్యంత దీనంగా తన పరిస్థితి చెప్పుకున్నది.
పరమేశ్వరుడు జంగలింగమ మూర్తియై మాదాంబవద్దకు వచ్చాడు.
‘‘ మాదాంబా నీవు చింతిల్లకు. నీ కడుపులో వున్న వాడు లోకపానమూర్తి. శిలాదుని కుమారుడైన నందీశ్వరుడు. అతడు వృషభావతారము. శివుని ఆజ్ఞ ప్రకారం భూలోకంలో నీకు సుతుడిగా అవతరిస్తున్నాడు. వానికి ‘బసవ’ అని పేరు పెట్టు.’’ అని చెప్పి అదృశ్యమయ్యాడు.
కొంతకాలానికి అర్ధోదయ సమయంలో పుత్రుడు జన్మించాడు. అతడే బసవేశ్వరుడు. అప్పుడు కూడలి సంగమేశ్వరుడు జంగమవేషములో వచ్చి ‘‘ నేను కూడలి సంగమేశ్వరుడను. నీకు పుట్టిన సుతుడు లోకహితార్థమై జన్మించాడు. ఇకమీదట అతనికి నేనే గురువుని. కనుక నిరంతరం నిత్య లింగార్చనాపర్వతమున మెలుగుచుండి ఇతనిని పెంచండి.’’ అని చెప్పి అదృశ్యమయ్యాడు.
(సశేషం)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి